Wednesday, June 3, 2020
Home > సీరియల్ > ట్రావెలాగ్ > నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర( 4 వ భాగం) – సబ్బని లక్ష్మీ నారాయణ

నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర( 4 వ భాగం) – సబ్బని లక్ష్మీ నారాయణ

లాస్ వేగాస్ ప్రయాణం :

అమెరికా వచ్చిన కొత్తలో లాస్ వేగాస్ వెళ్దాం డాడీ అన్నాడు మా శరత్. అమెరికా అంటే న్యూయార్క్, నయాగరా, చికాగో, వాషింగ్టన్ లాంటి ప్రదేశాలు చూస్తారు కాని లాస్ వేగాస్లో ఏముంటుందో నాకు తెలియదు. లాస్ వేగాస్ చూడవలసిన ప్లేస్ అక్కడ కసీనోలు ఉంటాయి, బాగుంటుంది అన్నాడు. అక్కడి నుండి గ్రాండ్ కెనియన్, అంటిలోప్ కేనియన్ కూడా చూడచ్చు అన్నాడు, టికెట్ బుక్ చేస్తానన్నాడు. అమెరికా దేశీయ విమానయాన సంస్థల్లో ఫ్రాంటియర్, అమెరికన్, సౌత్ వెస్ట్, యునైటెడ్, అలాస్కా లాంటి సంస్థలు ఉన్నాయి. అవి ఇందించే సౌకర్యాలను బట్టి వాటి రేట్లలో కూడా తేడాలు ఉన్నాయి. ఒకోసారి మనం బుక్ చేసుకొనే విమానాశ్రయమును బట్టి కూడా విమాన టికెట్ రేటు ఉంటుంది అన్నాడు. మాకు అనుకూలంగా ఉన్న ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్ ద్వారా శాన్ ఆంటోనియా విమానాశ్రయం నుండి మాకు మే మాసం 18 వ తేది గురువారం టికెట్ బుక్ చేశాడు లాస్ వేగాస్ కు, తిరుగు ప్రయాణానికి మళ్ళీ ఆదివారం ఉదయం లాస్ వేగాస్ నుండి శాన్ ఆంటోనియా కు చేశాడు.

బుదవారం సాయంత్రమే శాన్ ఆంటోనియా కు బయలుదేరాం ఆస్టిన్ నుండి రమాకాంత్ వాళ్ళ ఇంటికి.ఆ రాత్రి వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాం. మరునాడు సాయంత్రం 4 గంటలకు ఉంది విమానం. గురువారం ఉదయం నుండే శరత్ వర్క్ హోం చేశాడు ఆఫీస్ పనిని. మధ్యాహ్నం 3 గంటలవరకే శరత్ ను, నన్ను, శారదను విమానాశ్రయంలో డ్రాప్ చేశాడు కార్తీక్. మా సృజన డాక్టర్ సలహాపై ప్రయాణ చెయ్యవద్దు అంటే రమాకాంత్ వాళ్ళ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటానంది మేం వచ్చేవరకు. విమానాశ్రయంలో చెకింగ్ తర్వాత మా విమాన ప్రయాణం మొదలయ్యింది. ఇండియా లో ప్రయాణికులు ఎక్కువగా బస్సుల్లో, రైళ్ళలో ప్రయాణిస్తారు, విమానాల్లో ప్రయాణించేవారు తక్కువ. అమెరికాలో ఓ నాలుగైదు గంటలలోపు ప్రయాణమైతే కార్లల్లో వెళ్తారు, అంతకు మించి ప్రయాణం విమానాల్లోనే వెళ్తారు. అమెరికాలో బస్సుల్లో ప్రయాణించేవారు తక్కువ, వందల సంఖ్యల్లో అన్నట్లుగా ఇక్కడ ఇంటికో కారు కాదు, మనిషికో కారు ఉంటుంది.శాన్ అంటోనియాకు లాస్ వేగాస్ కు దాదాపుగా 2000 కి.మీ. పైగా దూరం ఉంటుంది. కారులో వెళ్ళితే 19 గంటలవరకు పడుతుంది. రెండు రోజుల్లో వెళ్ళడం కూడా కష్టం. విమాన ప్రయాణమైతే రెండున్నర మూడు గంటల్లో వెళ్ళవచ్చు. అమెరికా ప్రయాణములో ఇది మాకు రెండవసారి విమానం ఎక్కడం. విమానం పక్షిలా లేచి గాలిలో ప్రయాణిస్తుంటే వింతైన అనుభవం. దూది పింజల్లాంటి మబ్బుల్లోంచి, కింద ఎడారిలాంటి మైదానాలు వందలకొద్దీ కిలోమీటర్ల గుట్టలవరుసల మీది నుంచి తెలిపోతుంటే ఎంత దూరం మనిషి ఇలా ప్రయాణించవచ్చు అనిపిస్తుంది. రెండున్నర గంటల ప్రయాణంతో మేం లాస్ వేగాస్ మెకరాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినాం. ఎడారి ప్రాంతమైన లాస్ వేగాస్ లో అధునాతనమైన రద్దీగా ఉండే విమానాశ్రయం అది. ఇటీవలి కాలం లెక్కల ప్రకారం ఏటా సరాసరిగా నాలుగున్నర కోట్ల మంది ప్రయాణికులు ఈ విమాశ్రయం గుండా వస్తుంటారు, పోతుంటారు అని తెలుస్తుంది. అది విమానాశ్రయమా అంతే కాదు అంతర్జాతీయ వేదిక అని అనిపిస్తుంది ! విమానాలు పక్షుల్లా వాలుతుంటాయి, ప్రయాణం ఒక సరదానా ఇక్కడ అనిపిస్తుంది!
