చింతగింజలు కుప్పలు పోసి
రాతి పలకలతో దొబ్బేసి
గుండం అవతల పడ్డ గింజలు
జమగట్టి
కిలోలకొద్ది పాతా ఇనుపసామానులోడికి
అమ్మి ఫొగేసి పైసలతో
బూరు మిఠాయి కొనుక్కుని
దోస్తులకు ఊరిచ్చుకుంట తిన్న
కపటం బేషజం లేని బాల్యం
మా అమ్మమ్మ బొడ్ల సంచుల దాసుకున్న
చారాణ
అవ్వకు తెల్వకుంట ఎత్కపోయి
గడియారం మిటాయి సేతుకు
కట్టించుకుని దోస్తులకు ఊరించుకుంటూ
జిగిరి దోస్తుకు గోంత నాకుమని
ముంజేతిని అందించిన
ఎంగిలి తెలియని బాల్యం
పక్కవాడకట్టోడు మన వాడకట్టు
పోరన్ని కొట్టిండని పంచాయతి కి
పోయి …
అరే ఈడూ మనోడేరా అని చేతులుకలిపి
అలుముకున్న ఆత్మీయ బాల్యం
తొలకరి వానల్లె
స్వచ్చమైనది
తొలిపొద్దల్లె మేలైనది
పగటీలు ఎండల్లె చురుకైనది
సూరీడి వెలుగల్లె శాస్వతమైనది
మరపురానిది
మరలరానిది
తిరుగులేని జ్ఙాపకాల వయ్యిల దాసుకున్న
నెమలీక…
-నాగరాజ్ వాసం
Facebook Comments