Sunday, October 2, 2022
Home > కథలు > || నిర్ణయం || -వి. సునంద

|| నిర్ణయం || -వి. సునంద

వాసంతికి అస్సలు నిద్ర పట్టడం లేదు. ”ఎలా చెప్పాలి… ఎలా ఒప్పించాలి..? ఆలోచనల దాడితో కంటి పై రెప్ప పడటానికి ఇష్ట పడటం లేదు. దాహంగా అనిపించి నీళ్ళు తాగుదామని లేచిన కమలకు
”పై కప్పును చూస్తూ అస్థిమితంగా అటూ ఇటూ కదులుతున్న కూతురు కనిపించింది. ”ఇంకా నిద్ర పోలేదా అంటూ గోడ గడియారం వైపు చూసింది టైమ్ ఒంటిగంట.. అదేమిటే రేపు కాలేజీ వుంది కదా ‘ ఏమాలోచిస్తున్నావు పడుకో ‘ టీపాయ్ మీదున్న బాటిల్ లో నీళ్ళు తాగి ఆవులిస్తూ వచ్చి పక్కనే వున్న మంచంలో పడుకుంది.
తల్లిని చూస్తూ నిట్టూర్పు విడిచింది తనలో జరిగే అంతర్మధనాన్ని గుర్తించే స్థితిలో లేదు.. ఏదన్నా చెప్పాలని దగ్గరికెళితే అమ్మా వాసంతీ! అక్కకు అన్నం తినిపిస్తావా!
ఓ అరగంట చదివించి పంపించి వస్తానంటుంది…
అక్క.. వాసంతికో అక్క వుంది. పుట్టుకతోనే మానసిక లోపం తన పని తను చేసుకోలేదు. ఆకలి అవసరాలు అన్నీ ఇతరులు చూడాల్సిందే… ఎక్కువగా తండ్రి తనే చూస్తుంటారు….వైకల్యం శాతం ఎక్కువుండటం వలన
ప్రత్యేక స్కూల్ కు పంపినా ఫలితం లేకుండా పోయింది…
తండ్రి రిటైర్ అయినప్పటి నుండి అక్క అవసరాలన్నీ తనే చూస్తున్నాడు. తల్లి ప్రైవేటు స్కూల్లో టీచర్ గా పని చేస్తుంది.
వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా ఉపయోగ పడుతాయి. ఓపికున్నంత వరకు చేస్తానని వెళ్ళడమే కాకుండా, సాయంత్రం ట్యూషన్స్. అయిపోయే సరికి రాత్రి 9 దాటుతుంది అప్పటికి గాని తను వంటింట్లోకి రాదు. పొద్దుటి నుండి బడి, ట్యూషన్ లతో అలసి పోయిన తల్లిని కష్ట పెట్టడం ఇష్టం లేక తండ్రో తనో రాత్రి వంట చేస్తారు.. అవో ఇవో మాట్లాడుతూ, తిని దేహాలను పడక మీద చేర్చే సరికి 11 దాటుతుంది.
ఎన్నో సార్లు చెప్పాలనుకున్నా అవకాశం దొరకక కొంత ఎలా చెప్పాలో అర్థం కాక చెప్పాలనుకున్నది చెప్పలేక పోతోంది వాసంతి…
తల్లికి కూడా కూతురు మనసులో జరిగే అంతర్మధనం గుర్తించే తీరిక లేదు.
తండ్రి పూర్తిగా అక్కకు కాపలాదారుగా మారిపోయాడు.. తల్లి, తను వచ్చేంత వరకు అక్క అవసరాలను తండ్రే చూస్తుంటుంటే అనిపిస్తుంది తనకు… తల్లి ఇంట్లో వుండి ఇవన్నీ చూసుకుంటే బాగుండునని.. . ఆ మాటంటే అమ్మకు కోపం.. కన్నందుకు ఇద్దరి బాధ్యత.. చూడాల్సిందే అంటుంది….
