Sunday, February 28, 2021
Home > సీరియల్ > ప్రేమంచుల్లో..! (మొదటి భాగం) -అక్షర్ సాహి

ప్రేమంచుల్లో..! (మొదటి భాగం) -అక్షర్ సాహి

ఆఫీస్ లో అంతా సందడి గా ఉంది. పండగ రోజు సెలబ్రేషన్ లా ఎంజాయ్ చేస్తున్నారు. సుదీర్గంగా సాగిన ప్రాజెక్ట్ కంప్లీట్ అవడం ఒకటైతే.. ఎండాకాలానికి సెలవిస్తున్నట్లు సన్ అంకుల్ ప్రకటించిన వెంటనే సంబరపడిన వరణుడు తొలకరి జల్లు కురిపించడం. అటు వర్షం పడుతుంటే ఇటు కాంటీన్ నుంచి వచ్చిన వేడి వేడి సమోసాలు, మిర్చి లు షేర్ చేసుకుంటున్నారు.

మేనేజింగ్ డైరెక్టర్ ‘విశ్వం’ తన క్యాబిన్ నుండి బయటికి వచ్చి “హాయ్ గైస్ లెట్ మీ షేర్ యు సంథింగ్.. కంపెనీ పెట్టి 4సం. అయ్యింది. చాల ప్రాజెక్ట్స్ చేశాము. అయితే ఇప్పుడు మనం కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ కి క్లయింట్ సైడ్ నుండి 200% రెస్పాన్స్ వచ్చింది. ఇంఫాక్ట్ మన క్లయింట్ ఇంకో రెండు సంవత్సరాల బిగ్ ప్రాజెక్ట్ ఇప్పుడే కంఫర్మ్ చేసాడు. టార్గెట్ టైం కంటే వన్ వీక్ ముందుగానే కంప్లీట్ చేసినందుకు ముందుగా మీ అందరికి కంగ్రాట్యులేషన్స్. అండ్ ది క్రెడిట్ మస్ట్ బి గివెన్ టు ‘వర్ష’. వర్షిణి లేకుంటే ఈ ప్రాజెక్ట్ ఇంత తొందరగా కంప్లీట్ అయ్యేది కాదేమో! థాంక్యూ వర్ష అండ్ కీపిట్ అప్”. అందరు చప్పట్లు కొట్టారు.

బాస్ వెళ్ళిపోగానే అందరు వర్షిణి ని ప్రశంశల వర్షం తో ముంచెత్తారు.

వర్షిణి కి ఆఫీస్ లో ఒక సంవత్సరం నుండి ఇలాంటివి చాల కామన్. పొగడ్తలకు పొంగిపోదు, బాధలకు కృంగి పోదు. ఎప్పడు గల గల మాట్లాడుతూ, నవ్వు తూ నవ్విస్తూ ఉంటుంది. అందానికి సరిపడా ‘సమయస్ఫూర్తి’, వయసుకు మించిన ‘తెలివితేటలు’ ఆమె ఆభరణాలు. ఎలాంటి వారైనా ఇట్టే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎవ్వరు మిస్ బిహేవ్ చేసిన సందర్భాలు లేవు. ప్రేమ కోసం అయన వాళ్ళందరిని, ఆస్తిపాస్తులను కాదనుకొని పెళ్లి చేసుకుంది. బాగుందని ఎవరైనా అట్ట్రాక్ట్ అయినా ఆమె మాటతీరు చూసి మనసు మార్చుకొని గౌరవాన్ని పెంచుకుంటారు. తన ప్రపంచం అంతా తన భర్త ‘అవినాష్’.. ఎంబిఏ చదివినా.. ప్రస్తుత తమ ఆర్థిక పరిస్థితి బాగోలేక జాబ్ చేస్తుందే తప్ప… జాబ్ చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు. అయితే అది ఆఫీస్ లో ఎవరికీ కనిపించదు. చేస్తున్న ఏ పనికైనా వంద శాతం న్యాయం చెయ్యడమే తనకు తెలుసు.

వర్ష, అనూష ఇద్దరు కెఫెటేరియా లో కాఫీ తాగుతూ ఉన్నారు. “జాబ్ మానేస్తున్నావట? ఏంటి స్పెషల్? ఈరోజు టాక్ అఫ్ ది ఆఫీస్ నీగురించే ” అడిగింది అనూష.

