Monday, March 1, 2021
Home > సీరియల్ > ట్రావెలాగ్ > నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర (I వ భాగం)! – సబ్బని లక్ష్మీ నారాయణ

నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర (I వ భాగం)! – సబ్బని లక్ష్మీ నారాయణ

“విమానంలో విహరించి
విహార యాత్రకై వచ్చేసిన
విలక్షణ కవికి
వేగాస్ గ్రూప్ తరపున
విరజాజుల ఆహ్వానం”

నేను అమెరికాలోని డాలస్ విమానాశ్రయంలో దిగగానే మా అబ్బాయి శరత్ చంద్ర స్నేహితుడు కార్తీక్ పంపిన ఆహ్వానం ఇది, వారి వేగాస్ వాట్స్ ఆప్ గ్రూప్ ద్వారా. అమెరికా చూడాలని ఎవరికి ఉండదని! అమెరికాలో అక్కడి టెక్సాస్ రాష్ట్ర ఆస్టిన్ నగరములో మా పెద్ద అబ్బాయి శరత్ , మా కోడలు సృజన ఉంటారు. నేను ఉద్యోగ రీత్యా 2015 సంవత్సరంలో రిటైర్ అయినాను. అమెరికా వెళ్ళాలి అనే నా కోరిక 2017 సంవత్సరంలో తీరింది. అమెరికాకు ప్రయాణం ఇదే మొదటి సారి మాకు. నేను, నా శ్రీమతి శారద అమెరికా వెళ్ళడానికి వీలుగా కరీంనగర్ నుండి ఏప్రిల్ 19 వ తేది గురువారం సాయంత్రం 5 గంటలకు కారులో బయలు దేరినాం శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి. మా విమానం 20వ తేది ఉదయం 3 గంటల 30 నిమిషాలకు ఉంది. ముందుగా హైదరాబాద్ నుండి కటార్ దేశపు దొహా విమానాశ్రయానికి విమానం ఉంది, మళ్ళీ అక్కడి నుండి మూడున్నర గంటల వ్యవధి తర్వాత దోహా నుండి మళ్ళీ అమెరికా లోని డాలస్ విమానాశ్రయానికి ఇంకో విమానం ఉంది. ఇది మా ప్రయాణం, మొత్తం 22 గంటల వరకు కరీంనగర్ నుండి ఔటర్ రింగ్ రోడ్ ద్వారా విమానాశ్రయానికి చేరడానికి 5 గంటలు పడుతుందేమో. మేము మా కోడలు వాళ్ళ తల్లిగారు బి.హెచ్.ఇ.ఎల్.లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో రెండుమూడు గంటలు ఆగి భోజనం చేసి అర్ధ రాత్రి విమానాశ్రయానికి బయలుదేరాలనుకున్నాం. మేము బి.హెచ్.ఇ.ఎల్. చేరే వరకు రాత్రి 9 గంటలు అయ్యింది.