ఏమో ఎలా ఈ విషయం వాళ్ళకు చెప్పాలో… ఆలోచిస్తూ ఎప్పటికో గాని నిద్ర పోయింది వాసంతి…

వాసంతి ఎమ్మెస్సీ, ఎంబీయే చేసి ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నది. చక్కగా తీర్చి దిద్దినట్టుగా ఆకర్షణీయంగా వుంటుంది రూపం. వయస్సు పాతిక దాటుతోంది.. పెళ్ళి చేయాలని గత రెండేళ్ళుగా ప్రయత్నిస్తున్నారు.. ఎన్నో సంబంధాలు వచ్చాయి అమ్మాయి నచ్చిందంటారు. వెళ్ళగానే ఏ విషయం చెబుతామంటారు.. మధ్యవర్తితో వద్దని కబురు పంపుతుంటారు.. మొదట్లో కారణం తెలియలేదు… ఆ తర్వాత తెలిసింది వాసంతి అక్కే కారణమని..
రేపు పుట్టబోయే వాళ్ళు అలా పుడితే ఎలా అని, బావ మరిది లేడు రేపు ఆ బాధ్యత మేమే మోయాలిగా అని కొందరు, కట్నం సరిపోలేదు ఉన్న ఇల్లూ వాకిలి సమస్తం తమ పేర్న రాస్తానంటే అప్పుడాలోచిస్తామని కొందరు.. తమ అహాలను, గొంతెమ్మ కోరికలను నిస్సంకోచంగా వెల్లడించి వెళుతున్నారు…
వాస్తికి అర్థమైంది… తనకిక ఈ జన్మలో పెళ్ళి కాదని.. అక్క విషయం దాచి పెట్టి చేద్దామనుకున్నారు… ఆ తర్వాత తెలిస్తే తన జీవితం నరకమవుతుందని ఆలోచించి మానుకున్నారు… ..
రోజులు గడుస్తున్నాయి
ఆ రోజు శని వారం… సాయంత్రం అమ్మా నాన్నలిద్దరు హడావిడి పడుతున్నారు మరుసటి రోజు రాబోయే 50 వ సంబంధం కోసం…
అవేమీ పట్టనట్టుగా తన గదిలోకి వెళ్ళింది వాసంతి.
పొద్దున్నే తల్లితో అమ్మా! నీతో ఓ విషయం మాట్లాడాలి అంటుండగానే ‘ఆఁ ఈ పెళ్ళి చూపుల గురించే కదా’నీకు సంబంధం కుదిరేంత వరకు మా ప్రయత్నాలు మేం చేస్తూనే వుంటాం.. దయచేసి నీవేం చెప్పకు వాసంతి! ఇప్పటికే మానసికంగా చితికిపోయి వున్నాం ‘ బరువైన డైలాగ్ తో వాసంతిని మారు మాట్లాడకుండా చేసింది.
దెబ్బతిన్న పక్షిలా మనసు గిలగిలలాడుతుంటే నెమ్మదిగా తండ్రి దగ్గరికి వెళ్ళింది విషయం ఎలాగైనా చెబుదామని…. ‘నాకేం చెప్పొద్దు బిడ్డా’మీ అమ్మ చెప్పినట్టు విను తలతిప్పుకొని పనిలో పడిన తండ్రితో మాటలెలా పొడిగించాలో అర్థం కాక నిశ్చేష్టగా అలాగే నిలబడి పోయింది.
తల్లి పిలుపుకు ఈ లోకంలోకి వచ్చిన వాసంతి గంగిరెద్దులా తల్లి చెప్పినట్టు అలంకరించుకుని పెళ్ళి చూపులకు కూర్చుంది.
