Wednesday, July 6, 2022
Home > కథలు > || పాతచీర || -వి. సునంద

|| పాతచీర || -వి. సునంద

సావిత్రమ్మ చాలా దిగులుగా వుంటోంది ఈమధ్య. ఆమెలో మునుపటి ఉత్సాహం, చలాకీతనం మచ్చుకైనా కనబడటం లేదు. రోజూ చేసే పనులను తప్పదన్నట్టు చేస్తుంతదే తప్ప దేనిపై ఆసక్తి చూపడం లేదు. ఇదంతా భర్త రఘురాం గమనిస్తూనే ఉన్నాడు.

పిల్లలు పండక్కొచ్చి వెళ్ళిన తర్వాత నాల్గురోజులు బాగానే ఉంది. ఆ తర్వాత ఏమయిందో! ఏమో!? తిండి సరిగా తినడం సేదు. నిద్ర సరిగా పోవడం లేదు. పని అలసటా అంటే అదీ కాదు. పిల్లలు వచ్చి వెళ్ళిన తర్వాత మనవళ్ళు మనవరాలి ముద్దు ముచ్తట్లు చెప్పి పండుగ అలసటను మరచి పోయింది. అలాంటిది ఉన్నట్టుండి ఇలా ఎందుకు మారిందో? మనసులో ఏమాలోచిస్తుందో?.. చెబుతుందేమోనని ఎదురు చూశాడు. ఇక లాభం లేదని అడిగితే ‘ఏం లేదని’తల అడ్డంగా ఊపింది సావిత్రమ్మ.

“పిల్లలు, తాము ఎప్పుడూ అంతా కలిసి ఉంటే బాగుండునని బాధ పడ్తుందో ఏమో” అయినా ఒంట్లో ఓపికున్నంత కాలం “ఎక్కడికీ వెళ్ళొద్దు! ఇక్కడే ఉందాం” అన్న మాటలు గుర్తుకు రాగానే భార్యతో “రెక్కలొచ్చిన పక్షులు ఎంతకాలం మన దగ్గరుంటారు? అయినా మనమే ఓపికున్నంత వరకు ఇక్కడే ఉందాం అనుకున్నాం కదా! ఎందుకు దిగులు పడుతున్నావు?”. ఓదార్పుగా అన్నాడు రఘురాం.

భర్త ఓదార్పు మాటలకు కొంత సంతోషమనిపించింది. “అసలు విషయం తెలిస్తే” తలచుకోగానే ముచ్చెమటలు పట్టాయి. ముప్పై ఏళ్ళుగా భర్త మనస్తత్వాన్ని కాచి వడపోసిన సావిత్రమ్మకు.

“ఏమిటి! సావిత్రీ! నా మాటలు వింటున్నావా? మళ్ళీ ఆ పరధ్యానం ఏమిటీ? విషయమేమిటో చెప్పు! ఆరోగ్యం బాగా లేదా! చెప్పు మరి. డాక్టరు దగ్గరికి వెళదామా! ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ రఘురాం ఆదుర్ధాగీ, అనునయంగా అడిగాడు. “అబ్బే! అలాంటిదేం లేదండీ! పిల్లలూ” అని తనలో తానే గొణుక్కుంది. “ఆ పిల్లలకేమయింది నిక్షేపంగా ఉన్నారు. వాళ్ళ క్షేమం చూసి సంతోషించాల్సింది పోయి ఇలా బాధ పడటం ఏమిటి? ఇలా చేస్తేనే లేని పోని కొత్త రోగాలు ఒంట్లోకి వచ్చి చేరేది” కాస్త కఠినంగానే అన్నాడు రఘురాం. భర్త మాటలకు మారు మాట్లాడ లేదు సావిత్రమ్మ.
తన ప్రవర్తన వల్ల ‘విషయం ఎక్కడ బయట పడుతుందో’ తెలిస్తే ఎంత రాద్దాంతం చేసి, సాధిస్తారో కళ్ళ ముందు కనబడేసరికి భయపడిపేయింది. భర్త ముందు ఏ భావం కనిపించకుండా… మనసులోనే కుమిలిపోసాగింది. మనసులే ఓ పక్క ఆలోచన తొలుస్తూనే వుంది. ”ఏమై ఉంటుంది! ఎలా జరిగి ఉంటుంది! ఆలోచించి, ఆలోచించి బుర్ర వేడెక్కిపోతోంది. రోజూ పనంత అయ్యాక వెతకడం, దొరక్కపోయేసరికి దిగులు పడటం, మళ్ళీ భర్త రాగానే బలవంతాన ముఖాన ఇంత చిరునవ్వు పులుముకొని… ఏం జరుగలేదన్నట్లు నటించడం నిత్యకృత్యమయ్యింది.
ఇల్లంతాఅడుగడుగూ, అణువణువూ వెతికి వెతికి వేసారి పోయింది. ఎక్కడైనా దొరుకుతుందేమోననే చిన్న ఆశ మళ్ళీ మళ్ళీ వెతికేలా చేస్తుంది. ”ఇంత జాగ్రత్త పడే మనిషిని’ ఎలా పొరపాటు చేశాను!? నా జ్ఞాపక శక్తి’ ఏమయ్యింది? తగ్గిపోయిందా! ఊహూఁ అలాంటిది ఏం లేదు ‘నా జ్ఞాపక శక్తికేం డోకాలేదు’తనను తాను సమర్థించుకుంటూ… పండుగ ముందు నుండి జరిగిన విషయాలను ఒకదాని తర్వాత ఒకటి నెమరు వేయసాగింది.