విమానాశ్రయం గుండా బయటకి వస్తూ విమానాశ్రయం వాళ్ళు కల్పిస్తున్న సౌకర్యంలో భాగంగా కొంత దూరం ట్రైన్ ఎక్కి, మరి కొంత దూరం బస్ ఎక్కి రెంటల్ కారు దగ్గరకు వెళ్లాం. అక్కడ తిరుగడానికి కారు బుక్ చేశాడు మా అబ్బాయి. నిజంగా కారు లేనిది కాలు కదుపలేము అమెరికాలో అనిపించింది. రోజుకో నూరు డాలర్ల వరకు రెంట్ కట్టి పెట్రోలె పోసి వాడుకుంటే ఈజీగా ఉంటుంది కాని, మనం వెళ్ళవలసిన ప్లేస్ కు కారు మాట్లాడుకొని వెళ్ళితే దానికే నూరు, నూటాయబై డాలర్లు అవుతాయి. అందుకే అమెరికాలో ఉన్న వారికి స్త్రీలకైనా, పురుషులకైనా ముఖ్యంగా కారు ఉండాలే, కారు నడుపరావాలే. అది ప్రథమ అవసరం. ఇంకా కారుకైనా, మనిషికైనా తప్పకుండా ఇన్సురెన్స్ ఉండాలే. అవసరమైనపుడు స్వతహాగా మనము లక్షల్లో చెల్లించలేం వైద్య ఖర్చులు మనిషికైనా, కారుకైనా.
శాన్ అంటోనియా టైం, లాస్ వేగాస్ కంటే రెండు గంటలు ముందుగా ఉంటుంది. మూడు గంటల ప్రయాణం తరువాత లాస్ వేగాస్ లో రెండు గంటల సమయం వెనుక తేడాతో సాయంత్రం 5 గంటలు దాటింది. గమనించి చూస్తుంటే లాస్ వేగాస్ నగరం ఒక ఎడారి ప్రాంతం లా ఉంది. చెట్లు అసలు తక్కువ అని చెప్పచ్చు నేను చూసిన టెక్సాస్ రాష్ట్రము తో పోల్చి చూస్తే. అక్కడ ఉన్న చెట్లు ఏమిటి అంటే ఈత, ఖర్జూరపు చెట్ల లాంటివే కనిపించాయి. మేం ముందుగా కార్లో జిపిఎస్ అడ్రస్స్ పెట్టుకొని అక్కడికి దగ్గరలో ఉన్న వాల్ మార్ట్ కు వెళ్లాం. మూడు రోజులకు సరిపడా వాటర్ బాటిల్స్ తీసుకున్నాం. ఒక ఆరెంజ్ జ్యూస్ డబ్బా తీసుకున్నాం. ఒక బ్రెడ్ పాకెట్ తీసుకున్నాం. ఒక చిప్స్ పాకెట్ తీసుకున్నాం. ఒక డజెన్ అరటి పండ్లు కూడా తీసుకున్నాం. అక్కడి నుండి అడ్వాన్స్ గానే బుక్ చేసిన ‘హోటల్ బ్యాలిస్’ కు వెళ్లాం. అమెరికాలో కారు ఉండడం, కారు నడుపడమే కాదు, కారును పార్కింగ్ చూసుకొని పెట్టడం కూడా ముఖ్యం. హోటళ్ళ నానుకొని కారు పార్కింగ్ కోసం అంతస్తుల భవన సముదాయాలు ఉన్నాయి. పెయిడ్ పార్కింగ్ క్రెడిట్ కార్డ్ ద్వారా రోజుకు పది డాలర్ల వరకు చెల్లించవలసి ఉంటుంది. మూడో అంతస్తులో కారు పార్క్ చేసి లిఫ్ట్ ద్వారా వచ్చి హోటల్ దగ్గరకు వెళ్లాం. మమ్ములను ఇద్దరినీ ఒక దగ్గర ఉండుమని చెప్పి, కౌంటర్ దగ్గరకు వెళ్లి మా హోటల్ రూమ్ కీ తీసుకొని వచ్చిండు శరత్. ఆ హోటల్ కారిడార్ ఎంట్రెన్స్ లో అంతర్జాతీయ అధునాతన సమాజం కనిపించింది. ఎక్కడివారు ఈ జనాలు అంటే ప్రపంచ దేశాల వారు అనిపించింది. ఎవరి బ్యుజిలో వారు వసున్నారు, పోతున్నారు. ఎక్కడానికి, దిగడానికి లిఫ్తులే కాదు, ఎస్కులేటర్లు ఉన్నాయి. అది