Monday, February 24, 2020
Home > సీరియల్ > ట్రావెలాగ్ > || నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర (6 వ భాగం) ||- సబ్బని లక్ష్మీ నారాయణ

|| నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర (6 వ భాగం) ||- సబ్బని లక్ష్మీ నారాయణ

ఆస్టిన్ లొ “అక్షర సౌరభాలు” పుస్తక ఆవిష్కరణ :

నేను అమెరికా వెళ్ళేటప్పుడు రెండు పుస్తకాలు తీసుకవెళ్లాను పది పది కాపీల చొప్పున వీలైతే అక్కడి సాహిత్య సభల్లో ఆవిష్కరింప చేద్దామని. మొదటి పుస్తకం “ అక్షర సౌరభాలు” ఏక వాక్య కవితలు, ఆ పుస్తకానికి ఇద్దరు కవిమిత్రులు ముందు మాటలు రాశారు ఒకరు ఏకవాక్య కవితా శిల్పి బిరుదాంకితులు ఆచార్య ఫణీంద్ర, హైదరాబాద్ నుండి మరియు కవితా విశారద బిరుదాంకితులు ఆర్.వి.ఎస్.ఎస్. శ్రీనివాస్, భూపాల్ నుండి. రెండవ పుస్తకం “ అక్షరాణువులు” ( నానోలు ), ఈ పుస్తకానికి కూడా ఆర్.వి.ఎస్.ఎస్. శ్రీనివాస్ గారే ముందు మాట రాశారు. మే మాసంలో ఒకటి, జూన్ లొ ఒకటి బుక్స్ ఆవిష్కరింప చేయాలనుకున్నాను. సాధారణంగా ప్రతి నెల 3 వ శని, ఆదివారాల్లో ఆస్టిన్ కు దగ్గరి పట్టనాలైనా డాలస్ లోనూ, హ్యుస్టన్ లోనూ సాహిత్య సభలు జరుగుతుంటాయి. మే మాసం 21 వ తేది నాడు డాలస్ లొ TANTEX వారి సాహిత్య సభ ఉండే కాని మా లాస్ వేగాస్ టూర్ మే 18 నుండి 21 సాయంత్రం వరకు సాగింది. అక్కడికి వెళ్లే అవకాశం చిక్కలేదు. మే మాసం 21 నాడే మధ్యాహ్నం ఆస్టిన్ హిందూ దేవాలయంలో సాహితీ మిత్రుడు డొక్కా రాము గారి ఒక పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఉండే కాని నేను లాస్ వేగాస్ ప్రయాణంలో ఉండడం వలన సాయంత్రం వరకు గాని నేను ఆస్టిన్ కు చేరుకునే అవకాశం లేకుండా పోయింది. అలా నా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆ సభల్లో జరుపలేకపోయాను. మొత్తం మీద మే మాసం చివరలోనైనా పుస్తకం ఆవిష్కరణ చేయాలనుకున్నాను. మే 29 వ తేది ఆదివారం నాడు శాన్ ఆంటోనియా నుండి రమాకాంత్ వాళ్ళు, కార్తీక్, కార్తీక్ మిత్రులు మా ఇంటికి వచ్చారు. ఆ రోజు సాయంత్రం మా ఇంట్లోనే “ అక్షర సౌరభాలు” ఏక వాక్య కవితల పుస్తకాన్ని రమాకాంత్ చేతుల మీదుగా ఆవిష్కరింప చేశాను. గత ఆరు నెలలుగా నెలకు ఒక పుస్తకం ఆవిష్కరింప చేస్తూ వసున్నాను. విజయవాడలో అదేపల్లి వారి స్మారక సభలో నవంబర్ మాసం 2016 లొ “ మనిషి” దీర్గ కవిత, డిసంబర్ మాసంలో మచిలీపట్నం ‘ఆంధ్ర సారస్వత సమితి’ సభలో “ సాహిత్య నానోలు “ పుస్తకం, జనవరి 2017 మాసంలో మచిలీ పట్నం లోనే ‘ సీనియర్ సిటిజెన్ వాయిస్ ‘ పత్రిక వారి వార్షిక సభలో “ చాణక్యుడి నీతి సూత్రములు” అనే అనువాద పుస్తకం, ఫిబ్రవరి మాసంలో కరీంనగర్ లొ “ భక్త మీరా కవితలు “ పుస్తకం, మార్చ్ మాసంలో కరీంనగర్ లోనే “ అనుభవ సత్యాలు- ఆణి ముత్యాలు” పుస్తకం, ఏప్రిల్ మాసం లొ కరీం నగర్ లోనే “ ప్రేమ స్వరాలు “ ఏక వాక్య కవితల పుస్తకం ఆవిష్కరింపబడ్డాయి. అలా ఆస్టిన్ లొ ఆవిష్కరింపబడ్డ “ అక్షర సౌరభాలు” పుస్తకం ఏడవది..అలా మే మాసం లాస్ఈ వేగాస్జి ప్రయాణంతో, పుస్తక ఆవిష్కరణతో గడిచిపోయంది.

