ప్రేమ కావ్యాలకు కాలం చెల్లలేదా? శ్రీ కృష్ణ దేవరాయల పాలనా కాలాన్ని ప్రభందయుగముగా వర్ణి౦చారు. ఒక మనుచరిత్ర, , విజయవిలాసము వంటి ఎన్నో కావ్యాలూ వచ్చాయి. అలాంటి కోవలో ఆధునికంగా, భావావేశం తో ప్రేమంటే అనే స్వీటి రొమాంటిక్ కవితల్ని రాసారు, ప్రముఖ కవి శ్రీ సబని లక్ష్మినారాయణ గారు. ఈ పుస్తకం చదువుతుంటే మరొక సారి యవ్వనంలోకి తొంగి చూసినట్లు ఉంటుంది. కవితల్లో ప్రేయసి వర్ణన కన్నా విరహ వేదనే ఎక్కువగా కనిపి౦చినా, సర్దుబాటు తనం కనిపిస్తుంది. ఇది సరి కొత్త ప్రయోగంగా కనిపిస్తుంది. అక్కినేనినాగేశ్వర్ రావు హీరోగా నటించిన ప్రేమనగర్ లా అనిపిస్తుంది. ఇందులో ముగింపు సకారాత్మకంగా కనిపిస్తుంది. ప్రేమకావ్యాలు, ప్రేమకథలకు కాలం చెల్లలేదని వీరి ప్రేమంటే రుజువు చేస్తుంది. ఇందులోని కవితల్లోకి వెళ్ళాలంటే మనస్సుకు కమ్మతెమ్మరులు అద్దుకోవాల్సి ఉంటుంది. ఒక రసమయ జగత్తులోకి వెళ్ళినట్లు ఉంటుంది. ఎన్నెన్నో సామాజిక సమస్యలపై కవిత్వాలు రాసే కవులకు ఇది భిన్నంగా ఉంటుంది. రొటీన్ కి భిన్నంగా, ప్రేమజగత్ లోకి వెళ్లి రాయడం అంటే ఈ సబ్జెక్టు పై సరైన అవగాహన ఉండి తీరాలి కదా. ప్రేమ లోకం లోకి వెళ్లి విహరించే విరహించే సమయాలు కావాలననుకుంటే హాయిగ్గా సబ్బని గారు రాసిన ఈ కవితలని చదివి ఆనంది౦చడమో, ప్రేమ తత్వాన్ని ఆస్వాది౦చడమో చేస్తాము, చేసి తీరుతాము. ప్రేమ వేదన ప్రేమ కోసం పడే తపనలు ఇందులో మనకు భావ సబలతతో కనిపి౦చినా, ప్రేమ రాగం వికటి౦చదు. సబ్బని వారు ఈ పుస్తకాన్నీ ప్రేమజీవులకి అంకితమ చేస్తూ ఒకరికి ఒకరు త్యాగం చేసుకొని, బతికే ప్రేమైక జీవులకి అంకితమ ఇస్తున్నట్లుగా పేర్కొంటారు. మాటలే మౌనమైనప్పుడు వేయి కబుర్లు చెప్పే కళ్ళేమిటి ఇలా చేశాయని కళ్ళపై ప్రేమామృతాన్ని చిలికిస్తాడు.ప్రేమ కావ్యములో కళ్ళ గూర్చి చెప్పడంలోనే వీరి కవితా శక్తి మనకు అర్థమవుతున్నది. ఆకలి కోసం బతికేది కాదని అందమైన కళ్ళ కోసమేనని, తన ఆలోచనదారాలతో అభిశేకిస్తాడు. కాలుతున్న పూలతోట లో ప్రేమ విరహమై ఎలా దగ్ధమై పోతోందో ఒక ప్రేమికుడి వేదనని మనకు చెబుతాడు. కాలుతున్న పూలతోటకు కవిత్వాన్ని అద్దడమంటే ఇదేనేమో? గాలి పటాన్ని సైతం తన ప్రేమకు వాడుకొని మనస్సును స్వాంతన చేసుకుంటాడు. ఈ రాక్షస లోకంలో తన గాలి పటం అంటే ప్రేయసి చిన్నాభిన్నం కారాదని కోరుకుంటాడు. ప్రేమ జ్యోతి అంటే విరహ జ్యోతే, బహుశః ఆరిపోదని మనసులో మమత ఉన్నంతవరకు నూనె వెలుగుల్ని ఇస్తుందని చెబుతాడు. వెన్నెల నవ్వుల్నీ పారేసుకున్న నవ్వుల రాణిగా, ధవళ నేత్ర జ్వలిత ముని కాంతగా ఆమెపై ఆమె కవితలో మనల్ని కదిలిస్తాడు. ఆమె కోసము కీర్తిని,,ఖ్యాతిని పక్కకు పీట్టి చూసినా అందనిది పోయింది. అందేంత వరకు ఎదురు చూసినా చంచలై పోయిందని వగచుచు ఎదో ఒకదానితోటి తృప్తి పడటం చూస్తే ఆరాధన సన్న బడ్డదేమో ననిపిస్తుంది. ప్రేమకోసం తపించే కవితలతోటి నింపి ఒక దగ్గరె ఈ కవి రాజీ పడటం ఎందులకో. ఏడు రంగుల ఇంద్రధనస్సు మనిద్దరి మధ్యన లంకేలాగా ఉందని కాని అది మంచులా బ్రమై కరిగి పోవడాన్ని కవి విరహ వేదనతో చెబుతాడు. నా కలంలో మేధాస్సువై రేపటి జీవిత చిత్ర పటానికి నువ్వే ఆవిష్కర్తవు అంటూ రాజీ మార్గం పట్టాడా అనిపిస్తుంది, నువ్వే కవితలో. దక్కని చెలికోసం చక్కటి ఆలోచన చేసి సర్దుబాటు చేసుకున్నట్లు అనిపిస్తుంది. నాలోని కవితారావానికి నీవే ఊపిరిగా నిలిచావని, ఇంకా ప్రేమంటే నేను నీవైపు, నువ్వు నా వైపు పయనించే సుదీర్ఘ ప్రయాణం అని తన ప్రేమ కావ్యానికి ఆదర్శమైన ముగింపు ఇస్తాడు. నీవే గతానికి తీపి గుర్తువని, నన్నునేను సమాధాన పరచుకోవడానికి కవిత్వం రాస్తున్నానని అమృత వాక్యం పలుకుతాడు.
సంకేపల్లి నాగేంద్ర శర్మ, కరీంనగర్, చరవాణి 9441797650