Wednesday, July 6, 2022
Home > సీరియల్ > ట్రావెలాగ్ > నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర- 3 – సబ్బని లక్ష్మీ నారాయణ

నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర- 3 – సబ్బని లక్ష్మీ నారాయణ

ఒక వారం తరువాత డాలస్ ప్రయాణం

ఇక ఆ వారంతమంతా ఈజిగానే గడిచిపోయింది శుక్రవారం వరకు. అమెరికాలో సోమవారం నుండి శుక్రవారం వరకు పనిచేసి శుక్రవారం సాయంత్రం నుండి, ఆదివారం సాయంత్రం వరకు రిలీఫ్ గాగడుపుతారు వీకెండ్లో ఇక్కడి వారు. ఆ వారం మధ్యలో డాలస్ నుండి ప్రవీణ్ ఫోన్ చేశాడు, ఆ శనివారం ఏప్రిల్ 29 నాడు ‘డాలస్ లో TATA వారి మీటింగ్ ఉంది వస్తావా’ అని. TATA అంటే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015 సంవత్సరములో ఏర్పడిన సంస్థ అది. ఆ సంస్థ రెండవ వార్షికోత్సవం ఈ సారి డాలస్ లో పెట్టినారు, తెలుగువారు గాని, తెలంగాణ వారు గాని భారతీయులు గాని ఎక్కువ జనాభా ఉన్న సిటీ డాలస్. నేను తెలంగాణ ప్రేమికున్నిమలి దశ తెలంగాణ ఉద్యమ కాలములో పది పుస్తకాలు రాసినవాన్ని తెలంగాణ పై. తెలంగాణ ఏర్పాటు సందర్భంలో ఒక అరడజను మంచి పాటలు రాసి వాటికి సంగీత దర్శకుడు మిత్రుడు సంగనబట్ల నరేందర్ శర్మ జగిత్యాల గారిచే సంగీతమును కట్టించి నరేందర్ శర్మ, లలిత ప్రసాద్ గార్లచే అద్భుతంగా పాడించి ఆ పాటలను విడుదల చేయించిన వాణ్ని.

