Monday, January 18, 2021
Home > సీరియల్ > || ఎడారి పువ్వు || -ప్రీతీ నోవెలిన్ నోముల (పార్ట్ 2)

|| ఎడారి పువ్వు || -ప్రీతీ నోవెలిన్ నోముల (పార్ట్ 2)

|| ఎడారి పువ్వు || పార్ట్ 2

ఇంతలో సంధ్యని ఎవరో పిలవడంతో ఇప్పుడే వస్తానని చెప్పి తను వెళ్ళింది…నాకు ఇక్కడేమి తొచడంలేదు…చుట్టూ అలా చూస్తూ కూర్చున్న…సెంట్రల్ ఏ సీ ఫంక్షన్ హాల్ ఇది…ఎటు చూసిన రంగురంగుల అందమైన పూలత్ో కాశ్మీరీ పూల లోయలో సేదతీరుతున్న అనుభూతిని కలిగిస్తుంది అలంకరణ…
ఇందులో చాలా పూలని నేనెప్పుడూ చూసి ఎరుగను…వాటి గొంతుకలు కోసి తీసుకొచ్చి ఈ తొరణాలకి అలంకరించినా ఆ పూవులు నవ్వుతూనే ఉన్నాయి…మనలని బాధించిన వారిని చూసి ఒక్క చిరునవ్వు నవ్వగలమా వీటిలా..ఎంతటి గొప్ప మనసు కదా వీటిది అనిపించింది…

పూవులపైనుండి నా చూపు నెమ్మదిగా ప్లాస్టిక్ నవ్వులు పూసుకున్న మనుషుపైకి మళ్లింది…ఒక్కొక్కరు ఒక్కో నగల కొట్టులా కనిపించారు…ఒక్కసారిగా జాయ్ అలుకాస్,కళ్యాణ్ జ్యువెలర్స్ షాపులు ఇక్కడ మొబైల్ షాప్స్ ఓపెన్ చేశాయా అనిపించింది…బంగారం,ప్లాటినం,వజ్రాలు,పచ్చలు, కెంపులు ఒక్కటేమిటి భూమి మీద ఉన్న ఖరీదైన ప్రతి ఆభరణం ఇక్కడే నడుస్తూ కనిపిస్తుంటే ఎందుకో తెలీకుండా నవ్వొచ్చేసింది…
కాని ఇక్కడ నవ్వితే ఎవరిని చూసి ఎగతాళి చేసాను అని అనుకుంటారో అని బలవంతంగా నవ్వుని ఆపుకున్నాను…ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు ఇదో సరదా కార్యక్రమంగా అనిపిస్తుంది…
ఒక్కత్తినే ఇలా కూర్చోడం విసుగ్గా ఉంది…సంధ్య ఎక్కడుందా అని చూసాను…దూరంగా ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది…తన వైపు చేయి ఊపుతూ రమ్మని సైగ చేసాను…5 నిముషాలు అంటూ వేళ్ళతో చూపించింది..సరే అంటూ అలా కూర్చున్నాను..ఇంతలో పాపని తీసుకొని ఆ పాప అమ్మ నాన్న స్టేజ్ ఎక్కారు…అందమైన బార్బీ డాల్ అలంకరణలో ఉన్న కేక్ తీసుకొచ్చి పెట్టారు…

ఇక్కడ అన్నింటి కన్నా ఎక్కువగా ఆకర్షించింది మాత్రం ఆ పాప….లేత గులాబీ రంగులో ముత్యాలతో పోతపోసిన ఫ్రాక్ లో బుల్లి దేవకన్యలా ఎంత ముద్దుగా ఉందో… కేక్ వచ్చిన వెంటనే ఆ హాల్ అంత చప్పట్లతో మోగిపోయింది….పాపం ఆ చంటిది భయపడినట్టుంది ఒక్కసారి ఏడుపు లంఘించుకుంది…పాపం వాళ్ళ అమ్మ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఏడుపు ఆగడంలేదు…ఒక్కొక్కరుగా అక్కడున్న అందరూ ఎవరికీ తోచినట్టుగా వాళ్ళు ఆ పాప ఏడుపు ఆపే ప్రయత్నం చేస్తున్నారు…కానీ ఆ పాప మాత్రం ఎత్తిన రాగం ఆపడంలేదు…ఇంకా చూస్తూ ఉండడం నా వల్ల అవలేదు వెన్నెల ముద్దల్లాంటి ఆ బుగ్గలు ఏడ్చి ఏడ్చి ఎర్రగా అయిపోతున్నాయి…నేను కూడా స్టేజ్ ఎక్కి ఒక్క అవకాశం ఇవ్వమన్నట్టుగా చేతులు చాపాను..
తనని ఎత్తుకున్నాక గాని అర్ధమవలేదు తనేందుకు ఏడుస్తుందో…అప్పటిదాకా ముద్దుగా కనిపించిన ఆ ఫ్రాక్ ముళ్ళకంపలా కనిపించింది…వెంటనే వాళ్ళ అమ్మని అడిగాను ఈ ఫ్రాక్ కాకుండా వేరే ఉందా అని..ఉంది అంటూ వేరేది తీసి ఇచ్చింది..నేను పాపకి ఫ్రాక్ తీసేసి తిరిగి కాస్త పౌడర్ వేసి ఇంకో ఫ్రాక్ వేసాను..దానికన్నా ఇది కాస్త సౌకర్యంగా ఉండడం వల్ల పాప ఏడుపు ఆపేసింది…
నవ్వుతున్న పాపని వాళ్ళ అమ్మ చేతిలో పెట్టి కిందకి దిగుతున్నాను .అదిగో అప్పుడు చూసాను ఒక నవ్వుని…ఒక అబ్బాయి ఇంత అందంగా నవ్వగలడా అనిపించేంత అందంగా ఉంది…

