Thursday, April 22, 2021
Home > సీరియల్ > ||నాలో నేను|| -భండారి అంకయ్య(పార్ట్ -3)

||నాలో నేను|| -భండారి అంకయ్య(పార్ట్ -3)

పొద్దుపొడవకముందే నేను లేచి, అటు ఇటు చూసిన.
అన్న కనబడలేదు. తమ్ములిద్దరు నిద్రపోతున్నరు.
“రాజిరెడ్డి పటేల్ పని మీద ఓ సుంకరి పోతుంటే ఆయనతోటి అన్నపోయిండు”.దాద మొకం కడుక్కొని వచ్చి చెప్పిండు. రెండు గ్లాసుల్లో చాయ తీసుకోని అవ్వ వచ్చింది. చిన్నప్పట్నుంచే మాకు ఈ చాయ అలవాటైంది!
“అంకయ్యా ! నువ్వోసారి మొహ్మద్ అలీ సార్ ను కలిసి రా ”
“ఎందుకు?” నేను దాదను భయంగా అడిగిన .
“ఆయనక్కూడా జరిగిందంతా తెల్వాలెకదా?”
ఇంతలో ఎవరో వచ్చి ఆబ్కారోళ్ళు, చెట్లకు నంబర్లేసుటానికి ఇవాళ వస్తరని చెప్పిండు.
మా దాద దగ్గరికి పొద్దున్నే ఎవరో ఒకరు వస్తనే ఉంటరు.
మంచి చెడ్డలు మాట్లాడ్తరు. ఆయన పెద్దగౌడ్ !
కొంచెం అక్షర పోవిడి ఉన్నది. పద్యాలు బాగా పాడ్తడు.
కోలాటం వేస్తుంటే చూడ వశం కాదు.
నేను, సత్యనారాయణ స్నానం చేసి, ఉతికిన బట్టలు తొడుక్కొని తయారైనం.
రాత్రి అన్నంల పెరుగు పోసి అవ్వ
మా ఇద్దరికి పెట్టింది. మేము తిని బడికి పోయినం .
“ఏందీ బేటా ! ఎందుకొచ్చినవ్ ?”
నన్ను చూడంగానే సార్ దగ్గరికి తీసుకోని అడిగిండు .
జరిగిందంతా పొల్లుపోకుండా సార్ కు చెప్పిన .
“తెల్సి, తెల్వక ఒకడు తప్పు చేసిండు . నిజమే.
అది మనుసులో పెట్టుకొని నువ్ భయపడ్తవా ?
మీ అన్న, ఇంకా మీ స్నేహితులున్నరుకదా !
అందరితో కల్సి బడికిపో. ఒక్కనివి తిరుగొద్దు.
నలుగుట్ల ఉంటే ఎవరేం చేయలేరు .
నువ్ చాలా హుషారు పిలగానివని మీ అవ్వ కు చెప్తే కరీంనగర్ తోలిచ్చింది”
నేను మారు మాట్లాడకుండా ఆయన్నే చూస్తున్న.
“ఏందీ ?…. మాట్లాడ్తలేవ్ ?!”
“ఇక్కన్నే చదువుకుంట”
“వద్దు బేటా ! కరీంనగర్ నుంచి భయపడి అంకయ్య
ఇక్కడికే వచ్చిండని, పిల్లలు నిన్ను చూసి నవ్వుతరు.
నువ్వక్కన్నే చదువుకోవాలి. నేనొచ్చి మీ పెద్ద సార్ తో
