Monday, March 1, 2021
Home > సీరియల్ > ట్రావెలాగ్ > నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర- 7 వ భాగం- సబ్బని లక్ష్మీ నారాయణ

నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర- 7 వ భాగం- సబ్బని లక్ష్మీ నారాయణ

డాలస్ సాహితీ యాత్ర:

అమెరికా టెక్సాస్ రాష్ట్రం లోని డాలస్ నగరంలో ఉన్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ( TANTEX) వారు నెల నెల ఒక సాహితీ కార్యక్రమం చేస్తుంటారు, ఒక సాహితీ వేత్తచే ప్రసంగం ఏర్పాటు చేస్తారు. ఆ సంస్థ 1986 వ సంవత్సరంలో ఏర్పడింది. గత పది ఏళ్ళ నుండి క్రమం తప్పకుండా వారు ఈ కార్యక్రమమును ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 2017 కార్యక్రమములో భాగంగా నన్ను వక్తగా ఆహ్వానించారు. అది వాళ్ళ 119 వ సాహితీ సమావేశం. ఆ సమావేశములో ప్రసంగాంశం “ ఆధునిక తెలుగు కవిత్వంలో లఘు కవిత ప్రక్రియలు( హైకూలు, నానీలు, నానోలు, రెక్కలు, ఏకవాక్య కవితలు)”. ఈ అయిదు లఘు కవితా ప్రక్రియలలో నేను రచనలు చేసినవాన్ని, పుస్తకాలు కూడా ప్రచురించినవాన్ని. ఆ టాపిక్ కు కావలసిన ప్రసంగాన్ని తయారు చేసుకున్నాను. వారం పది రోజుల ముందుగానే ఆహ్వాన పత్రంలో నా ఫోటో వేసి నాకు ఆహ్వాన పత్రం పంపించారు. నేను ఆ సమావేశంలో ఒక పుస్తకం కూడా విడుదల చేయాలనుకున్నాను. అది “ అక్షరాణువులు” అనే నానోల పుస్తకం. నేను ఇండియా నుండి వెళ్ళేటప్పుడు ఓ పది కాపీలు తీసుకవెళ్లాను, ఆ సమావేశం ఆదివారం ఉందికాని శనివారం కూడా అమెరికా పిల్లలు పాడిన పాటల ఆడియో సి.డి. విడుదల కార్యక్రమం ఉంది కాబట్టి శనివారం నాటి ప్రోగ్రాంకు కూడా అటెండ్ కమ్మంది నిర్వాహకురాలు సింగిరెడ్డి శారద గారు. కాబట్టి మేం శరత్ ఆఫీస్ నుండి వచ్చిన తరువాత శుక్రవారం సాయంత్రమే డాలస్ కు నేను, శారద, సృజన అందరం కలిసి బయలుదేరినాం కారులో. సాయంత్రం ఎనిమిది గంటల తరువాత ప్రవీణ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో శైలుతో పాటు వంశీ, స్రవంతి కూడా ఉన్నారు. మేం వచ్చినామని చక్కటి విందు భోజనం ఏర్పాటు చేసినారు ఆ రాత్రి. తెల్లవారి కూడా చక్కటి వంటలు ఏర్పాటు చేసినారు. ముఖ్యంగా స్రవంతి రాగి సంకటి చేసింది, గోంగూర మటన్ కర్రీ వండింది. స్రవంతి వాళ్ళది రాయలసీమ కడప. కొన్ని రోజులు హైదరాబాద్ లొ సాఫ్టవేర్ ఉద్యోగం చేసి ఇటీవలే డాలస్ కు మారింది అన్నారు.

తెల్లవారి సాయంత్రం ప్రవీణ్ నన్ను సిడి ఆవిష్కరణ కార్యక్రమం ఉండే ఆడిటోరియం దగ్గర కార్లో వచ్చి దించి వెళ్ళిపోయాడు. నూతన యువ సంగీత దర్శకుడు కార్తీక్ ఆద్వర్యంలో రికార్డ్ అయిన ఆ సిడి లొ అమెరికా దేశపు వివిధ రాష్ట్రాలలో ఉంటున్న పిల్లలు పాడిన పాటలు ఉన్నాయి అందులో. ఆ ప్రోగ్రాం మొత్తాన్ని మొదటి నుండి కొ ఆర్డినేట్ చేస్తూ నడిపిస్తుంది శ్రీమతి సింగిరెడ్డి శారద గారు. ఆ పాటలు పాడిన పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, డాలస్ లోని సాహితీ కళాభిమానులు అందరూ మూడువందలకు పైగా హాజరైనారు సభకు.

సభా కార్యక్రమానికి ముందుగా అప్పట్లోనే జూన్ 12 నడు అస్తమించిన మాహాకవి సినారెకు నివాళి కార్యక్రమం ఏర్పాటుచేశారు. అందరితో పాటు నేను కూడా పుష్పగుచ్చాలు సమర్పించి సినారెకు నివాళి అర్పించాను. తర్వాత స్టేజిపై ఒక్కక్క అబ్బాయి, అమ్మాయి తను పాడిన అచ్చ తెలుగు పాటలు పాడి సభికులకు వినిపించారు, సభను అలరించారు. అందులో కొన్ని పాటలు విడియో చిత్రీకరణ కూడా చేసుకొని ఉన్నాయి. వాళ్ళు అలా తెలుగుతనం, తెలుగు సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడుతున్నారు దేశం కాని దేశంలొ అని అనిపించింది. చివరగా ఆడియో సిడి ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది, వేదికమీదికి పెద్దలను, అతిథులను పిలిచారు అందరితోపాటు నన్ను కూడా. ఆనాటి ఆడియో సిడి ఆవిష్కరణ తరువాత అందరికి తినడానికి పెరుగన్నం, పులిహోర ఏర్పాటు చేశారు. రాత్రి పది గంటలు దాటిపోయింది. ఆ రాత్రి మిత్రుడు మోహన్ రెడ్డి నన్ను ప్రవీణ్ వాళ్ళ ఇంటి దగ్గర నన్ను దింపి వెళ్లిపోయిండు..

