Sunday, October 2, 2022
Home > సీరియల్ > ప్రేమంచుల్లో..! (రెండవ భాగం) -అక్షర్ సాహి

ప్రేమంచుల్లో..! (రెండవ భాగం) -అక్షర్ సాహి

“ఎమ్మా వర్షా.. బాగున్నావా!”

“నేను సూపర్ అంకుల్.. హౌ అర్ యూ ?” కిటికీ విండో డౌన్ చేస్తూ అడిగింది.

“ఏక్ దమ్ ఫిట్ బేటా! డాడీ కి ఏమైనా చెప్పాలా?”

“ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పండి.. ఎక్కువ గా సిగరెట్ తాగుతూ అర్ధరాత్రి వరకూ మేల్కోవద్దని చెప్పండి” తండ్రి గురించి అవినాష్ గురించి మాట్లాడేటప్పుడు తన మాటల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తుంది.

“తప్పకుండా నాన్న..బై టేక్ కేర్.. ఏదైనా అవసరం వస్తే పోనే చెయ్యి..”

“ఓకే అంకుల్ బా..య్”

బెంజ్ కారు వీళ్లను దాటి వెళ్ళింది. కారు వెనుక అద్దం మీద ‘వర్షిణి’ అని రాసి ఉంది. బేగంపేట్ వైపు స్టీరింగ్ తిప్పుతూ అడిగిండి అనూష “ఎవరా అంకుల్.. కారు కి నీ పేరుంది ఏంటి” అని.

“ఓ అది.. నా కారే.. పెళ్ళికాకముందు! రఘురాం గ్రూప్ అఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ రఘునందన్ మా నాన్నగారు. ఇప్పుడు కలిశాడే.. ఆ అంకుల్ తిలక్ రెడ్డి అని మా నాన్న బెస్ట్ ఫ్రెండ్” చాలా కాజువల్ గా చెప్పింది.

ఆశ్చర్యం తో షాక్ అయినట్లు పేస్ పెట్టింది అనూష. తేరుకొని “మైగాడ్! కొన్ని వేలకోట్ల టర్నోవర్ కంపెనీస్ ఉండి ఇంత మాములు గా ఏమి లేనట్టు గా బతుకుతున్నావా?” అడిగింది.

“నో అనూ ఏమి లేనట్టు కాదు అన్నీ ఉన్నట్టే బ్రతుకుతున్నా.. చాలా సంతోషంగా ఉంటున్న.. నా సంతోషం ఎప్పుడు నా దగ్గరనే ఉంటుంది. మా నాన్న ఇస్తాన్న డబ్బులో లేదు కానీ తాను చూపిస్తున్న ప్రేమలో ఉంది. అవినాష్ చిరునవ్వు లో ఉంది. గాలి సైతం చొరబడి విడదీయలేని మా ప్రేమ బందం లో ఉంది”. ఇంకా చెప్పబోయింది కానీ ఇల్లు దగ్గరికి రావడంతో ఆపేసింది.

కారు వర్ష ఉంటున్న ఇంటి ముంది ఆపింది. వర్ష తో పాటు తనూ దిగింది.

“సరే మరి వర్షం పెరిగేట్టుంది నేను వెళ్తాను” అని ఒక్కసారి హగ్ చేసుకుంది. చేతిలో చేయి వేసి ‘థాంక్ యూ వర్షా! నువ్వు చెప్పింది నిజమే డబ్బులతో అవసరాలు మాత్రమే తీరుతాయి. సంతోషం అనేది మనదగ్గరే, మన మనస్సులో మన ఆలోచనలో ఉంది. ఈర్ష తో ఒకసారి, చాలి చాలని బతుకులని ఓ సారి.. ఇగో దెబ్బతిందని ఇంకోసారి, కష్టాల్లో ఉన్నామని ప్రతిసారీ.. మన సంతోషాన్ని మనమే అణిచివేస్తున్నాం! ఇప్పటినుండి నేను హ్యాపీ గా ఉండటానికి ట్రై చేస్తాను. కానీ రేపటినుండి ఆఫీస్ బోసి పోతుందేమో! ముఖ్యంగా నేను నిన్ను మిస్ అవుతానేమో! ఏదైనా అద్భుతం జరిగి నీ మనసు మారి నువ్వు ఆఫీస్ కి వస్తే బాగుంటుంది. అవసరం అయితే డెలివరీ టైం లో లీవ్ పెట్టొచ్చు”.

“ఇంకా మొదలే లేదు నువ్వు డెలివరీ దాకా వెళ్ళావా.. చూద్దాం లే.. ! ముందు త్వరగా పోనివ్వూ వర్షం ఎక్కువతుంది”.

“ఓకే మై డియర్ అల్ ది బెస్ట్”.

