Wednesday, June 3, 2020
Home > కవితలు > || రాయలేక ఉండలేక || – శ్రీ విజేత

|| రాయలేక ఉండలేక || – శ్రీ విజేత

రాయలేను
రాయకుండా ఉండలేను
రాయకుండా ఉండలేక రాసుకున్నదే రచన
అది వానచ్చినట్లు వరదచ్చినట్లు కన్నీళ్ళచ్చినట్లు
నాలోంచి వడివడిగా ప్రవహిస్తూ వస్తుంది
జీవితం ఒక సుధీర్గ ప్రయాణం
అది కష్టం ఇచ్చినా, కన్నీరు ఇచ్చినా
సుఖం సంతోషం ఇచ్చినా స్వీకరించవలసిందే
జీవితం ఎప్పుడూ అందీ అందని ఆరాటమే
కొన్ని మధురాతి మధురమైన అనుభూతులు
కొన్ని కర్కశ కాఠిన్యపు రోజులు
మౌనమే జీవితంలో మరో మజిలీ అయినపుడు
ప్రేక్షకుడిలా జీవితాన్ని దర్శిస్తూ వెళ్ళాల్సిందే
తెలిసీ తెలియక కొందరు, అన్నీ తెలిసీ కొందరు
జీవితం ఒక నాటకంలా కాలాన్ని గడుపుతూ
ఎవరు కర్తలూ ఈ జీవితానికి ?
ఎవరు బాధ్యులూ ఈ జీవితానికి ?
అనంతమైన విశ్వంలో మనిషి మన్నుగడ ఎంత?
దానికి ఇన్ని అవరోధాలు, అడ్డుగోడలు ఎందుకు?
కులాలు, మతాలు, వర్గాలు, వాదాలు, కుట్రలు, కుతంత్రాలు ఎందుకు?
అదే గాలి, అదే నీరు, అదే భూమి, అదే సూర్యుడు, అదే చంద్రుడు, అవే దిక్కులు
రక్త మాంసాల రంగంతా ఒక్కటే !
ఇంకా మనుష్యుల్లో బేధ భావాలు ఎందుకు?
సప్త సముద్రాలపై పూబంతిలా తేలుతున్న
ఈ భూగోళంపై ఎందుకీ విపరీతాలు విధ్వంసాలు?
మనుషులంతా ఒక్కటే మతమేదయినా, రంగేదైనా, కులమేదయినా
అని అనుకుంటే చాలు కదా!
వసుదైక కుటుంభం ఈ లోకం అని అనుకుంటే చాలు కదా !
జగతికి సూర్యుడు వెలుగునిస్తాడు, చంద్రుడు వెన్నెలనిస్తాడు
మనిషి పరిపూర్ణ మానవుడై మమతను మానవీయతను పంచాలి
మంచిని పెంచాలి, విశ్వ మానవుడై బతుకాలి .

– శ్రీ విజేత

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!