భోజనం చేసి రెండు గంటలు వాళ్ళ ఇంట్లో గడిపి అర్ధ రాత్రి సమయములో విమానశ్రయానికి బయలుదేరినాము. ఒంటి గంట సమయంలో విమానాశ్రయం చేరుకున్నాం. విమానం ఎక్కాలంటే విమానాశ్రయంలో కనీసం 3 గంటల ముందు ఉండాలి. మాతో పాటు మా వియ్యంకుడు, ఆయన కొడుకు మమ్ములను సాగనంపడానికి విమానాశ్రయానికి వచ్చినారు. కారు డ్రైవర్ మమ్ములను దింపేసి మా లగేజి అప్పగించి వెళ్ళిపొయినాడు. మేం తోపుడు బండిపై మా లగేజిని పెట్టుకొని విమానాశ్రయం లోనికి వెళ్ళినాం. మాతో వచ్చిన మా వియ్యంకుడు, ఆయన కొడుకు మాకు సెండప్ చెప్పి వెళ్ళినారు. మేము లోనికి వెళ్లి కటార్ విమానాశ్రయ కౌంటర్ దగ్గరకు చేరుకొని మా టికెట్ వివరాల ప్రింట్ అవుట్ చూపించి మా యొక్క విమాన టికెట్స్ ను తీసుకున్నాం. అక్కడే మా లగేజ్ ను వాళ్ళు తూకం చూసుకొని చెరి రెండు సూట్ కేస్ లను తీసుకున్నారు విమానములో పంపడానికి వీలుగా. చేతిలో మాకు ఇంకా చెరి ఒక సూట్ కేస్ ఉంది. ఒక మనిషి 53 ( 23+23+7) కిలోల వరకు బరువుగల సూట్ కేసులను మూడింటిని అనుమతి గల వస్తువులతో తీసుకవెళ్ళవచ్చు. రెండు సూట్ కేస్ లను విమానం లగేజీతో పంపిస్తే, ఒక సూట్ కేస్ ను 7 కిలోలది మన వెంబడి తీసుక వెళ్ళవచ్చు. అది మాకు మొదటిసారి అమెరికా ప్రయాణం కాబట్టి విమానం ఎక్కడం దిగడం మాకు కష్టమవుతుందని వీల్ చైర్ అసిస్టెన్స్ పెట్టిండు మా అబ్బాయి. అది కొంత ఈజీ మొదటి సారి విమాన ప్రయాణం చేసేవాళ్ళకు. హైదరాబాద్ విమానాశ్రయం కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళే ఉన్నారు విమాశ్రయ సిబ్బంది. వీల్ చైర్ అసిస్టెన్స్ వాళ్ళు మమ్ములను మా లగేజే ను చెకప్ చేయించే దగ్గరకు తీసుక వెళ్లినారు. మా లగేజ్ ను మిషన్ ద్వారా చెక్ చేసి పంపిస్తూ మమ్ములను మెటల్ డిటెక్టర్ ద్వారా చెక్ చేస్త్తూమా పాస్ పోర్టులను చెక్ చేసి మమ్ములను లోనికి పంపించారు. తర్వాత వీల్ చైర్ అసిస్టెన్స్ వాళ్ళు మమ్ములను విమానం ఎక్కే గేట్ దగ్గరకు తీసుకవెళ్ళి అక్కడ కూర్చోమన్నారు. సమయం రెండున్నర అవుతుందేమో. అరగంట ముందుగా విమానము లోనికి పంపిస్తారు. ఈ లోపున మేము అక్కడికి దగ్గరే ఉన్న టాయిలెట్ కు వెళ్లి వచ్చి కూర్చున్నాం. అరగంట తరువాత మమ్ములను వీల్ చైర్ అసిస్టెన్స్ వాళ్ళు తీసుకొని వెళ్లి విమానం ఎక్కే ద్వారం దాకా తీసుక వచ్చి మమ్ములను విమానంలోనికి పంపించి వెళ్లి పోయినారు.

