Sunday, October 2, 2022
Home > సీరియల్ > ట్రావెలాగ్ > నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర (5 వ భాగం)- సబ్బని లక్ష్మీ నారాయణ

నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర (5 వ భాగం)- సబ్బని లక్ష్మీ నారాయణ

గ్రాండ్ కెనియన్ , హోవర్ డ్యాం, ఆంటి లోప్ కెనియన్ ప్రయాణం :

తెల్లవారి 8 గంటల వరకు అందరం తయారై రూమ్ ఖాళి చేసి గ్రాండ్ కెనియన్ యాత్రకై బయలు దేరాం కారులో. త్రోవ వెంబడే కొన్ని బ్రెడ్ ముక్కలు, కొన్ని చిప్స్, అరటి పండ్లు, కొన్ని ఆలు చిప్స్ ఆహారంగా తీసుకున్నాం. లాస్ వేగాస్ కు దగ్గరలో కారు మీద వెళ్లి చూడవలసిన ప్రదేశాలు ముఖ్యమైనవి గ్రాండ్ కెనియన్, హువార్ డ్యాం మరుయు ఆంటిలోప్ కెనియన్. గ్రాండ్ కెనియన్, హువార్ డ్యాంలు లాస్ వేగాస్ నుండి ఒక రూట్లో ఉంటే, అంటిలోప్ కెనియన్ వేరే రూట్లో ఉంటుంది. మా ప్రయాణ మార్గంలో ముందుగా వచ్చేది హోవర్ డ్యాం. హోవర్ డ్యాం లాస్ వేగాస్ నుండి 50 కి.మీ. దూరంలో ఉంటుంది. కారులో గంటలోపే చేరుకున్నాం.

హోవర్ డ్యాం సందర్శనం :

హోవర్ డ్యాం నోవెడ రాష్ట్రం మరియు ఆరిజోనా రాష్ట్రము సరిహద్దుల్లో ఉంటుంది. ఇది కొలరాడో నదిపై బ్లాక్ కెనియన్ కొండలనానుకొని నిర్మించిన కాంక్రీట్ ఆర్చ్ గ్రావిటీ డ్యాం. ఇది 1931-1936 సంవత్సరముల మధ్యకాలములో నిర్మించబడినది. నిర్మించడంలో ప్రధాన ఉద్దేశ్యం వరదలను అరికట్టడం, వ్యవసాయానికి నీటి సరఫరా, జలవిద్యుత్ ఉత్పత్తి, పర్యాటక అభివృద్ధి మొదలగునవి. ఈ డ్యాం కు మొదటి పేరు బౌల్దర్ డ్యాం కాని ప్రపంచ ఆర్ధిక మాంద్యపు గడ్డు రోజుల్లో కట్టబడిన ఈ డ్యాం కు ఆ కాలములో 1929-1933 వరకు అమెరికా 31 వ అధ్యక్షుడుగా పనిచేసిన హెర్బర్ట్ హోవర్ జ్ఞాపకార్థం 1935 వ సంవత్సరంలో అప్పటి 32 వ అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ దీనిని అతని పేరున జాతికి అంకితం చేశాడు.
అది మే మాసం, ఎండాకాలం అమెకాలో ఇంకా ఎండలు బాగా ముదురలేదు. కోలరాడో నది నీళ్లు దూరం నుండి కనువిందు చేస్తున్నాయి నీలం రంగులో. దిగువన బోటింగ్ సదుపాయం కూడా ఉంది. అక్కడ కొంత సేపు గడిపి కొన్ని ఫోటోలు దిగి గ్రాండ్ కెనియన్ కు పయనమయ్యాం. అప్పటికి సమయం ఉదయం 11 గంటలు దాటిపోయింది.

గ్రాండ్ కెనియన్ ప్రయాణం :

