Saturday, February 22, 2020
Home > కవితలు > || ప్రేమ కోసం || – శ్రీ విజేత

|| ప్రేమ కోసం || – శ్రీ విజేత

ప్రేమ కోసం రోజులు చూశాను
నెలలు చూశాను, సంవత్సరాలు చూశాను
ప్రేమ నేను కోరినప్పటికన్నా
నేను కోరనప్పుడే నాకు సాక్షాత్కరించింది
ప్రేమ కోసం ఒకోసారి నాలో నేను మథనపడ్డాను
నాలో నేను ఆన్వేశించాను
ప్రేమ కోసం ఒకోసారి రోడ్డు మీద పడ్డాను , జనంలోకి చూశాను
పల్లెల్లోకి, పట్నాల్లోకి, చెట్లల్లోకి, గుట్టల్లోకి
అడవుల్లోకి , దేశాల్లోకి కూడా చూశాను
ప్రేమ చిరునామా ఎక్కడని
కవుల కలాల్లోకి, పుస్తకాల్లోకి తలామునకలై చూశాను
ప్రేమ లేనపుడు నేను ఒంటరినే
ఎప్పుడు వచ్చి చేరుతుందో ప్రేమ మళ్ళీ నా సరసన ఆలంబనగా
ప్రేమ నాలో, నాతో ఉన్నపుడు నేను గుబాళించే పువ్వులా ఉంటాను
ప్రేమ నాకు జ్ఞానామృతాన్ని, ప్రేమామృతాన్ని పంచుతుంది
నేను లేకున్నా ప్రేమ ఎప్పుడైనా, ఎక్కడైనా బతుకుతుంది
కాని కలలో కూడా ప్రేమ లేకుండా నేను బతుకలేనేమో
ప్రేమ నా నుండి దూరం వెళ్లిపోయినపుడల్లా
ప్రేమ కోసం చూస్తుంటాను, ఆవాహన చేస్తుంటాను
ప్రేమ కోసం రాస్తుంటాను
నా సాధన, నా తపస్సు చూసి ఇప్పుడైనా, ఎప్పుడైనా
ప్రేమ నన్ను కరుణిస్తుందనే నమ్మకం
ప్రేమ నేను పెంచుకున్న జీవన వృక్షం
ప్రేమ నన్ను సేదదీర్చే కల్పవల్లి
ప్రేమ నన్ను ఒలలాడించే హృదయరాణి
ప్రేమ నన్నెప్పటికీ కరుణిస్తుంది.

– శ్రీ విజేత

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!