కసీనోతో, రెస్టారెంట్ల తో కూడుకొను ఉన్న అంతర్జాతీయ త్రీ స్టార్ హోటల్. హోటల్ 66వ అంతస్తుల్లో మా రూమ్ ఉంది. ఇంత పెద్ద స్టార్ హోటల్లో ఉన్నామా, ఉంటామా, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు కాబట్టి రాగలిగాం అనిపించింది! సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్డ్ రూమ్, రెండు విలాసవంతమైన బెడ్స్, టీవీ, ఫోన్, బాత్రూం లో వేడి నీటి చన్నీటి సౌకర్యం, బట్టలను ఇస్త్రీ చేసుకొనే సౌకర్యం ఇస్త్రీ పెట్టెతో సహా, వేడి వేడిగా కాఫీ గాని, బ్లాక్ టీ గాని కలుపుకొనే సౌకర్యం ఉంది. ఒక్కసారి హోటల్ కిటికీ గాజు అద్దం పరదాను తొలగించి చూస్తే , ఓహ్ ! ఇదా లాస్ వేగాస్ అంటే ! మిరుమిట్లు గొలిపే లాస్ వేగాస్ స్ట్రిప్ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. హోటల్ బలాజియో పక్కన సరస్సులోని ఫౌంటెన్ లు జిలుగువెలుగుల్లో పాటలకు అనుగుణంగా నృత్యం చేస్తున్నాయి. ఆగి చూడవలసిందే ఆ దృశ్యాన్ని ! ప్రపంచంలోని అందాల వెలుగులన్నీ లాస్ వేగాస్ స్ట్రిప్ పైనే ఉన్నాయా అనిపించింది!
లాస్ వేగాస్ అమెరికా దేశపు నోవెడ రాష్ట్రపు మోజావె ఎడారి ప్రాంతపు పర్యాటక నగరం.
ఆ నగరపు చుట్టూ కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు వందల మైళ్ళు వ్యాపించి ఉన్నాయి పంటలు కూడా సరిగా పండవు. అలాంటి కరువు ప్రాంతాన్ని కూడా ప్రపంచములోనే గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు అమెరికా వారు. రాళ్ళు రప్పలు, కొండ ప్రాంతం అయినా కాసులపంట ఎడతెరిపి లేకుండా ఏడాది పొడుగునా పండుతుంది అని చెప్పవచ్చు. ఆ లెక్కన ఇక్కడ పంటలు కాదు కాసులు పండుతాయి అదే విచిత్రం అనవచ్చు ! ఇక్కడ ప్రభుత్వ అనుమతితో నడిచే జూద జూదగృహాలు ఉంటాయి వాటినే కసినోలు అంటారు ! అతివలు అందాలు ఆరబోస్తారు, ఇక్కడ కోరుకున్నోల్లకు కోరుకున్నంత లాస్ వేగాస్ లో. నిరంతరం మత్తులో జూగుతుంది, సేదదీరేది ఎప్పుడో తెలియనట్లుగా ! లాస్ వేగాస్ నగరం నిద్దుర పోదు, రాత్రి , పగలూ ఒక్కటే ఇక్కడ అని చెప్పవచ్చు. ! ఒంటిపై స్పృహ ఉంటే కదా, ఇక్కడి మనుషులు ఉట్టి మరబొమ్మలు అనిపిస్తుంది ! రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమలు ఎక్కడో లేరు అందాల లాస్ వేగాస్ నగరం లోనే ఉన్నారనిపిస్తుంది! ఆడు, పాడు, తిను, తాగు బతుకొక జూదం లాస్ వేగాస్ ‘కసినో’ లలో అని తెలుస్తుంది. అంతస్తుల భవనాలు, నగరపు ఆభరణాలు లాస్ వేగాస్ జిలుగు వెలుగులు అని చెప్పాలనిపిస్తుంది. ఈ నగరం రాత్రి వెలుగులలో జిగజిగలాడుతూ కాంతి