అయినా నా గురించి వారికి తెలియదు. ఒక ప్రేక్షకుడిగానైనా వెళ్లి అమెరికాలో ప్రోగ్రాములు ఎలా చేస్తారో చూడాలి అని అనిపించింది. నన్ను ఈ ప్రోగ్రాముకు అటెండ్ అవుతావా అని పిలిచింది మాత్రం మా కొడుకు శరత్ ప్రెండ్ ప్రవీణ్, అతడు గుంటూరు జిల్లా మిత్రుడు. ఇక్కడ ఇంత దూరములో ప్రాంతీయ బేధాలు అని ఏమి లేవు, అంతా కలిసిమెలిసి ఉంటారు. నేను డాలస్ వెళ్ళడానికి ,రావడానికి వీలుగా బస్సు టికెట్ బుక్ చేశాడు మా శరత్. డాలస్ లో నన్ను ప్రవీణ్ రిసీవ్ చేసుకుంటానన్నాడు, మళ్ళీ
సోమవారం నన్ను బస్ ఎక్కిస్తానన్నాడు.అలా డాలస్ వెళ్లి రావడానికి రడీ అయి ఉన్నాను.
ఇంతలో ప్రవీణ్ కు, శరత్ కు తెలిసిన మిత్రుడు, వెంకటేష్ శుక్రవారం సాయంత్రం డాలస్ వెళ్లి మళ్ళీ ఆదివారం ఆస్టిన్ వస్తాడు అని తెలిసింది. ఇక అతనితో శుక్రవారం డాలస్ వెళ్ళడానికి నిర్ణయమైపోయింది. డాలస్ వెళ్ళినప్పుడు ఇద్దరినీ కలువాలనుకున్నాను. ఒకటి ‘ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం’ (TANTEX) కో ఆర్డినేటర్ శ్రీమతి సింగిరెడ్డి శారద గారిని మరియు నా బాల్య మిత్రుడు నారాయణ రెడ్డి అల్లుడు మోహన్ రెడ్డిని . TANTEX వారు ప్రతి నెల 3వ ఆదివారం నాడు నెలనెల ఒక సాహితీ కార్యక్రమమును ఏర్పాటు చేస్తారు. ఒక సాహితీ సమావేశములో పాల్గొని నా యొక్క ఒక పుస్తకము ఆవిష్కరణ చేయించాలని, వీలుంటే వారి సమావేశములో ఒక ప్రసంగం చేయాలని వారితో మాట్లాడాలని అనుకున్నాను. సింగిరెడ్డి శారద గారిది మా కరీంనగర్ జిల్లా అని తెలుసు, వారితో ఫోన్ లో మాట్లాడినపుడు తెలిసింది వారిది చొప్పదండి మండలం రాగంపేట గ్రామం అని సి. నారాయణ రెడ్డి గారి, మరియు నాకు తెలిసిన నా సహచర అధ్యాపకులు మరో సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి బంధువులు వారు అని కూడా.
నేను శరత్ వాళ్ళ మిత్రుడు వెంకటేష్ టో కలిసి అతని కారులో శుక్రవారం సాయంత్రం డాలస్ వెళ్ళాను. వెంకటేష్ వాళ్ళ ఊరు గుంటూరు దగ్గరి తెనాలి అని చెప్పాడు. వాళ్ళ అక్క వాళ్ళు డాలస్ ఉంటారు, రెండు రోజులు సెలవు కాబట్టి వాళ్ళను కలిసి వద్దామని వెళ్తున్నా అని చెప్పాడు. మేం మధ్యమధ్యలో ఆగుకుంటూ డాలస్ చేరుకునేవరకు సాయంత్రం ఎనిమిదిన్నర అయ్యింది.. డాలస్ డౌన్ టౌన్ మాకు వెలుగులతో స్వాగతం పలికింది. డాలస్ చేరుకుంటుండగనే మోహన్ రెడ్డి ఫోన్ చేశాడు మా యింటికి రండి అని. ఈ రోజు రాత్రి ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో ఉండి తెల్లవారి వస్తాను అని చెప్పాను. ఆదివారం నాడు 4 గంటలు మళ్ళీ తిరుగు ప్రయాణం అని చెప్పి వెంకటేశ్ వెళ్ళిపోయాడు నన్ను ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో దింపి. ప్రవీణ్, శైలజ, ప్రవీణ్ వాళ్ళ మిత్రుడు కార్తీక్ నన్ను సాదరంగా ఆహ్వానించారు నేను వెళ్ళేవరకు ప్రవీణ్ వాళ్ళ ఇంకో ఫ్రెండ్ వంశీ, వాళ్ళ అమ్మానాన్నలు హైదరాబాద్ నుంచి వచ్చి, ప్రవీణ్ వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చి ఉన్నారు. పరిచయాల తరువాత అందరం కలిసి భోజనం చేశాం. వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయారు.