లాస్ వేగాస్ నుండి గ్రాండ్ కెనియన్ కు మధ్య దూరం 252 మైళ్ళు అనగా దాదాపు 400 కి.మీ. గంటకు 60 మైళ్ళ వేగంతో అనగా 100 కి.మీ. వేగంతో వెళ్ళితే 4 గంటల్లో చేరుకోవచ్చు. అప్పటికే మేం గంట ప్రయాణం చేసి ఉన్నాం. గ్రాండ్ కెనియన్ కు అక్కడి నుండి ఇంకా మూడు గంటల్లో చేరుకోవచ్చు.
గ్రాండ్ కెనియన్ కొండలు అమెరికా పడమర ప్రాంతపు దక్షిణ భాగంలోని ఆరిజోనా రాష్ట్రములో ఉన్నాయి. 446 కి.మీ పొడవునా విస్తరించి, 29 కి.మీ. వెడల్పుతో విస్తరించి, ఒకటిన్నర కిలోమీటర్ ఎత్తుతో ముదురు గోధుమ రంగులో ఉన్న అధ్బుతమైన ప్రకృతి ప్రసాదించిన కొండల వరుసలు అవి. కొన్ని వేల సంవత్సరాలనుండి గ్రాండ్ కెనియన్ కొండల్లో నీలి రంగును పులుముతూ కొన్ని ప్రాంతాల్లో కోలరాడో నది ప్రవహిస్తూ ఉంటుంది కొండలను, బండ రాళ్ళను కోస్తూ, లోయలను, గుహలను ఏర్పరుస్తూ. అది వేల సంవత్సరాల నుండి నేటివ్ అమెరికన్ ట్రైబల్ జాతి ప్రజలకు ఆవాస క్షేత్రం, మరియు ప్రీతి పాత్రమైనది కూడా. కొన్ని తెగల నేటివ్ అమెరికన్ ప్రజలకు అది నేటికినీ కూడా పవిత్రమైన తీర్థ యాత్ర స్థలం లాంటిది. గ్రాండ్ కెనియన్ అంటే నిజంగానే గ్రాండ్ కెనియన్! గ్రాండ్ కెనియన్ అందాలు పరిపూర్ణంగా చూడాలంటే 1969 లో విడుదల అయిన పాపులర్ ఇంగ్లిష్ సినిమా ‘మెకనాస్ గోల్డ్ ’ లో చూడచ్చు.
మా కారు ప్రయాణం మూడు గంటలు ఏకదాటిగా సాగింది. దారి పొడుగునా ఎదారిలానే, కొండలూ, గుట్టలు ఉన్నాయి. చెట్లు తక్కువ, కనిపించే చెట్లు ముల్ల చెట్లు, బ్రహ్మజెముడు చెట్లే. అక్కడక్కడ కొన్ని నివాస సముదాయాలు ఉన్నాయి గ్రామీణ అమెరికాను తలపిస్తూ. మధ్యహ్నం 2 గంటల తరువాత గ్రాండ్ కెనియన్ లోకేషన్ చేరుకున్నాం. అక్కడ గుడారములు వేసి ఉన్నాయి లోకల్ గా ఏమయినా వస్తువులు కొనుక్కోవడానికి వీలుగా. గ్రాండ్ కెనియన్ ప్రాంతాన్ని చూడడానికి బస్ సౌకర్యం ఉంది. భోజనం తో సహా ఒక్కొక్కరికి 80 డాలర్లు అన్నారు. గ్రాండ్ కెనియన్ అందాలను దర్శించడానికి హెలికాప్టర్ సదుపాయం కూడా ఉంది అక్కడ. డబ్బులను బట్టి సదుపాయం. మధ్యాహ్నం కాబట్టి మూడు టికెట్స్ తీసుకొని బస్ ఎక్కాం. ఒక ప్రదేశం దగ్గర బస్ బస్ ను ఆపారు. ముందుగా హోటల్ కు వెళ్లి అందుబాటులో ఉన్న తిన గలిగిన ఆహారం సబ్ తిన్న