Wednesday, January 26, 2022
Home > సీరియల్ > ||ఎడారి పువ్వు || -ప్రీతీ నోవెలిన్ నోముల (పార్ట్ 1)

||ఎడారి పువ్వు || -ప్రీతీ నోవెలిన్ నోముల (పార్ట్ 1)

||ఎడారి పువ్వు || (పార్ట్ 1)

ఎవరివి నువ్వు, నాకెందుకు నచ్చావు?

ఆ రోజు ఆ ఒక్క క్షణం నాకు చూపు లేకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది…ఇప్పుడు ఇంత మానసిక క్షోభ ఉండేది కాదు కదా నాకు…ఇంత వేదన నన్ను అలుముకునేది కాదుగా….అసలెందుకు నా జీవితంలో భాగమయ్యావు…నన్నెందుకు నీలో పిచ్చిదానిలా చేసావు?

అసలు ప్రేమ అనేది ఒకటి నా లైఫ్ లో ఉంటుంది అని ఏ రోజు ఊహించలేదు…నిన్ను చూసేదాకా అది నాలో ఊపిరిపోసుకున్న సంగతి గమనించనేలేదు.. ఏముందని నీలో, నన్నింతగా చుట్టిపడేసిన బంధం ఏంటి నీతో..నన్ను నాకు దూరం చేసి ఏంటి ఈ దాగుడుమూతలు?

అయ్యో కన్నీళ్లు ఆగడం లేదే! ఎంత ఓపిక వీటికి మూడు రోజులుగా ఒక్క క్షణం ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి… మబ్బులు పట్టిన ఆకాశంలా చీకటిగా ఉంది నా మనసంతా… ఎక్కడిదాకా వెళుతుంది నన్ను ముంచేస్తున్న ఈ శూన్యం..!

నిన్ను చూడకుండా ఉండలేని నేను మూడు రోజులుగా నీకు దూరంగా నిన్ను చూడకుండా ఈ చీకట్లో……ఎలా??? ఏమౌతుంది నా చుట్టూ…బతుకు పైన ఆశ కొద్దికొద్దిగా దూరమౌతుంది.

కాని ఈ వేదన నీకు తెలియాలి.. నా కన్నీళ్లు నిన్ను తాకాలి. నాది అరణ్య రోదన కాకూడదు… ఇన్నాళ్లు నీ చుట్టూ అల్లుకున్న పరిమళాన్ని నేనె అని నీకు తెలిసి తీరాలి.

కాని అది నువ్ తెలుసుకునే సమయానికి కాలం ఏ నిర్ణయాన్ని నా ముందు ఉంచుతుందో…ఆ నిర్ణయం ముందు నేనెంత వరకు నిలబడగలనో…కాని ఒక్కటి గుర్తుపెట్టుకో ఈ ఊపిరి నీకోసమే అని..

డైరీ రాయడం ఆపి టేబుల్ సొరుగులో పెట్టేసాను… మనసంతా అలసటగా ఉంది… ఎటు వైపు వెళుతున్నాయి నా ఆలోచనలు..అసలేమి నిర్ణయించుకోలేని సందిగ్ధత.. నా వేదనకి అంతం ఎక్కడుంది..?

తల నొప్పిగా ఉంది.అలాగే వచ్చి బెడ్ పైన పడుకున్నాను…నా ఆలోచనలు కాలాన్ని దాటుకుంటూ గతంలోకి పరుగులు పెడుతున్నాయి.