మాట్లాడ్త . ఎప్పుడుపోదాం?” సార్ ప్రేమగా అడిగిండు.
“దాదను అడిగి చెప్త” నేను సిగ్గుతో తలదించుకున్న.
“నేను పొద్దుగాల వచ్చి మాట్లాడ్త. నువ్వింటికి పో ”
ఎవ్వర్నీ చూడబుద్ది కాలేదు. ఏడుస్తూ ఇంటికి పోయిన.
** **
సంపతి చంద్రయ్య పటేల్ కు మంచిపేరు .
ఎటువంటి పదవి లేకపోయినా వాళ్ళింట్ల
ఎప్పుడు ఊరి పంచాయితీలు జరిగేది.
ఆయన మాటకు ఎవ్వరు ఎదురు చెప్పేది కాదు! ఆయనరోజూ దొడ్డి కాడికి పోయేటప్పుడో,
వచ్చేటప్పుడో మా ఇంటి ముందర ఆగి అవ్వ తో నో,
దాద తో నో మాటలు కలిపేటోడు .
వాకిట్లనె నిలబడేది కానీ, లోపలికి రాకపోయేది.
ఓ ఐదారుగురు తప్ప, ఎవరైనా ఇంట్లకొచ్చే మాట్లాడేది.
ఈ పెద్దోళ్ళు లోపలికొస్తే నామోషి అని అనుకుందురేమో ?
“మల్లవ్వా !” చంద్రయ్య పటేల్ పిలుస్తున్నడు.
“పటేలా !” అంటూ వాకిట్లో కొచ్చి నిలబడ్డది.
నేను అవ్వ కొంగు బట్టుకొని ఆమె వెనుక నిల్చున్న.
అయన నన్నే చూస్తున్నడు.
“అరేయ్ ! ఇట్రా, బడి ఎగ్గొట్టి వచ్చినవా”
ఆయన మాటల్లో ఆప్యాయత, ఆందోళన కనబడింది.
” పటేలా ! వీడు వట్టి పిరికోడు !! మీ మాట కాదనలేక
కర్నాగరం తొలిచ్చినం కానీ ….”
“పెద్దోడు చంద్రయ్య ఇంకా చానమంది వున్నరుకదనే,
భయమెందుకు ”
“నిజమే.. కని, ఏమన్నైతే?” కొంగుతో కంటినీరు తుడ్చుకుంది.
“ఎంగాదు. నువ్వేడుస్తుంటే వీడు డీలా పడ్తడు ”
మా అవ్వను సముదాయించిండు.
“అంకయ్య! రేపింటికి రా . కిష్టారెడ్డికి వాళ్ళవ్వ కారప్పొడి,పప్పులు,ఇంకేమో చేసిపెట్టింది.”
ఆయన మాట వినంగనే సరే నంటూ ఆయన కండ్లల్ల చూసిన.
ఆయన చూపు గొప్ప ఓదార్పు!
ఆయనపోతుంటే నాలో ఎన్నో ఆలోచనలు!!
అందరూ నా గురించి మాట్లాడుతుంటే
చేసిన తప్పు ఇప్పిడిప్పుడే తెలుస్తున్నది.
“నేను భయపడొద్దు ! ధైర్యంగుండాలె !!”
మనుసు నిమ్మలం చేసుకొని తమ్ముని దగ్గరికి పోయిన.
వాడు రెండో తరగతి.. ఎదో పుస్తకం తీసి
కందీలు వెలుగులో చదువు కుంటున్నడు.
కొంచెం సేపటికి అవ్వ వచ్చి ఇద్దరికీ అన్నం పెట్టింది.
** **

