Sunday, October 2, 2022
Home > సీరియల్ > || ఎడారి పువ్వు || -ప్రీతీ నోవెలిన్ నోముల (పార్ట్ 4)

|| ఎడారి పువ్వు || -ప్రీతీ నోవెలిన్ నోముల (పార్ట్ 4)

ఇంట్లోకి రమ్మని అడిగితే పనుందని చెప్పి సంధ్య వెళ్ళిపోయింది…కాసెపటివరకు గేట్ దగ్గరే నిలబడిపోయాను సంధ్య మాటలు గుర్తొచ్చి…తరువాత నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లాను..లోపలికి వెళ్ళేసరికి నాన్న భోజనం చేస్తున్నారు…మీకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి మా నాన్న…

అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాతో మాట్లాడిన మొదటివ్యక్తి నాన్న…అప్పటి నుండి నేను ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి కూడా నాన్నే..

మామూలుగా నేను మాట్లాడ్డం తక్కువ కానీ నాన్న ఎదురుగా ఉంటే ఎన్నో విషయాలు గుర్తొస్తాయి…నా జీవితానికి సంబంధించిన ప్రతి విషయం నాన్నకి చెప్తాను..

ఆయనే నాకు అన్ని…ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నాన్నే నా జీవితం…తనని దాటి ఇంకో ప్రపంచాన్ని చూడలేనంత ఇష్టం తనంటే నాకు…

ఇప్పుడున్న నా ఈ మానసిక పరిస్థితి నాన్నకి చెప్పాలి అనిపించింది..కాని కాసేపు పడుకొని లేస్తే మరచిపోగలిగిన విషయం గురించి తనతో చెప్పి తనను కూడా నాలా సందిగ్ధంలో పడేయడం ఎందుకు అనిపించింది…

అందుకే నాన్న దగ్గరికి వచ్చి తనని పలకరించి తిరిగి నా రూంలోకి వెళ్ళిపోయాను…
తలంతా భారంగా ఉంది…వెళ్లి హాయిగా తలస్నానం చేసి వచ్చాను…ఏదో కొంత బరువు తగ్గినట్టుగా అనిపించింది…తల తుడుచుకుంటూ వచ్చి బాల్కనీలో కూర్చున్నాను…

నాకు చిన్నప్పటి నుండి ఉన్న అలవాటు డైరీ రాయడం…నన్ను చూసుకోడానికి,నా లోపాలు నాకు కనిపించడానికి,మార్చుకోడానికి డైరీ ఉపయోగపడుతుందని నాన్న నాకు దీనిని రాయడం అలవాటు చేశారు..
డైరీ రాయడంతోనే నా రోజు ముగుస్తుంది..లోపలికి వెళ్లి డైరీ తెచ్చుకొని ఉయ్యాలలో కూర్చొని రాయడం మొదలుపెట్టాను…

పదిహేను నిమిషాలు పట్టింది రాయడానికి…
రాయడం మొత్తం పూర్తి అయ్యాక తిరిగి చదవడం నా అలవాటు…అది చదువుతున్నంతసేపు నాకు ఆశ్చర్యంగా అనిపించింది…

మామూలుగా రోజు మొదలయినదగ్గరినుండి రోజు పూర్తయ్యేంత వరకు జరిగిన ప్రతి విషయాన్ని క్లుప్తంగా రాసుకుంటాను…కాని ఈ రోజు నేను రాసింది కేవలం కొన్ని గంటలు జరిగిన విషయాన్ని మాత్రమే …అది కూడా ప్రవాహ్ నవ్వుతో మొదలై తను నా చెవిలో నా పేరు బాగుంది అని చెప్పేంత వరకు మాత్రమే.. అంతకుముందు కాని ఆ తరువాత కానీ జరిగిన మాట్లాడిన ఏ ఒక్క విషయాన్ని నేను కనీసం రాయను కూడా రాయలేదు…
ఇందాక నేను అనుకున్నట్టుగా పడుకొని లేస్తే మరచిపోయే విషయంలా ఇది అనిపించలేదు..
నాలో ఈ మార్పు నాకు చాలా స్పష్టంగా తెలుస్తుంది…నాకు తెలీకుండా ప్రవాహ్ నా ఆలోచనలని ఆక్రమించుకున్నాడు…

ఈ క్షణం నాకు అర్ధమైన విషయం ఏంటంటే నేను ఎప్పటికి గుర్తుంచుకోవాలి అనుకుంటున్న విషయం,,నిద్రలోనే మర్చిపోవాలి అనుకునే జ్ఞాపకం రెండూ కూడా ప్రవాహ్…
ఒకే విషయం గురించి రెండు విరుద్ధమైన అభిప్రాయాలు ఢీ కొనడం ఇదే మొదటిసారి నా లైఫ్ లో…
తగ్గిపోయింది అనుకున్న తలభారం మళ్ళీ మొదలైనట్టుగా ఉంది..దేనికి నేను లొంగకూడదు అనుకుంటున్నానో ఆ ప్రేమ నన్ను ఆక్రమిస్తునట్టుగా ఉంది..

