Wednesday, January 26, 2022
Home > సీరియల్ > చుక్కాని చిరు దీపం (చివరిభాగం -15) – స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరు దీపం (చివరిభాగం -15) – స్వాతీ శ్రీపాద

ప్రశాంతంగా ఉన్న ఆ పరిసరాల్లో ఎవరూ గట్టిగా కూడా మాట్లాడరు.

ఎక్కడ చూసినా అద్దంలా మెరిసే ఆశ్రమం అంటే అదే. ఓ చిన్న గ్రామంలా కనిపించే అక్కడ అందరికి అందరూ బంధువులే.

ఉదయం మంద్ర స్వరంలో చక్కని వీణా గానం వినిపిస్తో౦ది.

వీల్ చెయిర్ లో ఉన్న చందనను వాష్ బేసిన్ వరకూ తీసుకు వెళ్లి పసిపాపకు బ్రష్ చేసినట్టు పళ్ళు బ్రష్ చేసాడు హరి.

అక్కడే ఆమె తలదువ్వి మెత్తని టవల్ తో మొహం తుడిచి వీల్ చెయిర్ వెనక్కు తీసుకు వెళ్ళాడు. అప్పటికే  కెటిల్ లో కాగిన నీళ్ళు పిల్టర్ లో వేసి పాలు కాచి ఉంచాడు.

వేడి వేడి కాఫీ కలిపి కప్పు పట్టుకుని చందనకు కాఫీ తాగించాడు, చుక్క చుక్కగా.

“ నువ్వు తాగు హరీ “ ఆ మూడు మాటలు చెప్పడానికి మూడు నిమిషాలు పట్టింది చందనకు.

అవును మెదడు లో ఒక్కో భాగం కృశించి పోతుంటే ఒక్కో సెన్స్ ఆర్గన్ పనితీరు ప్రభావితమవుతో౦ది. గత ఏడాదిగా మాట రాడం కష్టంగా వుంది.

అంతకు అయిదేళ్ళ క్రితమే రెండు చేతులు పని చెయ్యడం మానేశాయి.

అయినా  ఒక్క సారి హరి మనసు ఆ క్షణం వైపు దూసుకు వెళ్ళింది.

మల్టిపుల్ స్క్లీరోసిస్.

ఇద్దరు మాన్పడిపోయిన క్షణం.

ఏం చెయ్యాలో, ఎవరిని ఎవరు ఓదార్చాలో తెలియని క్షణం .

కాస్సేపు కూర్చున్నా ఎక్కడన్నా చేతులు ఆన్చినా తిమ్మిరెక్కడం మామూలే అనుకుంది. కాని రోగ నిరోధక వ్యవస్థనే అస్తవ్యస్తం చేసే లక్షణాలని ఏ మాత్రం అనుమానించలేదు.  ఈ చికిత్స లేని జబ్బు ఇలా ఆశ్రయిస్తు౦దని ఊహించలేదు.

చికిత్స వల్ల ప్రభావం తగ్గవచ్చును కాని పూర్తిగా తగ్గడం ఉండదు.

ఇంటికి తిరిగి వచ్చాక కూడా ఇద్దరూ నిశ్శబ్దంగానే ఉండి పోయారు.

ఎవరికీ వారు ఆలోచనల్లో మునిగి తేలారు.

ఇద్దరూ ఒకసారే ఏదో చెప్పబోయారు. ఆగి నవ్వుకున్నారు.

“ మనిద్దరికీ మరో పరీక్ష చ౦దూ, అయినా మనం ఓడిపోము కదా … మన ఆత్మ విశ్వాసం ముందు ఆ మృత్యువైనా ఓడిపోవలసినదే.

పిల్లలు ఎలాగూ సెటిల్ అయారు. మనం ఇండియా  వెళ్లి పోదాం. ఇక్కడ చేసే పనే అక్కడా చెయ్యవచ్చు మనకు కనీసం అక్కడ హెల్ప్ అయినా దొరుకుతుంది. ఈ సేయా కార్యక్రమాలు అందవలసిన వాళ్ళు అక్కడ కోకొల్లలు.

ఏమో ప్రదేశం మార్పు వల్ల నీ ఆరోగ్యం ఏమైనా కుదుట పడవచ్చు.”

నిజమే. అక్కడ కనీసం ఎవరైనా అందుబాటులో ఉంటారు. అన్ని పనులూ హరి ఒక్కడూ నిభాయించడం కష్టం. అదే మంచిదేమో అనిపించింది చందనకు.

ఊహ కలగడానికి క్షణం పట్టదు  కాని ఆచరణలోకి వచ్చి పూర్తిగా ఏర్పాట్లు చేసుకునే సరికి రెండేళ్ళు పట్టింది.