ఆ సమయంలో ఇతరులు ఎనరూ ఇంటికి రాలేదు.. బిడ్డ… అల్లుడు.. కొడుకూ.. కోడలు.. పిల్లలు… కూతురికి ఎంత సేపూ పిల్లలిద్దరినీ చూసుకోవడంతోనే సరిపోయింది. ఇక కోడలు పసిదాన్ని చూసుకుంటూనే తనకు చేదోడు వాదోడుగా, తనతో పాటే తిరుగుతూ వుంది. ఆలోచిస్తున్న సావిత్రమ్మకు పండుగ రోజు సంఘటన గుర్తుకు వచ్చింది. ‘ఆ రోజే జరిగి వుంటుంది ‘మనిషికి అధకారమైనా… అవకాశమైనా ఇచ్చి చూడాలట;’ అప్పుడే అసలు బుద్దేమిటో బయట పడుతుందట’అయితే ఇంకేముంది తనే తీసి వుంటుంది ‘.
ఆ రోజు.. తనూ కోడలు పిండివంటలు చేస్తున్నప్పుడు అదే.. అత్తగారి హయాం నుండి ఇంట్లో పని చేసి ముసల్దయిన రంగమ్మ వచ్చింది.
‘సావిత్రమ్మా: ఏం చేత్తున్నరు!? పండక్కి ఓ పాతచీర కొనియ్యరాదుండి” అంది. తనకూ ఎప్పటి నుండో కొనివ్వాలనే ఉంది. అదే మాట భర్తతో అంది. పిండి చేతులతో వచ్చి అడుగుతున్న భార్యను విసుక్కుంటూ… ”నీకేం ఇంట్లో కూర్చుని ఎన్నైనా చెబుతావు ” నీ చేతికి డబ్హిస్తే దానధర్మాలతో ఇల్లంతా గుల్ల చేసేట్టున్నావు! అయినా పాతయో బోతయో ఇస్తూనే ఉన్నావుగా, అవి చాలక ఇదొకటా, అవే స్టీలు సామాన్ల వాళ్ళ కిస్తే ఏ గిన్నో, డబ్బానో వచ్చేది. చాల్చాల్లే ”దండకమ మొదలు పెట్టేసరికి, సావిత్రమ్మ… నొచ్చకుంటూ “సర్లెండి గట్టిగా అనకండి. వింటే ఏమన్నా అనుకుంటుంది ‘ అని చిన్నగా తనలో తాను గొణుక్కుంటూ వంటింట్లోకి వచ్చింది’.
విషయం అర్ధమయిన రంగమ్మ “బాబుగారు కోప్పడుతున్నట్టున్నారు? నే ఎల్తాలెండి అంది.
కొత్తచీర కొనివ్వలేక పోయినా కనీసం తన పాత చీరయినా ఇద్దామనుకొని “ఆగు రంగమ్మా! నా చీర ఇస్తాలే! ”అంది.
కోడలితో ‘నాచేతినిండా పిండుంది గీనీ నీవెళ్ళి బీరువా అడుగున నాచీరొకటి ఉంది. ఒకట్రెండు సార్లు కట్టి అడుగున పడేశా, దాన్ని తెచ్చివ్వు” అంది.
అత్తగారిని మరోసారి ఎక్కడుందో అడిగి, చెప్పిన చీర తీసుకొచ్చింది. ”ఆఁ అదే చీర ”ఇవ్వమని కోడలికి చెప్పి, అటు రందమ్మతో “కోడలిస్తుంది తీసుకో! ఈ సారికి ఇది కట్టుకో ”అంది. ‘కొత్తమెరుపు తగ్గని, పాత చీరను మెరిసే కళ్ళతో తీసుకొని పోయింది రంగమ్మ.