తన పరిచయం విచిత్రంగా జరిగింది… సంధ్య నా స్నేహితురాలు… ఒక రోజు పార్టీకి వెళ్లాలంటూ నన్ను తోడుగా రమ్మని అడిగింది… మామూలుగానే పార్టీలకి దూరంగా ఉంటాను నేను.. కానీ అడిగింది సంధ్య..తనకి ఎప్పుడు నో చెప్పలేను..తన స్నేహం నా బలం బలహీనత రెండూ…నా బాధలో ఓదార్పు తను,నా సంతోషంలో భాగం తను…అలాంటి తనకి నో అని చెప్పలేక అయిష్టంగానే తన వెంట బయలుదేరాను…

మెరూన్ కలర్ బెనారస్ డ్రెస్ లో హెవీ వర్క్డ్ చున్నీ ని కుడివైపు వేసి, అదే కలర్ స్టోన్స్ ఉన్న బ్యాంగిల్, మాచింగ్ ఇయర్ రింగ్స్ తో ఏ మాత్రం కూడా హేవిగా లేని అలంకరణలో కిందకి దిగిన నన్ను చూసి..

“పార్టీలో అందర్నీ నీ చుట్టూ తిప్పుకోవాలి అనుకుంటున్నావా” అంది సంధ్య.

చిన్నగా నవ్వి ఊరుకున్నాను.. నిజానికి ముట్టుకుంటే మాసిపోయే రంగు,గులాబీ రంగు పెదాలు,ఎంతసేపు చూసినా చూడాలనిపించే అందమైన కళ్ళు, అంటూ నవలలో కథలలో వర్ణించే అందాలు నాలో లేవు… చూడ్డానికి చాలా మామూలుగా ఉండే అమ్మాయిని నేను… కాని చూడగానే బాగుంది అనిపించేలా మాత్రం ఉంటాను. కానీ మా సంధ్య కళ్ళకి నేనెప్పుడూ గొప్పగా కనిపిస్తూ ఉంటాను.

అమ్మ వెళ్లొస్తాం అని చెప్పి ఇద్దరం బయలుదేరాం… కార్ లో వెళ్తున్నంతసేపు సంధ్య మాట్లాడుతూనే ఉంది… దానికి మాట్లాడ్డం అంటే చాలా ఇష్టం…నాకేమో మాటలే దొరకవు..అయినా ఎలా కలిసిందో మా స్నేహం ఇంత దగ్గరగా బలపడింది.

తను మాట్లాడుతూ ఉండగానే ఫంక్షన్ హాల్ వచ్చేసింది… నేను కార్ దిగాను… నన్ను లోపలికి నడవమని చెప్పి తను కార్ పార్క్ చేయడానికి వెళ్ళింది…నేను లోపలికి వెళ్తూ ఆ పక్కనే ఉన్న బ్యానర్ లో చూసాను చిన్ని పాపని..ఈ రోజు ఆ పాప మొదటి పుట్టినరోజు..కనీసం ఏ ఫంక్షన్ కి వస్తున్నానో కూడా తెలుసుకోలేదని నాలో నేనే నవ్వుకున్నాను..
ఇంతలో వెనుక నుండి సంధ్య నా భుజంపైన చేస్తూ నన్ను పిలిచింది….తనవైపు తిరిగాను నేను…ఏంటే అంతలా లీనమయ్యావేంటి ఆ ఫోటోలో అంది…అప్పుడు చూపించాను ఆ పాపని..అసలెంత ముద్దుగా ఉందొ ఆ పాప… మా అమ్మ ఎప్పుడూ వాడే పదం చిదిమి దీపం పెట్టుకోవచ్చు అని…ఇప్పుడు ఈ పాపని చూస్తుంటే నాకు అలాగే అనిపించింది.

నెమ్మదిగా ఇద్దరం లోపలి వెళ్లాం. అక్కడ సంధ్య ఫ్రెండ్స్ కొంతమంది కలిశారు. వాళ్ళతో నాకు ఇంతకు ముందు పరిచయంలేదు. సంధ్య నన్ను వాళ్లకి పరిచయం చేసింది.

అన్నట్టు మీకు నా పేరు చెప్పలేదు కదా…’గమనిక’…అవును ‘గమనిక’ ఇదే నా పేరు. వినడానికి వింతగా ఉన్నా నాకు నచ్చేపేరు ఇది.. మా నాన్న ఇష్టంగా పెట్టిన పేరు..!

(ఇంకా ఉంది)
-ప్రీతీ నోవెలిన్ నోముల

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!