Thursday, April 22, 2021
Home > సీరియల్ > ||నాలో నేను|| -భండారి అంకయ్య(పార్ట్ -2)

||నాలో నేను|| -భండారి అంకయ్య(పార్ట్ -2)

||నాలో నేను|| పార్ట్ -2

కావడి కుండలతో మా దాద వచ్చిండు.
అవ్వలేచి కుదుర్లు పెట్టి, రెండు కుండల్ని
దివాన్ ఖానా లో పెట్టింది.
మేము కన్నతండ్రి ని దాదా అని పిలిచేది.
ఎందుకట్లా పిలిచేదో మాకు ఇప్పటికి కూడా తెల్వదు.
దొరలు,కర్ణాలు,షావుకార్లు,పటేండ్లు “బాపు”అని,
ఎక్కువమంది “నాయిన” అని,
పనిపాటలోళ్లు “అయ్యా”అని రకరకాలుగా పిలిచేది!
కన్నతల్లిని మాత్రం అందరు “అవ్వా” అనేది!!

మోకు, ముత్తాదు పక్కన పెట్టి దాద
మమ్మల్ని చూసి చిన్నగా నవ్విండు,
నేను ఆయన్ని కన్ను మల్పకుండా చూస్తున్న.
మా దగ్గరకొచ్చి కన్లల్ల చూస్తుంటే –
ఎందుకొచ్చినారని అడిగినట్టనిపించింది.
మా అన్న జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పిండు.
“భయపడితే మీదికెక్కుతరు కొడుకా !
ధైర్యంగుండాలె . గిట్లైతే నువ్వేం చదువుకుంటవ్?
ఆ..! ..పోనీ, మాకు సాయంగా యిక్కన్నే ఉంటవ?”
తల కిందికి దించి, నేను ” లేదని” చెప్పిన.
దాద స్నానం చేసి, జపమాల తీసుకొని,
ఆంజనేయ స్వామి దండకం మొత్తం
నోటికే పూర్తి చేసిండు. ఇది ఎన్నడూ తప్పలేదు.
అవ్వ అందరికి అన్నం పెట్టింది. చిన్నోడు
రాజయ్య మమ్మల్ని వింతగ చూస్తున్నడు.
దాద పిడికెడు పెరుగన్నం ముద్ద తీసి
కంచం పక్కన పెట్టిండు. మ్యాప్ మ్యాప్ అంటూ
సాదుక పిల్లి వచ్చి మిటకరించుకుంటూ తిన్నది!
దాలి పొయ్యి మీద కుండల పాలెప్పుడు గోరెచ్చగ ఉండేది.
మీగడ తీసి అవ్వ మా ఇద్దరి కంచంల వేసింది
కడుపునిండా తిని ఎన్ని రోజులైందో?..!
మేం తిని లేస్తుంటే బడి గంటలు వినిపించినై.
కొంచెం సేపటికి తమ్ముడు సత్యనారాయణ వచ్చిండు.
“అన్నా ఎప్పుడొచ్చిండ్రే” అంటూ నన్నుపట్టుకున్నడు.
ఇద్దరం చూసుకున్నం. కండ్లతోటె మాటలు!
వాడంటే నాకెంతో ఇష్టం.
అన్నం తినంగనే మల్ల బడికి పోయిండు.

