Sunday, October 2, 2022
Home > సీరియల్ > ||నాలో నేను|| -భండారి అంకయ్య(పార్ట్ -4)

||నాలో నేను|| -భండారి అంకయ్య(పార్ట్ -4)

నా మీద ఎండపొడ పడుతుంటే తెలివైంది.
లేచి కూచున్న. ఇంతల అవ్వ నా దగ్గరకొచ్చింది.
“లే… లే.. జల్దీ మొకం కడుక్కో . మేమంతా తానాలు కూడా చేసినం . నువ్వొక్కనివే మిగిల్నవ్”.
నాకు రాత్రి వాళ్ళ మాటలు యాదికొచ్చి దబ దబ పోయి పండ్లు తోముకొని నల్ల దగ్గర కూచున్న.
అవ్వ నాలుగు చెంబుల నీళ్లు పోసింది
అప్పటికే అవ్వ, దాద స్నానం చేసి,ఆంజనేయ స్వామి, సత్యనారాయణ స్వామి ఫోటోలకు దండం పెడుతున్నరు.
అప్పుడు ఇంటి యజమాని, ఆయన భార్య ఇద్దరు వచ్చిండ్రు.
వాళ్ళ కాళ్ళకుమోక్కి దీవెనలు తీసుకున్నరు.
కొబ్బరికాయ కొట్టి అందరికి ప్రసాదం పెట్టిండ్రు.
కట్టెల పొయ్యి మీద అవ్వ పాలు పెట్టింది.
అందరికి చాయ్ ఇచ్చింది .అన్న బడికి పోయిండు.
ఝాముపొద్దెక్కినంక బుర్ర మల్లయ్య మామ వచ్చిండు.
ఏమేం చేయాల్నో మాట్లాడుకున్నరు.
ఆయన దాద కు చెప్తున్నడు.
” ఇది గౌలిగూడ. ఇట్నుంచి బస్టాండ్ దిక్కు
ఎక్కువ గొల్ల కుర్మలే .మన తంగళ్లపల్లి లెక్కనే ఉంటరు.
వీళ్ళ బతుకు దెరువు పాలిచ్చే బర్రెలు, ఆవులే!.
మనకు పట్టు పాలు పుష్కలంగా దొర్కుతయి.”
ఇద్దరు చాయ్ తాగి బజార్ కు పోయిండ్రు .
ఒక బొగ్గుల కుంపటి,నీళ్లు కాగపెట్టే చిన్న రాగి బాయిలర్,
ఇరవై చిన్న గాజు గ్లాసులు,రెండు రౌతెండి పెద్ద గిన్నెలు,
శెక్కరి, చాయ్ పత్తా … ఇంకా ఏమేమో తెచ్చిండ్రు
ఉడుకు నీళ్ళతోటి రాగి బాయిలర్ ను, గిన్నెలు,
గ్లాస్ లను అవ్వ బాగా తోమింది.
ఓ పెద్దగిన్నె నిండా చాయ్ చేసి బాయిలర్ ల నింపింది.
దాద కొంచెం తిని, ఓ సంచి లో ఇవన్నీ పెట్టుకొని,
కుంపట్ల బొగ్గులు పోసి, దాని మీద వైర్ తో బాయిలర్ని బిగించికట్టి బయలు దేరిండు.
అవ్వ రోడ్డుమీద గురుద్వార దాక వచ్చి సాగతోలుతుంటే
నేను చూసుకుంటూ బొమ్మోలె నిలబడ్డ.
ఏందో అంతా కొత్తగా అనిపించింది!
తాటిచెట్టెక్కెటోడు వేడి చాయ అమ్ముకోవాలన్న
దాద ఆలోచనలకు డంగైపోయిన.
** **

గౌలిగూడ నుంచి కోఠి దాక చక్కగా ఒక్కటే రోడ్డు.
బాణమేసినట్టు కనబడుతుండే.
రోడ్డుపక్కల దుకాణాలు, బంగ్లాలు ఎక్కువ లేకుండే.
చౌరస్తా దగ్గర ఖాళీ స్థలంలో మావూరి మేరొళ్ల నర్సయ్య, ఇంకో ఇద్దరు బట్టలు కుడుతుండిరి.
వాళ్ళ దగ్గరికి పోయి ఇవన్నీ పెట్టుకొని దాద కూచున్నడు.
వాళ్ళదగ్గరికి వచ్చేటోళ్లు, రోడ్డుమీద పోయేటోళ్లు, పనిపాటలోళ్లు వచ్చి చాయ తాగి మెచ్చుకున్నరు.
మొదటి రోజని అందరికి పైసల్ లేకుంటనే చాయ్ పోసిండు.
కొంచెం దూరం ల పెద్ద హోటల్ ఉన్నది.
అక్కడ కప్పు చాయ్ బ్యాడ అంటే రెండణాలు( నిజాం సిక్కా రూ. కి 16 అణాలు). దాద ఆరుపైసలకే (యెక్అణా) అమ్ముడు మొదలు పెట్టిండు.
వారం రోజులకే గిరాకీ బాగా పెరిగింది.
చాయ్ కమ్మగుండేది మరి !
ఇంటికొచ్చి ఇవన్నీ దాద చెప్తుంటే నోరు తెర్సుకొని ఇనుకుంటు కూసునేది.
** **