పిల్లలు సెలవులకు ఒకరోజు ముందే ఇల్లు సర్ధకోవాలంటూ వెళ్ళిపోయారు. ఇన్ని రోజులుగా పిల్లలూ, పెద్దలతో కళకళలాడిన ఇల్లు బోసిపోయింది.
పిల్లలున్నప్పుడు అవసరం కోసం తీసిన గిన్నెలు అటక మీద పెట్టింది. నాల్గు రోజులూ ఇల్లంతా సర్దడంతోనే సరిపోయింది. ఆ తర్వాత బీరువాలో బట్టలు సర్ధేటప్పుడు గుర్తుకు వచ్చింది సావిత్రమ్మకు. గబగబా గుండెలు గుబగుబలాడుతుండగా పైనుండి కిందిదాకా అరలన్నీ దులిపింది. మడత పెట్టి పెట్టిన చీరల మడతలన్నీ విప్పి చూసింది. ‘ఎక్కడ పెట్టాను! అంత డబ్బు?! మళ్ళీ మళ్ళీ దులిపి చూసింది. పైసా పైసా పోగేసి దాచుకున్నడబ్బు ‘. ఇంట్లో పాలకూ, కూరగాయల కోసమని ఇచ్చిన డబ్బుల్లో కొంత మిగుల్చుకుని అతి జాగ్రత్తగా కూడేసుకున్న డబ్బు’, భర్తను ఎప్పుడైనా ‘ఓ పదిరూపాయలు అడిగితే ‘ పదిమాటలు మాట్లడుతూ ”నీకేం అవసరాలుంటాయి? అన్నీ తెచ్చి పడేసేది నేనే కదా! దేనికో చెప్పు? అదేదో నేన్ పట్టుకొస్తా కదా’అని అంటుంటే ‘ఏదో నా చేత్తో పిల్లలకప ఏదన్నా కొనివ్వాలని ఉండదా ‘ అంటే నీ చేయి నా చేయి ఏమిటీ’ఎవరిచ్చినా ఒక్కటే: అని తేలిగ్గా తీసి పారేసే భర్తతే వాదన ఎందుకని ఈ మార్గం ఎంచుకుంది. ‘తనకంటూ కొంత డబ్బుండాలి. దానితో పిల్లలకు నేనూ ‘కొనిచ్చా’ అనే తృప్తి ఉండాలనుకుంది. అది కాస్తా ఇలా మాయమై పోయింది. తలచుకుంటుంటే తిండి సహించడం లేదు. నిద్ర పట్టడం లేదు.” అంత డబ్బు”! తనెంతో నిధిలా దాచుకున్న డబ్బు ” ఆ రోజు చీరను కోడలే కదా తెచ్చివ్వమంటే యిచ్చింది. ‘కోడలే’ తీసి వుంటుందా?… ఏమో: డబ్బెవరికి చేదు. నేనెలాగూ విషయం బయట చెప్పుకోలేను. అది తెలిసే ఇలా చేసిందేమో: ఛీ!.. ఛీ!… ఇలా ఆలోచిసేతున్నానేమిటి: బంగారం లాంటి కోడల్ని అనుమానిస్తున్నానేమిటీ! రెండు రకాల ఆలోచనలతో ఎవరికీ చెప్పుకోలేక తనకు తాను సర్ధి చెప్పుకోలేక సతమతమైపోతోంది సావిత్రమ్మ. ”దాచీ దాచీ దయ్యాల పాలు జేసినట్టు! చీమలు పెట్టిన పుట్టలు పాముల పాలైనట్లు, తను దాచి దాచి కూడబెట్టిన ‘డబ్బు’ పోయినందుకు బాధ పడీ పడీ చివరకు ఓ నిర్ణయానికి వచ్చింది.

