Tuesday, July 14, 2020
Home > సీరియల్ > ||నాలో నేను|| -భండారి అంకయ్య(పార్ట్ -1)

||నాలో నేను|| -భండారి అంకయ్య(పార్ట్ -1)

||నాలో నేను-1||

నేను మా అన్న 1947 లో వస్తానియాలో చదువుతున్నం.
నేను నాలుగు, అన్న ఐదో తరగతి.
వస్తానియా అంటే మిడిల్ స్కూల్.
ఐ బి గెస్ట్ హౌస్ ఎదురుగ సందులో ఉండేది.
అప్పుడు కరీంనగరం గంజ్ లో తహతానియా ( ప్రాథమిక పాఠశాల)
ఫోఖానియా ( ఉన్నత పాఠశాల)
ఇప్పుడు నడుస్తున్న పాఠశాలనే !
బాలికలకు విడిగా ప్రాథమిక పాఠశాల.
అప్పుడంతా ఉర్దూ మీడియం లో మొదలు చదివి
తరువాత అదే తరగతి తెలుగు మీడియం .
విచిత్రం! ఒకే తరగతి రెండు భాషల్లో !!
ఇవి నాలుగో తరగతి వరకు మాత్రమే

***

మాకు కరీంనగరం కొత్త.
బడి వాతావరణం ఇంకా కొత్త !!
తంగళ్లపల్లి లో అందరూ తెలిసిన వాళ్ళే .
ఇక్కడంతా కొత్త వాళ్ళే!
నైజాం కాలం కాబట్టి, ముసల్మానుల మాతృ భాష
ఉర్దూ కు ప్రాధాన్యం ఉన్నట్లే,
ముస్లిం పిల్లలు కాలర్ ఎగిరేసే వాళ్ళు!
ఆ రోజుల్లో గురువులు మాకు ఆరాధ్య దైవాలు!
ఏ సమస్య వచ్చినా చిటికెలో పరిష్కారం దొరికేది.
క్లాసులు రోజూ నడుస్తున్నాయి.
ఒక నెల గడిచింది.
కొంత ఇరుకు తనం పోయింది .
నాకు ముగ్గురు దోస్తులైనరు.
అందులో ఒకడు ముస్లిం!

***

ఆరోజు 15 ఆగష్టు, శుక్రవారం.
బడికి తాతీలు అంటే సెలవు !
పొద్దున్నే లేచి అన్న అంగడికి పోయిండు .
కూరగాయలు తెచ్చుకోవటం, బట్టలుతుక్కోవటం ,
ఇల్లంతా సాఫ్ చేసుకోవటం సెలవు రోజు పని !!
నేను స్నానం చేసి అన్నకోసం ఎదిరి చూస్తున్న .
ఓ గంటకు కూరగాయలు తీసుకోని ,
అన్న సంబరంగా వచ్చిండు. ఆగుతలేడు .
అందర్నీ పిలిచి చెప్పుడు మొదలు పెట్టిండు.
“బజార్ల షావుకార్లు అనుకుంటున్నారు
ఇవాళ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందట.
అదేమిటో పూర్తిగా తెలియక పోయినా,
అందరి మొఖాలు వెలుగుతున్నై .
ఇవ్వాళ గొప్ప మహత్తు జరిగింది.
కొంతకాలానికి గానీ నాకు అర్తం కాలేదు
ఆరోజు నేను జీవితంలో మరచిపోను.!
ఈ దేశమే మరిచిపోని చారిత్రాత్మక మైన రోజు !!
బంగారు అక్షరాలతో రాసిన రోజు .
మువ్వన్నెల జెండాలు ఎగిరేసిన రోజు !
ఇక్కడ మాత్రం కనీసం నోరు విప్పి జై భారత్ మాత,
అని అనడానికే వీలు లేని రోజు.

