Monday, August 8, 2022
Home > సీరియల్ > ట్రావెలాగ్ > || నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర(8 వ భాగం) || – సబ్బని లక్ష్మీ నారాయణ

|| నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర(8 వ భాగం) || – సబ్బని లక్ష్మీ నారాయణ

నయాగరా ప్రయాణం :

అమెరికా వెళ్ళిన వారు ముఖ్యంగా, తప్పకుండా దర్శించేది నయాగరా జలపాతం. నయాగరా అందాలను గూర్చి గొప్పగా చెపుతారు నయాగరా జలపాతాన్ని దర్శించినవారు. నయాగరా అందాలను వర్ణించడం అంటే అది ఉహల్లోని విషయమే చాలా మందికి. అమెరికా వెళ్ళిన ఎందరు కవులు ఎన్ని వినూత్నమైన కవితలను రాసి ఉంటారో నయాగరా అందాలను దర్శించి! అలా నేను కూడా మినహాయింపు కాదేమో! మా నయాగరా యాత్రకు టికెట్స్ జూన్ 21 నాటికి బుక్ చేశాడు శరత్ ఆస్టిన్ నుండి. నయాగరా వెళ్ళడానికి డైరెక్ట్ గా విమానాలు లేవు ఆస్టిన్ నుండి. ఆస్టిన్ నుండి ముందుగా నార్త్ కరోలినా రాష్ట్రం లోని చార్లెట్ విమానాశ్రయం చేరుకొని, అక్కడి నుండి మరో విమానంలో నయాగరా జలపాతంకు దగ్గరగా ఉన్న విమానాశ్రయం బఫెల్లోకి చేరుకోవలసి ఉంటుంది. ఆస్టిన్ నుండి సాయంత్రం 6 గంటల తరువాత విమానంలో బయలుదేరి రాత్రి తొమ్మిది గంటల వరకు చార్లెట్ విమానాశ్రయం చేరుకున్నాం నేను, శరత్, శారద. ఓ గంట తరువాత మరో విమానం లో బఫెల్లోకి వెళ్ళవలసి ఉండే, కాని ఆ విమానం మూడు గంటలు లేటు అని తెలిసింది. బస్సులు, రైళ్ళ వలె విమానాలు కూడా లేటుగా వస్తాయా అని అనిపించింది! ఆకలేస్తుంది కాబట్టి అక్కడ ఉన్న విమాశ్రయం లోని రెస్టారెంట్ దాంట్లో కొద్దిగా అందుబాటులో ఉన్న ఫుడ్ ను తీసుకున్నాం. విమానాశ్రయంలో అన్నీ ఎక్కువ రేటే, మేం వెళ్ళవలసిన విమానం అర్ధ రాత్రి 12 గంటల వరకు వచ్చింది. ఓ గంట ప్రయాణం తరువాత మేం బఫెల్లో విమానాశ్రయం చేరుకున్నాం. సమయం రాత్రి ఒంటి గంట దాటింది. అక్కడ విమానాశ్రయంలోనే రెంటల్ కారు తీసుకొని నయాగరా జలపాతం దగ్గరలోని హోటల్ కు చేరుకున్నాం, మాకు అర్ధ రాత్రి జీపిఎస్ త్రోవ చూపింది హోటలకు తికమకపడకుండా. అలా వెళ్తూ వెళ్తుంటే కెనడాకు కూడా వెళ్ళచ్చు దారి తప్పితే అన్నాడు శరత్. త్రోవలో మాకు ఒక టోల్ గేట్ దగ్గర ఒక్క డాలరు డబ్బులు తీసుకున్నారు. అప్పుడు రాత్రి రెండు గంటలు అయ్యింది. మేం ఉండబోయే హోటల్ ను అడ్వాన్స్ గానే బుక్ చేసిండు శరత్. నయాగరాకు రావడం ఇది రెండవ సారి అన్నాడు శరత్. ఆ రాత్రి హోటల్లో నిద్రపోయి, పొద్దున ఏడు గంటల వరకు నిద్ర లేచి, కాల కృత్యాలు తీర్చుకొని, స్నానాదులు ముగించుకొని, తయారు అయి రూమ్ ఖాళి చేసి నయాగరా జలపాతాన్ని చూడడానికి వెళ్లాం. అప్పుడు సమయం ఉదయం తొమ్మిది దాటింది. అది జూన్ మాసం వేసవి కాబట్టి వాతావరణం కొంత బాగానే ఉంది, అయినా చినుకులు పడే అవకాశం కూడా ఉండచ్చు అనిపించింది. మేం అక్కడికి వెళ్ళింది, గురువారం కాబట్టి కార్ పార్కింగ్ ప్లేస్ ఈజీగానే దొరికింది, ఆదివారం అయితే కార్ పార్కింగ్ దూరంగా దొరుకుతుందట. మాలాగా నయాగరాను చూడడానికి వచ్చినవాళ్ళు ఎందరో కనిపించారు, అందులో ఇండియాన్స్, ఇంకా తెలుగువాళ్ళు కూడా కనిపించి మాట్లాడారు. అక్కడ రోడ్డు పక్కన ఒక పంజాబీ అతను మోటారు బండిపై హోటల్ నడుపుతున్నాడు, ఇడ్లీ, దోశ, వడ, పూరి అమ్ముతున్నాడు. పది డాలర్లకు ఒక టిఫిన్ . ఇడ్లీ, దోశ, వడ, పూరి తాజాగా ఉన్నా, చట్నీ, సంబారు బాగా లేదు, నిన్న మొన్నటిది లా ఉంది పులిసిపోయి. ఏదో కొంత టిఫిన్ చేసి నయాగరా అందాలను చూడడానికి ముందుకు వెళ్లాం. నయాగరా నది పక్కన మంచి ఉద్యానవనం ఉంది, అమెరికా దిక్కునుంచి ప్రవహిస్తున్న నయాగరా నది గలగల శబ్దాలు చేస్తూ ఉరుకుల పరుగులతో పాలబుగ్గల్లాంటి నురుగులు కక్కుతూ ప్రవహిస్తుంది జలకన్యలా. నయాగరా నదీ ప్రవాహమే ఒక సంగీత ఝరిలా ఉంది. దూరంగా నయాగరా ఆవలి ఒడ్డున అంతస్తుల భవనాలతో ఎదురుపలుకుతుంది కెనడా దేశం. ఏ దేశం, ఏ ప్రాంతం ఎక్కడ ఉన్నాం అని అనిపించింది! అమెరికా దేశపు న్యూయార్క్ రాష్ట్రం , కేనాడా దేశపు ఒంటారియా ప్రాంతపు సరిహద్దుల్లో ఉంది నయాగరా జలపాతం. నయగారా నదిపై ఓ పావు కిలోమీటర్ బ్రిడ్జి ఉంది రెండు దేశాల మధ్య. నయాగరా జలపాతం అమెరికా వైపునుండి కొంత, కెనడా వైపునుండి కొంత దుముకుతూ ప్రవహిస్తుంది వడివడిగా. అలా 50 మీటర్ల ఎత్తునుంచి దుముకుతున్న నయాగరా అందాలను దూరం నుంచి దర్శించడం ఒక మధురమైన అనుభూతి. షిప్ లొ దుముకుతున్న జలపాతం దరిదాపుల్లోకి వెళ్లి జలపాతం తుంపర్లలొ తడుస్తూ నయాగరా అందాలను ఆస్వాదిస్తూ అనుభూతి చెందడం ఒక ఎత్తు! కొందరు హెలికాప్టర్ పైనుంచి కూడా నయాగరా అందాలను చూస్తున్నారు. అది ఒక అనుభూతి కొందరికి. షిప్ లొ వెళ్లేందుకు మూడు టికెట్లు తీసుకున్నాడు శరత్, మనిషికి ముప్పయి డాలర్లు అయి ఉండచ్చు. షిప్ లొ వెళ్ళినపుడు తుంపర్లలో తడువకుండా ఉండడానికి మనిషికి ఒక వరక్ జాకెట్ ఇచ్చారు. వందలాది మంది జలపాతం పడే దాకా షిప్ పై వెళ్తున్నారు, వస్తున్నారు. అమెరికా వైపు ఉన్న షిప్ లు నీలం రంగులొ ఉన్నాయి, కెనడా వైపు ఉన్న షిప్ లు పింక్ రంగులో ఉన్నాయి. నయాగరా జలపాతంను షిప్ పై వెళ్లి ఆ జలపాతం తుంపర ల్లో తడుస్తూ దర్శించడం ఒక మదురమైన అనుభూతి! ఆ పాల నురగల్లాంటి మంచుబిందువుల్లా కురిసే నీటి తుంపరల్లోని మధురమైన ప్రయాణపు అనుభూతి పేరు ‘మేడ్ ఆఫ్ ద మిస్ట్”. ఓ అరగంట ఆ ప్రయాణం షిప్ లొ వెళ్లి రావడం, నయాగరా జలపాతాన్ని దర్శించడం మంచి అనుభూతి. ప్రవహిస్తున్న నది పక్కన, దుముకుతున్న జలపాతం వెనుకవైపు కొండలా, గుహలా 130 ఫీట్ల ఎత్తున ఉన్న ప్రదేశాన్ని దర్శించడం ఈ నయాగరా సందర్శనలో ఇంకొక భాగం. దానిని ‘కేవ్ ఆఫ్ ద విండ్స్’ అంటారు. అంత ఎత్తుకు ఎక్కలేమని మేం రామన్నాం. నయాగరా అందాలను కవిత్వంలో చెప్పాల్నంటే ఒకటి రెండు వాక్యాల్లో చెప్పచ్చు ఇలా.