తరువాత అక్కడ ఉన్న నేటివ్ అమెరికన్స్ కు సంభందించిన విశేషాలు చూసి మళ్ళీ బస్ ఎక్కాం తరువాతి ప్లేస్ స్కైవాక్ ప్రదేశం కు వెళ్లాం. గాలిలో స్కై వాక్ చెయ్యాలని ఉందా ! చెయ్యండి గ్రాండ్ కెనియన్ లో అని చెప్పాలనిపిస్తుంది. లోయమీంచి గాలిలో గుర్రపునాడా ఆకారంలో ఇనుప బీముల ఆదారంతో ట్రాన్స్పరెంట్ గాజు ప్లేట్ మీద నడిచే ఏర్పాటు చేశారు. కిందికి చూస్తే లోయ, పైకి చూస్తే ఆకాశం కనిపిస్తుంది , గాలిలో నడిచినట్లు గానే ఫీల్ అవుతారు జనం. కాళ్ళకు బట్ట కవర్లను ధరించి నడువ వలసి ఉంటుంది గాజు ప్లేట్ మీద. అక్కడ ఫోటో దిగితే 13 డాలర్లు వాళ్ళే దించుతారు, మన కెమరాలను తీసుకపోనివ్వరు. అదొక వ్యాపార సూత్రం డబ్బులు సంపాదించడానికి. ఆ ప్రదేశాలను చూస్తుంటే అమెరికా వాళ్ళు బండలను, కొండలను, ఎడారులను కూడా పర్యాటక ప్రదేశాలుగా తేర్చిదిద్దుకుంటారు అనిపించింది. అక్కడ బయట కొన్ని ఫోటోలు దిగి తర్వాత ఇంకో ప్రదేశానికి బస్ లో వెళ్లాం. గ్రాండ్ కెనియన్ కొండల వరుసలు, ప్రకృతి వింతలు వందల కిలోమీటర్లు వ్యాపించి ఉన్నాయి. కిందికి చూస్తే లోయ , పైకి చూస్తే ఆకాశం ఎత్తైన కొండలు, ఆ కొండల వెనుక సూర్యాస్తమయం, సూర్యోదయం చూడవలసిన సందర్భాలు అన్నారు. అప్పటికే సాయంత్రం ఐదు అయ్యింది కొన్ని ఫోటోలు తీసుకొని లాస్ వేగాస్ కు తిరుగు ప్రయాణ మయ్యాం. రాత్రి తొమ్మిది గంటల తరువాత లాస్ వేగాస్ చేరుకున్నాం.
ఆ రోజు ఉండడానికి ఎక్స్ కలిబర్ హోటల్లో రూమ్ బుక్ చేశాడు శరత్ . అది లాస్ వేగాస్ స్ట్రిప్ మీద ఇంకో వైపున ఉన్న హోటల్. ఓ గంట సేపు రెస్ట్ తీసుకొని ఫ్రెస్ అయి లాస్ వేగాస్ స్ట్రిప్ మీది నుంచి నడుస్తూ ముందుకు కదిలాం. నగరమంతా రాత్రిపూట వింత లోకం లానే ఉంది. వేలాది మంది స్ట్రిప్ మీద అటూ,ఇటూ నడుస్తూనే ఉన్నారు. మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుగుల్లో వినిపిస్తున్న సంగీతానికి అనుగుణంగా స్టెప్పులు వేస్తూ డాన్స్ చేస్తూ కదులున్నారు జనం. రాత్రి పదకొండు గంటల తరువాత ప్లానెట్ హాలివుడ్ లో ఉన్న చైనీస్ రెస్టారెంట్లో ఫ్రయిడ్ రైస్ వెజ్, నాన్ వెజ్ అందుబాటులో ఉంటే భుజించి అర్ధరాత్రి తరువాత రూమ్ కు వచ్చి పడుకున్నాం.
ఆంటి లోప్ కెనియన్ యాత్ర :

