Monday, August 8, 2022
Home > సీరియల్ > || ఎడారి పువ్వు || -ప్రీతీ నోవెలిన్ నోముల (పార్ట్ 3)

|| ఎడారి పువ్వు || -ప్రీతీ నోవెలిన్ నోముల (పార్ట్ 3)

సంధ్య వెనకాలే ఇంకో నలుగురు వచ్చి టేబుల్ చుట్టూ ఉన్న చైర్స్ లో కూర్చున్నారు…నేను సంధ్య చిన్నప్పటినుండి ఒకే స్కూల్ ఒకే కాలేజ్.. తను MS చేయడానికి US వెళ్ళింది వీళ్ళంతా తనకి అక్కడి క్లాస్మేట్స్…వీళ్ల గురించి ఎప్పుడు చెబుతూ ఉంటుంది కానీ ఎప్పుడు కలవలేదు…ఇప్పుడు ఈ పాప వాళ్ళ అమ్మ కూడా సంధ్యకి US లో క్లాస్మేట్… అప్పుడు సంధ్య నా చేయి పట్టుకొని గమన నేనెప్పుడూ చెప్పే నా ఫ్రెండ్స్ వీళ్ళే.. చైతన్య, రుత్విక, విశ్వేష్, అజార్… ఇక తను ప్రవాహ్ (హీరో పేరు ప్రవాహ్ గా మార్చాను)ఆల్రెడీ మీ ఇద్దరికీ పరిచయం అయిపోయిందిగా అంటూ అందర్నీ పరిచయం చేసింది…

ఫ్రెండ్స్ షి ఈస్ గమనిక…నాకు ఊహ తెలిసినప్పటి నుండి నా ఫ్రెండ్…మనలా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది…అతి సున్నిత స్వభావి…మనం పట్టించుకోని మన చుట్టూ జరిగే ప్రతి చిన్న విషయాన్ని మనసుదాకా తీసుకునే మృధుస్వభావి..మూగజీవాలన్నింటిని అమితంగా ప్రేమిస్తుంది..ఆఖరికి మనం అసహ్యించుకునే పందిని కూడా. మీకు ఒక సంఘటన చెప్తాను వినండి..ఒకరోజు నేను గమన ఎక్కడికో వెళ్లి వస్తున్నాం…అక్కడ వీధిలో ఒకావిడ కొడుక్కి అన్నం తినిపిస్తుంది…ఆ పిల్లోడు అక్కడ ఉన్న ఒక పందిని రాళ్లతో కొడుతూ నవ్వుతున్నాడు..వాళ్ళమ్మ నవ్వుతా ఆ పిల్లాడికి అన్నం తినిపిస్తుంది…