ఈ లోగా చందన తన డ్యూటీ తను చేస్తూనే ఉంది కాదంటే అదనంగా వచ్చి చేరిన వీల్ చెయిర్ లో. ఎప్పుడు ఎక్కడ తల తిరిగడం తిమ్మిరెక్కి నడవ లేకపోడం లాటి ఇబ్బందులు లేకుండా ప్రికాషనరీ మెజర్. ఒక ముందు జాగ్రత్త.

రెండేళ్ళలో పిల్లల చదువు లూ ఒక కొలిక్కి వచ్చాయి. పరిస్థితులు అర్ధం చేసుకునే ఆలోచనా వచ్చింది. మొత్తానికి ఇండియా వచ్చేసి ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణం లో పది ఎకరాల స్థలంలో తమ ఆసుపత్రి ప్రారంభించారు. ఆ వెనకే వృద్ధాశ్రమం , పిల్లల సంక్షేమ  గృహం , ఆ పైన స్కూల్ , ఈ మధ్యే కొత్తగా కాలేజీ …

మరి వెనక్కి తిరిగి చూసుకోలేదు.

పది హేను స౦వత్సరాలు.  అప్పుడప్పుడు చెకప్ … మరిన్ని కాంప్లికేషన్స్ , మరింత స్థైర్యం …

మరిన్ని సేవా కార్యక్రమాలు.

అయిదారు సార్లు పిల్లలను పిల్లల పిల్లలను చూసి వచ్చారు.

“ ఈ రోజు గుర్తుందా చందూ ..”

వేడి కాఫీ నెమ్మదిగా సిప్ చేస్తూ అడిగాడు హరి.

సాలోచనగా అతనివైపు చూసింది చందన ,

“ఉహు గుర్తు రాడం లేదు”

అయిదారేళ్ళుగా వీల్ చెయిర్ తప్ప అడుగు కింద పెట్టలేకపోడం వల్ల విపరీతంగా పెరిగిన శరీరం , చాలా మటుకు తెల్లబడి , రాలిపోడం వల్ల పిలకలా మారిన జుట్టు కత్తిరించుకుని పల్చని బాబ్డ్ హెయిర్ కూడబలుక్కుని పదాలు పలకడం

“ చాలా ఏళ్ళ  క్రితం  నా మిత్రుడితో వాళ్ళ ఊరికి వెళ్లి అక్కడ ఒక దేఅతను చూసిన రోజు”

చందన కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

“ ఏం సుఖ పడ్డావు?” గొణిగి౦ది.

నింపాదిగా కాఫీ తాగి గ్లాస్ సింక్ లో వేసి వచ్చాడు

ఆమె వీల్ చెయిర్ వెనకాల నిల్చుని తలను గుండెకు ఆనించు కుంటూ

“ నీతో కలిసి ప్రతిక్షణమూ బ్రతకడం, నువులేని జీవితం లేదనుకున్నాను, ప్రతి నిమిషం నీ ఉనికే నా ఊపిరి.

చందూ , ఏవో ఇబ్బందులూ కష్టాలూ అందరికీ తప్పు. అంత మాత్రాన … శారీరిక సమస్యలు మన చేతుల్లో లేనివి. ఆత్మా విశ్వాసం మనది.

అది చాలు కదా

మన వల్ల ఎవరికి ఏ మేలు జరగాలో అది మనం చేస్తున్నాం. ఇహ మిగతావి అల్పం కదూ …

నీకన్నా పన్నెండేళ్ళు పెద్ద వాడిని అయినా అనుక్షణం నా గురించి నేను శ్రద్ధ తీసుకోడం నీకు నీడలా ఉండాలనే.

ఇంతకన్నా నాకు మరేమీ అవసరం లేదు బంగారూ “

మాటా మాటా కూడబలుక్కుని చెప్పింది చందన.

“ చీకటి సముద్రంలో ఆశ ఒక చుక్కాని చిరు దీపం , నా చుక్కాని చిరుదీపం మీరే , అదే నాకు వెలుగు చూపేది. ఈ జీవన సముద్రాన్ని కళ్ళు మూసుకుని ఈదగలిగే శక్తి నిచ్చేది.

ఒక్క సారి నన్ను మన సన్నజాజి పందిరి కిందకు తీసుకు వెళ్ళండి”

హరి వీల్ చెయిర్ తోసుకుని పెరట్లోకి నడిచాడు.

సన్నజాజి పందిరి కింద సిమెంట్ అరుగు మీద చందనను కూర్చో పెట్టాడు.

తనూ ఆమె పక్కన కూచుని గాలికి రాలిపడే సన్నజాజుల వానలో తడుస్తున్నారు ఇద్దరూ-ఎనభై రెండేళ్ళ హరి డెబ్బై దరిదాపుల్లో చందన.

— అయిపోయింది–

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!