తెల్లవారి తొమ్మిది గంటల తరువాత మోహన్ రెడ్డి అడ్రస్ తెలుసుకొని వచ్చాడు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకవెళ్ళడానికి. నేను బ్యాగ్ సర్దుకొని ప్రవీణ్ వాళ్ళకు చెప్పి మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్లాను. ప్రవీణ్ వాళ్ళు ప్ల్యానో ఏరియాలో ఉంటె మోహన్ రెడ్డి వాళ్ళు ఫ్రిస్కో ఏరియాలో ఉంటారట డాలస్ లో.మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి చేరుకొనే వరకు 10 గంటలు అయ్యింది. వాళ్ళ శ్రీమతి నీరజ గారు పలుకరించి మాకు టిఫిన్ పెట్టింది. మోహన్ రెడ్డి గారికి ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి పెళ్లి అయ్యింది, కరీంనగర్ జిల్లా జగిత్యాల, వాళ్ళ మేనల్లుడు డాక్టర్ కు ఇచ్చి పెళ్లి చేసిండు ఒక సంవత్సరం క్రితం. అప్పుడు నేను కూడా జగిత్యాల లో ఆ పెళ్ళికి అటెండ్ అయినాను నారాయణ రెడ్డి తో పాటు. రెండవ కూతురు డాలస్ లోనే యూనివర్సిటీలో చదువుకుంటుంది అని చెప్పిండు.. ఐదు బెడ్ రూముల పెద్ద ఇల్లు వాళ్ళది, విశాలంగా ఉంది బ్యాక్యార్డ్ ఓపెన్ ప్లేస్ తో. వాళ్ళ ఇల్లంతా చూపించాడు, చాలా సౌకర్యవంతంగా ఉంది ఇల్లు. మేం పగటి పూట భోజనం చేసిన తరువాత వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉన్న సింగిరెడ్డి శారద గారి ఇంటికి వెళ్ళాము. శారద గారి భర్త, శారద గారు మమ్ములను రీసీవ్ చేసుకున్నారు సాదరంగా, నేను ఇండియా నుండి తీసుకవచ్చిన కొన్ని బుక్స్ వారికి అందచేసినాను. నా యొక్క పుస్తక ఆవిష్కరణ గురించి చెప్పాను. మే నెల మీటింగ్ అతిథి నిర్ణయం జరిగి పోయింది. నన్ను జూన్ నెల సాహిత్య కార్యక్రమానికి అతిథిగా రమ్మని, ఏదయినా ఒక టాపిక్ పై ప్రసంగించమన్నారు శారద గారు వాళ్ళింట్లో ఉండగానే నాకు డాలస్ లోని రేడియో నిర్వహిస్తున్న మిత్రుడు కె.సి. చేకూరి గారి ఫోన్ నెంబర్ ఇచ్చారు మాట్లాడమని, ఆస్టిన్ లోని డొక్కా రాము, మందపాటి సత్యం గారి గురించి చెప్పారు. హ్యుస్టన్ లో ఉంటున్న వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు చిట్టెన్ రాజుతో మాట్లాడించారు. చిట్టెన్ రాజు గారు నన్ను జూన్ – జులై నెలలలో జరుగబోయే వారి వార్షిక సాహిత్య సభకు ఆహ్వానిస్తామన్నారు. వాళ్ళింట్లో సెలవు తీసుకొని మోహన్ వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేసి కొంత సేపు రెస్ట్ తీసుకొని, సాయంత్రం TATA సభకు వెళ్ళాము. డాలస్ లోని ఒక ఇండోర్ స్టేడియం లో సభను ఏర్పాటు చేశారు. తెలంగాణ వారి సభ కాబట్టి తెలంగాణ తనం ఉట్టిపడేట్టు ఒక చార్మినార్ కమాన్ ఏర్పాటు చేశారు. కొందరు గాయకులూ, సినిమా యాక్టర్లు, యాంకర్లను పిలిచారు. కొందరు అమెరికా లో ఉన్న స్థానిక కళాకారులను కూడా పిలిచారు. ఓ రెండు గంటలు ప్రోగ్రాం చూసి ఇంటికి వచ్చాం. తెలవారి ఆదివారం డాలస్ లోని ఒక ఇండోర్ మాల్ చూపించాడు మోహన్ రెడ్డి. సకల వస్తువులను కొనుక్కోవడానికి, ఎంజాయ్ చేయడానికి, టైం గడుపడానికి, సినిమాలు కూడా చూడడానికి, పుస్తకాలు చదువుకోవడానికి, కొనుక్కోవడానికి, ఆట పాటలతో ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉన్న కాంప్లెక్స్ అది. మధ్యాహ్నం ఇంటికి చేరుకొని భోజనం చేసి కొంత సేపు రెస్ట్ తీసుకున్న తరువాత సాయంత్రం 4 గంటలకు వెంకటేష్ వచ్చాడు ఆస్టిన్ వెళ్ళడానికి వీలుగా. అలా రెండు రోజులు డాలస్ లొ గడిపి, సాయంత్రం డాలస్ నుండి బయలుదేరి రాత్రి ఎనిమిది గంటలవరకు ఆస్టిన్ కు చేరుకున్నాను.

