Sunday, October 2, 2022
Home > సీరియల్ > || నా లో నేను || -అంకయ్య భండారి

|| నా లో నేను || -అంకయ్య భండారి

|| నా లో నేను ||
(ఓ విశ్రాంత ఉద్యోగి జీవన మథనం)

నేను ఓ విశ్రాంత ఉద్యోగి ని మాత్రమే అయితే , మీ ముందుకు వచ్చేవాడిని కాదు !

ఉద్యోగ కాలంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన !!

“అధికారాన్ని ప్రజల పరం చేసినవాడే మంచి ప్రభుత్వ అధికారి . నీ కర్తవ్య నిర్వహణలో దీన్ని పాటిస్తావన్న” కాళోజి గారి హితవును శిరసావహించినవాన్ని!!

“అదృష్టం కొద్దీ వచ్చిన అవకాశాన్ని పదిమంది అసహాయుల శ్రేయస్సుకోసం మాత్రమే ఉపయోగించుకోవాలన్న” జయశంకర్ సార్ ఆదేశాన్ని అక్షరాలా పాటించిన వాన్ని!!

ఇంకా ఎందరో సమాజ హితుల సావాసంతో జీవితకాలం గడిపినవాన్ని!!
అందుకే , వందలు కాదు , వేలమందితో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది . ఇందుకు నాకు సాహిత్య , సాంస్కృతిక రంగం ఎంతగానో దోహదపడింది.

ఈ నేపథ్యం లో , నా జ్ఞాపకాలకు అక్షర రూపం ఇచ్చే ప్రయత్నమే -” నాలో నేను!”

తొలుత దాపరికం లేకుండా ఈ ధారావాహిక రాయడానికి కారణమైన ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తావిస్తాను:
ఒకరు- బహుభాషావేత్త , కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. నలిమెల భాస్కర్ గారు.
ఆయనెప్పుడూ కల్సినా , ఏ సాహిత్య సభలో మాట్లాడినా – ” అంకయ్య గారూ ! మీ అనుభవాలకు అక్షర రూపం యివ్వాలే ! అది మీ జీవిత కథ మాత్రమే కాదు. గత డెబ్భై ఏండ్ల తెలంగాణ కథ అవుతుంది ! మాకే కాదు ముందు తరాలకు ఓ చరిత్ర అందించినట్లు అవుతుంది” అని పదే పదే పోరుపెట్టి నాకు ప్రేరణ కల్గించినారు! వారికి నా ధన్యవాదములు.

ఇక రెండో వ్యక్తి – తెలుగు భాషాభిమానులకు ఉత్తమ కథకుడిగా పరిచయం అయి ప్రస్తుతం ఫోటోగార్డెన్ సంకలన కర్తగా, మిద్దె తోట రైతు బిడ్డగా, లబ్ది ప్రతిష్టులైన తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారు. మాయింటికి వచ్చినపుడు నా సాహిత్య కృషిని తెలుసుకున్న వెంటనే “మీరు ఈ విలువైన సమయాన్ని వృధా చేయద్దు ! అరవై ఇండ్లు దాటిన వాళ్ళు రాసిన రచనలే పరిపూర్ణమైనవిగా గా నేను భావిస్తాను. ఎందుకంటే ఇందులో అనుభవ సంఘటనలుంటాయి. ఇవి సమాజానికి ఉపయోగపడేవిగా ఉంటాయి. మీరు రాస్తే పాఠకులకు చేరవేసే బాధ్యత నాది” అని భరోసా ఇచ్చిన సౌజన్య శీలి అయన ! వీరికి నా కృతఙ్ఞతలు!

నేను తప్పక రాయాలి.
రాయగలనన్న ఆత్మవిశ్వాసం ఉన్నది.!
ఇదివరకు ఓ 20 కథలు 3 పుస్తకాలూ రాసిన అనుభవం ఉంది.
ఇపుడు గతాన్ని నెమరువేసుకుని అక్షర బద్దం చెయ్యాలి. అంతే..!