ఇక మీదట నాతో నేనే యుద్ధం చేయబోతున్నానని మాత్రం అర్థమైంది…నాలోని పరస్పర విరుద్ధమైన రెండు అభిప్రాయాల మధ్య నలిగిపోబోతున్న నన్ను తలుచుకుంటే నాకే జాలిగా ఉంది…
ఎంతసేపు అలా కూర్చున్నానో తెలీదు…

ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో లోపలికి వెళ్లి మొబైల్ తెచ్చుకున్నాను…డిస్ప్లే పైన సంధ్య అన్న పేరు చూడగానే నవ్వొచ్చింది…

ప్రవాహ్ అంటే నాకున్న ఫీలింగ్ ఏంటో తెలుసుకునేదాక దీనికి నిద్రపట్టదు…ఫోన్ లిఫ్ట్ చేసాను…హాయ్ సంధ్య ఏంటే ఇంకా పడుకోలేదా అని అడిగాను…ఇంకా లేదు గమన కాస్త అనీజీగా ఉంది…నిద్రరాడం లేదు…నా సంగతి వదిలేయి.. నువ్వు ఈపాటికి పడుకొని ఉంటావు కాల్ చేయనా వద్దా అని అలోచించి చేసాను..
నువ్వేమో ఇంకా పడుకోకుండా అలాగే ఉన్నావు ఏంటి అని అడిగింది.. దాని ఇంటెన్షన్ నాకు అర్థమైంది..నేను పడుకోకుండా ప్రవాహ్ ఆలోచనల్లో ఉన్నానేమో కనీసం ఇప్పుడైనా తనకి చెప్తానేమో అని దాని ఆశ…
కానీ ప్రవాహ్ గురించి నా ఆలోచనలు నన్ను దాటి పోకూడదు అని నిర్ణయించుకున్నాను…ఆఖరికి నాన్న కి కూడా చెప్పకూడదు అని నిర్ణయించుకున్నాను…

అసలు నాకే ఎలాంటి క్లారిటీ లేని విషయాన్ని వీళ్ళతో ఎలా పంచుకోను… బహుశా వీళ్ళిద్దరిదగ్గర నేను దాచబోతున్న మొదటి విషయం కావొచ్చు…చివరిది కూడా ఇదే కావాలి అని కోరుకుంటున్నాను..ఫోన్ పట్టుకొని నా ఆలోచనల్లో ఉండగా ఫోన్ లో నుండి గమన గమన అంటూ సంధ్య గొంతుతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను…
హ సంధ్య చెప్పు లైన్ లొనే ఉన్నాను..

మరెంటే నాపాటికి నేను పిలుస్తూనే ఉన్నాను ఉలకవు పలకవు అంటూ కేకలు పెడుతుంది సంధ్య…
అమ్మ తల్లి అదేమీ లేదు డైరీ రాస్తూ నీతో మాట్లాడుతున్నాను..అందుకే లేట్ రిప్లై అంతకుమించి ఏమిలేదు అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేసాను…

కానీ సంధ్య నుండి తప్పించుకోడం అంత తేలిక కాదు…అతి చిన్న మార్పుని కూడా ఇట్టే పసిగట్టే నేర్పు తనది…ఇక పైన ప్రవాహ్ విషయంలో నేను మరింతగా జాగ్రత్తగా ఉండాలి…ఒక అరగంటపాటు తనతో మాట్లాడాక ఫోన్ పెట్టేసి వచ్చి పడుకున్నాను…

మొదటిసారి నా మీద నాకే కోపంగా ఉంది…నాకు ఏమి కావలి ఏది వద్దు అని చాలా ఖచ్చితంగా నిర్ణయించుకోగలిగిన నేను,వాటికీ తగ్గట్టుగానే నా మనసుని మార్చుకోగలిగిన నేను ప్రవాహ్ విషయంలో ఎందుకిలా అవుతున్నాను…అలా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలీలేదు..ఉదయం అమ్మ వచ్చి లేపేదాకా మెలకువ కూడా రాలేదు..అంత లేట్ లెగటం చూసి అమ్మ కంగారుగా ఏంటమ్మా ఒంట్లో బాలేదా అంటూ నుదుటిపైన చేయి వేసి చూసింది…అదేంలేదమ్మా నైట్ కాస్త లేట్ గా పడుకున్నాను అంతే. నువ్వేం కంగారుపడకు అని చెప్పి ఫ్రెష్ అవడానికి వాష్ రూంకి వెళ్లాను…