విమాన ప్రయాణం మొదటి సారి కాబట్టి వింతగా అనిపించింది. అది కటార్ ఎయిర్ వేస్ విమానం. అందంగా ఉన్న వివిధ దేశాలకు చెందిన ఎయిర్ హోస్టెస్ లున్నారు సూచనలిస్తూ, ప్రయాణికులకు స్వాగతం పలుకుతూ. మాకు సీట్ నంబర్ వెతికి మా సీట్లు చూపించారు. నాకు విండో సీట్ వచ్చింది, నా పక్కన మా శారద. కొద్ది సేపటికి సీట్ బెల్ట్ పెట్టుకొమ్మని సూచనలు వచ్చాయి విమానం స్పీకర్ల లోంచి. సీట్ బెల్ట్ ఎలా ధరించాలో కూడా పెట్టుకొని చూపించారు, అత్వవసర పరిస్థితుల్లో లైఫ్ జాకెట్లు, ఆక్సీజన్ మాస్కులు ఎలా ధరించాలో కూడా చేసి చూపించారు విమాన సిబ్బంది. విమానంలో మాది ఎకానమీ క్లాస్. విమానమంతా పరిశీలించి చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత పెద్దగుంటదా విమానం అని! మన రెండు బస్సులంత పెద్దగా అనిపించింది, ఒక పెద్ద రైల్ డబ్బంతా పెద్దగా కూడా ఉంది. చాలా సౌకర్యవంతంగా కూడా ఉంది. మధ్యలోను, ముందటి భాగములోను అతవసర ఎగ్జిట్ ద్వారాలు ఉన్నాయి. మధ్యలోనూ, చివరలోనూ టాయిలెట్ సౌకర్యం ఉంది. విమానం అంతా ఫుల్ ఏ.సి. సౌకర్యం ఉంది. ప్రతి సీట్ కు ఒక ప్రోగ్రాం చేసిన చిన్న టీ.వీ. సదుపాయం ఉంది, ఇయర్ ఫోన్లు ఉన్నాయి. ఆ టీ.వి. లో నచ్చిన సినిమాలు చూడవచ్చు, నచ్చిన పాటలు వినవచ్చు, కటార్ ఏర్ వేస్ వారి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కటార్ ఏర్ వేస్ వారి కొన్ని పుస్తకాలు, విమానము కు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కొన్ని బ్రోచర్లు కూడా ఉన్నాయి. విమానం బయలుదేరే ముందు సెల్ ఫోన్లను ఏరోప్లేన్ మోడ్ లో పెట్టమన్నారు. మేము అలానే పెట్టాం. విమానం సరిగ్గా 3 గంటల ౩౦ నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరింది. కొంత దూరం రన్ వే పై పరుగెత్తి గాలిలోకి పక్షిలా లేచింది ఒక్కసారి కుదుపు ఇచ్చినట్లుగా. విమానము విండో సీట్ లోంచి రాత్రి పూట కిందికి చూస్తుంటే కింద అన్నీ దీపపు వెలుగులే ! కుగ్రామాలు, పల్లెలు, పట్టణం దీపపు వెలుగులు కుప్పపోసినట్లు! ఆకాశములో పక్షిలా విహరిస్తూ విమానం వెళ్ళిపోతుంది. మధ్య మధ్య లో ఎయిర్ హోస్టెస్ లు మంచినీళ్ళు, కాఫీ, బీర్, వైన్, కోక్ ఏది కావలసిన వాళ్ళకు అది అందచేసినారు. మేము తినడానికి ప్రిఫర్ చేసిన ఇండియన్ ఫుడ్ మాకు అందచేసినారు. శుక్రవారం మా శారద నాన్ వెజ్ తీసుకోదు కాబట్టి వెజిటేరియన్ ఫుడ్ అందచేసినారు కోరినట్టు. నాకు ఇచ్చిన దాంట్లో బ్రెడ్, ఆమ్లెట్, కొంత రైస్ ఫుడ్ లాంటిది అందచేసినారు. పెద్దగా రుచిగా లేకున్నా విమానములో అంతకు మించి ఏమి దొరుకదు కాబట్టి వారు అందచేసిన ఆహారాన్ని స్వీకరించాం. విమానం సౌకర్యవంతంగానే ఉన్నా, సౌకర్యంగా కనిపించనిది టాయిలెట్ కు వెళ్ళినపుడు అవసరమైతే తుడుచుకోవడానికి నాపికిన్స్, టిస్స్యూ పేపర్లు వాడడం. నాపికిన్స్, టిస్స్యూ పేపర్లు వాడడం అలవాటు లేని పని, మేము అవసరం అనుకున్నపుడు ఖాళి వాటర్ సీసాలు వాడుకున్నాం.