***

మర్నాడు శనివారం తరగతులు ,
మామూలుగానే నడుస్తున్నాయి
మధ్యాహ్నం 12:30 గం. లకు విరామం!
ఎప్పటి వలనే ఇంటికి పరుగు.
ఆంజనేయ స్వామి గుడిపక్కనుండి
కమాన్ వైపు దారిలో మా ఠికానా ఉండేది.
ఆకలి తీర్చుకొని , మైలు దూరం నడిచి
మళ్ళీ బడికి హాజరు !
సార్లంతా ఎదో గుసగుసలాడుతున్నారు .
వాల్లముఖాల్లో కళ తప్పింది .
విద్యార్థుల్లో ఎదో కలకలం !!
మొదటి పిరియడ్ గంట టంగ్ మన్నది .
ఎవరి తరగతులకు వాళ్ళు చేరుకున్నారు.
మా క్లాస్ టీచర్ బాల మల్లయ్య సారు
ఎదో పోగుట్టుకున్నట్టు బాధ పడుతున్నారు .
నేను ధర్యం చేసి లేచి నిలబడి అడిగిన .
” సార్ ఏమైంది ?”
“బడి విడిచిపెట్టినంక చెప్త”
“ఇప్పుడు చెప్తే ఏమవుతది?”
“నాజర్ సాబ్ వస్తే కొంప మునుగుద్ది ”
“ఎందుకు?”
“భారతదేశం గురించి మనం మాట్లడద్దు ”
“అదేమిటి? ఇది మన దేశం కాదా ?”
సారు మౌనంగా పిల్లలందర్నీ చూస్తున్నారు .
“కాదు ! .. మనది నైజాం రాజ్యం !! ”
ఓ ముస్లిం పిల్లవాడు గట్టిగ అరిచిండు.
అంతే ! పిల్లలంతా లేచి నిలబడ్డరు.
“సార్ ! చెప్పు సార్ !! నిజం చెప్పు సార్ .”
అందరిదీ ఒక్క గొంతు అయింది .
“నిన్న భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది .
ఇంగ్లీషోళ్ళు లండన్ వెళ్ళిపోయిన్రు ,
రేడియోలో వార్తలు వచ్చినై .
కానీ మనది నైజాం రాజ్యం కాబట్టి ,
మనకు ఎప్పటివలనే ఉంటది .
వందేమాతరం, భారత్ మాతాకీ జై !
అనే నినాదాలు నిన్న రేడియోలో విన్నం.”
భారత్ మాతాకీ జై ..
తరగతి మొత్తం దద్దరిల్లింది.
ఇంతలో బడి గంట మోగింది .
“ఎవరు గంటకొట్టింది ” చెప్రాసీ అరుపులు .
బిలబిలా మంటూ విద్యార్థుల పరుగులు
అనంతస్వామి మరికొందరు సార్లు ఆగమాగమైతున్నారు.
నేను , లింగరెడ్డి రోడ్డు మీదికి ఉరికినం.
జై జై అంటూ ఎగురుతున్నం , దుంకుతున్నం!!
భారత్ మాతా కి జై .. దిక్కులు పిక్కటిల్లినై .
మా అడుగులు వేగంగా పడుతున్నై,
ఖబరస్తాన్ దగ్గరి చౌరస్తా వచ్చింది,
నలుగురు పిల్లలు మాకడ్డంగా నిలబడ్డరు.
మాకన్నా పెద్దగున్నరు. ఒకే తీరు తెల్లబట్టలు !
పైజామా , పొడుగు అంగి , నెత్తిమీద టోపీ .
ఒకడు నా చెయ్యి గట్టిగ వడి పెట్టిండు .
“వావ్వో ! వాయ్యో !!” నేను మొత్తుకున్న.
“క్యా బక్తా హై రే” (ఎం ఒర్రుతున్నవ్ రా)
“కిదర్ హై రే తేరా భారత్ మాత?”
(నీ భారత్ మాత ఎక్కడున్నదిర )
“సాలా ! యే జంబియాసే ఖతం కరూంగ ”
