Monday, January 18, 2021
Home > సీరియల్ > ట్రావెలాగ్ > నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర (2 వ భాగం) – సబ్బని లక్ష్మీ నారాయణ

నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర (2 వ భాగం) – సబ్బని లక్ష్మీ నారాయణ

డాలస్ విమానాశ్రయంలో మమ్ములను రిసీవ్ చేసుకోవడానికి ముందుగా మా అబ్బాయి శరత్ వాళ్ళ మిత్రుడు ప్రవీణ్ వచ్చిండు, అతడు డాలస్ లోనే ఉంటాడు. తరువాత శరత్, శరత్ వాళ్ళ మిత్రుడు కళ్యాణ్ వచ్చిండు. అప్పుడు సమయం దాదాపు ఏడు గంటలు కావస్తుంది. అయినా ఇంకా వెలుతురే ఉందిఅక్కడ. ఆనాడు ఆకాశం కొద్దిగా మబ్బు పట్టి ఉంది. సాయంత్రం ఎనిమిది గంటల సమయానికి డాలస్ లోని ప్రవీణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ప్రవీణ్ వాళ్ళ భార్య శైలు మమ్ములను సాదరంగా వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది.

ఆ రోజు రాత్రి మేమందరం డాలస్ లో వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఆ సాయంత్రం వర్షం పడింది, బాగా చలి గాలులు వీస్తున్నాయి. ఆ వర్షం రాత్రి మా అబ్బాయి ఉండే సిటీ ఆస్టిన్ వెళ్దామంటే ఈ చలి వర్షం గాలిలో మూడు గంటలకు పైగా ప్రయాణం కష్టం అని ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించినాం. ఆ రాత్రి ప్రయాణ బడలికలో ఉన్నాం కాబట్టి బాగానే నిద్ర పట్టింది . ఆ రోజు రాత్రి అక్కడే గడిపి తెల్లవారి ఎనిమిది గంటల తరువాత ఆస్టిన్ కు బయలుదేరి వచ్చాం కారులో. వచ్చేముందట ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో గ్రూప్ ఫోటో దిగినాం జ్ఞాపకంగా ఉంటుందని.