కొత్తగా ప్రయాణం, సరిగా నిద్ర పట్టలేదు గాలిలో ఉన్నట్లుగా విమానంలో. తెలతెలవారుతుండగా విమానం కిటికిలోంచి గమనించి చూస్తే మా విమానం సముద్రం మీది నుంచి వెళుతుంది. తూర్పున సూర్యోదయం అవుతుంది. అనంత జలరాశిపై విమానము పక్షిలా పయనిస్తుంటే అపురూపం ఈ ప్రయాణం అనిపించింది! ఒకవేళ ఈ విమానం ఇలానే సముద్రంలో పడిపోతే ఎలా అని భయం కూడా వేసింది! సముద్రంపై సూర్యుడు ఉదయించి తన బంగారు కిరణాల్ని సముద్రంపై ప్రసరిస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని నా సెల్ కెమరాలో బంధించాను. విమానం కటార్ దేశపు దొహా విమానాశ్రయం సమీపిస్తుంటే ఆశ్చర్యం వేసింది! కటార్ చిన్న దేశం, ఎడారి ప్రాంతం, చెట్లు పచ్చిక లేని దేశం. అయినా వారు ఆ ఎడారి దేశములో ఒక అధునాతనమైన విమానాశ్రయాన్ని ఏర్పరచుకున్నారు అనిపించింది. అమెరికా లాంటి పడమర దేశాలకు వెళ్ళాలంటే కటార్, అబుదాబి, దుబాయి లాంటి దేశాల గుండా విమానం దిగి, ఆయా విమానాశ్రల్లోంచి మరొక విమానం ఎక్కి పడమర దేశాలకు చేరుకోవడం సులువు. బ్రిటిష్ ఎయిర్ వేస్ ద్వారానైతే లండన్ ద్వారా కూడా వెళ్ళవచ్చు. అనుకున్నట్టుగానే మా విమానం ఉదయం 8 గంటల ౩౦ నిమిషాలకు దోహా ఎయిర్ పోర్టుకు చేరుకుంది. మా అబ్బాయి ముందుగానే చెప్పాడు, మీరు తొందరపడి విమానం దిగకండి, మీ కొరకు వీల్ చైర్ అసిస్టెన్స్ వాళ్ళు వస్తారు, విమానం లోంచి మిమ్మలను తీసుకొని వెళ్లి ఇంకో విమానం అమెరికా వెళ్ళడానికి ఎక్కిస్తారు అని. మేం అలానే చేశాం. మాలాంటి అవసరం ఉన్న వీల్ చైర్ వాళ్ళందరిని విమానం కుడి వైపు ద్వారం గుండా ఒక బస్సు ద్వారా తీసుక వెళ్లి మమ్ములను విమానాశ్రయములో ఒక దగ్గర కూర్చోపెట్టినారు. అక్కడ మాలాంటివారు ఎందరో వివిధ దేశాలకు వెళ్ళవలసిన వారు కూర్చొని ఉన్నారు. ఆయా దేశాల విమాన సమయానికి అనుగుణంగా ప్రయాణికులను విమానం ఎక్కించడానికి తీసుకవెల్లుతున్నారు. మా విమానం ఉదయం 11 గంటల 3౦ నిమిషాలకు ఉంది. మా అబ్బాయికి మేం దొహా చేరుకున్నాం అని తెలియచేయడానికి వాట్స్ ఆప్ ద్వారా ప్రయత్నించాం, మా ఇండియా వాట్స్ ఆప్ పనిచేయలేదు. అక్కడ విమానాశ్రయానికి ఉచిత వాట్స్ అప్ సదుపాయం ఉంది. విమానాశ్రయ సిబ్బందికి మా టికెట్ చూపిస్తే వారు వారు మాకు వాట్స్ ఆప్ కలిపి ఇచ్చారు మా సెల్ ఫోన్ లో. ఫోన్ మాట్లాడే అవకాశం లేదు కాని, మెసేజ్ పెట్టే అవకాశం వచ్చింది. మేం దోహా చేరుకున్నామని మా బాబుకు మెసేజ్ పెట్టాం. ఈ లోపున ఒకసారి అక్కడున్న టాయిలెట్స్ కు వెళ్లివచ్చాం. ఓ గంట తరువాత మమ్ములను సెక్యురిటి చెక్కింగ్ దగ్గరికి తీసుకవెళ్ళారు. ముందుగా దోహా విమానాశ్రయపు సెక్యురిటి మా పాస్పోర్ట్లను పరిశీలించి ముందుకు పంపిస్తే, ఇంకో అంచెలో సెక్యురిటి సిబ్బంది మా లగేజును, మా బెల్ట్, చెప్పులు, పర్స్, బ్యాగ్, అన్నింటిని బాక్స్ లో ఉంచితే మిషన్ ద్వారా వాటిని పంపి,మమ్ములను మెటల్ డిటెక్టర్ గుండా చెక్ చేసి మాపాస్పోర్ట్లు చెక్ చేసి ముందుకు పంపించారు. మాతో వచ్చిన వీల్ చైర్ అసిస్టెన్స్ వాళ్ళు మమ్ములను తీసుకొని వెళ్లి అమెరికా డాలస్ వెళ్ళే విమానం గేట్ దగ్గర కూర్చోపెట్టి వెళ్ళిపోయినారు. అరగంట ముందు డాలస్ వెళ్ళే విమానంలోకి అందరిని పంపించినారు వరుసగా. మేం విమానం ఎక్కి మా సీట్ ప్రకారం, మా లగేజ్ సర్దుకొని కూర్చున్నాం. మాకు ఈ విమానంలో మధ్య వరుసలలో సీట్లు వచ్చినాయి. హైదరాబాద్ నుంచి కటార్ వచ్చిన విమానం కంటే ఈ విమానం ఇంకా పెద్దగా,విశాలంగా ఉన్నది. ఇది బోయింగ్ ఇంకా పెద్ద విమానం.దానిలో రెండు వరుసల సీట్లు ఉంటె, దీనిలో మూడు వరుసల సీట్లు ఉన్నాయి. కటార్ నుంచి డాలస్ కు 16 గంటల ప్రయాణం, హైదరాబాద్ నుంచి డాలస్ కు మొత్తం 22 గంటల ప్రయాణం లో. అబ్బో ఎంత దూరం అనిపించింది! అరేబియా సముద్రాన్ని దాటి, గల్ఫ్ దేశాల సముద్రాల్ని దాటుకొని, ఆఫ్రికా ఖండాన్ని దాటుకొని, అట్లాంటిక్ మాహా సముద్రాన్ని దాటి ఈ అమెరికా డాలస్ నగరాన్ని చేరుకోవాలి. సుదీర్ఘ ప్రయాణం టైం ఎలా గడువాలి అనిపించింది! విమానంలో టీ.వి. ఉంది, పుస్తకాలు ఉన్నాయి.ఈ ప్రయాణంలో రెండు హిందీ సినిమాలు చూశాను, ఒకటి రాం గోపాల్ వర్మ అమితాబ్ తో తీసిన సర్కార్-1 సినిమా, ఇంకొకటి ఒక లేడీ ఓరియెంటెడ్ హిందీ సినిమా. కాసేపు పుస్తకాలు చదివిన. విమానం స్టార్ట్ అయిన తరువాత ఒకసారి చికెన్ బిర్యాని రైస్ తో ఇచ్చారు, బీర్ అంద చేసారు. మా శారద విజిటేరియన్ ఫుడ్ తీసుకుంది. కాసేపు నిద్రా కాసేపు సినిమాలు కాలం గడిచిపోయింది. మా శారద ఎక్కువగా నిద్రలోనే గడిపింది. మద్యలో ఇంకో సారి కూడా స్నాక్స్ అంద చేసినారు.