అవ్వ రోజు ఐదారు సేర్ల పట్టుపాలు తెచ్చి బాగా మరగబెట్టేది.
ఇంకోగిన్నెల నీళ్లు బాగా గరం చేసి అండ్ల చాపత్త వేసేది,
కొంచెం సేపటికి చెక్కరేసి కలిపేది. ఆఖరకు పాలు పోసేది.
అప్పుడు ఘరమ్ ఘరమ్ చాయ్ తయ్యార్ !
ప్రతిరోజు పొద్దున్నే ఉన్నదేదో తిని అడ్డమీదికి పోవుడు,
12 గం.ల లోపల్నే ఇంటికొచ్చి ఇంత తిని పండుకునుడు,
మల్ల 4 గం.ల కు అవ్వ చాయ్ చేసి ఇచ్చుడు,
దాద కోఠి పోయి అమ్ముకునుడు.ఇది రివాజయింది!
రోజు రాత్రి పైసల్ లెక్కపెట్టుకునేది.
చానా పైసల్ వచ్చేది. అవన్నీ దాసిపెట్టి తెల్లారటికి
అవసరమున్న చాపత్త చెక్కరి రాత్రే కొనుక్కొచ్చేది .
పొద్దుగాల లేవంగనే స్నానం చేసి ఆంజనేయస్వామి దండకం చదివి దాదా అడ్డా మీదికి పోవుడు
మాకు గమ్మత్తుగా అనిపించేది.
పైసల్ చూస్తుంటే సంబురం అయ్యేది.

నేను, మా అన్న కన్నా మూడేళ్లు చిన్న.
అక్కడ దగ్గర సర్కారీ బడి లేకుండె.
ఓ అయ్యగారు ఖానిగి బడి నడిపించేది.
అన్న మొదటి తరగతి అక్కన్నే చదువుతుండే.
నేను పోయి “అ..ఆ..” లు దిద్దుతుంటి.
మేముండే గురుద్వారాకు కొంచెం దూరంలో
ఓ చిన్న గుడి ఉండేది. అది దాటి పొతే పెద్ద మసీదు.
జనం మాట్లాడుతుంటే ఆ భాష తెల్వకపోయేది.
పంజాబీ, ఉర్దూ, మరాఠి ఇంకేదో అని చెప్పుకొనే వాళ్ళు. గుర్రాల మీద తిరిగే మిల్ట్రీ వాళ్ళు హిందీ, ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు. అక్కడందరూ కాలినడకనే బజార్ల తిరిగేది. కొంచెం ఉన్నోళ్లు సైకిళ్ళ మీద పోతే, నవాబులు, జాగీర్దార్లు గుర్రాలబండ్ల మీద పోయేది.
అయినా అందరు కల్సి మెల్సి ఉండేది.
ఒక్కరోజుకూడా లొల్లి జరగలేదు.
చిన్న-పెద్ద అందరు కల్సి బత్కుడు, అప్పటి హైదరాబాద్ గొప్పతనం. ఇవన్నీ మాకు దాద చెప్పేటోడు.
** **

చూస్తుండంగానే ఓ యాడాది గడిచింది!
ఓ రోజు పొద్దున్నే రాజిరెడ్డి బావ ఇంట్లకు రాంగానే
అవ్వ అట్లనే బీరిపోయింది. మాట రాలేదు.
గుడ్లల్ల నీళ్లు తిరిగినై. ఒక్కసారి శోకం పెట్టింది!
దాద ఆయన వెనుకనే వచ్చిండు.
అవ్వను దగ్గరికి తీసుకోని ఏడవద్దన్నాడు.
“ఇన్ని రోజులకు యాదికొచ్చినమా? ”
అవ్వగొంతు పూడుక పోయింది.
“రెండు మూడు సార్లు పట్నం వచ్చిన, మామను కూడా కల్సిన కానీ ఇక్కడ దాకా రాలేక పోయిన”
రాజిరెడ్డి మెల్లగా చెప్పిండు.
అవ్వ గోడకానించిన పట్టెమంచం వేసింది.
దానిమీద చద్దరేసింది. కుచోమ్మని చెయితోని చూపిచ్చింది.
ఆయన ఇబ్బందిగా కూచున్నడు.
నన్ను దగ్గరికి తీసుకున్నడు.
బడికి పోతున్నావా అని అడగంగనే..
నేను ” ఆ.. అ-ఆ లు వచ్చినై , ఒకటిరెండ్లు కూడా
నూరు దాక వచ్చినై. చదవాల్నా? ” .
“నీది ఒడ్వది గని బావకు మంచి నీళ్లు తీసుకరా”.
బిందెల నీళ్లు గ్లాసుల ముంచుకొని తీస్కొచ్చిన.
ఆయన దాద తోటి మాట్లడుతున్నాడు.
“మామా! సంపాదన ఎట్లున్నదే?”.
“మన రెక్కల కష్టం ఊర్కనే పోదు.
తంగళ్లపల్లి కన్నా నయమే!”.
“ఎమన్నా ఎనికేసినావే”.
“ఎదో కొంచెం! ఫుజూల్ ఖర్చుల్లేవ్ ఏదికనబడితే అది కొనుడు లేదు.
బట్ట పొట్టకు పోను మంచిగానే మిగులుతున్నై.
ఓ గుంటెడు ఇంటి జాగా కొనుక్కోవాలని ఉన్నది.”
“నేను వెంకటేశ్వరావు పంతులు తో మాట్లాడతా. ఆయనింటికి పడమట దిక్కు చాన జాగ ఉన్నది.
ఇప్పుడైతే అగ్వకు దొరుకుద్ది. ఆయనక్కూడా పైసలవసరమున్నది. తొవ్వకే తీస్కొమామ.
రాన్రాను ఇండ్లు పడ్డంక మంచి అనుకూలంగ ఉంటది.” “గట్లనే! నువ్ రమ్మనప్పుడు తంగళ్లపల్లికి వచ్చి జాగచూసుకొని బయానా ఇస్తా “.
అవ్వ చాయ్ తెచ్చిచ్చింది.