“ఏం లేదు.. ఊరికే!” కాఫీ సిప్ చేస్తూ చెప్పింది వర్ష.

“ఓహో బేబీ ప్లానింగా!” కన్నుకొట్టింది అనుష. “నో అదేం లేదు” సిగ్గుపడుతూ చెప్పింది. “మ్యారేజ్ అయి వన్ ఇయర్ అయ్యింది ఇంకో సంవత్సరంలో సెటిల్ అయ్యి.. ఆతర్వాతే పిల్లలు!”.

“మరి ఇద్దరు జాబ్ చేస్తేనే కదా తొందరగా సెటిల్ అయ్యేది. చెప్పకుండా ఇంకో పెద్ద జాబ్ ఏదైనా వెతుక్కున్నావా ఏంటి? ఎదో సీక్రెట్ కనిపెట్టినట్టు స్టయిల్ గా అడిగింది.

ఇంతలో వాట్సాప్ లో మెసేజ్.. “కం ఇన్ టు మై కేబిన్”… “బాస్ రమ్మంటున్నాడే మళ్ళి మాట్లాడుదాం” అంటూ ఫోన్ లో “జస్ట్ టూ మినిట్స్ సర్!” రిప్లై చేసింది.

“సరే..ఇంటికెళ్తూ మాట్లాడుకుందాం” అని చెప్పి తన డెస్క్ దగ్గరికి వెళ్ళింది అనూష.

విశ్వం ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ గుమ్మం దగ్గర వస్తూ ఆగబోయిన వర్ష ని లోనికి రమ్మని సైగ చేశాడు.

“సరే మిగితా విషయాలు నేను డైరెక్ట్ గా కలిసినప్పుడు డిస్కస్ చేద్దాం..బై” అంటూ ఫోన్ కట్ చేశాడు.

“వెల్ వర్ష.. పొద్దున్నే నీ రిజైన్ లెటర్ చూసాను. మళ్ళి ఒకసారి ఆలోచించరాదూ!”

“లేదు సర్” ప్రాజెక్ట్ అయిపోయింది! మల్లి ఇంకొకటి స్టార్ట్ చేస్తే మధ్యలో విడిచిపెట్టలేను”.

“ఓహ్ అగైన్.. కాల్ మీ విసు.. పెళ్ళికి ముందు అలాగే పిలిచేదానివి కదా!” నవ్వి ఊరుకుంది.

“వాడు.. అవినాష్ ఏమైనా వద్దన్నాడా? మొన్న కలిసినప్పుడు ‘నాకేం అభ్యంతరం’ లేదన్నాడే!”

“తన ఫోర్స్ ఏమి లేదు నాకే..”

“ఐ నో ఐ నో.. నాకు అన్నీ తెలుసు పెళ్ళికి ముందూ తర్వాత ఇద్దరిలో ఎలాంటి మార్పు లేదు. ఛాయస్ ఈజ్ యువర్స్” నెలాఖరు కాబట్టి ఇంకో త్రీ డేస్ వరకు ఎలాగూ వస్తావు.. తర్వాత కూడా నీకు ఎప్పుడు కావాలన్నా జాయిన్ అవ్వొచ్చు.

“విసూ వన్ రిక్వెస్ట్.. రేపటినుంచే రావద్దనుకుంటున్న.. మా ఆయన ఫస్ట్ డే ఇన్ న్యూ ఆఫీస్ కదా!”

“అబ్బో పెద్ద ఫస్ట్ డే!” వన్ ఇయర్ నుంచి చాలీ చాలని జీతానికి పని చేశాడు. చిన్న కంపెనీ కి మారడు, నా కంపెనీ లో ఇస్తా అంటే వద్దంటాడు. అటు వాడు అంతే ఇటు నువ్వు అంతే! నీకేం తక్కువ? ఇలాంటి కంపనీలు నాలుగున్నాయి మీ నాన్నదగ్గర..”

“విసూ..”

“సరే సరే” ఆపేస్తాను! నవ్వాడు. షేక్ హ్యాండ్ ఇస్తూ.. “అల్ డి బెస్ట్! మీ ఇద్దరికీ ఎప్పుడు ఏ అవసరం కావాలన్నా నేనున్నాని మర్చిపోవద్దు”.

“తప్పకుండా విసు.. మాకు పెద్ద దిక్కు మీరే కదా.. ఇద్దరు నవ్వుకున్నారు.