సాయంత్రం ఐదున్నర గంటల తరువాత విమానం అమెరికా లోని డాలస్ విమానాశ్రయములో దిగింది. మేం హైదరాబాద్ నుంచి బయలుదేరంగానే మాకు ఒక అమెరికా లో పనిచేసే సిమ్ కార్డ్ మిత్రుల ద్వారా కొనిపించి అంద చేసినాడు మా అబ్బాయి. అదే సిమ్ కార్డు ఫోన్తో మా బాబుకు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాం అని మెసేజ్ పెట్టాను ఫోన్ ద్వారా. మెసేజ్ రిసీవ్ అయ్యింది. ఫోన్ లో కూడా మాట్లాడినాడు మా అబ్బాయి. బయట ఉంటాను గేట్ దగ్గర లగేజ్ తీసుకొని, ఇమిగ్రేషన్ సెక్యురిటి కానిచ్చుకొని వీల్ చైర్ సహాయకుల ద్వారా కస్టమ్స్ వారి చెకింగ్ చేయించుకొని బయటకు రమ్మన్నాడు. వాళ్ళు ఏమైనా వస్తువులు తెస్తున్నారా అని అడుగుతే ఫుడ్ ఐటమ్స్ స్నాక్స్, స్పైసెస్, స్వీట్స్ ఉన్నాయని చెప్పమన్నాడు. మేం విమానం లోంచి బయటకు రాంగానే మాకు వీల్ చైర్ అతను మాకు సహాయకులుగా వచ్చినాడు. అతను మమ్ములను తీసుకొని ఇమిగ్రేషన్ చెకింగ్ దగ్గరకు తీసుక వెళ్ళినాడు. ఆ పని అయిన తరువాత మమ్ములను విమానములో వచ్చిన మా నాలుగు సూట్ కేస్ ల దగ్గరికి తీసుక వెళ్ళినాడు, మేం వచ్చేవరకే అవి వచ్చి ఉన్నాయి అక్కడికి. మా సూట్ కేస్ లను ట్రాలీ బండిపై పెట్టుకొని మమ్ములను అమెరికా కస్టమ్స్ చెకింగ్ వాళ్ళ దగ్గరికి తీసుక వెళ్ళినాడు, అదే చివరి చెకింగ్ పాయింట్ మేం అమెరికా లో అడుగు పెట్టడానికి. మా పాస్ పోర్టులు చూసి మమ్ములను ఎందుకు వస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎవరి దగ్గర ఉంటారు, ఏమేమి తెసున్నారు అనే ప్రశ్నలు వేసి, ఆ ప్రశ్నల జవాబులకు సంతృప్తి చెంది మమ్ములను బయటికి పంపించాడు. వీల్ చైర్ అతను మమ్ములను, లగేజ్ తో పాటు తీసుక వచ్చి బయటి గేట్ దగ్గర వదిలిపెట్టాడు. వీల్ చైర్ వాళ్ళు ఏమి డబ్బులు అడుగరు కాని చిల్లర ఉంటే ఏమైనా ఇస్తే ఇవ్వు అని చెప్పిండు మా బాబు. నేను ఐదు డాలర్లు ఇచ్చినాను, థాంక్స్ చెప్పి వీల్ చైర్ అతను వెళ్ళిపొయినాడు. అలా అమెరికా లోని డాలస్ నగరం విమానాశ్రయం చేరుకున్నాం సురక్షితంగా.
(ఇంకా ఉంది)


-సబ్బని లక్ష్మీ నారాయణ

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!