ఉగాది పండుగకు సెలవులు లేవంటున్నా ఒక్కరోజైనా సెలవు పెట్టుకొని రమ్మనమని, కొడుకూ కోడల్ని పిలిచింది. విషయం అర్ధం కాని రఘురాం తనూ వాళ్ళను రమ్మన్నాడు.

కొడుకూ..కోడలు మనవరాలితో వచ్చారు. రెండురోజులకే అంత పట్టుబట్టి ఎందుకు రమ్మందో వారికీ అర్ధం కాలేదు. తల్లి మొహంలో కళా కాంతులు లేవు,. కోడలిని అడగాలా! వద్దా! అడిగితే ఏమనుకుంటుందో?.. ఈ ఆలోచనలతో కోడలితో సరిగా ఉండలేక పోతోంది. విషయమేమిటో తెలియక ‘తన’ వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా?.. అదే విషయం అత్తగారితో అంది.

కోడలి మాటల్లో స్వచ్ఛతను చూసి ‘తనే అనవసరంగా అనుమానిస్తున్నానేమో’నని బాధ పడ్తూ అయినా ‘అసలువిషయం తేల్చుకోవాల్సిందే’ నిర్ణయానికి వచ్చింది.

వెళ్ళి పోవడానికి బట్టలు సర్ధుకుంటున్న కోడలి దగ్గరికి వచ్చింది సావిత్రమ్మ. ఏదో అడగాలని వచ్చిన అత్త గారి వంక చూస్తూ విషయమేమిటో చెప్పమన్నట్టు చూసింది కోడలు. ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తుండగా గేటు చప్పుడైంది. పని మనిషి రంగమ్మ’ ‘అమ్మా! అమ్మా: అంటూ పిలుస్తుంటే ఎదురు వెళ్ళింది. ‘అమ్మా’! నువ్వు మా ఇంటి దేవతవు తల్లీ!.. అని ఏదేదో మాట్లాడుతుంటే అర్ధం కాక “విషయమేమిటో చెప్పు రంగమ్మా’! అంది.
“అమ్మా! మీరిచ్చిన పాత చీర నా జీవితానికో దారి చూపిందమ్మా..!”

“పాత చీర దారి చూపడమా!? అంటే “ఆ చీరలో డబ్బులు” ఆ తర్వాత ఆలోచింపలేక పోయింది.
‘అమ్మా.. ఆ రోజు మీరు కోడలిగారితో ఇప్పించిన చీర ఇంటికెళ్శాక కట్టుకుందామని యిప్పానమ్మా!’ అందులోంచి పదివేలు బయట పడ్డాయి’. వెంటనే మీకు తెచ్చిద్దాం అనుకున్నా… కానీ తల్లీ: నా పరిస్థితి బాగో లేదు. ఇంటికొచ్చి లచ్చువమ్మోర్ని కాలదన్నుకోవద్దనిపించింది. ఆ డబ్బుతో. నేనూ కోడలు కలిసి ఇంట్లో కిరాణం, సెంటర్లో బజ్జీల బండి పెట్టావమ్మా! ఏళా యిశేషం… రెండూ మంచిగా నడుత్తున్నయి. ‘యిసయం’ మీకు చెప్పాలని ఎప్పటికప్పుడు అనుకుంటూనే వున్నమ్మా: డబ్బులు కూడాక తెచ్చిచ్చి, తప్పొప్పుకుందాం అనుకున్నా… మీరు బాధ పడ్డం చూసి తట్టుకోలేక పోయానమ్మా..! ఇదిగోండి డబ్బు.. గుడిసె తాకట్టు పెట్టి తెచ్చిన. తీరుసుకుంటాననే దయిర్నం వచ్చింది. గుక్క తిప్పుకోకుండా రంగమ్మ చెబుతుంటే… అక్కడికి వచ్చిన కోడలుకు విషయం అర్ధమయ్యింది. అత్తగారి బాధకు కారణం తెలిసింది.

కోడలును దగ్గరకు తీసుకుని, గుంజెలకు హత్తుకొని “బంగారం లాంటి కోడలును అనుమానించాను. చేజారిన డబ్బు మళ్ళీ వస్తుందనుకోలేదు.” దాచుకున్న డబ్బు ఒక కుటుంబానికి ఉపయోగ పడినందుకు సంతోషపడింది సావిత్రమ్మ.

“నాకు ఇప్పుడే ఇవ్వొద్దులే రంగమ్మా.. నీ దగ్గరే ఉండనీ! చెయ్యి తిరిగిన నాడే ఇద్దువులే అంది”.

అప్పుడే బజారు నుండి వచ్చిన తండ్రీ కొడుకులకు విషయం తెలిసి ఆశ్చర్యంగా చూస్తుండి పోయారు.

-వి. సునంద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!