……………………………………………………………………………………………………
ఆ తర్వాతి పది రోజులు

అలా అమెరికాలొ మొదటి 10 రోజులు గడిచిపోయింది ఈజిగానే. మే 1 వ తేది వచ్చింది. అప్పటికే అమెరికాలో కూడా బాహుబలి-2 సినిమా వచ్చి నడుస్తుంది. సోమవారం నాడు సినిమా చూద్దామని నాలుగు టికెట్స్ బుక్ చేసిండు శరత్. ఒక్కొక్క టికెట్ 13 డాలర్లు ఉంటుందట. నేను, శారద, శరత్, సృజన అందరం కలిసి సినిమాకు వెళ్లాం. అక్కడ సినిమాలు చూడడానికి కూడా ఒకే దగ్గర 10 సినిమాలు ఆడే థియేటర్లు ఒకే కాంప్లెక్స్ లొ ఉన్నాయి విశాలమైన కార్ పార్కింగ్ తో.
బాహుబలి -2 మొదటి బాహుబలి కంటే కూడా బాగుంది ముగింపుతో ఉంది కాబట్టి.
భాహుబలి అయినా భారతం అయినా ధర్మం, అధర్మం పైన యుద్ధమే,ధర్మమే గెలుస్తుంది అనేది సారాంశం అనిపించింది.

తెల్లవారి మంగళ వారం నన్ను కళ్యాణ్ ను తీసుకొని బఫెల్లో వైల్డ్ వింగ్స్ కు తీసుక వెళ్ళిండు శరత్. మాకు ఒక కొన్ని ఫ్రైడ్ చికెన్ లెగ్ పీస్ లు, మనిషికి ఒక్క బీర్ ఆర్డర్ చేశాడు. అమెరికా రెస్టారెంట్లో తినడం, తాగడం మొదటిసారి. అక్కడ కౌంటర్ మీద కాని, సర్వ్ చేసే దగ్గర కాని అందమైన అమ్మాయిలే ఉన్నారు ఎక్కువ. అక్కడ టేబుల్స్ పై అమెరికన్ స్త్రీ పురుషులు ఉన్నారు మందు సేవిస్తూ, ఫుడ్ తింటూ. కొన్ని టేబుల్స్ పై చైనీస్ వాళ్ళు, నల్ల జాతి అమెరికన్స్ కూడా కనిపించారు. చుట్టూగోడలపై టీవీల్లో వివిధ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. బాగా లైట్స్ కాకుండా, గుడ్డి వెలుగు కాకుండా లైట్లు వెలుగుతున్నాయి. అమెరికాలో నాన్ వెజ్ ఆహారం అంటే బీఫ్, ఫోర్క్, గోట్, ఫిష్, చికెన్ దొరుకుతాయి. పిండి పదార్థాలతో ఆహరం అంటే బ్రెడ్, బిస్కెట్, పిజ్జా, బర్గర్, సబ్ లు దొరుకుతాయి. వీటికీ ఆకులు, అలములు, ఉల్లిగడ్డ, టమాటో, క్యాబేజీ, ఆలుగడ్డ లాంటివే వెజ్ పదార్థాలు గాని, నాన్ వెజ్ గాని కలుపుకొని తింటారు. వాళ్ళు తినేది వండిన ఆహరం తక్కవ, నూనెకు బదులు చీజ్( వెన్న) పెట్టుకొని తింటారు. నాన్ వెజ్ అయితే గ్రిల్