ఆస్టిన్ కు డ్యాలస్ కు మూడున్నర గంటల ప్రయాణం. విశాలమైన రోడ్లు, వచ్చే వాహనాలకు పోయే వాహనాలకు విడివిడిగా దేనికదే ప్రమాదాలకు అవకాశము లేకుండా, రోడ్ల కిరువైపులా స్పీడ్ లిమిట్ బోర్డులు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎంత బాగున్నాయి అని అనిపించింది. రోడ్ల కిరువైపులా పచ్చని చెట్లు, పచ్చిక, అక్కడక్కడ గ్యాస్ స్టేషన్లు, గ్యాస్ స్టేషన్ లో నిత్య అవసర వస్తువులను, తినుబండారాలను కొనుక్కొనే సదుపాయం, టాయిలెట్ వెళ్ళడానికి రెస్ట్ రూమ్ లు, చెత్తను వేయడానికి చెత్త కుండీలు నన్ను ఆశ్చర్యానికి గురి చేసాయి. పచ్చదనం, పరిశుభ్రత, క్రమశిక్షణ దాని మారు పేరు అమెరికా అనిపించింది. నిన్నటి రాత్రి వర్షం పడింది కాబట్టి చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆ చలి విపరీతంగా గజగజ వనికిస్తున్నట్లుగా అనిపించింది. బాగా చలిపెడుతుందని నేనంటే, “ ఇది ఇంకా మామూలు చలి, మీరు న్యూయార్క్- న్యూజెర్సీ లాంటి ప్రదేశాల్లోనయితే భరించుకోనేలేరు చలికాలములో , ఎండాకాలం వస్తుంది ఇప్పుడు పరువాలేదు” అన్నారు కళ్యాణ్, శరత్. మేం మధ్యలో అక్కడక్కడ ఆగుకుంటూ మూడున్నర గంటల వ్యవధిలో ఆస్టిన్ చేరుకున్నాం. ఇంటివద్ద మా కోడలు సృజన మమ్ములను సాదరంగా ఆహ్వానించింది. అలా మేం శనివారం మధ్యాహ్నం ఏప్రిల్ 22 వ తేదినాడు ఆస్టిన్ చేరుకున్నాం. కాస్త స్నానాలు ముగించి భోజనం చేసి నిద్ర వస్తుంది కాబట్టి మద్యాహ్నం నిద్ర ముంచుక వస్తుంటే నిద్ర పోయినాం. సాయంత్రం ఆరు గంటల వరకు నిద్ర లేచినాం. ఇంకా పొద్దు కుంకడానికి రెండున్నర గంటల సమయం ఉంది. మా వాళ్ళు ఉంటుంది ఓ ఇరవై అపార్త్మెంట్లతో కూడుకొని ఉన్న కమ్యునిటీ లో. ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఓ పాతికకు పైగా గృహనివాసాలు ఉన్నాయి. సకల సదుపాయాలతో కట్టబడి ఉన్నాయి ఆ ఇండ్లు. చక్కటి కిచెన్ ఉంది, ఆ కిచెన్లో ఫ్రిజ్, ఓవెన్, గ్యాస్ స్టౌ, డిష్ వాషర్ , వేడి నీళ్ళు, చలి నీళ్లు వచ్చే సదుపాయం ఉంది. చక్కటి కప్ బోర్డులు ఉన్నాయి సరిపడేంత కిచెన్ సామాను పెట్టుకోనేంత. ఒక పక్క రూంలో వాషింగ్ మిషన్ ఉంది. వస్తువులు పెట్టుకోవడానికి షెల్ఫులు ఉన్నాయి. బట్టలు వేసుకోవడానికి కప్ బోర్డులు ఉన్నాయి రూమ్ రూముకు. ఇది అపార్ట్మెంట్ కాబట్టి రెండు బెడ్రూములు, హాలు, కిచెన్ కంపార్ట్మెంట్, ఒక స్టోర్ లాంటి గది. ఇల్లంతా చెక్కతోనే కట్టబడి ఉంది, కింద ఫ్లోరింగ్ తో సహా. ఫ్లోరింగ్ పై కార్పెట్ పరుచబడి ఉంది. ఒక్క కిచెన్ కంపార్ట్మెంట్ గోడపై మాత్రం మార్బుల్ ప్లేట్ అమర్చి ఉంది. సౌకర్యవంతమైన బెడ్స్ ఉన్నాయి. దాదాపుగా అక్కడి ఇండ్లల్లో ఓ సోఫా కూడా తప్పకుండా ఉంటుంది అని అర్థమయ్యింది. అక్కడ ఇండ్లల్లో కడపల్లాంటివి కనిపించలేదు. చీపుర్ల లాంటివి ఏమి లేవు కాని ప్రత్యేకమైన డస్ట్ క్లీనర్ మిషిన్లు ఉన్నాయి ఇంటింటికి, ఇక కడుపలు కడిగి, వాకిలి చల్లి, ముగ్గు వేసే అవసరం పని అక్కడ లేదు. ఇక బోల్లకని , బట్టలకని పనిమనుషులతో పని లేదు అని అర్థమయ్యింది. బట్టలకు , బోల్లకు మిషన్లు ఉన్నాయి. సాయంత్రం అలా అందరం కలిసి వాకింగ్ కని వెళ్ళాం కొద్దిసేపు. సాయంత్రం ఎనిమిదిన్నర అవుతున్నా ఇంకా వెలుతురు ఉంది. ఆ కమ్యునిటీలో విశాలమైన రోడ్లు ఉన్నాయి. రోడ్లకు ఇరువైపులా మార్కింగుతో కార్ల పార్కింగ్ ప్లేస్ లు ఉన్నాయి.నెలకు ముప్పై డాలర్లు చెల్లిస్తే కార్లు పెట్టుకోవడానికి ప్రత్యేకమైన కారు గరాజులున్నాయి . కమ్యునిటీలో చక్కటి జిమ్ ఉంది, చక్కటి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది కమ్యునిటీ వాసుల కోసం . చక్కటి పూల చెట్లు ఉన్నాయి, ఖాళి స్థలములో చక్కటి గార్డెన్ ఉంది. కమ్యునిటీ లోకి రావడానికి ఆటోమాటిక్ గా కోడ్ నంబర్ కొడితే తెరుచుకొనే గేటులు ఉన్నాయి, అలానే బయటికి వెళ్ళడానికి గేటులు ఉన్నాయి. ఇక అక్కడ గేటు కీపర్ పని కూడా లేదు అనిపించింది. ఇక కమ్యునిటీలో చెత్తవేయడానికి పెద్ద రూముల్లాంటి డబ్బాలున్నాయి సామూహికంగా , ఇంకా ప్రతి అపార్ట్మెంటుకు దగ్గరలో చెత్త వేయడానికి డబ్బాలు ఉన్నాయి. ఇక ప్రతింటికి చెత్త వేయడానికి చెత్త డబ్బాలు ఉన్నాయి. ప్రతి సాయంత్రం చెత్తను తీసుకపోవడానికి ఒక మనిషి వస్తాడట నెలకింతా డబ్బులు తీసుకొని. ఇంకా కమ్యునిటీలో చెత్త డబ్బాలతో పాటు అక్కడక్కడ పెంపుడు కుక్కల మలం తీసి అందులో వేయడానికి కూడా డబ్బాలున్నాయి. అలా ఓ అరగంట కమ్యునిటీ లో తిరిగి ఇంటికి వచ్చి ఆ రాత్రి పూట భోజనం కానిచ్చాం. అమెరికాలో మన తెలుగు ఆహారంకు కొదువలేదు వండుకునే శక్తి ఉంటె అని అర్ధమైంది. రాత్రి గోధుమ రొట్టెలు, కొంత భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాము, కాని ఇండియాలో పగలూ అయితే అక్కడ రాత్రి , ఇంకా మాకు ఇండియా అలవాటు పోలేదు, ఏ అర్ధ రాత్రో గడిచిన తరువాత నిద్దుర పట్టింది.
(ఇంకా ఉంది)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!