ఇంటికి వేళ్లెసరి ఇంకా అవినాష్ రాలేదు. ఇల్లంతా సద్ది, స్నానం చేసి వంట చేసి టీవీలో “నిన్నే పెళ్లాడుతా” మూవీ చూస్తూ ఎదురు చేస్తుంది వర్ష. రాత్రి అవుతోంది. అవినాష్ ఇంకా రాలేదు. బహుశా వర్షం అని ఎక్కడో ఆగివుంటాడు. రెండు గంటలనుండి వెయిట్ చేస్తూ ఉంది. కొత్త ఉద్యోగం కన్ ఫర్మ్ చేసుకొని వారం కిందటే పాత ఆఫీస్ మానేశాడు. ఈరోజే ఫ్రెండ్ ని కలిసొస్తా అని వెళ్ళాడు.

“త్వరగా రా బాబూ.. ఆకలేస్తోంది.. ఎంత సేపయ్యా మొగుడా!” టీవీ లో టాబూ మాటలు విని గట్టిగా తనూ అంది. ఒక్కసారి చుట్టూ చూసి సిగ్గు పడి నవ్వుకుంది.

అవినాష్ తొందరగా వస్తే బాగుండు అనుకుంది. పెళ్ళైన దగ్గరినుంచి ఆఫీస్ లో తప్పించి ఎక్కువ సమయం ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఫోన్ చేసినా రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయకపోవడంతో ఎటూ తోచని స్థితిలో ఉంది. నిజానికి ఇద్దరికీ వర్షం అంటే చాలా ఇష్టం. వర్షం పడిందంటే ఇద్దరు తడవాల్సిందే.. ఆడుతారు.. పాడుతారు.. చిన్న పిల్లలైపోతారు..పక్కన పిడుగు పడ్డా తెలియనంత మైమర్చిపోతారు.

ఫోన్ రింగ్ అవుతుంటే ఆత్రుతగా తీసింది అవినాష్ నుండి కాల్ అనుకోని. విసు నుండి కాల్.

“హలో విసు చెప్పండి”

“హలో.. వచ్చాడా వాడు? ఫోన్ తీయట్లేదు”

“లేదు విసు నేను అదే వెయిట్ చేస్తున్నా”
“వస్తాడులే ఎక్కడో బహుశా వర్షం అని ఎక్కడో ఆగివుంటాడు. కంగారు పడకు
బై ది వే ఈ సండే మీ ఇంటికి భోజనానికి వస్తున్నాం. నేను మా ఆవిడ, మా సంటోడు..పెళ్ళికి ముందు నువ్వు చేసిపెట్టిన బిరియాని టేస్ట్ ఇంకా మరిచిపోలేదు.

“అయితే బాస్ కి బిరియానీ కావాలన్న మాట ఆరోజు! విత్ ప్లెజర్ సర్.. కానీ ఆరోజు లా మరీ ఎక్కువగా మందు కొట్టరుగా?” నవ్వుతూ గుర్తు చేసింది ఆరోజుని.

“ఓహ్ అయితే విందు తో పాటు ముందుకు పర్మిషన్ ఉందన్నమాట.. అయినా శాలిని ఉంటది కదా డోంట్ వర్రీ.. నేను సేఫ్..”

“అవునా… అయితే మా శాలిని కంట్రోల్ లోనే ఉన్నారన్నమాట!”

“లేదు.. తనకి కార్ డ్రైవింగ్ నేర్పించాను! హ హ హా” గట్టిగా నవ్వుకున్నారిద్దరు.

ఇంతలో శాలిని ఫోన్ తీస్కుని “ఈయన మాటలకేం గాని సండే రోజు అన్ని పనులకు గుడ్బై.. మేము వస్తున్నాం.. అందరం కలిసి మూవీ కి వెళ్దాం అట్నుంచి ఏదైనా రెస్టారెంట్ వెళ్దాం” అంది.

“ఇది మరీ బాగుంది భోజనానికి మా ఇంటికి వస్తా అని మళ్ళి బయటికి వెళ్లాలా? అదేం కుదరదు.. చక్కగా మా ఇంట్లోనే బిరియాని చేసి పడుతాను”.

“సర్లేవే తల్లీ నిన్ను నీ ఆయన్ని ఎవడూ బాగుచెయ్యలేడు.. ట్రెండు కే ట్రెండ్ సెట్టర్ లు ఇద్దరూ” వెక్కిరించింది.

“మధ్యలో మా ఆయనను ఎందుకు లాగుతున్నవే.. రావే నీ పని చెప్తా..” ఇద్దరు ఓ అరగంటా మాట్లాడుకుని ఫోన్ పెట్టేశారు.