వర్ష, అనూష ఆఫీస్ లో అందరికి గుడ్ బై చెప్పి హ్యాండ్ బాగ్స్ తీస్కుని బయటికి వచ్చేశారు. లైట్ గా వర్షం పడుతూనే ఉంది. పార్కింగ్ ప్లేస్ కి వెళ్లి ఇద్దరు అనూష కారు లో బయలుదేరారు. రోజూ దారిలో వర్ష ని పిక్ చేస్కోవడం, రిటర్న్ లో డ్రాప్ చెయ్యడం ఆఫీస్ లో అందరికన్నా ఎక్కువ చనువు, స్నేహం ఏర్పడింది అనూషకి.

చల్లని సాయంత్రం పైగా వర్షం.. “ఈ వర్షం సాక్షిగా” అంటూ ఎఫెమ్ రేడియో లో పాటలు ప్లే అవుతూ ఉంది.

వర్ష పాట హమ్ చేస్తుంటే అడిగింది అనూష వర్ష కపుల్ కి బాస్ ఎట్లా పరిచయం అని.

“విసు, అవినాష్ ఇద్దరు కాలేజీ నుంచీ ప్రాణ స్నేహితులయ్యారు. అప్పట్లో ఇద్దరూ ఒకే దగ్గర ఉండేవారు. విసు సిటీ లోనే అమ్మా-నాన్న లతో నే ఉంటున్నా ఎక్కువగా అవినాష్ దగ్గరే ఉండేవాడు. ఇద్దరికీ డబ్బులకు కొదువ లేదు. విసు వాళ్ళ నాన్న ది బిజినెస్ అయితే అవినాష్ వాళ్ళ ది వరంగల్ లో వ్యవసాయ కుటుంబం. విసు ఎలాగూ బిజినెస్ లోనే సెటిల్ అవుతా అని డిసైడ్ చేస్తే అవినాష్ కొంతకాలం జాబ్ చేసి తర్వాత బిజినెస్ పెట్టాలనే ఆలోచనలో ఉండే వాడు.
అవినాష్ కి నాకు పరిచయం అయ్యేముందు నుంచే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. మా పెళ్లి అయింతర్వాత కూడా అందరం చాలా క్లోజ్ గా ఒకటే ఫామిలీ అన్నట్టుంటాము”. చెప్పింది వర్ష.

“ఇప్పుడు చెప్పు అసలు విషయం ఏంటి..ఎంబీఏ చదివిన నీవు ఖాలి గా ఉంటావా ? నేను నమ్మను. ఎదో ఉంది.” అడిగింది అనూష.

“ఏంలేదు అను జస్ట్ ఊరికే.. నాకు హౌస్ వైఫ్ లాగా ఉండటం అంటే ఇష్టం… మా వారికి వేరే కంపెనీ లో పెద్ద జాబ్ వచ్చింది.. ఇంక బేబీ ప్లాన్ కూడా చేద్దామనుకుటున్నాం.. ఎలాంటి టెన్షన్ లేకుండా ఫ్రీ మైండ్ తో ఉందాం అనుకుంటున్నా” సిగ్గు పడుతూ చెప్పింది.

“వ్వాట్ ఏ ఫ్యూలిష్ థాట్? నీ నుంచి ఇలాంటిది ఎక్సపెక్ట్ చెయ్యలేదు. అస్సలు అనుకోలేదు. అందరికి ఆదర్శంగా, నీ తెలివి తేటలతో ఎంతో ఎత్తుకు ఎదుగుతావనుకున్న. సడెన్ గా ఇదేంటి?

ఆర్థికంగా కూడా మీరు ఇప్పుడిప్పుడే అన్ని సమకూర్చుకుంటున్నారు. ఒక చిన్న పెంట్ హౌస్ లో అడ్జెస్ట్ అవుతున్నారు. మా ఆయన లక్షకు పైన సంపాదిస్తున్నారు నాకు 30 వస్తుంది. సొంత ఇల్లు ఉంది అయినా ఇద్దరం కష్టపడుతున్నాం. ఆయన బెంగుళూరు లో నేను ఇలా హైదరాబాద్ లో… వీకెండ్స్ లో వస్తుంటారు. ఏ రెస్టారెంట్ అంటే అక్కడ తింటాం. హ్యాపీ లైఫ్! పిల్లల కోసం ఇప్పుడేం తొందరలేదు. అంతా ప్లానింగ్ చేస్కుంటూ వెళ్తున్నాం. రేపు మాకు బాబు కావాలనుకుంటున్నాం! వాడు కార్ బొమ్మ అడిగితే నిజమైన కార్ కొని ఒక డ్రైవర్ ని పెట్టేంత, టాప్ స్కూల్ లో చదివించే అంత సంపాదించుకోవాలి! రేపు నా పిల్లలు.. వాళ్ళ ఫ్రెండ్స్ కి అది ఉంది ఇది ఉంది నాకేది మమ్మీ అంటే నేను షేమ్ గా ఫీలవద్దు. పిల్లలకి అన్ని రకాల సౌకర్యాలు కలిపంచగలననే నమ్మకం కుదిరినప్పుడు కంటాం! ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరు సెటిల్ అవుతూ ఉన్నారు మేమూ తొందర్లోనే అవుతాం.