(ఈ కత్తి తో పొడిచి చంపేస్తా సాలే)
చిన్న పిడి కత్తి నా మెడను తాకింది .
భయంతో నా నిక్కర్ తడిసి పోయింది .
మా లింగరెడ్డి బలవంతుడు, తప్పించుకున్నడు.
నేను దిక్కులు చూస్తూ ఏడుస్తున్న .
అప్పుడు నా దోస్త్ హమీద్ వచ్చి ఆదుకున్నడు.
“అరె ఇస్కో చోడ్దొరే “(వీణ్ణి విడిచిపెట్రా )
“యే మేర జిగిరి దోస్త్ హై”(వీడు నా ప్రియ మిత్రుడు )
“అచ్చా లడకా రే” (మంచోడ్రా )
ఇంతలో మా అన్న , ఆయన క్లాసోళ్ళు
పదిమంది అక్కడికి చేరుకున్నరు.
మా అన్న చంద్రయ్య చాలా ధైర్య వంతుడు!
“క్యా హై? మేరా భాయి కో క్యోమ్ సతారై?”
(ఎందిది ?మా తమ్మున్నెందుకు ఏడిపిస్తున్నరు )
ఒకని చెయ్యి గట్టిగ గుంజుతే వాడు కిందపడ్డడు .
అందరు కల్సి వాళ్ళ మీద పడ్డరు.
ఆ నలుగురు కాళ్లకు బుద్ది చెప్పినరు .
నేనింకా వణుకుతూనే ఉన్న !
నన్ను దగ్గరికి తీసుకుని అన్న ఊకుంచిండు.
టిఖానాకు పోంగనే , అందరువచ్చి
నాకు ధైర్యం నూరి పోసిన్రు !!
తెల్లవారంగానే నా బట్టలు , పుస్తకాలూ
సంచిలోపెట్టి , ” ఇంటికిపొదాం తయారుగా జల్దీ ”
అన్న తొందర పెడుతుంటే నేను మెల్లగ అడిగిన
“ఎందుకు”
“రాత్రంతా నువ్ నిద్రపోలే. ఒకటే కల్వరింతలు .
బాగ జరమొచ్చింది . పెయ్యి కాలిపోతుంటే
భయమైంది . లే..లే .. బస్సు యాల్లయ్యింది ”
నేను ఆదర బాదరగ లేచిన . బొగ్గు పొడితోటి
పండ్లు తోముకున్న . బాయి దగ్గర మొకం కడిగిన.
నీళ్లు చేదుకొని నెత్తిమీద పోసుకున్న .
పానం కొంచెం చల్ల బడ్డది !!
మా అన్న నారాయణ రెడ్డి దగ్గర బస్ కిరాయి కోసం
రెండున్నర బదల్ తెచ్చిండు
సంచి పట్టుకొని బస్టాండుకు పోయినం .
అప్పుడు కరీంనగర్ నుండి హైదరాబాద్ కు
రోజు మూడో నాలుగో బస్సులు నడుస్తుండే .
ఇంకోటి రోజు శనిగరం రాత్రికొచ్చి తెల్లారంగ
తిరిగి కరీంనగర్ పోయేది .
డ్రైవర్ , కండక్టర్ గాక ఇంకో క్లినర్ కూడా ఉండేది .
బస్సులో పెద్ద డ్రమ్ము – దాన్నిండా బొగ్గులు .
అవి ఎర్రగ కాల్తుండే.ఆ వేడికి ఇంజన్లో
నీళ్లు ఆవిరై లోపల ఫ్యాన్ గిర గిర తిరగంగనే ,
ఇంజన్ బర్ మని పెద్ద చప్పుడు చేసేది .
అప్పుడు డ్రైవర్ గేరు మార్చి బస్సును ముందుకురికించేది .
కొంచెం దూరం పోయినంక స్పీడందుకునెది .
ఆగినప్పుడు , క్లీనర్ హ్యాండిల్ తో తిప్పేది .
ఆ కాలంలో నైజాం లో డీజిల్ , పెట్రోల్ బస్సుల్లేవ్.
బస్సెక్కి పోతుంటే , కమాన్ దాటినంక నాకెంతో
నిమ్మలమైంది . ఊర్లొచ్చుడు, బస్సాగుడు