అది చూడగానే వెంటనే నేను గమన వైపు చూసాను..అప్పటికే గమన అటువైపే చూస్తూ ఉంది…ఉన్నట్టుండి సడెన్ గా ఆవిడ దగ్గరికి వెళ్లి,అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమౌతుందా అని అడిగింది..దానికి ఆవిడ అయోమయపడుతూ చేతిలో ఉన్న అన్నం గిన్నె వైపు కొడుకు వైపు గమన వైపు మార్చి మార్చి చూస్తుంది..ఇంతలో గమనే మళ్ళీ అందుకుంది…అది మీకు అసహ్యం కలిగించే జంతువే కావొచ్చు కాని అది కూడా ఒక ప్రాణి..అందులోనూ కడుపులో పిల్లల్ని మొస్తుంది…మన ఆడాళ్ళు ప్రెగ్నెన్సీ రాగానే నడవలేక నడవలేక ఆపసోపాలు పడుతూ నడుస్తాం…అలాంటిది అక్కడ అది నిండు గర్భిణి అండి…దాన్ని అలా అంతంత పెద్ద పెద్ద రాళ్లతో కొడుతూ పరిగెత్తిస్తుంటే దానికెంత ఆయసంగా అలసటగా ఉంటుందో ఆలోచించారా…రాళ్ళు తగలకూడని చోట తగిలి లోపల ఉన్న పిల్లలకి ఏదైనా జరిగితే…కనీసం ఊహించారా ఇలా…పిల్లాడు చేస్తున్నదాన్ని తప్పు అని చెప్పడం మాని నవ్వుతు చూస్తున్నారా..ఇంకొక్క రాయి ఆ పంది పైన పడాలి అస్సలు బాగోదు అంటూ క్లాసు పీకేసింది…
పాపం ఆవిడ బిక్క మొఖం వేసింది …తన చుట్టూ ఉన్న ఇరుగుపొరుగు వాళ్ళు తనవైపే చూస్తూ ఉండడంతో తప్పు చేసినదానిలా తల దించుకుంది…అయినా కూడా గమనలో కోపం తగ్గలేదు…దీన్ని అలాగే వదిలేస్తే ఇంకా ఏమంటుందో అని చేయి పట్టుకొని బలవంతంగా లాక్కొచ్చేసాను…గమన అంత ఆవేశంగా ఒకరిపైన అరవడం ఎప్పుడు చూడలేదు నేను…ఇంకోసారి కాఫీ షాప్ లో కూర్చొని కాఫీ తాగుతున్నాం ఉన్నట్టుండి గమన కాఫీ కప్ టేబుల్ పైన పెట్టేసి బైటికి పరిగెట్టింది…ఏం జరిగిందో అర్ధమవక తన వెనకే నేను వెళ్లాను…బైటికి వెళ్లి చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది

బైటికెళ్ళి చూసా అక్కడ ఒక ముసలాయన రిక్షాలో బరువుని మోస్తూ వెళ్తూ రోడ్ ఎత్తుగా ఉండడం వల్ల ఆ బరువుని మోయలేక కష్టపడుతున్నాడు…గమన వెళ్ళి ఆ బండిని వెనుకనుండి తోస్తూ ఆ తాతకి సాయం చేస్తుంది…అక్కడ ఉన్నవాళ్లంతా తనని వింతగా చూస్తున్నారు..ఆ రోడ్ పైన అబ్బాయిలు ఉన్నారు,ఆటో వాళ్ళు ఉన్నారు,లేబర్ వాళ్ళున్నారు ఇంకా చాలామంది ఉన్నారు..కానీ ఏ ఒక్కరికి కూడా ఆ తాతకు సాయంపట్టాలి అని అనిపించలేదు.నాకు కూడావెళ్లి గమనకి సాయాం చేయాలన్న ఆలోచన రాలేదు అలా చూస్తూ నిలబడిపోయా…ఎత్తుగా ఉన్న రోడ్ మొత్తం ఎక్కించాక ఆ తాత గమనకి దండం పెట్టబోతుంటే అతని చేతిని తీసుకొని తన తలపైన పెట్టుకొని ఆశీర్వాదం తీసుకొని చేతులు దులుపుకుంటూ వెనక్కి వచ్చింది…ఒక అందమైన నవ్వుతో…ఆ క్షణం తనపైన ఉన్న గౌరవం ఇంకా పెరిగింది…ఇలాంటివి ఒకటి రెండు కాదు చాలా చాలా ఉన్నాయి…
సంధ్య ఇక ఆపుతావా నాకు చాలా అనీజీ గా ఉంది ప్లీజ్…ఎందుకు గమన ఏమైంది…ఏమిలేదు సంధ్య ఈ విషయాలు కాకుండా వేరే ఏదైన మాట్లాడుకుందామా ప్లీజ్..సరేసరే లే తల్లి ఇక ఆపేస్తానులే..
నాకెందుకో చాలా ఇబ్బందిగా ఉంది…సంధ్య వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంది..వాళ్లందిరిని చూడాలంటే ఏదోలా ఉంది..ఈ సంధ్యకి ఎక్కడ పనిలేదు.ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలీదు అనుకుంటూ తల పక్కకి తిప్పాను..ప్రవాహ్ తదేకంగా నావైపే చూస్తూ కూర్చున్నాడు…తన చూపుల మాటలు నాలో మౌనాన్ని తాకుతున్నట్టుగా ఉన్నాయి..పట్టుమని పది సెకండ్లు కూడా తన కళ్ళని చూడలేకపోయాను…అంత తీక్షణమైన కళ్ళని చూడడం ఇదే మొదటిసారి…అక్కడ ఉన్నంతసేపు ప్రవాహ్ మాటలు,నవ్వులు,చూపులు నా చుట్టూ పరిమళాన్ని వేదజల్లుతూనే ఉన్నాయి…ఫంక్షన్ అయిపోయింది… అందరం బయలుదేరాము..అడుగులు వేయమంటూ నా పాదాలు మొండికేస్తున్నాయి…ఒక్కో అడుగు నా కళ్ళల్లో కన్నీరుగా మారడానికి సిద్ధంగా ఉంది..ఇదేంటి నేనింత ఫూలీష్ గా చేస్తున్నానేంటి…
ఎవరీ ప్రవాహ్ ….గంట క్రితం పరిచయమైన తన గురించి ఇంతలా ఆలోచించడమేంటి …ఇక్కడి నుండి త్వరగా బైటపడాలి…సంధ్య బయలుదేరుదామా ప్లీజ్ కాస్త హెడేక్ గా ఉంద అన్నాను…సరే పదా వెళదాం అంటూ ఇద్దరం మెట్లు దిగుతున్నాం..వెనుక నుండి ఒక పిలుపు గమనిక అంటూ…అదే గొంతు నేను దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తున్న గొంతు.. ఆగి వెనక్కి తిరిగి చూసాను ప్రవాహ్ మెట్లు దిగుతూ కనిపించాడు…దగ్గరగా వచ్చాడు అదే అందమైన నవ్వుతో…కలిసినప్పటినుండి ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను బట్ మర్చిపోయాను అన్నాడు..చెప్పండి ఏం మర్చిపోయారు అని అడిగాను.ఇంకో మెట్టు దిగి దగ్గరగా వచ్చి..గమనిక… మీ పేరు చాలా బాగుంది అంటూ చెవిదగ్గర చెప్పి నవ్వుతూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లి కార్ ఎక్కేసాడు…అంత దగ్గరగా అతని గొంతులో నా పేరు వినేసరికి ఏదో గమ్మత్తుగా అనిపించింది..గమనా ఏం చెప్పాడే తను అని సంధ్య అడుగుతున్న సమాధానం చెప్పకుండా వచ్చి కార్ ఎక్కాను…తనొచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది…కార్ స్టార్ట్ చేసి మళ్ళీ అడిగింది తనేం చెప్పాడు అని..