ఆ నవ్వుని అలా చూస్తూనే ఉండలనిపించింది..ఇంత సమ్మోహనమైన నవ్వు పుట్టిబుద్ధెరిగాక ఎప్పుడూ చూడలేదు…ఇంతకాలం అమ్మాయి నవ్వులనే వర్ణించడం చూసి అబ్బాయిలు అందంగా నవ్వరనే భ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ నవ్వుని చూపించాలి అనిపించింది…చూడ్డానికి కూడా తను చాలా బాగున్నాడు…హైట్ ఆరు అడుగులు దాటే ఉంటాడు..జిమ్ బాడీ అనుకుంటా బ్లాక్ కలర్ షర్ట్ నుండి అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది..మగాళ్ళకి నలుపు రంగు ఇంతబాగా నప్పుతుందా అని మొదటిసారి అనిపించింది…కొన్ని క్షణాలపాటు అలాగే చూస్తూ ఉండిపోయా..ఇంతలో నాది నాకే ఏదోలా అనిపించింది… ఏంటి మరీ ఇలా చేస్తున్నాను అని…తన వైపు నుండి చూపు తిప్పేసుకున్నాను…
డైవర్షన్ కోసం పక్కన వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాను…వెనుకనుండి అతని నవ్వు వినిపిస్తునే ఉంది…దేవుడా ఏంటి ఈ పరీక్ష చూడ్డానికే కాదు వినడానికి కూడా ఆ నవ్వు అంత బాగుందేంటి… నా ఎదురుగా కూర్చున్నావిడ ఏం మాట్లాడుతుందో కూడా వినబడ్డం లేదు..అతని నవ్వు తప్ప అసలేది నా చెవులని తాకడంలేదు…అయ్యో ఏంటిది ఒక నవ్వు నన్నిలా బందీని చేస్తుంది…మాటిమాటికి తనని దొంగచాటుగా చూస్తూనే ఉన్న…కాసేపటికి వెనుక నుండి ఎస్క్యూస్ మీ అంటూ ఓ గొంతు…

వెనక్కితిరిగి చూసాను నాకు అడుగు దూరంలో తను…ఒక్కసారిగా ఒళ్ళంతా పులకరింత…ఊపిరి వేడి సెగలు నన్ను కాల్చేస్తాయేమో అన్నంతగా ఉంది…అరచేతుల్లో చెమటలు పట్టేస్తున్నాయి. తను నా కళ్ళ ముందు చిటికేస్తూ మళ్ళీ పిలిచాడు…ఏదో మైకం నుండి బైటపడ్డట్టుగా తడపడుతున్న కన్నులతో తనవైపు చూసాను…హాయ్ థిస్ ఈస్ ప్రవాహ్ అంటూ చేయి ముందుకు చాపాడు…AC గదిలో ఉన్న ఉక్కపోతతో గొంతెండుకుపోతుందేమో అనిపిస్తుంది…అతను మళ్ళీ చేతిని ఊపడంతో తనకి షాక్ హ్యాండ్ ఇచ్చాను…ఒక స్పర్శ్ నేరుగా మనసుని తాకడం ఇప్పుడు చూసాను…హలో మీ పేరు?? అని అడిగాడు…ఓ సారీ అండి మై సెల్ఫ్ గమనిక..ప్లీజ్ టు మీట్ యూ అన్నాను…నా చేతిని మెత్తగా నొక్కి షాక్ హ్యాండ్ ఐపోయినట్టుగా వదిలేసాడు…నేను సంధ్య ఫ్రెండ్ ని..తను అక్కడ కాస్త బిజీగా ఉంది..మీరు ఒక్కరే బోర్ ఫీల్ అవుతున్నారని చెప్పడంతో నేను మీ దగ్గరికి వచ్చాను అని చెప్పాడు..ఇదేంటిది అతని నవ్వుతో పాటు ఈ గొంతు కూడా మాయ చేస్తుందే…ఏం చేయను…అలా కూర్చొని మాట్లాడుకుందామా అంటూ టేబుల్ వైపు చూపించాడు.ఇద్దరం వెళ్లి కూర్చున్నాం..నేను బేసిక్ గా కాస్త తక్కువగా మాట్లాడతానండి…బట్ మీరు నాకన్నా కూడా దారుణంగా ఉన్నారుగా అన్నాడు…అప్పటికి కానీ అర్దవలేదు..నేను తనని చూడడం తప్ప నోరువిప్పి ఒక్కమాట కూడా మాట్లాడలేదని…
నన్ను నేను కాస్త సరి చేసుకొని నవ్వుతూ తన వైపు చూసాను… ఆ కలవరపాటు చూసి అతనునవ్వేసాడు… దేవా… కొన్ని వేలకోట్ల గలాక్సీ విస్ఫోటనాలు జరిగినట్టుగా అల్లకల్లోలం అయిపోయింది మనసంతా.. ఇంత దగ్గరగా ఆ నవ్వుని చూడగానే.. తను ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు అలా చూస్తూ కూర్చుండిపోయాను తనని చూస్తూ…
ఇంతలో సంధ్య వచ్చింది.. పరిచయాలు బాగా జరిగాయా అంటూ నవ్వుతు.

(ఇంకా ఉంది)

-ప్రీతీ నోవెలిన్ నోముల

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!