(మంటపై మాడ్చుకొని) చేసుకొని తింటారు. ఇంట్లోకి గ్రిల్ చేసుకొనే స్టవ్ లను కొనుక్కుంటారు. అక్కడక్కడ కమ్యునిటీలలో స్విమ్మింగ్ పూల్స్ పక్కన నాన్వెజ్ ను గ్రిల్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. అమెరికన్స్ నాన్ వెజ్ తిన్నా అందులో కొంత ఆకులు అలములు, వండని ఆహార పదార్థములను కలుపుకొని తింటారు. అదే వారి ఆరోగ్య రహస్యం అనిపిస్తుంది. బహుశా వారు తనవి తీరా మందును అంటే బీర్, విస్కీ, బ్రాండీ, వైన్ తాగుతారు. సిగరెట్టును కూడా తాగే పురుషులతో పాటు స్త్రీలు కూడా ఎక్కువే అమెరికాలో. అమెరికాలో మందు తాగేవాళ్ళు ఎక్కువ, సిగరెట్లు తాగేవాళ్లు ఎక్కువ. అమెరికాలో మద్యం అమ్మే దుకాన్లు పెద్దపెద్ద గోదాముల్లా ఉంటాయి. ఎన్ని సంవత్సరముల పాత మద్యమైనా దొరుకుతుంది. వాటి ధర పదుల డాలర్ల నుంచి వందల డాలర్ల వరకు ఉంటుంది. తాగడం ఇక్కడ వారి హాబి కాని అతిగా తాగి కారు నడుపరాదు. అలా నడిపితే ఫైన్ వేస్తారు. పదేనిమిది ఏళ్ళలోపు వారు అసలు మద్యం తాగకూడదు. అమెరికాలో 18 ఏండ్ల వయసు లోపువారికి మద్యాన్ని దుకాణాల్లో అమ్మరు. మద్యం అమ్మేటపుడు పుట్టిన తేది చెకప్ చేసుకొనే మద్యం అమ్ముతారు. ప్రతి ఆదివారం అమెరికాలో మద్యం దుకాణాలకు సెలవును చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తారు. అమెరికాలో బీర్ చాలా చౌకగా దొరుకుతుంది మిగితా మద్యం కంటే. ఒక డాలర్ కు ఒక బీర్ చొప్పున చిన్న సైజ్ బీర్లు అవి, మన బీర్ బాటిల్లో సగం ఉంటాయి. ఎక్కువగా తాగి కారు నడుపరాదు, స్పీడ్ లిమిట్ కు మించి వేగముతో కారు నడుపరాదు. అలా చేస్తే ఫైన్ వేస్తారట. ఎప్పుడైనా మిత్రుల ఇంట్లో పార్టీలు చేసుకుంటే అక్కడే పడుకొని తెలవారి వస్తాము అన్నారు మిత్రులు. ఆ రోజు మామూలుగానె ఉన్నాం కాబట్టి రాత్రి 10 గంటల వరకు ఇంటికి చేరుకున్నాం.