నా ఊరు, నా వాళ్ళు, నా వ్యక్తిగత జీవన చిత్రణకు నేను పరిమితం కాబోను ! నా ఎరుక లోని తెలంగాణ జన జీవనాన్ని, నాకెదురైనా విభిన్న రాష్ట్రాల విలక్షణ వ్యక్తుల వ్యాపకాన్ని , ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల వ్యవహార శైలిని, నేను కలిసి పని చేసిన సహచర ఉద్యోగుల తీరు తెన్నులను నిర్భయంగా, నిజాయితీగా రాస్తానని ప్రమాణం చేస్తున్నాను.

నా జీవితాన్ని మలుపు తిప్పిన తొలి సంఘటన నాకు గుర్తుకొస్తుంటది:
“కులకష్పి లో దించకుండా కొడుకులను చదువుకోవడానికి కరీంనగరం పంపుతున్నారు. ఊళ్ళు ఏలుతారో, ఉద్యోగాలు చేసి ఉద్ధరిస్తారో చూడక పోతామా”. అని హేళన చేసిన కుల పెద్దల నోరు మూయించి, మా తల్లిదండ్రుల వెన్ను తట్టింది సంపత్ చంద్రయ్య పటేల్, మహమ్మద్ అలీ సార్.! వీరిద్దరి ప్రోత్సాహం ఎప్పటికి మరువలేనిది.

మా అన్న చంద్రయ్య వేలు పట్టుకుని, నా ఎనిమదోయేట కరీంనగరం బాట పట్టిన !

ఆ రోజుల్లో – అంటే 1940 దశకం లో తెలంగాణ పల్లెల్లో అక్షరాస్యులు చాల తక్కువ! పిల్లలు కొంచెం చేతికి అందగానే కులవృత్తుల్లో పెట్టేవారు .అందరు చమటోడ్చితే గాని కడుపు నిండని పేదరికం గుర్తొస్తే గుండె చెరువు అవుతుంది. నాకు తెలిసి గ్రామీణ ప్రాంతం నుండి అపుడు కరీంనగరం చదువుకోవడానికి వచ్చిన వాళ్ళల్లో కేవలం పటేండ్లు కోమటోళ్ళు బాపనోళ్ళు ఒకరిద్దరు కాపు ధనపొల్లు , బి. సి. లు ఉండే వాళ్ళు. కేవలం 3% అక్షరాస్యత అంటే ఆశ్చర్యం కలుగుతుంది ఆడపిల్లలు ఊరు దాటి బయటకు చదువుకోసం వచ్చిన వాళ్ళు కేవలం దొరల పిల్లలు మాత్రమే!

కోహెడ మండలం తంగళ్ల పల్లిలో 1939 లో పుట్టిన నేను విద్యాబ్యాసం పూర్తిచేసుకుని ఉద్యోగం సంపాదించుకొని అంచెలంచెలుగా డిప్యూటీ కలెక్టర్ గా ఎదిగిన. మా యింట్లో ఆడపిల్ల లతో సహా అందరం విద్యావంతులమే! అందుకే చుట్టూ పక్కల పదూల్ల పెట్టు మా తల్లితండ్రులు మల్లవ్వ కిష్టయ్య గౌడ్ గురించి గొప్పగా చెప్పుకునే వాళ్లంటే అతిశయమేమికాదు.

నేను 1997 ఏప్రిల్ లో పదవీ విరమణ చెయ్యగానే అప్పటి కలెక్టర్ శ్రీమతి శాలిని మిశ్రా ఆదేశాల మేరకు రెండేన్లు వరంగల్ జిల్లా బాలకార్మిక సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ గా పనిచేసిన. ఆ కాలంలోనే డా. జయప్రకాశ్ నారాయణ్ గారు లోక్ సత్తా ఉద్యమ సంస్థ ను ప్రారంభించినారు. అయన పిలుపునందుకుని క్రియాశీల కార్య కర్తగా దాదాపు పదేండ్లు సంతృప్తికర కార్యక్రమాల్లో భాగస్వామి నైన.

ప్రస్తుతం కరీంనగరం లో పూర్తిగా విశ్రాంత జీవితం గడుపుతున్న. సాహిత్యం తో బాటు టి. వి. మాత్రమే నాకు కాలక్షేపం.
నా జీవన కథనం “నాలో- నేను” తో ప్రతి వారం మీ ముందుకు వస్త.

ఆదరించాలని వినమ్రంగా కోరుతున్న..

మీ
అంకయ్య భండారి,
9032742937

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!