షరా మామూలే…
ఏవేవో ప్రశ్నలు… అన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెప్పింది తను చేసే ఉద్యోగ వివరాలు అడిగితే చెప్పింది
.. వాళ్ళకు స్వీట్లు టీలు అందించి లోపలికి వచ్చిన వాసంతికి వాళ్ళు తల్లిదండ్రులను అడుగుతున్న ప్రశ్నలు వినబడుతున్నాయి… తల్లి దండ్రులిద్దర్నీ ముద్దాయిల్ని చేసి అడుగుతున్నారు. అక్క విషయం వంశ పారంపర్యంలో ఇంకెవరయినా ఇలాంటి వారున్నారా…క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు… పెళ్ళయిన తర్వాత మీ కుటుంబాన్నిచూసుకోవలసింది నేనే కదా..మీ ఆస్తులన్నీ నా పేరు మీద పెళ్ళప్పుడే రాసివ్వాలి.. ఈ విషయం ఇష్టమైతే కబురు చేయండి తర్వాత మాట్లాడుకుందాం అంటూ వాళ్ళు వెళ్ళి పోవడం అంతా వింటూ గమనిస్తూ, బట్టలు మార్చుకొని వంట గదిలోకి వచ్చింది వాసంతి…
తల్లి దండ్రులిద్దర్నీ చూస్తుంటే ఓప్రక్క బాధగా మరో ప్రక్క కోపంగా కూడా వుంది.. తనకూ ఓ మనసుందని, వచ్చిన పెళ్ళి కొడుకుల ముందు తప్పు చేసిన దానిలా తలొంచుకుని కూర్చోవడం ఎంత దుర్భరంగా వుంటుందో గుర్తించనందుకు కోపంగా వుంది..
ఇదే మంచి సమయం తన విషయం చెప్పడానికి… మనసులో ధైర్యాన్ని కూడ గట్టుకొని వాళ్ళున్న గదిలోకి వెళ్ళింది.
అప్పటికే వాళ్ళూ ఓ నిర్ణయానికి వచ్చి పెళ్ళి సంబంధం వారికి ఫోన్ చేయబోతూ కూతురు వంక ప్రశ్నార్థకంగా చూశారు…
నాన్నా! మీతో ఓ విషయం చెప్పాలి అంది నెమ్మదిగా….
మేమే నీకో విషయం చెప్పాలనుకుంటున్నాం.. అన్నది తల్లి..
”వాళ్ళు అడిగిన వాటన్నింటికీ ఒప్పుకోవాలనుకుంటున్నాం… ఇప్పటికే పెళ్ళి ఆలస్యమై పోయింది.. అదే విషయం వాళ్ళకు
ఫోన్ చేయాలనుకుంటున్నాం”… అంది.
ఇప్పుడే ఇంత కచ్చితంగా మాట్లాడిన వాళ్ళ మాటలు మీరెలా నమ్ముతున్నారమ్మా. అంది వాసంతి. తప్పదు బిడ్డా… ”ఇప్పటికే ఆలస్యమై పోయింది.. ఇంకా నయం అక్క విషయం ఏమనలేదు ఆస్తే అడిగారు.. ఇంతకు ముందు వాళ్ళు అక్కను చూసే మాకీ సంబంధం వద్దని ముఖం మీద చెప్పి వెళ్ళారు” అన్న తల్లి మాటలకు ఒళ్ళంతా చెమటలు పోశాయి వాసంతికి..

ఇక తన విషయం దాచి పెడితే బాగుండదనుకుంటూ… ”మీతో ఓ విషయం చెప్పాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను” నెమ్మదిగా..
తండ్రి ఒక్క సారిగా ‘ఏ విషయం’ కొంచెం ఆదుర్ధాగా అడుగుతుంటే…
నేనూ.. నేనూ… నన్నూ.. నన్నూ… అని నీళ్ళు నమిలింది వాసంతి..
చెప్పు బిడ్డా!కాలేజీలో ఏమైనా జరిగిందా.. మీ కొలీగ్స్ నిన్నేమన్నా అంటున్నారా… ఉద్యోగం మానేయాలనుకుంటున్నావా… ఈ పెళ్ళి కుదిరితే చాలు.. ఆ తర్వాతే వాళ్ళు ఉద్యోగం చేయమంటే చేద్దువు, లేదంటే మానేద్దువుగానీ… అంటున్న తల్లి మాటలకు తను చెప్పబోయే దానికి ఏమాత్రం పొంతన కుదరక తెల్ల మొహం వేసింది..