చెరగని చిరునవ్వుతో ఇంకా ఎం చెప్తుందో అని వింటూ ఉన్న వర్ష ని చూసి ఇంకా ఆశ్చర్య పోయింది అనూష.

“అదేంటే నేను ఇంత సీరియస్ గా చెప్తూ నీలో ఆలోచన కలిగించాలని చూస్తుంటే నువ్వేం మాట్లాడట్లేదు? నీకు అవినాష్ అంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. నాకు ఉంది మా ఆయన మీద ప్రేమ.. మాది లవ్ మ్యారేజ్ నే.. తర్వాత అందరు ఒప్పుకున్నారు, కట్నకానుకలు ఇచ్చి పుచ్చుకున్నాం. అలాగని తను మాత్రమే జాబ్ చెయ్యాలి నేను ఇంట్లో కూర్చుని చాకిరీ చేసి పెట్టాలి, బట్టలు ఉతకాలి అని కూర్చోలేను. నేనూ చదుకున్న, నాకు కొన్ని కావాలి అనుకుంటే నేను కొనుక్కోగలను ప్రతిదానికి చేయి చాచి అడగే ఖర్మ నాకేంటి! నేను సంపాదిస్తున్నాను కాబట్టి నా ఖర్చులకి లెక్క అడగలేడు. గుర్తు పెట్టుకో ఆడది మొగుడికి పనిమనిషి గా ఉండొద్దు పెళ్ళాం గా ఉండాలి. కాలం మారుతూ ఉంది అంతా ఈక్వల్. ప్రపంచం అంతా మోడరన్ అవుతుంటే నువ్వు ఇంకా పాత సినిమా హీరోయిన్ లా తయారవుతున్నావేమో అనిపిస్తుంది” ఏమంటావ్?”

“సరే కాఫీ తాగుదామా,?”
కార్ కాఫీ షాప్ ముందు ఆగింది. ఇద్దరు వెళ్లి కాఫీ ఆర్డర్ చేశారు.

“అవినాష్ కి కూడా కాఫీ అంటే ఇష్టం. ఇంట్లో రోజూ టీ నే తాగుతాడు కానీ ఇలాంటి టైం లో కాఫీ ఆస్వాదిస్తూ ఉంటాడు” సిప్ చేస్తూ చెప్పింది వర్ష.

“అవును.. చందూ కూడా అంతే.. అందులో నేను పెట్టిన కాఫీ అంటే చాలా ఇష్టం” చెప్పుకొచ్చింది అనూష.

“ఇంతకీ డిసిషన్ మార్చుకున్నావా” లేదా నిలదీసింది.