గమన ప్రవాహ్ ఏమన్నాడే…మళ్ళీ అడిగింది సంధ్య…ఏమిలేదే నా పేరు బాగుందని చెప్పాడు అంతే..అంతకుమించి ఏమిలేదు అంటూ నవ్వుతు చెప్పింది గమనిక..ఓరిని ఈ మాట చెప్పడానికేనా ఇంతలా ఇదౌతున్నావ్.. అయినా ఆ ముక్క అంత దగ్గరగా వచ్చి చెప్పాలా అంది కొంటెగా నవ్వుతూ సంధ్య…నాకేం తెలుసు నీ ఫ్రెండే కదా అదేదో నువ్వే అడుగు.మధ్యలో నాకేమి సంబంధం చిరుకోపాన్ని చూపుతున్నట్టుగా నవ్వుతూ అంది గమనిక…గమన నేనో విషయం గమనించానే ఇందాక…”ఏంటి అది” …ప్రవాహ్ ని చూస్తున్నప్పుడు నీ కళ్ళల్లో ఏదో మెరుపు కనిపిస్తుంది అంది ఓరకంట గమనికని చూస్తూ…ఆ మాట వినగానే రెప్పల చాటున దాగిన కళ్ళు చేప పిల్లలా కదులుతూ కలవరపడ్డం సంధ్య కంటిని దాటిపోలేదు…కాసేపటివరకు గమనిక మౌనంగా ఉండిపోయింది…మళ్ళీ సంధ్యే అంది తను మా బ్యాచ్ టాపర్.. కాలేజ్ టాపర్..US లో కాలేజ్ లో ప్రతి అమ్మాయికి తను డ్రీమ్ బాయ్..ఆఖరికి అక్కడి తెల్లతోలు అమ్మాయిలకి కూడా…కాని వాడు మాత్రం అసలు అమ్మాయిలని పట్టించుకునేవాడు కాదు…మేం ఆరుగురం తప్ప వాడికి వేరే ప్రపంచమే ఉండేది కాదు…నేను ఋత్విక అమ్మాయిలమే అయినా మా మధ్య జెండర్ ఫీలింగ్ ఉండేది కాదు..అందుకే వాడు మాతో చాలా ఫ్రీగా ఉండేవాడు…బట్ వాడు ఒక అమ్మాయిని స్పెషల్ గా చూడ్డం మాత్రం ఇదే మొదటిసారి…అది కూడా నిన్ను అంటూ గమనిక వైపు చూసింది…గమనిక ముఖం అభావంగా ఉంది..
గమన ఏమయ్యిందే ఎందుకలా ఉన్నావ్…ఏం లేదు సంధ్య ఇలాంటి ఆలోచనలు నాకిష్టంలేదు..ఇక ప్రవాహ్ గురించి నా దగ్గర మాట్లాడకు ప్లీజ్ వేడుకుంటునట్టుగా అంది గమనిక…ఎందుకే ప్రవాహ్ నీతో ఏదైనా మిస్బిహేవ్ చేశాడా గాభరాపడుతున్నట్టుగా