తల్లి ఎప్పుడూ అంతే.. ఎదుటి వాళ్ళ మనసును ఏమాత్రం గ్రహించదు.. అయోమయంగా మాట్లాడుతూనే తనకు అనుకూలంగా మార్చుకుంటుంది… ఆలోచనలో పడిన వాసంతిని చూస్తూ…
అంతే కదా బిడ్డా…అనగానే.. ఒక్కసారిగా తల విదిలించి నేను చెప్పబోయేది అది కాదు.. నెమ్మదిగా స్థిరంగా అంది.
ఏది కాదు… మరేమిటీ… అడిగిన తండ్రి వంక చూసి తలవంచుకొని
”వాళ్ళు ఒప్పుకున్నా… నాకీ పెళ్ళి ఇష్టం లేదు”
మా కాలేజీలో పని చేసే కొలీగ్ నన్ను ఇష్ట పడుతున్నాడు.. అతన్ని.. అతన్ని.. పెళ్ళి చేసుకో…. ఇంకా అనబోతుండగానే…
గట్టిగా అరుస్తూ… మేం పెళ్ళి చేయలేని అసమర్థులమనే కదా… నీవీ మాట అంటున్నది.. నేను ఒప్పుకోను.. నాకీ ఒక్క అవకాశం ఇవ్వు.. నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏం చేసినా నేనీ లోకంలో వుండను.. కోపంగా గదిలోకి వెళ్తున్న తండ్రి వంక అలాగే చూస్తుండి పోయింది…
నీ కోసం ఎన్ని పూజలు వ్రతాలు చేస్తున్నాను, జాతకాలు చూపిస్తున్నాను దోషాలు తొలగడానికి గ్రహ శాంతులు చేస్తున్నా… ఇంతా చూస్తూనే.. నీవిలా మాట్లాడుతావనుకోలేదు… తను చెప్పబోయే మాటలేవీ వినిపించుకోకుండానే అక్కడి నుండి వెళ్ళిన తల్లిని ఎలా ఆపి చెప్పాలో అర్థం కాలేదు.
……. ఆరోజంతా ఇంట్లో మౌనం రాజ్య మేలింది.
మరుసటి రోజు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి పోయారు.
తల్లి వెళ్ళిన తర్వాత… వాసంతి తయారై అలాగే
కూచుంది… ఇంకా వెళ్ళని కూతుర్ని మౌనంగా ఓ చూపు చూసి పెద్దబిడ్డ అవసరాలు చూడటానికి వెళ్ళాడు.
నెమ్మదిగా లేచి బాక్స్ సర్థుకొని కాలేజీకి బయలు దేరింది…
వెళ్ళగానే ప్రశ్నల పరంపర మన విషయం చెప్పావా.. ఏమన్నారు” అని
జరిగినదంతా చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్న వాసంతిని ‘ దీనికొకటే మార్గం…. నేను చెప్పినట్టు చేయడమే’అని కన్నీళ్ళను తుడిచి భుజం తట్టాడు..
ఈ ఆత్మీయమైన తోడు కోసమే తనింతగా తపిస్తున్నది.. మనసులోని భావోద్వేగాలను పంచుకునే మనిషి తనకు కావాలి.. అలాంటి వాతావరణం లేని ఇంట్లో తనకిప్పుడు ప్రతి క్షణం నరకం లాగే వుంది… ఓ నిశ్చయానికి వచ్చింది… అతడు చెప్పిన మాటకు మనస్ఫూర్తిగా అంగీకరించింది…
వాసంతికిప్పుడు గుండె నిండా ఓ ధైర్యం తనకంటూ ఓ తోడు దొరికిందని నిశ్చింత..
