Monday, February 17, 2020
Home > కవితలు > ఎవరిని వెతికేది ? -స్వాతీ శ్రీపాద

ఎవరిని వెతికేది ? -స్వాతీ శ్రీపాద

నువ్వు లేకపోడం అంటే నాకు నేను లేకపోడమే కదా
మంచుముక్కల మధ్య నాకు నేను మౌనమై
నిశ్శబ్దంగా నాకు నేను చుట్టుకు పోడమే కదా
ఒక స్వప్నం మనసును తట్టి మేల్కొలిపిన ఘడియ
ఆసాంతం ఆస్వాది౦చక మునుపే
ఒక స్వప్నం కంటి కొసల నుండి
చినుకు చినుకు గా జారి జారి
చిరు ప్రవాహమై పాకి పాకి అణువణువునా
ధారలుగా అమృత౦ కురవక మునుపే
ఆవిరయిపోయిన జాడలు
ఒక ఎడారి తుఫాను ఊపి ఊపి
నిలువెల్లా పెకలించి వేసినపుడు
ప్రపంచాన్ని తలక్రిందులుగా వెళ్లాడ దీసినపుడు
క్షణం క్రితం గీసిన చిత్రం లాగానో
వెలసిపోయిన నలుపు తెలుపు ఫోటో మాదిరో
ఏ మూల నుండో వెన్నాడే ఒక అనంతానంత సమయాన
ప్రాణంతో ముడి వేసిన సంకెల
ఒక ఊపిరి పంజరాన పెంచుకున్న మరో ఊపిరి
ఒక శ్వాసలో మిళితమైన మరో సంగీతం
ఎక్కడ వియోగ గీతం – ఉన్నదల్లా
ఒక లిప్త విరామమేగా
అదేమిటో అక్షరం అక్షరం నీ వేలి ముద్రలే
అడుగు తీసి మరోఅడుగు వేసే లోగా
నీ అరచేతుల పూల తివాసీలు
నువ్వు లేకపోడం అంటే నాకు నేను లేకపోడమే కదా
పదం పదంలో నీ స్వరం పలుకుతున్నప్పుడు
నిన్ను వెతుక్కోనా నీలో నేనైన
నన్ను వెతుక్కోనా

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!