మనసు హాయిగొలిపే చల్లటి గాలి కిటికీ నుండి వీస్తుంటే ఇటు టీవిలో ప్రేమ సన్నివేశాలు వాళ్ళ లవ్ స్టోరీ గుర్తు చేస్తున్నాయి. చల్లటి గాలి వీస్తూ వర్ష ను గతం లోకి లాక్కెళ్ళింది.

విసు, అవినాష్ ఇద్దరు కాలేజీ నుంచీ ప్రాణ స్నేహితులు. అప్పట్లో ఇదే పెంట్ హౌస్ లో ఇద్దరూ ఉండేవారు. విసు సిటీ లోనే అమ్మా-నాన్న లతో నే ఉంటున్నా ఎక్కువగా అవినాష్ దగ్గరే ఉండేవాడు. ఇద్దరికీ డబ్బులకు కొదువ లేదు. విసు వాళ్ళ నాన్న ది బిజినెస్ అయితే అవినాష్ వాళ్ళ ది వరంగల్ లో వ్యవసాయ కుటుంబం. విసు ఎలాగూ బిజినెస్ లోనే సెటిల్ అవుతా అని డిసైడ్ చేస్తే అవినాష్ కొంతకాలం జాబ్ చేసి తర్వాత బిజినెస్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు.

శాలిని, విసు చిన్న నాటి ఫ్రెండ్స్ కం లవర్స్. దీంతో ఈ లవ్ బర్డ్స్ ఎప్పుడు టైం చిక్కినా ఇదే పెంట్ హౌస్ మీద వాలిపోయేవారు. అవినాష్ రాసే కథలు, కవితలు వింటూ నీకో హీరోయిన్ వచ్చే వరకు నీ కథల్లో క్యారెక్టర్స్ మేమె అంటూ సరదా సరదా గా గడిపేవారు.

ఓరోజు వర్షం పడుతుంది. లాస్ట్ మినిట్ లో మూవీ కి వద్దనుకుని ఇంట్లోనే గడిపెయ్యాలని అనుకున్నారు. ఇంతలో అవినాష్ “నేను ఇప్పుడే వస్తాను చిన్న పని ఉంది హాఫ్ అవర్ లో వస్తా” అన్నాడు బయటికి రెడీ అవుతూ. “ఏమిరా మాకు ప్రయివసీ ఇవ్వడానికి వెళ్తున్నావా?” విసు శాలిని ని చూస్తూ అడిగాడు.

“ఏయ్ నిన్ను..” అంటూ పేపర్ తో వసుని కొట్టింది.

“అంత లేదు రోయి! నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది ఈరోజు కలిసివద్దామని వెళ్తున్నా! తల దువ్వుతూ బదులిచ్చాడు.

“అవునా ఎవరా లక్కీ గాళ్” క్యూరియాసిటీ తో అడిగింది.

“తొందర్లో చెప్తాను నాట్ నౌ” అంటూ బయటికి వచ్చాడు.

“తీస్కరా బాబూ మా జంటకి మీరూ తడైతే అందరం కలిసే వెళ్లొచ్చు ఎటైనా..” అంటూ ఫోన్ తీసుకుంది రింగవుతుంటే.

విసు కి తెలుసు ఆహ్లాదకరమైన వాతారణం ఉంటె మనోడు రొమాంటిక్ అయిపోతాడు. ఒక కవితనో, కథ నో విసురుతాడు. లేకుంటే గిటార్ తీసుకుని పాటందుకుంటాడు. ఇవి లేకుండా బయటికి వెళ్తున్నాడంటే సిగరెట్ తాగడానికో లేదా ఇన్స్పిరేషన్ కోసమో!

వర్ష ఫ్రెండ్ ని కలుద్దామని విజయనగర్ కాలనీ వెళ్లింది. రోడ్ మధ్యలో రిపేర్ ఉంటె కార్ పక్కన పెట్టి నడవ సాగింది. సన్నటి వాన తుంపర లో నడుస్తుంటే ఎదో తెలియని మధుర మైన ఫీలింగ్. మనకు జరగ బోయే విషయాలు మనకంటే ముందే మన పరిసరాలు పసిగట్టి మనల్ని ప్రిపేర్ చేస్తుంటాయట. బహుశా తను ప్రేమలో పడుతానని వరణుడు కనిపెట్టి ఉంటాడు అందుకే కాబోలు చిరు జల్లుల తో గిలిగింతలు పెడుతున్నాడు. ఎదో చెట్టుకొమ్మ మీద కోయిల ప్రణయ గీతం పాడుతూ ఉంది. సీతా కోక చిలుకలు సయ్యాటలాడుతున్నాయి. కారుమబ్బులు దోబూచులాడుకుంటున్నాయి. వాహనాలేవి రోడ్ మీద లేకపోవడంతో దారిలో నీళ్లలో చప్పుడు చేస్తూ లయబద్దంగా వర్షం కురుస్తోంది. చుక్కల గొడుకు పట్టుకుని నడుస్తున్న తన అడుగుల చప్పుడు కి కాలి అందెలు తాళం వేస్తున్నాయి. సన్నటి గాలి శృతి కడుతోంది. కవినాథుడు పులకరించి పరవశించి పాటలు కట్టే సమయం కూడా కాబోలు.. ఏదైనా.. ఇద్దరి మనుషుల పరిచయం కోసం ఆ రెండు మనసుల కలయిక కోసం ప్రకృతి.. పరిసరాలను సమన్వయపరిచి సృష్టిస్తున్న ప్రణయ ఘట్టం అది.