చికాగో పర్యటన :

అమెరికాలో దిగుతూనే చెప్పాను ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో శరత్ తో ‘నేను చికాగో చూడాలి’ అని, ఎందుకంటే అది వివేకానందుడు సందర్శించిన ప్రదేశం కాబట్టి. అన్నట్లుగానే జూన్ 3 వ తేది శనివారం నాటి సాయంత్రం కోసం విమాన టికెట్ బుక్ చేశాడు శరత్. తిరుగు ప్రయాణం మళ్ళీ జూన్ 5 వ తేది సోమవారం ఉదయం. నేను, కళ్యాణ్, శరత్ ముగ్గురం వెళ్లాం. ఆనాటి బస కళ్యాణ్ వాళ్ళ ప్రెండ్ రూమ్ లొ అన్నారు. ఇంటి వద్ద మా శారద, సృజన ఇద్దరు ఉన్నారు. ఆస్టిన్ నుండి చికాగోకు 3 గంటల ప్రయాణం దాదాపు. మేం సాయంత్రం 4 తర్వాత మా కారును ఆస్టిన్ విమానాశ్రయం పార్కింగ్ లొ పెట్టి విమాశ్రయం లొ చెకింగ్ తర్వాత లోనికి వెళ్ళినాం. మా విమానం అయిదున్నర తరువాత బయలు దేరింది. చికాగోకు, ఆస్టిన్ కు టైం డిఫెరెన్స్ ఏమిలేదు, రెండూ ఒకే టీం జోన్ లొ ఉంటాయి. గాలిలో అలా ప్రయాణం మూడోసారి నాకు. విమానం కిటికీ లోంచి అస్తమిస్తున్న సూర్యున్ని క్లిక్ మనిపించాను. రాత్రి అవబోతున్న సమయం ఎనిమిదిన్నర తొమ్మిది మధ్యలో విశాలమైన చికాగో నగరం వీధుల్లోని క్రమ పద్ధతిలో ఉన్న మిరుమిట్లు గొలిపే వీధి దీపాలు స్వాగత తోరణాల్లా కనిపించాయి. విమానం దిగగానే బయట మమ్ములను కళ్యాణ్ మిత్రులు రిసీవ్ చేసుకున్నారు. ఆ రాత్రి మాకు చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. అయిదుగురు మితులున్నారూమ్ లో అందరు ఉద్యోగం చేస్తున్న బ్రహ్మచారులే, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, విజయవాడకు చెందిన మిత్రులు వారు. చికాగోలొ అక్టోబర్ నుండి మార్చ్ వరకు మంచు కురిసే ప్రాంతం కాబట్టి విపరీతమైన చలి ఉంటుందట. అందుకే అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ క్లోసుడుగా ఉండి ఒకే ఎంట్రన్స్ తో ఉంది , అందులో రెండు బెడ్ రూమ్ ల అపార్ట్మెంట్ వారిది, ఆ రాత్రి వాళ్ళ రూమ్ లొ పడుకొని తెల్ల వారి తొమ్మిది గంటలకు మిత్రుని వాళ్ళ కారు తీసుకొని చికాగో చూడడానికి బయట పడ్డాం. కారును ఒక దగ్గర పార్క్ చేసి, దగ్గరలోని సబ్ వే లొ సబ్ ను తిని చికాగో దర్శన్నానికి నున్నటి ఆ పేవ్మెంట్ల పై నడుస్తూ వెళ్లాం.