ఒక రోజు గడిచింది. నాకు కొంత బరువు దిగింది.
జరం దెంకపోయింది . దాద సంబరంగా చూస్తూ..
” ఒకసారి నువ్వు రాజిరెడ్డి పటేల్ ఇంటి దాక పోయి
ఆయన ఎమన్నా ఇస్తే తీసుకరా, ఎం మాట్లాడకు” .
తల ఊపి వాళ్ళింటికి పోయిన .
ఇంటి ముందు సుంకరి బర్చి కట్టె పట్టుకొని నిల్చున్నడు.
” ఇప్పుడెవలను రావద్దన్నడు పటేల్.” అని నన్ను ఆపిండు.
“నేను రుక్కవ్వ తో మాట్లాడి వస్తా ” అనంగనే
నా మొకం చూసి ఇంకేం మాట్లాడలేదు.
వాకిలికి కుడి పక్క బంగ్లా. ఎదురుగ చతుశ్శాల భవంతి.
ఎత్తు మీద ఉన్నది. ఐదారు తంతెలెక్కి లోపలి కి పోయిన .
రాజిరెడ్డి తల్లి రుక్కవ్వ నన్ను చూడంగనే –
” ఏందిరా అంకయ్య ! కర్నాగురం నుంచి ఎప్పుడొచ్చినవ్ ”
“అత్తా ! జరమొస్తే మొన్ననే వచ్చిన.”
“గట్లన ! సరే కూచో. గిర్దావర్ వస్తున్నడని కోడ్ని కోయించినం,
గారెలు కూడా చేస్తున్నం . తిని పోదువుగాని.”
“ఇప్పుడు వద్దొత్త ! పెద బావను కలిసి రమ్మని
దాద చెప్తె వచ్చిన .”
“గట్లన ! లోపల అర్రల ఎదో రాస్కుంటున్నడు.
పిలిస్తె ఏమన్నంటడేమో”
కొడుకంటే ఎంత ప్రేమనో.. అంత భయం ఆమెకు !
మా మాటలు విని ఆయనే వచ్చిండు ,
చేతికంటిన సిరాను తుడుచుకుంటూ
” బామ్మర్దీ.. దాద తోలిండా? నాకు ఈ ‘రోజునాంచా’
(కొత్వాలీ దిన చర్య) రాసుడు తోనేసరిపోతుంది.
రేపు పని ఐద్దని చెప్పు “అంటూ మల్ల అర్రలకు పోయిండు.
మా దాదను ‘మామ’ అని పిలుస్తడు ప్రేమతో .
ఇంత ప్రేమెందుకో ఈరోజు దాదను అడగాలని
మనుసులో అనుకుంటూ ఇంటికిపోయిన.