లాస్ట్ పఫ్ లాగి సిగరెట్ కింద పడేసాడు అవినాష్. కాలనీ లో ఉన్న చిన్న బస్ స్టాండ్ పక్కనే నిల్చుని ఉన్నాడు. వర్షం పడుతున్నా గొడుగు పట్టుకుని కంకులు కాలుస్తున్న రంగమ్మ ను పిలిచి “ఇంక సాల్లేవే ఇంటికి పోదాం! మల్ల వానెక్కువైతే ఈడ్నే కూసోవాలె!” అన్నాడు శంకరయ్య.

“బంజేత్తున్న నే.. గీ నిప్పులు గూడ మండుతనే లెవ్! పెద్దోడికి పోన్ జెయ్యి జర.. ఇంటికచ్చిండా లేదా!

వాళ్ళనే గమనిస్తూ వాళ్ళ మాటలు వింటూ ఏదో ఆలోచిస్తున్నాడు అవినాష్. ఈ మధ్య ఏ జంటని చూసినా తన లైఫ్ పార్టనర్ గురించే ఆలోచించడం చేస్తున్నాడు. నిజానికి విసు వాళ్ళకి ప్రయివసీ ఇద్దామనే బయటికి వచ్చాడు. కాలనీ ఎంట్రన్స్ దగ్గర మిర్చి బజ్జిలు మంచి టేస్ట్ గా ఉంటాయి. వెళ్లే టప్పుడు తీసుకెళ్దాం అని కూడా వచ్చాడు.

“ఎస్క్యూజ్ మీ!” తల పక్కకి తిప్పి చూసాడు ఎవరా పిలిచేది అని.

“ఆనంద నిలయం అని ఇదే కాలనీ అని చెప్పారు కాస్త దారి చెప్పగలరా?”

అడుగుతుందా! తీసుకెళ్లమని చెప్తుందా అని ఆలోచించే లోపు

“గిట్లనే సీద పోయి పస్ట్ లెఫ్ట్ తీస్కుంటే నాల్గో ఇల్లే” శంకరయ్య చెప్పాడు

“కంకులు తీస్కో రాదు బిడ్డా! మంచిగ లేతగున్నయి! తింటే తీయ్యగ ఉంటై!” రంగమ్మ అడిగింది.

“మ్.. మ్.. మ్.. సరే ఒక నాలుగివ్వు.. కవర్ లో పెట్టివ్వు.”

“దా బిడ్డ! గిటు పక్కకు రా! ఆడ నీళ్లున్నయి” అంటూ లేత కంకులు వెతుకుతూ అంది.

“సిన్మా ఈరోయిన్ లెక్కున్నవ్ ! నీ పేరేంది బిడ్డ !

“వర్ష..” కొద్దిగా సిగ్గుపడుతూ చెప్పింది పక్కనే ఉన్న అవినాష్ తననే చూస్తూ ఉంటె.

వాళ్ల మాటలు వింటూన్న అవినాష్ లో ఆల్రెడీ అలజడి మొదలయ్యింది. తన కవితల్లో, కథల్లో దాచుకున్న కథానాయకి కళ్ళముందు ప్రత్యక్షం అయినట్లు.. మేఘాలు ముద్దాడి పూల వర్షం కురుపిస్తున్నట్లు… మనసు కోరుకున్న మగువ ముంగిట ఉండగా తాను ఊహల్లో విహరిస్తున్నాడు.

“ఇన్నాళ్ల నా నిరీక్షణ నీ కోసమే!
నీ నవ్వులో నవ్వు నై – కళ్లల్లో కనుపాప నై
నీ శ్వాస లో శ్వాసనై – ఎద లయలో శృతినై
నీ పెదవులపై చిరుమందహాసమై ఒదిగి పోవాలని
నిరీక్షిస్తున్నా..!”

(ఇంకా ఉంది)

-అక్షర్ సాహి
aksharsahi@gmail.com

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!