నయాగరా ! మనసు దోచే నదికన్య ! ఎగిసి దుమికే జలకన్య !
రంగులలో నవ హరివిల్లు ! పరుగులల్లో జల ప్రవాహిని !
మేడ్ ఆఫ్ ద మిస్ట్ ! కేవ్ ఆఫ్ ద విండ్స్ ! పరవసించును హృదయం ! చూసినా కొద్దీ! అనిపిస్తుంది.

ఇంకా నయాగరా అందాలను రాత్రిపూట వెలుగుల్లో కూడా దర్శించ వచ్చట! ఆ మధురమైన అనుభూతిని అందుకోవాలంటే సాయంత్రం వచ్చి అ రాత్రి అక్కడే ఉండి బస చేస్తే వీలు అవుతుందీ, మాకు ఆ అవకాశం చిక్కలేదు.

అలా మా నయాగరా యాత్ర కొనసాగింది.
ఈ సారి యాత్రలో మేం నయాగరా, న్యూయార్క్, న్యూజెర్సీ ,వాషింగ్టన్ డి.సి., ఒసియన్ సిటీ, మొదలగు అమెరికా దేశపు తూర్పు తీరం దిక్కు ఉన్న ప్రదేశాలను చూడాలనుకున్నాం. ఈ తూర్పు తీర ప్రాంతం వైపు ఉన్న రాష్ట్రాలు సుసంపన్నమైన ప్రాంతాలు, చక్కటి నీటివసతి, పచ్చ్చదనం, అడవులు, పంట పొలాలతో సమృద్ధిగా ఉండే ప్రాంతాలు. నయాగరాను దర్శించి మధ్యాహ్నం న్యూజేర్సీకి కారులో ప్రయాణమయ్యాం. మధ్యలో చిన్నగా హోటల్లో పిజ్జా తిని, దారిలో ఉన్న పెన్సిల్వేనియా రాష్ట్రం దాటుతూ, ఫిలడెల్ఫియా దరిదాపుల్లోంచి ఆరేడు గంటలు ప్రయాణం చేసి రాత్రి తొమ్మిది గంటల ప్రాంతాన న్యూ జెర్సీ రాష్ట్రం లొ ఉన్న ఎడిసన్ లొ శరత్ వాళ్ళ ఫ్రెండ్ గోరంట్ల సుమన్ వాళ్ళ ఇంటికీ చేరుకున్నాం. ఆ రాత్రే బఫెల్లోలో తీసుకున్న రెంటల్ కారును న్యూ జెర్సీలోని రెంటల్ కారు వాళ్లకు అప్పజెప్పి వచ్చారు సుమన్, శరత్ కలిసి. ఆ రాత్రి సుమన్ , సుమన్ వాళ్ళ శ్రీమతి దివ్య తయారు చేసిన పప్పు చారు భోజనం చేసి పడుకున్నాం వాళ్ళ ఇంట్లో. సుమన్ వాళ్ళది కొత్త పెళ్లి జంట, ఒంగోలు దగ్గర, మేం వచ్చినామని చక్కటి ఆతిథ్యం ఇచ్చారు అభిమానంగా. న్యూ జెర్సీ రాష్ట్రంలో ఎక్కువగా మన తెలుగు వాళ్ళు ఉంటారు అన్నారు. గతంలో శరత్ న్యూ యార్క్ లొ ఉద్యోగం చేసినపుడు న్యూ జెర్సీ లోనే మిత్రులతో కలిసి ఉండేవాడు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!