చికాగో అమెరికా ఇల్లినాయ్ రాష్ట్రం లోని చరిత్ర ప్రసిద్ధమైన నగరం. అమెరికాలోని 3వ అతిపెద్ద నగరం. మిచిగన్ సరస్సు పక్కన ఉన్న ఈ నగరం ప్రపంచ ప్రసిద్ధ వర్తక వాణిజ్య కేంద్రం. చక్కటి భవన నిర్మాణాలు గల నగరం. మేం అక్కడ ముందుగా దర్శించింది చికాగ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ . ఎక్కడతే 1893 వ సంవత్సరంలో సెప్టెంబర్ 11 నాడు స్వామి వివేకానంద విశ్వ మత మాహా సభలో ఉపన్యసించాడో ఆ ప్రదేశాన్ని ముందుగా చూడాలని వెళ్లాం. ఏ చికాగో వీధుల్లోనైతే వివేకానంద నడిచాడో ఆ వీధుల గుండా నడుస్తూ వెళ్లాం. చికాగో ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఎదురుగుండా వెళ్లే రోడ్ కు గౌరవ ప్రదంగా వివేకానందా మార్గ్ అనే బోర్డ్ కూడా ఉంది. చికాగో ఆర్ట్ ఇన్స్టిట్యూట్ మరియు చికాగో లోని ఎత్తైన భవనం స్కై డెక్ చూడడానికి రెండింటికి కలిపి ఒక్కక్కరికి ముప్పయి డాలర్ల టికెట్ తీసుకున్నాడు శరత్. ఆ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ను ఓ పూటంతా ఓ రోజంతా చూడవచ్చు దాన్ని.1879 వ సంవత్సరంలో నెల కొల్పబడి, ప్రాక్ పశ్చిమ దేశాల్లోని శిల్పకళ, చిత్రకళ వస్తువులతో నిండి ఉన్న మ్యూజియం అది, ఆసియా, ఆఫ్రికా, యూరోప్, అమెరికా మొదలగు ఖండాలకు సంబంధించి చిత్రకళ, శిల్పకళ,పెయింటింగ్స్ అధునాతన,మరియు పురాతనానికి సంబంధించి వస్తు విశేషాలు, వస్త్ర విశేషాలు, ఫోటోలు సందర్శించవచ్చు. భారత దేశానికి సంబంధించి బౌద్ధ మతం, జైనమతం, హిందూ మతానికి సంబంధించి చిత్ర శిల్ప సంపదను కూడా మనం దర్శించవచ్చు. నాతో వచ్చిన ఇద్దరు యువకులు ఎక్కువ సేపు చూడనిస్తారా! రెండు మూడు గంటలు చూసి ఇక ఏ ప్రదేశంలోనైతే వివేకానందుడు మాట్లాడాడో ఆ ప్రదేశం చూడడానికి వెళ్లాం. ఆ ప్రదేశం ఆర్ట్ ఇన్స్టిట్యూట్ కుడివైపు మెట్ల దగ్గర ఉంది. అక్కడ గోడపై వివేకానందుడి ఫోటో ఉండి సెప్టెంబర్ 11, 1893 అని రాసి ఉంది. అక్కడ నిలబడి ఫోటో తీయమన్నాను శరత్ తో. చికాగోలొ నాటి కొలంబస్ హాల్, నేటి ఫుల్లెర్టిన్ హాల్ వివేకానంద సందేశం ఇచ్చిన ప్రదేశం. ఆ హాల్ తాళం వేసి ఉంది,మేం కోరితే సిబ్బంది తాళం తీశారు.నాటి వివేకానంద సందేశం ఇచ్చిన ప్రదేశం పేరు కొలంబస్ హాల్, నేడు అది ఫుల్లెర్టిన్ హాల్ గా పేరు మార్చుకొని ఆధునీకరించబడినది. అక్కడ సభావేదిక ఉంది, హాలులో వందలాది కుర్చీల వరుసలు ఉన్నాయి. భారత దేశంకు చెందినా ఒక గొప్ప మహానుభావుడు ఆ వేదిక ప్రదేశంలోనే విశ్వమత మహా సభలో భారత దేశ ఔన్నత్యం గూర్చి, హిందూ మతం యొక్క గొప్పతనం గూర్చి నూట ఇరువై అయిదు సంవత్సరాల క్రితం ప్రసంగించినాడు. “ Sisters and brothers of America” అంటూ మొదలుపెట్టిన వివేకానందుడి ఆ నాటి ప్రసంగం సభాసదులను ఉర్రూతలూగించింది అని ఆ మాటల గురించి నేను వినేవాడిని భారత దేశంలో ఉన్నపుడు, కాని అక్కడే నేను నిలుచున్నానంటే పులకించిపోయాను, ఆ సభాభవనం లోని కుర్చీలలో కూడా కూర్చున్నాను కాసేపు. మా శరత్ తో ఫోటోలు తీయమన్నాను. సభాభవనంలో. అప్పటికి సమయం ఒంటి గంట దాటి పోయింది. తర్వాత అక్కడికి దగ్గర లోని ఎత్తైన భవనం స్కై డెక్ చూడడానికి వెళ్లాం.