“చూడు అను నీ లైఫ్ స్టయిల్ వేరు నాది వేరు. మన ఆలోచనలు వేరుగా ఉన్నాయ్. అయినంత మాత్రాన నాలా నువ్వు ఉండాలని నీలా నేను ఉండాలని లేదు కదా. లైఫ్ సెక్యూరిటీ కోసం సంపాదించుకోవాలి.. నిజమే! అది అందరికి అవసరమే.. కానీ సంపాదనే జీవితం అని మార్చుకుంటే ఇంక నువ్వు జీవిస్తున్నట్లా లేక చాకిరీ చేస్తున్నట్లా? మొగుడి కోసం, మన ఇంట్లో పనులను మనం చేసుకుంటే అది చాకిరీ అనుకుంటున్నాం. మొగుడు సంపాదిస్తే తన ఒక్కడికోసమే కాదు కదా. తన ఇంటికోసం, తన భార్య పిల్లల కోసం రోజంతా కష్టపడడం చాకిరీ కాదా? నేను పిల్లలకు బొమ్మ కొనియమ్మా అంటే బొమ్మే కొనిస్తాను. తాను దానితో ఆడుకుంటాడు వాడికి అంతవరకే అర్ధం అవుతుంది. స్కూల్ కి వెళ్తా అంటే స్కూల్ బస్ లోనే పంపిస్తాను. నలుగురి తో ఫ్రెండ్షిప్ పెరుగుతుంది రేపు ఏమైనా అవసరం వస్తే మనతో పాటు వాడి స్నేహితులూ తోడుంటారు. కష్టాలో ఉంటె హెల్ప్ చేయమనే సంస్కారం నేర్పిస్తాను. నా భర్తని నా పిల్లల్ని చూసుకోవడం లో నేను చాలా ఆనందాన్ని అనుభవిస్తాను. నా ఇల్లు శుభ్రం చేసుకోవడానికి నేనెందుకు పనిమనిషి అని పోల్చుకోవాలి? నాకు చేతకాకుంటే పనిమనిషిని పెట్టుకుంటాను. నాన్న కోసం పని చేస్తాం, బ్రదర్స్ కోసం పని చేస్తాం.. భర్త దగ్గరికొచ్చేసరికి నేనేమన్న పనిమనిషినా అనుకోవడం అవగాహనారాహిత్యం. అలాగే నేను సంపాదిస్తున్నాను కాబట్టి నువ్వు నా మాట వినాల్సిందే అని మొగుడంటే అది అతని తప్పు.

అవసరాల కోసం సంపాదించాలి కానీ పక్కోడితో పోల్చుకుని సంపాదిస్తుంటే దానిలో గొప్పతనం తెలియదు. నువ్వు కంపేరిజన్ లో ఉన్నత కాలం నీకు తృప్తి అనేది ఉండదు. ఇంకో 25ఏండ్ల తర్వాత నీ కొడుకు నీ సంపాదన వద్దనుకుని వెళ్ళిపోతే నీ త్యాగానికి అర్ధం ఉంటుందా? అవసరానికి మించిన లక్ష్యం నాకనవసరం. అన్ని వసతులు కల్పిస్తే పిల్లలు బాగా వృద్దలోకి వస్తారని గ్యారంటీ ఉందా? బాగా డబ్బున్న పిల్లలు ఎక్కువమంది క్లబ్బుల్లో, పబ్బులో నే ఉంటున్నారు. సంపద కల్పించాలి. సంపాదన విలువను చెప్పాలి అంతే కానీ డబ్బే లక్షసాధన అన్నట్లు పెంచొద్దు. సరే ఈ గీతోపదేశం మళ్ళెప్పుడైనా వినొచ్చు వెళ్దాం పద మా వారి కంటే ముందే ఇంటికి వెళ్లి తనకి స్వాగతం పలకాలి” అని ముగుంచింది.

ఇద్దరు బిల్ పే చేసి కార్ లో కూర్చున్నారు. అమీర్ పెట్ రాగానే రద్దీ ఎక్కువయ్యింది. వాహనాలేవీ పరిగెట్టట్లేదు. నత్త నడక లా ఉంది పరిస్థితి.

ఇద్దరూ ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. అనూష లో ఇదో కొత్త మార్పు.. “ అంతా మెకానికల్ లైఫ్ కి అలవాటు చేసుకుంటున్నాం. అన్ని ఆలోచనలు డబ్బు చుట్టే తిరుగుతున్నాయి కానీ సంతోషం గా లేము. ఏ మనిషైనా లేనిదానిగురించే ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతుంటాడు”.

వెంటనే చందూ కి ఫోన్ చేయాలనిపించింది. పెళ్ళైనా బాచిలర్ కష్టాలు పడుతూ అంతదూరం ఎందుకు అనిపించింది. “అక్కడ కష్టపడింది చాలు అంతా వొదిలేసి ఇక్కడికి రండి కష్టమైన సుఖమైనా కలిసే ఉంటూ పరిష్కరించుకుందాం అని చెప్పాలని ఉంది”.

వీళ్ళ కారు పక్కనుంచి వెళ్తున్న బెంజ్ కార్ లో పెద్దాయన “వర్ష వర్ష” అని పిలుస్తుండటంతో ఇద్దరు అటుగా చూశారు.

(ఇంకా ఉంది)

-అక్షర్ సాహి

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!