మనుషులు ఎక్కుడు దిగుడు చూస్తుంటే
గమ్మత్తుగా అనిపించింది.
నుస్తులాపురం, మోయతెమ్మద వాగు దాటి దేవక్కపల్లి ,
తోటపల్లి , గాగిల్లాపురం దాటంగానే శనిగరం స్టేజి దగ్గర
హారన్ కొట్టి బస్సు ఆగింది.
ఇరవై ఐదు మైళ్ళ దూరానికి రెండు గంటలు పట్టింది .
అక్కన్నుంచి శనిగరం ఓ మైలు .
తర్వాత మూడు మైళ్ళు నడుస్తే తూర్పు దిక్కున
మా వూరు తంగళ్లపల్లి . శనిగరం నుంచి పిల్లివాగుదాకా
కంకర రోడ్డు. దానికి రెండు పక్కల చెరువు కాల్వలు .
పొలాలకు నీళ్లు పారుతున్నై .
చిన్న చిన్న చాప పిల్లలు కాల్వల ఎదురెక్కుతున్నై .
ఎలుకలు చేసిన పొక్క ల్ల ఎండ్రికాయలు మీసాలు తిప్పుతున్నై
నాకు నవ్వొచ్చింది ! భలే విచిత్రంగున్నది .
ముందుకు నడుస్తుంటే మాకొండ గుర్తు “కొషమర్రి ” !
నిలువుగా తాటిచెట్టంత ఎత్తు.
దాన్ని చూడంగనే మా ఊరొచ్చినంత సంబరం !
మా లక్ష్మి దేవవ్వ ఎకరన్నర పొలం అక్కన్నే ఉండేది .
వరినాట్లు అయి పోయినై.
చూపు అందనంత దాక భూమికి పచ్చటి
రంగు అద్దినట్లు పొలాలు .
ముందుకు పోతుంటే మామిడి తోట .
వంపు దాటంగానే పిల్లి వాగు ఎక్కువ నీళ్లు లేవు .
ఇసుకతోడి చెలిమెల్ల నీళ్లను చెంబుతో ముంచి
బిందెలు నింపుకుంటున్న మా వాడొల్లు .
మా ఊర్లో బాయిలన్నీ ఉప్పులే .
అందుకే వాగు నీళ్ళే తాగడానికి !
ముందుకు పోంగనే మా ఊరి గంగ ! జాలుక్కాలువ !!
నిండుగ పారుతున్నది.
తెనుగోళ్లు వలేసి చాపలు పడుతున్నరు .
చూసుకుంటూ ముందుకు పోయినం .
కుమ్మరోళ్ల బండ దాటినం .బడిగంటలు వినిపిస్తున్నై.
అంటే మా ఇల్లు వచ్చినట్టే.పాణం ఆగుతలేదు.
బడి దిక్కు చూడకుండ ఇంటిదాకా ఒకటే పరుగు !
మోసపోసుకుంటూ పోయి కడపల్ల నిలబడ్డ .
పచ్చటి వాకిట్లో అవ్వ బింకులు కడుగుతున్నది .
ఆమెను చూడంగనే దుక్కమాగుతలేదు.
కొంగుతోటి చేయి తుడుచుకుంటూ దగ్గరికొచ్చింది .
” ఏంది కొడుకా చెప్పక చెయ్యక దిగినవ్?”
“ఏమయిందిరా ?..ఇప్పుడు తాతీళ్ళు గుడ లెవ్ గదా ?”
నేను ఆమె కాళ్లకు చుట్టుకొని ఏడుస్తున్న .
“ఎందుకేడుస్తున్నవ్ బిడ్డా !.. ఇటురా ”
అవ్వ అంటుండగానే అన్న లోపలికొచ్చిండు .
ముగ్గురం దివాన్ ఖానా అరుగు మీద కూచున్నాం.
అవ్వ తొడ మీద తల పెట్టుకున్నంక నా భయం పోయింది !
ఆమె భుజం తడుతుంటే నా కన్నీటి ధార ఆగిపోయింది !!

(ఇంకా వుంది)

-అంకయ్య భండారి,
9032742937

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!