శాన్ ఆంటోనియా ప్రయాణం :

అమెరికా లో టెక్సాస్ రాష్ట్రం వైశాల్యం రీత్యా గాని, జనాభా రీత్యా గాని రెండవ స్థానములో ఉన్న పెద్ద రాష్ట్రం. ఆ రాష్ట్రం రాజధాని సువిశాలమైన ఆస్టిన్ నగరం. టెక్సాస్ లో పెద్ద నగరం అంటే హ్యుస్టన్ నగరం చరిత్ర ప్రసిద్ధమైనది. ఆ తరువాత చెప్పుకుంటే డాలస్ నగరం మరియు శాన్ ఆంటోనియా నగరం. మా బాబు ఉంటున్న ఆస్టిన్ నగరానికి దగ్గరగా ఉంటాయి ఈ మూడు నగరాలు, ఆ మూడింటికి కూడలిలో ఉంటుంది ఆస్టిన్ నగరం. ఈ నాలుగు నగరాలను దర్శించే అవకాశం కలిగింది నాకు . ఎక్కడికి వెళ్ళినా ఆత్మీయంగా నన్ను ఆహ్వానించిన తెలుగు మిత్రులు ఉన్నారు, అది వాళ్ళ సహృదయం. శాన్ ఆంటోనియాలో శరత్ వాళ్ళ మిత్రుడు, కార్తీక్ వాళ్ళ కజిన్ రమాకాంత్ ఉంటాడు. వాళ్ళ కొత్త యింటి గృహప్రవేశం ఉంది మమ్ములను రమ్మన్నారు. మే మాసం 6 వ తేది శనివారం ఉదయం 10 గంటల వరకు మేం శాన్ ఆంటోనియా చేరుకున్నాం కారులో. రమాకాంత్, రమాకాంత్ భార్య దివ్య, కార్తీక్ మమ్ములను సాదరంగా ఆహ్వానించారు వాళ్ళ ఇంటికి. రమాకాంత్ వాళ్ళది విజయవాడ. వాళ్ళ అమ్మానాన్నలు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారట. రమాకాంత్ వాళ్లకు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు, ఈశాన్ 3 సంవత్సరాల లోపు, ఒక కూతురు శ్రీ వైష్ణవి, ఏడాదిలోపు వయసు వారికి. ఇద్దరు అమెరికాలోనే పుట్టినారు అన్నాడు. రమాకాంత్ వాళ్ళకు గీన్ కార్డ్ ఉంది, పిల్లలు అక్కడే పుట్టారు కాబట్టి పిల్లలకు సిటిజెన్ షిప్ ఉంది. రమాకాంత్ ఇక్కడికి పదిహేనేళ్ళ క్రితం చదువుకోవడానికి వచ్చి, ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఉండిపోయానని చెప్పాడు. రమాకాంత్ వృత్తి రీత్యా సివిల్ ఇంజనీర్ ఒక కంపనీలో. అంతకు ముందు వాళ్ళు హ్యుస్టన్ లో ఉండేవారట. అక్కడ రోడ్డు పని ప్రాజెక్ట్ అయిపోవడం వలన శాన్ ఆంటోనియాకు మారవలసి వచ్చింది అని చెపాడు. హ్యుస్టన్ లో కూడా ఇల్లు కొనుక్కున్నారట, ఇక్కడికి రావడం వలన ఆ ఇల్లు అమ్మకానికి పెట్టామన్నాడు. ఆ ఇంటికి దాదాపుగా రెండు కోట్ల వరకు అవుతుందన్నాడు ఇండియన్ కరెన్సీలో. దాదాపు ఎనబై పర్సెంట్ పైగా లోన్ మీదే తీసుకున్నామన్నాడు. ఆ నాటి గృహ ప్రవేశానికి హ్యూస్తన్ లో ఉంటున్న వాళ్ళ బావమరది, బావమరిది మిత్రుడు, శాన్ ఆంటోనియా లో ఉంటున్న రమాకాంత్ వాళ్ళ కజిన్ కార్తీక్, ఇంకో కవిమిత్రుడు సూరంపూడి శరత్, ఆస్టిన్ నుండి నేను, శారద,శరత్, సృజన అటెండ్ అయ్యాం. మేం వెళ్ళేవరకు గృహప్రవేశం పూజ జరుగుతుంది. అయ్యవారు శాస్త్ర బద్దంగా పూజ నిర్వహించి వెళ్ళాడు. పూజా కార్యక్రమము తరువాత తీర్థ ప్రసాదములు తీసుకున్నాం. గృహ ప్రవేశానికి పెద్దలుగా హాజరైనామని భావించి మాకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు రమాకాంత్ దంపతులు. భోజనాల తరువాత ఇల్లంతా చూపించారు.రెండు అంతస్తులతో, నాలుగు బెడ్ రూములతో,పైన చిన్నగా కింద పెద్దగా రెండు హాలులతో , చక్కటి కిచెన్ తో, వెనుక ఓపెన్ ప్లేస్ తో, ముందట విశాలమైన కార్ గ్యారేజ్ తో సౌకర్యవంతంగా ఉంది ఇల్లు. ఇంటి వెనుక, ఇంటి ముందట కొన్ని చెట్లు ఉన్నాయి, పూల మొక్కలు, తులసి మొక్కలతో సహా ఉన్నాయి. విశాలమైన రోడ్లతో ఒక కొత్త కమ్యునిటీ లో ఉన్న ఇల్లు వాళ్ళది. మూడు నాలుగు సంవత్సరాల్లో ఇండియా వెళ్లిపోతామన్నాడు రమాకాంత్, పిల్లలు పెద్దపెరిగి చదువుకుంటుంటే ఇండియా వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందేమోనని. తరువాత పిల్లల ఉన్నత చదువుల వరకు మళ్ళీ రావచ్చు వాళ్ళకు సిటిజెన్ షిప్ ఉంది కాబట్టి అన్నాడు. మధ్యాహ్నం వరకు వాళ్ళ ఇంట్లో గడిపి ఆ సాయంత్రం సెలవు తీసుకొని గంటపావు ప్రయాణం తరువాత ఆస్టిన్ చేరుకున్నాం కారులో.

( మిగితా వచ్చే వారం)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!