ఇద్దరూ వెళ్ళి మిగిలిన కొలీగ్స్ సహకారంతో ఆర్య సమాజంలో పెళ్ళి చేసుకున్నారు ఓ శుభ ముహూర్తాన.. ఈ విషయాలేవీ తల్లిదండ్రులకు చెప్పవద్దు.. నెమ్మదిగా చెబుదాం. రోజూ లాగే. డ్యూటీకి వచ్చేయమంటే సంతోషంగా తల ఊపింది.
ఇదివరకటి నిరాశా నిస్పృహలు లేవు వాసంతిలో.తల్లీతండ్రి మాటలను వినడమే గానీ తను మాట్లాడటం మానేసింది.
వీళ్ళు ఇంతగా అన్నింటికి ఒప్పుకున్న సంబంధం.. అక్కను తమ పెళ్ళికి ముందే ఏదైనా మెంటల్లీ రిటార్టెడ్ వారి ఆశ్రమంలో చేర్చమని.. ఆమె వల్ల తమ బంధువులలో తమ పరువు పోతుందని దీనికి ఒప్పుకుంటేనే… తాము పెళ్ళికి ఒప్పుకుంటామని వాళ్ళు కబురు చేయడంతో దెబ్బతిన్న పక్షుల్లా విలవిల్లాడుతూ.. ఆడపిల్లను అలా చేర్చడానికి ఇష్టం లేదని చెప్పడంతో ఆ సంబంధం కాస్తా… చిట్లిపోయింది….

ఆ రోజు వాసంతి గుడికి వెళ్తున్నానంటూ దీవించమంటూ
ఇద్దరి కాళ్ళకు దండం పెట్టింది. అక్కను దగ్గరికి తీసుకొని తనే అన్నం తినిపిస్తానని చెప్పి తినిపించింది… అటునుండి కాలేజీకి వెళ్తానని చెప్పి వెళ్ళింది…
కాలేజీకి వెళ్ళగానే అతడు కలిసి
వాసంతిని ప్రశంసగా చూస్తూ ‘డియర్ అన్నింటికీ సిద్ధపడి వచ్చేశావుగా’అన్నాడు. బుద్ధిగా తల ఊపింది వాసంతి.
ఇద్దరూ సెలవు పెట్టి గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని మధ్యాహ్నం హోటల్లో లంచ్ చేసి సాయంత్రం అలా టాంక్ బండ్ దాకా వెళ్ళి కొద్ది సేపు కూర్చుని చేయబోయే దాని గురించి మాట్లాడుకున్నారు…
ఆలస్యంగా వచ్చిన వాసంతిని చూసి కాలేజీలో ఏమైనా మీటింగా? ఇంత ఆలస్యమయిందని ట్యూషన్ పిల్లల లోకంలోకి వెళ్ళిన తల్లి. కళ్ళతోనే కారణమడిగి మౌనంగా తనపని చేసుకుంటున్న తండ్రిని చూసిన తర్వాత తన ”నిర్ణయం” నూటికి నూరు పాళ్ళు సరైనదే అనిపించింది వాసంతికి…
మరుసటి రోజు కాలేజీకి వెళ్ళిన వాసంతి ఇంటికి రాలేదిక కట్టుకున్న భర్తతో అత్తారింట్లో అడుగు పెట్టింది…
కురూపి అయిన కొడుకుకు కుందనం బొమ్మలాంటి అమ్మాయి దొరకడం సంతోషంగా వుంది అత్తమామలకు. ఇక పెళ్ళే కాదు అనుకున్న వాళ్ళిద్దరూ… అతని తల్లి దండ్రుల సమక్షంలో శాస్త్రోక్తంగా దంపతులయ్యారు…
తను ఏం చెప్పాలనుకున్నదో, తన మనసులో అంత కాలం గూడు కట్టుకున్న భావాలన్నింటినీ
రాసి పెట్టి వచ్చిన ఉత్తరం చూసి మనసు మారిన తల్లి దండ్రుల ఆహ్వానంతో… సగౌరవంగా తలెత్తుకుని భర్తను తీసుకొని
పుట్టింట్లో అడుగు పెట్టింది వాసంతి..

-వి. సునంద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!