అడిగింది సంధ్య…అయ్యయ్యో అలాంటిదేంలేదు ..ప్రవాహ్ చాలా మంచివాడు తన మాటల్లోనే కాదు చూపులో కూడా చిన్న తేడా కూడా లేదు అంది గమనిక..మరెందుకే తన ప్రస్తావన తేవొద్దు అంటున్నావు..తనతో ప్రేమలో పడతావని భయపడుతున్నావా అంది సంధ్య…

ఏదో తప్పుచేసినదానిలా తలదించుకుంది గమనిక…గమన ఏమయ్యిందే ఎందుకలా ఉన్నావ్ అంది సంధ్య…నా గురించి తెలిసి కూడా ఈ మాట ఎలా అన్నావ్ సంధ్య నువ్వు..ప్రేమ అనేది నా లైఫ్ లో ఉండదని నీకు తెలుసు కదా..మనసుని బానిసని చేసి ఆ వ్యక్తి నుండి చిన్న వ్యతిరేకత వచ్చినా ప్రాణాలు తీసుకునేంతగా మనసుని పాడుచేసే ఈ ప్రేమంటే నాకు భయం…ఆ విషయం నీకు బాగా తెలుసు కదా అంది కాస్త హీన స్వరంతో…సారీ గమన నిన్ను నొప్పించాలని కాదు ప్రవాహ్ ని చూస్తున్నంతసేపు నీలో ఏదో మార్పు కనిపించి అలా అడిగాను..అంతేకానీ నీకు బాధకలిగించాలని కాదు…అయినా ప్రతి ప్రేమ ఇలాగే అవుతుందని ఎందుకు అనుకుంటున్నావే… ప్రతి ప్రేమలో వ్యతిరేకతే ఉంటుందని ఆత్మహత్యే మార్గమని ఎందుకు అనుకుంటావ్…నువ్వు చూసిన రెండు మూడు సంఘటనలు అలా ఉండొచ్చేమో కాని ప్రతి ప్రేమ అలాగే ఉంటుంది అనుకోడం కరెక్ట్ కాదేమో గమన ..అనునయిస్తున్నట్టుగా అంది సంధ్య…ఇంతలో గమనిక వాళ్ళ ఇల్లు వచ్చేసింది…గమనిక కార్ దిగి సంధ్యని లోపలికి రమ్మంది…లేదు గమన ఇప్పటికే లేట్ అయింది.. ఐ హావ్ సం వర్క్.

(ఇంకా వుంది)

-ప్రీతీ నోవెలిన్ నోముల

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!