మా లాస్ వేగాస్ యాత్రలో భాగంగా ఇంకా చూడవలసింది ఆంటి లోప్ కెనియన్ . శనివారం ఉదయం తొమ్మిది గంటలకు లాస్ వేగాస్ నుంచి బయలు దేరినాము. మా ప్రయాణం అయిదు గంటలు పోను అయిదు గంటలు రానూ, దూరం 281మైళ్ళు అనగా దాదాపు 458 కి.మీ. ఎడారి రాళ్ళు గుట్టల ప్రాంతమే త్రోవ వెంబడి. గ్రాండ్ కెనియన్ కొనసాగింపే ఆంటి లొప్ కెనియన్.. అంటి లోప్ కెనియన్ రెండు బాగాలుగా ఉంది, అప్పర్ ఆంటి లోప్, లోయర్ ఆంటి లోప్ అని . పర్వతం నిలువుగా చీలిపోయింది ఒకటి A ఆకారంలో అది అప్పర్ అంటి లోప్, ఇంకో దగ్గర V ఆకారంలో చీల్పోయింది అది లోయర్ ఆంటిలోప్ కెనియన్ ! అప్పర్ ఆంటి లోప్ కెనియన్ దగ్గర హార్స్ బెండ్ షూ అనే ఒక ప్రదేశం ఉంది. మేము ముందుగా అక్కడికి చేరుకున్నాం. కారుపార్కింగ్ చేసిన దగ్గరి నుండి రెండు కిలోమీటర్లు నడిస్తే అది వస్తుంది. మే మాసం మిట్టమధ్యాహ్నం ఎండలో అంత దూరం నడిచి వెళ్లే ఓపిక లేక మేం అక్కడే కూర్చున్నాం. శరత్ వెళ్లి చూసి ఫోటోలు తీసుకొని వచ్చాడు. అక్కడి విశేషం ఏమిటీ అంటే కొలరాడో నది అక్కడి లోయ గుండా ఒక చిన్న కొండ చుట్టూ తిరుగుతూ నీలి రంగును ప్రతిఫలిస్తూ ప్రవహిస్తూ పోతుంటుంది. అక్కడి నుండి మేం అప్పర్ ఆంటి లొప్ కెనియన్ వెళ్లాం. అప్పటికి సమయం రెండున్నర అవుతుంది. అది చూడడానికి బస్ పై వెళ్ళాలి, ముప్పయి డాలర్ల టికెట్, తర్వాతి బస్ మూడున్నరకు ఉంది అన్నారు. టిఫిన్ చేద్దామన్నా వసతి ఏమీ లేదు. ఓ అయిదారు కిలో మీటర్లు ముందుకు వెళ్లి తినడానికి సబ్ తీసుకొని, త్రాగడానికి మంచి నీళ్ళ క్యాన్ తీసుకొని వచ్చాం. కొంత ఆహారం తీసుకున్న తరువాత మమ్ములను బస్ లపై తీసుక వెళ్ళారు అవి చూపించడానికి. సాయంత్రం నాలుగు అయిదు ప్రాంతం. A ఆకారంలో చీలిపోయిన కొండ గుహల్లోంచి వెళుతుంటే పై నుండి సూర్య రశ్మి పడుతుంది, కింద మెత్తటి ఇసుకతో మైదానం లా తోవ ఉంది బయటకు. బండ రాళ్ళపై రకరకాల ఆకారాలను మనుష్యులవి, జంతువులవి పోల్చి చూసుకోవచ్చు. ఆ కొండ రాళ్ళలో కెమెరాలతో క్లిక్ మనిపిస్తే రకరకాల వింత డిజైన్లతో ఫోటోలు వస్తున్నాయి. అన్ని వివరాలు చెప్పడానికి మాకు ఒక గైడ్ కూడా ఉన్నాడు. అవి చూసి వచ్చే వరకు మాకు ఐదున్నర అయ్యింది. ఇక లోయర్ ఆంటి లోప్ కెనియన్ చూసే అవకాశం లేకుండా పోయింది. మార్గ మద్యములో మేం లేక్ పావెల్ అనే సరస్సును కూడా చూసే అవకాశం ఉండే. సమయం చాలదని లాస్ వేగాస్ కు తిరుగు ప్రయాణం అయ్యాం. సాయంత్రం ఎనిమిది దాటినా కాని సూర్యాస్తమయం కాదు అక్కడ. ప్రకృతి అందాలను చూస్తూ వందల కిలోమీటర్లు వ్యాపించి ఉన్న గ్రాండ్ కెనియాన్ కొండల వెనుక సూర్యాస్తమయం దృశ్యాలను చూస్తూ మధ్య మధ్య ఒకటి రెండు ప్రదేశాల్లో ఆగుతూ రాత్రి పది గంటల వరకులాస్ వేగాస్ చేరుకున్నాం. మార్గ మద్యం లోనే హోటల్ ప్యారిస్ లొ ఆన్లయిన్ ద్వారా రూమ్ బుక్ చేశాడు శరత్. ప్యారిస్ అందాలు చూడాలనుకుంటే లాస్ వేగాస్ ప్యారిస్ హోటల్లో చూడచ్చు అన్నట్లుగా ఉంది ఆ హోటల్. రెస్టారెంట్ లు, బార్ లు, కసినో ఆటలు, అమ్మాయిల నృత్యాలతో, ఆట పాటలతో అదిరిపోతుంది ఆ హోటల్. ఆ రాత్రికి అక్కడే బస చేశాం. ఆ రాత్రి లాస్ వేగాస్ అందాలను చూడడానికి ఇంకో అవకాశం దొరికింది. తెల్లవారి తిరుగు ప్రయాణం. కారును విమానాశ్రయం రెంటల్ కార్ లొ అప్పగించి ఉదయం 11 గంటల తరువాత విమానం ఎక్కాం. మధ్యాహ్నం 4 గంటల తరువాత రమాకాంత్ ఇంటికి చేరుకొని భోజనం చేసి సాయంత్రం 7 గంటల తరువాత మా కోడలు సృజనతో కలిసి కారులో ఆస్టిన్ చేరుకున్నాం.

-సబ్బని లక్ష్మినారాయణ

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!