అంబటాల్లకు యాప పుల్ల
కడుపుల సల్ల….
పిల్లా జెల్లాకొరకు బత్కుగుల్ల
మాశ్న తూవ్వాల నీ నెత్తికిర్టిం
కష్టాలజోలె నిన్నిడిసి సంకదిగలే
ధైర్యం గిట్ల చినిగినంగి శింపులపంచేస్కోనుంటదని
నాకెర్కలే…….
యాపచెట్టు నీడ నీ అనుభవాల జాడ
నీచేతికర్రకు నీకు శెమ తప్పితే నాదనే ఇకమతులు తెల్వయ్…
ఆనవ్వులల్ల కండ్లల్ల నెనరు తెనెకారినట్టు కార్తది…
నాకొడుకు నీ అంగిజేవుల శేయిపెడ్తే
నీకు చిల్లర కష్టం ..కాని ఇష్టం తృప్తి
నువ్ మా అమ్మను మనువు చేస్కున్నప్పటి మంచం …..నా పిల్లలకు తొట్టెలైంది …
మట్టికాళ్ళ నడక రెండెడ్ల సోపతి
ఉష్కాగుల నీళ్ళు నిన్నిడువని సాల్లు
పెద్దమనిషి కాకముందే పెనిమిటి బత్కు
తూర్పుగాలి సదువు సంధ్యతెల్వని ఇగురం
ఎందుకుపుట్టిందో తెల్వని బత్కు …
తనకు తెల్వని జిగజిగల ముల్లెను మోస్తూ
ఆరాటాలు ఆర్భాటాలు
మామిడికాయ తొక్కెర్గిన పేగులు
ఉడుకుడుగంజీ ఊపిరిబువ్వ తినుబిడ్డానేదొక్కటే ఎర్క
సాకిరి సాన్పు జల్లి బత్కుపిడసతో
ప్రేమనలికింది మా గుడిసే ఇడుపులకు
ఆడదానిగా పుట్టినందుకేమో
బతుకంతా గాడిదమోత
మా అమ్మ కు సదువురాదు..
కాని సదువే మా అమ్మను సదువుకోవాలి.!
రాచకొండ రమేష్
యాదాద్రి భువనగిరి జిల్లా
సంస్థాన్ నారాయణపూర్ మండలం
శేరిగూడేం గ్రామం
cell: 9010580489