మిరపకాయలు ఎండబోసినట్లు కనిపిస్తుంది ! ఐఫిల్ టవర్ నమూనాను ప్యారిస్ లోనే కాదు, ఇక్కడా చూడచ్చు, అమెరికా స్టాచ్యూ అఫ్ లిబర్టీ, గ్రీక్, ఈజిప్ట్ స్పినిక్ష్, పిరమిమిడ్ల నమూనాలు ఇక్కడా చూడచ్చు లాస్ వేగాస్ నడిబొడ్డులో ! అమెరికాను చూడాలని ఉందా, లాస్ వేగాస్ ను దర్శించు కనిపిస్తుంది లాస్ వేగాస్ లో తిరుగాడుతుంటే ! ఇక్కడ అందాలు ఆరబోసుకొని జానెడు బెత్తెడు వస్త్రం ధరించి రోడ్డు మీద తిరుగాడుతున్న ముద్దుగుమ్మలతో ఫోటో దిగాలని ఉంటే , దిగవచ్చు లాస్ వేగాస్ లో ఐదు, పది డాలర్లు ఇచ్చి వాళ్ళకు ! బొమ్మ చూపిస్తూ అడుగుతారు బ్రోకర్లు ఇక్కడ అమ్మాయి కావాలా అని లాస్ వేగాస్ లో ! ఇక్కడి ‘కసినో’ల్లో టేబుల్లపై అమ్మాయిలు తొంబై శాతం నగ్నంగా డాన్సులు చేస్తారు చూసేవాళ్ళకు కనువిందు చేస్తూ. క్లబ్ లు , డ్యాన్సులు మనం సినిమాల్లో చూస్టాం, ఇక్కడ లాస్ వేగాస్ లో నిజంగా చూడచ్చు! విందు, చిందు, మందు, పొందు, అడుగడుగునా పసందు లాస్ వేగాస్ లో ! మొలపై జానెడు గుడ్డ తో అమ్మాయిల నర్తనం వయ్యారంగా కాసులకోసమేనా అనిపిస్తుంది ! కసినోల్లో ఆట జాగ్రత్తగా, మెలకువతో ఆడాలి పైసలు పోవచ్చు, రావచ్చు ! ప్యారిస్ కు వెళ్ళీ చూడక్కర్లేదు ప్యారిస్ అందాలు లాస్వేగాస్ ప్యారిస్ హోటల్లో చూడచ్చు అని చెప్పవచ్చు. నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న లాస్ వేగాస్ స్ట్రిప్ పై నడక, అదొక వింత ప్రపంచం అద్భుత లోకం అని చెప్పవచ్చు. ప్రపంచములోని కాంతులన్నీ వెలుతురు పిట్టల్లా లాస్ వేగాస్ వీధుల్లోనే కుప్పపోసారా అనిపిస్తుంది రాత్రిపూటా !
దేశం అమెరికా ,రాష్ట్రం నోవెడ అందచందాల అడ్రస్ లాస్ వేగాస్ అని చెప్పాలనిపిస్తుంది !
ముచ్చటగా మూడు రాత్రులు గడిపాను, నాదొక విచిత్ర అనుభవం లాస్ వేగాస్ లో ! మేం శాన్ ఆంటోనియాలో బయలుదేరంగ రమాకాంత్ అన్నాడు, లాస్ వేగాస్ అంటే లాస్ వేజేస్ అని, నిజమేమేనేమో అనిపించింది అందరు డబ్బులు ఖర్చుచేసుకొని పోతారు కాబట్టి అక్కడ.

రాత్రి తొమ్మిది గంటల తరువాత హొటల్ రూమ్ లోంచి బయటికి వెళ్ళితే లాస్ వేగాస్ అందచందాలు చూస్తూ, వింతలు విడ్డూరాలు చూస్తూ కాసినోలు దర్శిస్తూ నచ్చిన ప్రదేశాల్లో ఫోటోలు దిగుతూ రాత్రి రూమ్ కు వెళ్లి పడుకునే వరకు రెండు గంటలు దాటిపోయింది. మధ్యలో అర్ధ రాత్రి సమయంలో మా హోటల్ పక్కనే ఉన్న సబ్ వే లో సబ్ తిన్నాము. హోటల్ రూమ్ కు వెళ్లి కాసిన్ని మంచినీళ్ళు తాగి పడుకుంటే తెల్లవారి ఉదయం ఎనిమిది గంటలవరకు నిద్ర లేచాము.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!