రాజిరెడ్డి ముకంలా మంచి కల ఉండేది.
ఎప్పుడు నవ్వుకుంటూ మాట్లాడేది.
దాదా కన్నా పదేండ్లు చిన్నోడే కానీ నిండైన భారీ విగ్రహం ఆయన వయసును ఎక్కవ చేసింది.
ఆయన చాయ్ తాగి పోతానని చెప్తే, అవ్వ తిని పొమ్మన్నది. “ఇప్పుడు కాదు. పనున్నది. మళ్ళొచ్చినప్పుడు తప్పక తింటా ” అనుకుంటూ లేచిండు.
దాదా ఆయనెనుక నవ్వుకుంటూ పోయిండు.

మాకు తర్వాత తెల్సింది, ఆయనెప్పుడూ హైదరాబాద్ వచ్చినా ఓ హొటల్ లో దిగేది.
మా దాదా ను తప్పక కల్సుకొనేది.
ఆయనకు తినటానికి, తాగటానికి ఎమన్నా తీసుకొని హొటలుకు పోయేది.
ఇద్దరు కల్సుకున్నపుడు ఊరి ముచ్చట్లు పెట్టుకునేది. వాళ్లకు మంచి స్నేహం కుదిరింది.
** **

ఒకరోజు అవ్వ దాదా తోని మాట్లాడుతుంటే
వినుకుంటా కూసున్న.
“నాకు ఈ వారం రోజులు కష్టంగుంటది”.
“నిజమే! మంగలామె ఎంచెప్పింది ?” .
“కాన్పు ఎప్పుడైనా కావచ్చన్నది”.
“అయితే పని చేసుటానికి ఓ మనిషిని మాట్లాడ్త”.
“ఔ ! నేను అదే చెప్పుదామనుకున్న”.
ఓ గొల్లామే పాలు తీసుకొచ్చి ఇంట్ల సాయం చేయటానికి కుదిరింది. ఆరోజు అందరు హైరానా పడ్తున్నరు.
ఓ మంత్రసాని వచ్చి పురుడు పోసింది.
మాకు తమ్ముడు పుట్టిండు.
మాకు సంబరమే సంబరం !!
ఇదంతా చూసుకుంటూ ఇంటి ముందర
సర్దార్జీ భార్య భర్తలు చాలాసేపు కూచున్నారు.
ఓ ఐదు రోజులు గడిచినై.
వాళ్లిద్దరూ వచ్చి అవ్వతో మాట్లాడుతున్నరు.
“మల్లవ్వా! నీకొడుకు మంచిగున్నడు”. అవ్వ నవ్వింది. “మాకు పిల్లలు లేరుకదా, నీ కొడుకునిస్తావా?,
ఇప్పుడైతే మాక్కూడా మంచిగుంటది.
మెం పెంచుకుంటే మా సిక్కులొల్లల్లా కల్సి పోతడు.
నీకెంత కావాలన్నా ఇస్తం”. ఆమె దీనంగా అడిగింది. “నేను కొడుకును అమ్ముకోను… ఇవ్వను.
ఏమి అనుకోవద్దు”.
అవ్వ ఆమెనే ఒక్కతీరుగా బతిమిలాడింది.
“సోచాయించుకో ! రాత్రికి కిష్టయ్య గౌడ్ తో మాట్లాడతా”. అని సర్దార్జీ భార్యను తీస్కొని పోయిండు.
నాకేమి అర్ధం గాక అవ్వను , తమ్ముణ్ణి చూసుకుంటూ మంచం పక్కన్నే నిలబడ్డ .

(ఇంకావుంది..)
-అంకయ్య భండారి,
9032742937

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!