15 నిమిషాల్లో రెడీ అయ్యి కిందకి వచ్చాను… కింద టిఫిన్ చేయకుండా నాకోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు నాన్న.. అప్పటిదాకా ఆ విషయమే మర్చిపోయాను…
నాన్న తనకి తాను పెట్టుకున్న రూల్ మార్నింగ్ టిఫిన్ నైట్ డిన్నర్ నాతో కలిసి చేయడం..చదువు,ఉద్యోగం అంటూ నేను ఆఫీస్,బిజినెస్ అని తను ఎప్పుడూ బిజీగా ఉండడం వల్ల మేం కలిసి స్పెండ్ చేసే టైం తక్కువ..
అందుకే కనీసం ఈ రెండు సందర్భాల్లో అయినా మేం కలిసి ఉండాలని నాన్న కోరిక..నిద్రలో పడి నాన్న వెయిట్ చేస్తూ ఉంటారనిమర్చిపోయాను…నాకోసం తను అలా వెయిట్ చేస్తూ తినకుండా ఉండడం చూసి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి..సారీ నాన్న నైట్ లేట్ గా పడుకోడం వల్ల ప్రొద్దుటే లెగలేకపోయాను..
మిమ్మల్ని ఇలా వెయిట్ చేపించాను..
ఆమ్ సారీ నాన్న అంటూ నాన్నని అల్లుకుపోయా…
సారీ ఏంట్రా తల్లి..నీకోసం వెయిట్ చేయడంలో ఈ నాన్నకి తృప్తి ఉందిరా…నువ్ హాయిగా పడుకున్నావ్ కదా అది చాలు నాకు…రారా తల్లి కూర్చో పాపం మీ అమ్మ మనకోసం ఏదో చేసింది..
తినలేదంటే మళ్ళీ అలిగి కూర్చుంటుంది అంటూ అమ్మ వైపు చూసారు నాన్న…అవును మరి ఈ తండ్రి కూతుళ్లు తిని నాకు అవార్డులు రివార్డులు ఇస్తారని చూస్తూ కూర్చున్న ఇక్కడ అంటూ చిరుకోపం ప్రేమ కలిపి మాకు వడ్డించడం మొదలుపెట్టింది అమ్మ…ఇదే నా చిన్ని అందమైన ప్రపంచం…ఇంత ప్రేమ మధ్య పెరిగాను కాబట్టే వేరే ఏ ప్రేమ నాకు కావాలి అనిపించలేదు నాకు….
ప్రవాహ్ కనిపించేదాక అంతా బాగానే ఉండింది…తనని చూసాకే చిన్న డిష్టబెన్స్ వచ్చింది…ఇక మళ్ళీ ఇప్పుడు తనని కలిసే అవకాశంలేదు కాబట్టి నెమ్మదిగా ఈ జ్ఞాపకాల్ని చేరిపేయొచ్చు అని ఆలోచిస్తూనే టిఫిన్ చేయడం కంప్లీట్ చేసాను…అంతసేపూ పడుకున్నా సరే ఇంకా ఎందుకో నిద్ర మత్తు అలానే ఉంది..తినడం అయిపోగానే నాన్న బైటికి వెళ్ళిపోయారు..
నేను తిరిగి నా రూంలోకి వెళ్ళిపోయాను…ఈసీ చైర్ లో కూర్చొని అలా ఆలోచిస్తూ ఉండిపోయా..
కాసేపటికి కింద నుండి సంధ్య గొంతు వినిపిస్తుంది…అమ్మతో మాట్లాడుతుంది..తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవాహ్ గురించిన నా ఆలోచన తెలియకూడదు..అందుకే వెంటనే లేచి బుక్ పట్టుకొని చదువుతూ కూర్చున్నాను తను పైకి వచ్చేసరికి….
తల్లి పొద్దుటే బుక్ పట్టుకొని కూర్చున్నావా నీ ఓపికకిమెచ్చుకోవచ్చు అంటూ వస్తూనే మొదలెట్టేసింది…
మరేం చేయంటావ్ చెప్పు ఈ పుస్తాకాలే నాకు మంచి వ్యాపాకాలు మంచి నేస్తాలు…
ఓహో అవే నీ నేస్తాలైతే మరి నేనెవరినో అంది బుంగమూతి పెడుతూ…
హహహ అవి నేస్తాలు నువ్ ప్రియనేస్తానివి అంటూ హాగ్ చేసుకున్న దాన్ని..
సరే సరే కాని రెడీ అవు మనం బైటికి వెళ్ళాలి అంటూ హడావిడి చేసింది సంధ్య…మళ్ళీ ఏ ఫంక్షన్ కే బాబు…ఈ సారి నేనైతే ఫంక్షన్స్ రాను అని చెప్పేసా…
ఎప్పుడూ ఫంక్షన్ కే తీసుకెళ్తానా ఏంటి…ఫ్రెండ్స్ అందరం కలిసి బైటికి వెళ్తున్నాం అందుకే నిన్ను తీసుకెళ్లడానికి వచ్చా…త్వరగా రెడీ అవు ప్రవాహ్ వాళ్ళని డైరెక్ట్ గా ఇక్కడికే రమ్మని చెప్పా…ఆల్రెడీ వాళ్ళు బయదేరి ఉంటారు త్వరగా కానివ్వవే ప్లీజ్ అంది బతిమాలుతున్న ధోరణిలో…
అది కాదు సంధ్య మీరంతా వెళ్తుంటే మధ్యలో నేనెందుకు…చాలా రోజుల తరువాత కలిశారు కదా మీరు ఎంజాయ్ చేయండి..

(ఇంకా ఉంది…)

-ప్రీతీ నోవెలిన్ నోముల

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!