#కవిత్వమంటే ఎట్లుండాలే..!
తల్లి దేహాన్ని చీల్చుకు పుడుతూ
కేర్ మనే పసిపాప ఏడుపు లెక్కుండాలే..!
ఎట్లుండాలే..!
తల్లి దేహాన్ని చీల్చుకు పుడుతూ
కేర్ కేర్ మంటూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని
ఆనందంలో ముంచే
పసిపాప ఏడుపు లెక్కుండాలే..!
ఆ….అట్లనే ఉండాలే..!
ఊయల్లో ఊపుతూ ముచ్చట చెప్తుంటే
ఊ కొడుతూ కేరింతలు కొట్టే పసిపాప
పరవశం లెక్క మస్తుండాలె..!
ఎట్లుండాలె..!
ఊయల్లో ఊపుతూ ముచ్చట చెప్తుంటే
ఊ కొడుతూ కాల్లూపుతూ కళ్ళెగరేస్తూ
కేరింతలు కొట్టే పసిపాప
పరవశం లెక్క మస్తుండాలె..!
ఆ…..అట్లనే ఉండాలె..!
ఎండకు పనిచేసి కమిలిన దేహంతో
చెమటలు చిందిస్తూ మధ్యాహ్నం చెట్టు కింద
అన్నం ల మాడ్శిన కారం మంచినూనె సుక్కేసుకుని
తింటున్నంత తన్మయత్వం లెక్కుండాలె..!
ఎట్లుండాలె..!
ఎండకు పనిచేసి కమిలిన దేహంతో
చెమటలు చిందిస్తూ మధ్యాహ్నం చెట్టు కింద
అన్నం ల మాడ్శిన కారం మంచినూనె సుక్కేసుకుని
కళ్ళల్లో నీళ్ళున్నా నోట్లో నీరు నింపుకుని
తింటున్నంత తన్మయత్వం లెక్కుండాలె..!
ఆ…..అట్లనే ఉండాలె..!
కవిత్వమంటే ఎట్లుండాలె..!
మేఘం కార్చే కన్నీటిసుక్కని లటుక్కున నోట కర్సుకున్న
ఆల్చిప్ప ఆనందం లెక్క అధ్భుతంగుండాలె..!
ఎట్లుండాలె..!
మేఘం కార్చే కన్నీటి సుక్కని లటుక్కున నోట్ల కర్సుకుని ముత్యం చిప్ప దొరికిందని మురిసే
ఆల్చిప్ప ఆనందం లెక్క అధ్భుతంగుండాలె..!
ఆ….అట్లనే ఉండాలె..!
కొత్తగొచ్చిన రెక్కలతో స్వేఛ్ఛగా ఎగురుతూ
రెక్కలాడిస్తూ ఆకాశాన్ని చుట్టేసే పక్షి ఆరాటం లెక్క అధ్భుతంగుండాలె..!
ఎట్లుండాలె..!
కొత్తగొచ్చిన రెక్కలతో స్వేఛ్ఛగా ఎగురుతూ
రెక్కలాడిస్తూ నొప్పులు తిప్పలు పెడుతున్నా
ఆకాశాన్ని చుట్టేసే పక్షి ఆరాటం లెక్క
అధ్భుతంగుండాలె..!
ఆ…అట్లనే ఉండాలె..!
ఊపిరిపోయాక దేహాన్ని చుట్టుముట్టి అల్లుకునే
నిప్పుల కొలిమి లెక్క భగ భగ మండిపోతున్నట్లుండాలె..!
ఎట్లుండాలె..!
ఊపిరిపోయాక దేహాన్ని చుట్టుముట్టి అల్లుకునే
నిప్పుల కొలిమి లెక్క సెగలు పుట్టిస్తూ గుండెల్లో
బుగులు పుట్టిస్తూ భగ భగ మండిపోతున్నట్లుండాలె..!
ఆ..అట్లనే ఉండాలె..!
చెమటలు సల్లితే
సుయ్ సుయ్ మని సరాగాలు పాడే
వేడి వేడి పెనం గొంతు లెక్క గమ్మత్తుగుండాలె..!
ఎట్లుండాలె..!
చెమటలు సల్లితే సుయ్ సుయ్ మని సరాగాలు
పాడుతూ మేఘానికే సవాల్ విసిరే
వేడి వేడి పెనం గొంతు లెక్క గమ్మత్తుగుండాలె..!
ఆ..అట్లనే ఉండాలె..!
కవిత్వమంటే గట్లనే ఉండాలె..!
-కృష్ణ కొరివి