ఇక తెల్లవారి ఆదివారం TANTEX వారి సమావేశంలో నా ప్రసంగం. మధ్యాహ్నం 2..30 నుండి 5 గంటల వరకు ఉంది సమావేశం. శరత్, నేను, శారద, సృజన, మధ్యాహ్నం 2 గంటలవరకే డాలస్ విమానాశ్రయం రూట్ లొ ఉన్న సభాస్థలికి చేరుకున్నాం. మా వెనుక అర గంట తరువాత, వంశీ, ప్రవీణ్, శైలు, స్రవంతి చేరుకున్నారు. స్థానికంగా ఉన్న డాలస్ మిత్రులు, సాహితీ మిత్రులు, TANTEX కార్యవర్గ మిత్రులు అందరు కలిసి 50 మందివరకు సభకు హాజరైనారు. ఈ కార్యక్రమములో కూడా ముందుగా మహాకవి సినారె కు నివాళి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. నివాళి తరువాత సినారె పై వక్తల ప్రసంగం ఏర్పాటు చేశారు గంటకు పైగా. అమెరికా లాంటి గడ్డమీద కూడా సినారె పై చక్కటి ప్రసంగం చేశారు అక్కడి సాహితీ మిత్రులు. ముఖ్యంగా సినీ సాహిత్యం పై ప్రసంగించారు, సినారె ఒకటి రెండు కావ్యాలపై కూడా ప్రసంగించారు. అలా మాట్లాడిన వాళ్ళలో డాక్టర్లు ఉన్నారు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఉన్నారు. వారి సాహితీ ప్రియత్వాన్ని చూస్తీ నాకు ఆశ్చర్యం వేసింది.

తర్వాత కార్యక్రమం లొ భాగంగా గంటసేపు నేను “ ఆధునిక తెలుగు కవిత్వంలో లఘు కవిత ప్రక్రియలు( హైకూలు, నానీలు, నానోలు, రెక్కలు, ఏకవాక్య కవితలు)”.అనే అంశంపై ప్రసంగించాను. ఆసక్తిగా విన్నారు సభికులు. ఆ తర్వాత నా పుస్తకం “ అక్షరాణువులు” ( నానోలు) పుస్తకాన్ని TANTEX అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణా రెడ్డి గారు మిత్రుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ పూర్వ అధ్యక్షులు ఉరిమిరెడ్డి నరసింహారెడ్డి గారు, సమన్వయకర్త సింగిరెడ్డి శారద గారు, మిగితా కార్యవర్గ సభ్యులు మా కుటుంభ సభ్యులు, శరత్ మిత్రులు, నా మిత్రుడు మోహన్ రెడ్డి స్థానిక సాహితీ మిత్రులు పాల్గొన్నారు. ఆ సభలోనే నాకు శారదకు శాలువతో సన్మానించారు. వారి గుర్తుగా నాకు ఒక సన్మానపత్రం కూడా సమర్పించారు. అలా డాలస్ లొ ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారిచే సన్మానం పొందడం అనేది ఒక తీపి జ్ఞాపకం. అమెరికాలో మన తెలుగువారు అత్యధికంగా ఉన్న ప్రాంతం డాలస్, డాలస్ లొ తెలుగువారు 50 వేలకు పైగా ఉంటారు, భారతీయులు లక్షా ఇరువైవేలకు పైగా ఉన్నారంటారు. అంత దూరంలో సప్త సముద్రాలు, ఖండాంతరాలు దాటి వెళ్ళినా వారు తెలుగు భాషను నేర్చుకుంటూ, తెలుగు ఉత్సవాలను జరుపుతూ, తెలుగు సంస్కృతిని కాపాడుతూ, తెలుగువారిని ఆహ్వానిస్తూ, తెలుగు సాహిత్యానికి సేవ చేస్తున్నారంటే వారిని అభినందించి తీరాలి. సాయంత్రం ఆరు గంటల వరకు ప్రోగ్రాం అయిపొయింది. అందరికి కృతజ్ఞతలు చెప్పి ప్రవీణ్ వాళ్ళ ఇంటికి వచ్చాం.

ఇక తెల్లవారి ఆఫీస్ కు .వెళ్ళా.లంటే ఈ రాత్రే వెళ్ళాలన్నాడు శరత్. జూన్ 21 వ తేదీ నాడు నయాగరా వెళ్ళాల్సి ఉంది. నయాగరా, న్యూయార్క్, వాషింగ్టన్ ఆరు రోజుల టూర్. సృజన డాక్టర్ సలహాపై రెస్ట్ తీసుకుంటానంది. మేం టూర్ వెళ్తున్నాం కాబట్టి ఆ వారం రోజులు డాలస్ లోనే ఉంటానంది. మేం రాత్రి తొమ్మిది గంటల తరువాత డాలస్ నుండి బయలుదేరి ఒంటి గంటలోపల ఆస్టిన్ చేరుకున్నాం.
(ఇంకా ఉంది)

-సబ్బని లక్ష్మీ నారాయణ

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!