Saturday, February 22, 2020
Home > కవితలు > || నాన్న మొగ్గలు || -డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

|| నాన్న మొగ్గలు || -డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

ఆప్యాయతానురాగాలను సతతం పంచుతూనే
ఆత్మీయానుబంధాలకు సంజీవని అవుతాడు
నాన్న హృదయం తెలుసుకోలేని అనంతసాగరం

జీవితంలో తప్పటడుగులు వేస్తున్నప్పుడల్లా
భవిష్యత్తుకై చేయిపట్టుకుని నడిపిస్తూనే ఉంటాడు
నాన్నంటే గుండెధైర్యాన్ని కలిగించే భద్రతామూర్తి

భవిష్యత్తుకు బతుకు భరోసా కలిగిస్తూనే
జీవితానికి ఆక్సిజన్ ను అందిస్తుంటాడు
నాన్నంటే జీవితాన్ని వెలిగించే నిత్యకొవ్వొత్తి

ఆయన ఆత్మీయస్పర్శ మెత్తగా తగిలినప్పుడల్లా
ఏ కాంతికిరణమో వెలుగులు పంచినట్లుంటుంది
నాన్న చేతిస్పర్శ ఎప్పటికీ ఔషధం కన్న మిన్న

నిత్యం నీడలా మన వెనక ఉంటూనే
రక్షాకవచమై మానసిక ధైర్యాన్ని కలిగిస్తాడు
నాన్నంటే బాధ్యతలను మోసే ఆశలపల్లకి

బాధనంతా గుండెగుడిలో దాచుకుంటూనే
నిరంతరం బతుకుపోరాటం సాగిస్తుంటాడు
నాన్నంటే ఎవ్వరికీ కనిపించని అపరబ్రహ్మ

తను ఒదుగుతూ మనలను ఎదుగనిస్తూనే
ప్రగతిబాటల వెలుగులను పంచుతుంటాడు
కాలం బాట మీద చేసిన సంతకం నాన్న

ఎన్ని ఆటుపోట్లనో నిత్యం ఎదుర్కొంటున్నా
నిటారుగా నిలబడ్డ పర్వతమే గుర్తుకొస్తుంది
నాన్నంటే అంచనాలకందని ఎవరెస్టు శిఖరం

– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
9032844017

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!