అమెరికాలో గొప్ప చారిత్రిక శిల్పకళ లేకున్నా, వారసత్వ చిహ్నాలు లేకున్నా ఉన్న దాంట్లోనే ప్రకృతి వనరులను ఉపయోగించుకొని పర్యాటక కేంద్రాలుగా వారు ఆ దేశాన్ని తీర్చిదిద్దుకున్నారు. కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలను కూడా నిర్మిచుకున్నారు. అందుకు ఉదాహరణలుగా చికాగోలోని, స్కై డెక్ ను, గ్రాండ్ కెనియన్లో స్కై వాక్ ను, డిస్నీల్యాండ్ ను, హాలివుడ్ స్టూడియోలను చెప్పుకోవచ్చ్చు. చికాగోలోని స్కై డెక్ నూట మూడు అంతస్తుల భవనం. నూటా మూడంతస్తుల పైన స్కై డెక్ నుంచి చూస్తే చికాగో నగరాన్ని, నాలుగు రాష్ట్రాల సరిహద్దులను దర్శించవచ్చు. స్కై డెక్ అద్దం లోంచి కిందికి చూస్తే పాతాళం లో నగరం, పైకి చూస్తే ఆకాశం కనిపిస్తుంది. ఆ స్కై డెక్ పైన నిలుచుండి మేం ఫోటోలు తీసుకున్నాం. మూడు వందల అరువై డిగ్రీల కోణంలో స్కై డెక్ పై చుట్టూ ఉన్న దర్శించే ప్రదేశాల్లోంచి నగరాన్ని చూశాం. అక్కడి నుండి చూస్తే మూడు రాష్ట్రాల సరిహద్దులు కనిపిస్తాయంటారు. అది 103వ అంతస్తులో ఉంది. దాని పైనుంచి చూస్తే చికాగో నగరంతో పాటు ఇంకా మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు కూడా కనిపిస్తాయి. అక్కడ స్కైడెక్ పై కొన్ని ఫోటోలు దిగి మేం కిందికి దిగేవరకు మధ్యాహ్నం రెండు గంటలు దాటిపోయింది. ఆకలి అవుతుంది కాబట్టి అక్కడికి దగ్గరలోని ఒక రెస్టారెంట్ కు వెళ్లాం. అందులో అందుబాటులో పిజ్జానే ఉంది. పద్దెనిమిది ఇంచుల పిజ్జా ఆర్డర్ ఇచ్చాడు శరత్. పిజ్జా అంటే మైదా పిండితో దొడ్డుగా కాల్చిన రొట్టెనే , ఆ రొట్టెపై ఉల్లి గడ్డ ముక్కలు, అన్ని విజిటబుల్ ముక్కలు వేసి వెన్న పెట్టి ఇస్తారు. ముగ్గురికి ఈజీగా సరిపోయింది అది. పిజ్జా తిన్న తరువాత అక్కడికి దగ్గరలో ఉన్న మిలినియం పార్క్ కు వెళ్లాం చూడడానికి నడుచుకుంటూనే. మిలినియం పార్క్ లొ చాలా విశేషాలు ఉన్నాయి చూడడానికి అందులో ముఖ్యంగా మేం చూసినవి క్రౌన్ ఫౌంటెన్ మరియు క్లౌడ్ గేట్. క్రౌన్ ఫౌంటెన్ పై నుంచి జలపాతంలా నీటి దారలు కురుస్తున్నాయి. వాటి కింద జనులు ఉల్లాసంగా స్నానం చేస్తున్నారు నీటి తుంపరలకు తడుస్తూ, విశాలమైన 24 ఎకరాలకు పైగా ఉన్న ఆ పార్క్ గుండా నడుస్తూ క్లౌడ్ గేట్ దగ్గరకు వెళ్లాం. ఎటు చూసినా అద్దం లాంటి క్లౌడ్ గేట్ కింది గుండా, చుట్టూ తిరుగుతూ కూడా నడుస్తూ మన ప్రతిబింబాలను ఏ కోణములోనైనా చూసుకోవచ్చు. అక్కడ కొన్ని ఫోటోలు దిగి, మిగితా కాసేపు పార్క్ లొ తిరిగి వెనుతిరిగాం ఇంటికి. ఆ పార్క్ లొ ఆనాడు ఆదివారం కాబట్టి అన్ని జాతుల ప్రజలు పర్యాటకులు వేల మంది ఉన్నారు. అక్కడికి దగ్గరలోని మిచిగన్ సరస్సు చూడాలని ఉన్నా అప్పటికే తిరుగడం వలన కాళ్ళు నొప్పి పెడుతున్నాయన్నారు. మా కార్ పార్కింగ్ దగ్గరకు వెళ్లి సాయంత్రం 5 గంటల తరువాత మిత్రుల రూమ్ చేరుకున్నాం. చికాగోలో ఇంకా చూడవలసిన ప్రదేశాల్లో వివేకానంద వేదాంత సొసైటీ కూడా ఉండే, మళ్ళీ ఇంకోసారి వచ్చినపుడు సమయం తీసుకొని చూద్దాం అనిపించింది. ఆ సాయంత్రం కళ్యాణ్ మిత్రులను కలువడానికి వాళ్ళు భోజనానికి పిలిస్తే వెళ్ళాడు. శరత్ మిత్రులతో కాసేపు వాలీబాల్ ఆడడానికి వెళ్ళాడు. ఆ సాయంత్రం కరీంనగర్ ఎల్లారెడ్డి పేట మండలం నారాయణ పురం మిత్రుడు శీనురెడ్డి తో ఓ రెండు గంటలు కబుర్లతో గడిచింది. రాత్రి అందరం భోజనం చేసి పడుకుంటే తెల్లవారి చికాగో విమానాశ్రయానికి కార్లో దించారు మిత్రులు. ఉదయం పదకొండు తరువాత సోమవారం ఆస్టిన్ చేరుకున్నాం.
………………………………………………………………………………………