** **
దాద కొంచెం సేపు పండుకొని లేచిండు.
“చంద్రయ్యా ! నువ్వు, అంకయ్య ఇద్దరూ
జాగిరొళ్ళింటిదగ్గర రాగి కొమరమ్మ కొడుకు
కిష్టయ్య దగ్గరికి పోయి జరిగింది చెప్పూ.
మీకు కరీంనగర్ ల ధీమ్ గ ఉంటడు.”
దాద చెప్పంగనే ఇద్దరం వాళ్ళింటి దారిపట్టినం.
రాగి కిష్టయ్య అప్పుడు రిజర్వ్ పోలీస్!
ఇంకోయన అచ్చయ్య కూడా పోలీస్ ఉండె కానీ
ఎక్కడ పనిచేసేదో మాకు తెలియదు.
నాకు తెల్సి మా తంగళ్లపల్లి లో వీళ్లిద్దరు
మొట్టమొదలు సర్కారీ కొలువు సంపాయించుకున్నోళ్ళు.
తర్వాత పుప్పాల బలరామయ్య కొడుకు నారాయణ
జిల్లా పోలీస్ ఆఫీస్ లో షెగదారి ఉద్యోగం చేసిండు.
వీళ్లకు నెల నెలా మంచి జీతం! నల్గురిలో గౌరవం!!
కాయకష్టం కన్నా, సర్కారీ కొలువు ఎంతో గొప్ప!
అందుకే బాగా చదివించి మేము సర్కారీ
కొలువు చేస్తుంటే చూడాలని మా దాద కోరిక, పట్టుదల!
కొమురమ్మ ఇంటికి పోంగనే చాపేసి కూచో బెట్టింది.
పుట్నాలు పేలాలు కలిపి ఓ గిన్నెల పోసి
మా ముందర పెట్టింది. ప్రేముంటే తప్ప
ఈ మర్యాదలు చేయరుకదా? కొడుకు
కిష్టయ్య పండుకున్నాడని చెప్పింది.
మేము కొంచెం కొంచెం నోట్లో వేసుకుంటున్నం
ఇంతలో “ఘల్లు ఘల్లుమని” గజ్జల చప్పుడు
వినిపించoగనె లేచి వాకిట్లకొచ్చి నిలబడ్డం.
గఢీల నుంచి సవారీ కచ్రం వస్తున్నది.
అది మామూలు కచ్రం కాదు. కప్పు తడిక
మీద నీలం, నొగలు, కాని మీద పసుపచ్చ
గీరెల మీద ఎరుపు తెలుపు రంగులు.
ఎంతో అందంగున్నది. ముందు వెనుక
పర్దాలు గాలికి కొట్టుకుంటున్నై. మాంచి కోడెలు
ఒక్క తీరుగ నడుస్తున్నై. వాటి కొమ్ములు మెరుస్తున్నై.
ఎదో రంగు వేసినట్లున్నరు! బండి ముందు ఒక మనిషి
నడుస్తున్నడు, కాదు మెల్ల మెల్లగా దౌడు తీస్తున్నడు.
కచ్రం మా ముందు నుంచి దాటి పోయింది.
వెనుక ఇంకో మనిషి చేతుల కట్టె పట్టుకొని ఉర్కుతుండు.
ఆ ఇద్దరి మనుషులకు పెయ్యి మీద ఎం లేదు.
నడుం నుంచి తోడల దాక కాశ బోసిన దొడ్డు బట్ట తప్ప!
ఇది ఆనాటి దొరల రాజసం! దర్పానికి నిలువెత్తు సాక్ష్యం!!
గాలికి పర్దాలు లేచినపుడు నేను ఆత్రంగా చూస్తే,
కూచునొల్ల ముకాలు కనబళ్ళేదు కానీ
లోపల చిన్న నవారు మంచం, పరుపు, మెత్తలు.
అబ్బో! చూసుటానికి నా కండ్లు చాలలేదు !!
“ముందట పగ్గాలు పట్టుకొని ఎడ్లను తోలుతున్నది
దొర్సాని తమ్ముడు. మన దేశముఖ్ –
అదే దొర చనిపోయి ఛానేండ్లయింది.
అందుకే దొర్సాని తమ్ముడు, చెల్లె ఇక్కన్నే
ఆమెకు తోడుగా ఉంటున్నరు.
వాళ్ళదేక్కన్నో చేర్యాల దగ్గర ఊరు. దొర్సాని
ఒక్కడే కొడుకు చిన్నోడు ఈ ఆస్తికంతటికి వారసుడు!”