రాజిరెడ్డి చెప్పిన మాట దాద చెవిలో వేసిన.
ఆయన విని సరేనన్నడు.
“దాదా !”… ” ఏందిరా ?”….
“నీ మీద రాజిరెడ్డి బావకు ఇంత ప్రేమెందుకు?”
నన్ను ఆశ్చర్యంగా చూసి దగ్గరికి తీసుకున్నడు.
“మేము చూసుకున్న గడియ అటువంటిది.రాత్రికి చెప్త.”
నాక్కూడ గిర్దావర్ ను చూడాలన్న తహతహ!!
అవ్వక్కూడా చెప్పకుండా తూర్పు దిక్కు అడుగులేసిన.
మా చావడి ఊరి నడిబొడ్డున ఉన్నది.
దాని వెనుక పీరీల గద్దె.
సర్కారోల్లస్తే చావట్లనే కూచుంటరు.
అక్కడ ఐదారుగురు అటు.. ఇటు… తిరుగుతున్నరు. అలుకుపూత చేయించినట్లున్నది. ముందట నీళ్లు చల్లిండ్రు.
ఒకాయన కట్టెకుర్చి తెచ్చి వేసిండు.
ఇంకో ఇద్దరు కల్సి రెండు పెద్ద పర్దాలు తాడుతోటి కట్టి
ఒక పక్కకు జరిపివుంచిండ్రు. అవి దగ్గరికి అంటే
తిని తాగే టప్పుడు లోపలున్న మనుషులు కనబడరు.
ఓ మంచం, రెండు చెద్దర్లు తెచ్చి వేసిండ్రు.
చిన్న టేబుల్, దాని మీద రంగుల గుడ్డ!
ఇవన్నీ గిర్దావర్ వస్తున్నాడని పటేల్, పట్వార్లు చేయిస్తున్నరు.
చూడంగ చూడంగ ఓ గంటకు గుర్రం మీద గిర్దావర్ వచ్చిండు.
గద్దెలమీద కూచునోళ్లు లేచి నిల్చున్నరు.
గిర్దావర్ దర్జాగా అటుఇటు చూస్తున్నడు.
వెనుక కూచున్న చెప్రాసీ దిగి,
గుర్రం కళ్లెం పట్టుకొని నిల్చున్నడు.
అప్పుడు కిందికి దిగిండు గిర్దావర్!
బాగా పొడుగున్న శేర్వాణి వేసుకున్నడు.
తెల్ల పైజామా,కాళ్ళకు బూట్లు, నెత్తిమీద
గుండ్రటి ఎర్రరంగు టోపీ దాని మీద నల్లరంగు కుచ్చులు. నాకు నవ్వొచ్చింది ఆయన్నిచూసి!!
ఆయనకందరు “ఆదాబ్” అంటూ సలాం చేసిండ్రు.
రాజిరెడ్డి ఒక్కనికే చేతిల చేయి కలిపిండు.
చావట్ల వేసిన కుర్చీల గిర్దావర్ ఒక్కడే కూచున్నడు.
పట్వారి రాచర్ల వెంకట్రాజం కొంచెం సేపటికి బయటకొచ్చిండు.
ఒక్క రాజిరెడ్డి తోనే చాల సేపు మాట్లాడిండు.
అందరు దూరంగా పోయి గుసగుసలు పెట్టుకున్నరు.
ఇంతల్నె పటేల్ ఇంటికాన్నుంచి మూడునాలుగు గిన్నెలొచ్చినై.
కుమ్మరాయినా నీళ్లు పెట్టిండు.
ఇంకో సుంకరి పర్దాలు దగ్గరికి జరిపిండు.
ఇంకేంది… ఇగ మంచిగ తింటడనుకున్న.
ఆ దర్జా చూస్తుంటె మా దొర కూడా గిర్దావర్ ముందు
దిగదుడుపే అని పించింది.
నాకు ఆకలైతుంటే ఇంటికి పోయిన..
** **
రాత్రి తినంగనే దాద మంచం మీద కూచున్న.
ఆయన కండ్లు మూసుకుని ఆలోచనలో మునిగిండు.
“దాద… చెప్పు దాద.. నీ కథ చెప్పు ” నేను తొందరపెట్టిన.
ఓ గంటసేపు తనజీవితాన్ని నా ముందు పరిచిండు.
మా దాద కథ వింటే నాకు కండ్లల్ల నీళ్లు తిరిగినై.
ఆయన చెప్తుంటే బాధ గొంతులో బయటబడ్డది.
చిన్నప్పుడే వాళ్ళవ్వ దూరమైంది.
తండ్రి జంగయ్య పన్నేడేండ్లప్పుడే చనిపోయిండు.
చెల్లె సుభద్ర, తను చిగురుమామిడి లో ఉండలేరని,
మేనత్త జాగిరి నర్సవ్వ తంగళ్లపెల్లికి తీసుకొచ్చుకున్నది.
ఆమె భర్త అంకయ్య. కొంచెం కోపిష్టి !
అయినా వీళ్ళను బాగనే చూసుకున్నడు.
పదహారేండ్లకే తాటి చెట్లెక్కుడు నేర్పించిండు.
గీత పనికూడా వచ్చింది.
ఇంక బతుకు బాటకు ఢోకా ఉండదని
శనిగరం ‘లక్ష్మీదేవి’ తో పెండ్లి చేసి వేరే ఉంచిండు.
తర్వాత కొంత కథ తెలిసిందే!
ఇద్దరు భార్యలు , ఇద్దరు కొడుకులు వచ్చే సంపాదన చాల్తలేదు.
ఇంకేదైనా చేసి ఎక్కువ సంపాయించాలె.
ఓ ఇల్లు కట్టుకోవాలె, పిల్లలను బాగ చదివించాలె!
ఈ ఆలోచనలకూ హైదరాబాద్ లో ఉంటున్న
బుర్ర మల్లయ్య ఓ తొవ్వ చూపిండు.
పట్నం వస్తె నీ బాధలన్నీ పోతయని చెప్పిండు.
ఓ వారం రోజులకు మూట.. ముల్లె.. కట్టుకొని
అందరం పట్నం బస్సెక్కినం.
ఇల్లుచూస్కుంటూ లక్మిదేవవ్వ తంగళ్లపల్లిలనే ఉన్నది.
పట్నం ల గౌలి గూడా గురుద్వారా దగ్గర ఓ సిక్కులాయిన ఇంటి పక్కన జాగా చూపిస్తే అక్కడ ఠికానా పెట్టినం.
వాళ్లకు పిల్లల్లేరు. మమ్మల్ని మంచిగ చూసుకునేది.
అపుడపుడు తింటానికి ఏమైనా పెట్టేది.
కొంచెం కుదురుకున్నంక నాల్గురోజులకు
అవ్వ దాద కల్సి ఓ నిర్ణయం తీసుకున్నరు.

(ఇంకావుంది..)

-అంకయ్య భండారి,
9032742937

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!