జూన్ 12, మా కోడలు సృజన పుట్టిన రోజు వేడుక :

జూన్ 12 వ తేది సోమవారం మా కోడలు సృజన పుట్టిన రోజు. ఆనాడు సాయంత్రం ఆస్టిన్ లొ ఉన్న తనకు తెలిసిన మిత్రులను కుటుంభంతో సహా పిలిచాడు శరత్. మా శరత్ ఉండే కమ్యూనిటి లొ స్విమ్మింగ్ పూల్ దగ్గర, గ్రిల్ ఉంది. టేబుల్స్. కుర్చీలు, టి.వి, ఫ్యాన్, సదుపాయం సౌకర్యవంతంగా ఉంది . అక్కడ అందరం ఇరువది అయిదు మందిమి సాయంత్రం ఎనిమిది గంటల వరకు వెళ్లాం. భోజనాలు చికెన్ బిర్యాని, మటన్ కర్రీ, చపాతీలు, వెజ్ బిర్యాని, అన్నీ ఇంట్లోనే తయారు చేసుకొని వెళ్లాం. త్రాగడానికి సాఫ్ట్ డ్రింక్, డ్రింక్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. హాపీ బర్త్ డే తోరణం, బెలూన్లు అరేంజ్ చేసినాం. వినడానికి టేప్ రికార్డర్ పాటలు కూడా అరేంజ్ చేసినారు.అందరి సమక్షంలో మా కోడలు కేక్ కట్ చేసింది. ఉల్లాసంగా, ఉత్సాహంగా అందరి సమక్షంలో మా కోడలు పుట్టిన రోజు వేడుక జరిగింది. భోజనాదులు ముగించి అందరం పదకొండు గంటల రాత్రి వరకు ఎవరింటికి వాళ్ళం చేరుకున్నాం. అమెరికా లాంటి దేశంలోనైనా కలుసుకోవాలనుకుంటే వివిధ సందర్భాలలో ఓ పాతిక మంది ఇంకా కావాల్నంటే ఓ యాబై మంది మిత్రులు కలుసుకోవచ్చు.అని అర్ధమైంది.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!