ఏంటి అలా చూస్తున్నావ్.. నేను నీ నవ్వుని
నాకు తెలుసు..
కాలంతో పరుగెడుతున్నా.. తన మనసును
అందుకోలేని నీ నిస్సహాయత నాకు తెలుసు
ఏ క్షణం తను వస్తుందో అని
మనసు తెలుపులు తెరిచి
రెప్పల చాటున కలవరిస్తున్న
నీ ఎదురుచూపులు నాకు తెలుసు
నిద్దుర పోవే మనసా..
ఊహల చితిమంటల్లో రాలిన ప్రేమ భస్మం పులుముకొని
నిదురే తెలియని నిశీదిలో నిరీక్షిస్తూ ఎన్నాళ్లిలా
ఆరాటం ఎందుకే మనసా..
నింగికి నేలకు పెళ్ళే లేదు.
పరాయి మనసులో నీ ఉనికే లేదు!
దూరం కాని దూరం లో నన్ను నెట్టేసి
నీకు నీవే భారం అని బాధల్లో బందీ కాకు
ఎంత కాలం అయ్యిందో నీ పెదవుల పైన చేరి
ఈ ప్రేమ.. మధ్యలో వచ్చింది
మనిద్దరిమద్య చిచ్చుపెట్టి పోయింది
నీ కన్నిటి సిరా తో రాసుకుంటున్న అక్షరాలు
ఆవిరి అయ్యేలోగా ధైర్యం కూడగట్టుకొని
ఒక్కసారి నన్ను పిలిచి చూడు
నీ మనసారా నవ్వించి నిలుస్తాను
మునుపటి లా నిన్ను నీలా నిలబెడుతాను!
-అక్షర్ సాహి