గడీల పనిచేసే భూమక్క అక్కడున్నోళ్లకు
కథలు కథలు చెప్తున్నది. ఇవ్వాళ్ళ కళ్ళేపల్లి దొర
ఇంట్ల ప్రభోజనానికి పోతున్నారు అంటూ ముగించింది.
మలుపు తిరిగే దాక నేను ఆ కచ్రాన్నే చూస్తున్న.
చెమటోడ్చే కష్టజీవులు !
వారి శ్రమతో సుఖాలు అనుభవించే గొప్పోళ్ళు !!
ఈ తేడాలెందుకని నేను ఆలోచనలో పడ్డ.
ఇంతట్లనే పోలీస్ కిష్టయ్య మామ బయటకొచ్చి
మాతో మాట్లాడిండు . కరీంనగర్ లో ఎప్పుడవసరమున్న
తనదగ్గ్గరికి రమ్మని పత్తా ఇచ్చిండు .
మేము సంబరంగా ఇంటిమొకం పట్టినం.
** **
మూడు ఝాములకు వనానికి పోవుటానికి
దాద తయారవుతున్నడు. గీసే కత్తులకు పదును పెడుతున్నడు.
ధోతీని మోకాళ్ళ మీదికి జరిపి నడుం చుట్టూ కదలకుండా బిగించి కట్టుకున్నడు.
ముత్తాదు వెనుక నుంచి కట్టి,
మోకు భుజాలమీద వేసుకొని దాద పోతుంటే
నాకేదో భయం!
అంతెత్తు తాటిచెట్టెక్కి, గీసి కిందికి దిగొచ్చేదాకా పాణగండమే కదా!
పొద్దూకంగానే ఓ చిమ్ని, ఓ కందీలు వాటి బుగ్గలు తుడిచి,
గ్యాస్ నూనె పోసి అవ్వ వెలింగించేది. కరెంటు లేని కాలం!
ఇంతే కొంత ఉన్నోల్లం కనుక, ఈ మాత్రమైనా వెలుగు
మా ఇంట్లో ఉండేది. చాలా మంది ఇండ్లల్ల గుడ్డి దీపాలే!
అందుకేనేమో చీకటి పడకముందే తినే అలవాటు చాలామందికి.
ఆరోజు రాత్రి అందరం వంటింట్లో ఒక్కసారే
చాపల కూర తోటి అన్నం తిన్నం. రాజయ్య కు
అవ్వ ముండ్లు తీసిన చాపముక్క తినిపించుకుంటూ
మాకు కంచుడ్నుంచి ఏరి ముక్కలు పెట్టింది.
నలుగురు కొడుకుల్ని చూసుకుంటూ దాద తృప్తిగా
తిని లేచిండు. అప్పుడు గాని అడుగులు బొడుగులు
అవ్వ తిన్నది. విచిత్రం! జీవితమంతా తనకడుపు మాడ్చుకొని మా కడుపు నింపేది అవ్వ!
కన్నతీపి అంటే ఇదేనేమో!!
“దాదా! లసిందేవవ్వ కనబడ్తలేదు?”
“దానిష్టం! ఇక్కడ ఉండబుద్ది కాకపోతే,
అవ్వగారింటికి శనిగరం పోతది.”
నా ప్రశ్నకు దాద అయిష్టంగా చెప్పిన మాట!
లక్ష్మీదేవవ్వ మా దాదకు మొదటి భార్య.
ఆమెకు నలుగురు పిల్లలు పుట్టి పోయింతర్వాత,
ఊళ్లనే బుర్రోల్ల ఇంటి పిల్ల
మా అవ్వను పెండ్లి చేసుకున్నడు.
ఈ విషయాలు మాట్లాడడం దాదకు ఇష్టం లేదు.
“చంద్రయ్యా! నువ్వు రేపొద్దున్నే కరీంనగరం పో.
అంకయ్య ను ఓ మూడు రోజులకు నేనే తీసుకొస్తా .
ఖర్చులకు అవ్వనడిగి పైసల్ తీస్కో ”
అయన మాటకు మా ఇంట్లో తిరుగుండేది కాదు.
మాట్లాడకుండా పోయి ఎక్కడోళ్లమక్కడ పండుకున్నం.

(ఇంకా వుంది)

-అంకయ్య భండారి,
9032742937

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!