కవితంటే
కవితంటే కాదు ఉట్టి మాటల పేటిక
కాదు కాదు అది ఉట్టి పేపర్ వార్త
కాదు కాదు ఉట్టి వచనపు గొడవ
కవిత్వం ఒక అగ్ని శ్వాస
కవిత్వం అది హృదయ భాష
కవిత్వం అది జన ఘోష
అన్యాయం, అక్రమంపై రణ నినాదం
కవిత్వం అది కవి రక్తమాంసాల శ్వాస
కవిత్వం అది మానవత్వపు పరమ విలువ
కవిత్వం అది కన్నీరులా ప్రవహించాలి గుండెలు చీల్చుకొని
అగ్నిపర్వతం లావాలా భూమి పొరల్ని చీల్చుకుంటూ వచ్చినట్లు రావాలి
సునామిలానో, తుఫాను లానో తెలియకుండా విరుచుక పడాలి
టోర్నిడోలా ఉదృతంగా గాలి హోరుతో విస్తరించాలి
భూకంపంలా విస్తరిల్లి ధరిత్రిని బ్రద్దలు చేసేట్లుగా ఉండాలి
ఉట్టి భావిలోని కప్పల్లాగా, గంప కింది ఈగల్లాగా బతుకుతూ
వర్గం, వాదం, గ్రూప్, కులం, మతం, ప్రాంతం అంటూ సంకుచితమేనా ?
నువ్వు విశ్వాన్ని ప్రేమించాలి
విశ్వనరుడివి కావాలి
చరాచర విశ్వంలో అణువంతైన నీవు
ఈ భూగోళమంత కవిత్వం రాయాలి
ఈ విశ్వమంతా విస్తరించి రాయాలి
నువ్వు విశ్వ ప్రేమ గురించి రాయాలి
నీ ముందటి ప్రతిభావంతున్ని కూడా
సాటివాడిగా గుర్తించని అహం నిండిన నిన్ను
కవి అంటే ఎవరు నమ్ముతారు
కవిత్వమంటే ఆశామాషీ వ్యవహారం కాదు
కవిత్వం విశ్వ జనీన భాష
కవిత్వం ఒక ప్రాపంచిక దృక్పథం
కవిత్వం నీ ఆత్మ శక్తితో రాసి
నువ్వు అమరుడివి కావాలి.
సబ్బని లక్ష్మీ నారాయణ
6-6-౩౦2, సాయినగర్ ,
కరీంనగర్-505001
మొబైల్ : 91 8985251271