Sunday, October 2, 2022
Home > సీరియల్ > || నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – మొదటి భాగం – “తొలిప్రేమ” -నాగరాజ్ వాసం

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – మొదటి భాగం – “తొలిప్రేమ” -నాగరాజ్ వాసం

తొలిప్రేమ

విషయంలోకి వెళ్లేముందు మీతో ఒక మాట చెప్పాలి. కార్టూనులంటే నాకు ఇష్టం, ఆ ఇష్టం ప్రేమగా మారడానికి, అది ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరుగుతూనే ఉండడానికి, కార్టూనులు వేయడం నా హాబీగా మల్చుకోవడానికి, ఎంతోమంది ప్రముఖులు, మిత్రులు కారణం.
అలాగని నేను కార్టూనిస్ట్ ని మాత్రం కాదు. కార్టునుల ఇష్టుడిని మాత్రమే.
కార్టూనిస్టుని అనిపించుకోవడానికి నానా తంటాలు పడుతున్నవాడిని.

నేను ఇంటర్ చదివే రోజుల్లో డి.వి మురళీమోహణాచారి గారు మాకు తెలుగు బోధించేవారు.
ఆయనది కంచు కంఠం. పద్యాలు గొప్పగా రాగయుక్తంగా చదివి అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత సులభంగా పద్య ప్రతిపదార్థతాత్పర్యాన్నీ వివరించేవారు.
గురువుగారి వల్ల నాకు లైబ్రరీ కి వెళ్లడం, రకరకాల పుస్తకాలు చదవడం అలవాటైంది.
అక్కడచదివే వార, మాస పత్రికల్లో నన్ను బాగా ఆకర్షించినవి,గిలిగింతలు పెట్టి నవ్వించి కవ్వించి, వయ్యారాలు పోతూ కన్నుకొట్టి ప్రేమలో దింపినవి కార్టూనులు.

******************

లైబ్రరీ కి వెళ్లడం, కార్టూనులతో ప్రేమలో మునిగిపోవడం రోజువారీ వ్యసనంగా మారింది.
అక్కడ నాకు జయదేవ్, మల్లిక్, శ్రీగద్దె, మృత్యుంజయ పేరుతో ఉండే కార్టూనులు భలే నచ్చేవి వాటితో మాట్లాడేవాడిని, బొమ్మలను అనుకరించే వాడిని. కార్టూనులు వేద్దాం.. పత్రికలకు పంపుదాం అనే ఆలోచన మాత్రం చేయలేదు.

డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న రోజులు. మా గ్రూపులో అంతా మంచిమిత్రులే ఒక్కొక్కరు ఒక్కోరకమైన ప్రతిభ కనబరిచే వారు.
ఏలేటి ప్రభాకర్ రెడ్డి మేమంతా రెడ్డిగారు, బాబాయ్ అంటూ సరదాగా పిలుచుకునే మిత్రుడు.

పత్రికలకు వ్యాసాలు, కథలు, లేఖలు ఆరోజుల్లోనే పుంఖాను పుంఖాలుగా రాసేవాడు. అతని వల్ల నాకుకూడా పత్రికలలో పేరు చూసుకోవాలని ఆశ కలిగింది. “వార్త” దిన పత్రిక అప్పుడే పురుడుపోసుకుని మార్కెట్లో బాగా పాపులర్ అయింది. దాంట్లో పిల్లల పేజీలో క్లాసురుమ్ జోక్స్, ఫ్యామిలిపేజీలో ఫ్యామిలీజోక్ అని వచ్చేవి. పోస్టుకార్డు పైన రాసి పంపితే పంపిన రెండు మూడు రోజుల్లోనే జోక్ అచ్చువేసేవారు. అడక్కుండా ఐస్క్రీమ్ దొరికిన చంటిపిల్లడిలాగా ఆనందపడేవాడిని.
కాలేజీలో అందరికి చూపించి ఆనందపడేవాడిని.

ఒక రోజు ప్రభాకర్ రెడ్డి నాతో, “నువ్వెప్పుడైన పత్రికలలో “శ్రీగద్దే” అనే పేరుతో వచ్చే కార్టూనులు చూసావా? అనడిగాడు, అడుగుతూనే ఆయన నాకు మంచి పరిచయం, దుబాయి బతుకుదెరువు కోసం వెళ్లి అక్కడినుండి కార్టూనులు పత్రికలకు పంపుతుంటాడు. అతన్ని ఈ రోజు మనం కలవబోతున్నాం.
నెల రోజుల చుట్టిమీద ఇండియా వచ్చాడు, నువు జోకులు బాగా రాస్తున్నావుకదా కార్టూనులు వేయడం, వాటిని పత్రికలకు పంపడం ఎలాగో ఆయన్ని ఆడిగితెలుసుకో అన్నాడు”.

ఆమాట వింటూనే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కార్టూనులు చూసి ఎంతబాగా వేశారు, ఎవరో ఈ గొప్పవ్యక్తి అనుకునే నాకు ఏకంగా ఒక కార్టూనిస్టుని స్వయంగా కలిసే అవకాశం. నా ఆనందానికి హద్దులు లేవు.

కోరుట్ల బస్టాండు దగ్గర ఒక చిన్న టి హోటల్లో టి తాగుతూ ఉన్నారు ఆయన. నేను, ప్రభాకర్ రెడ్డి, దోనెగిరి తిరుపతి, దాసరి రామస్వామి ఇంకా కొంతమంది మిత్రులం కలిసివెళ్ళాం. నేను సూపర్ హీరోని చూస్తున్నట్లు నిలబడిపోయా.

“లోపలికి రండయ్యా చాయ్ తాగుదాం మనమంతా ఒక్కటే, నన్ను వేరేగా ఎందుకు చూస్తారు” అంటూ టి ఆఫర్ చేశారు.
కార్టూనులకు సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేసారు, a4 షీట్ ని నాలుగు భాగాలు చేసి, పెన్సిల్ బార్డర్ వేసి, ముందుగా కాప్షన్ రాసి, తరువాత బొమ్మ వేయాలి, వెనకాల మన పూర్తి అడ్రసు రాయాలి, 5 రూపాయల పోస్టల్ కవర్లో 10 కార్టూనులు పంపవచ్చు అని ఎన్నో వివరాలు తెలిపారు ఆయన వేసిన ఒక కార్టూను “అప్పుడు పెట్రోల్ ధరలు పెరిగాయి” ఒక వ్యక్తి ఒక రూపాయి పెట్రోల్ కొట్టండి అని బంకు వాడితో చెబుతాడు.
ఇది రిజెక్ట్ అయింది అచ్చులోకి తీసుకొలేదు, ఇలాంటివి జరుగుతుంటాయి, నిరాశపడవద్దు, ప్రయత్నిస్తూనే ఉండాలి అని చెప్పారు.
ఆయన అప్పుడు నా మనసులో పాతుకుపోయారు.
*****************
శ్రీగద్దె గారు నాకు కార్టునుల పై గురుబోధ చేశారు. కానీ నేను పత్రికలకు కార్టూనులు వేసి పంపే సాహసం చేయలేదు. చిత్తు కాగితాలపై బొమ్మలు గీసి చింపేసేవాడిని, వాటిని ఎవరికి చూపించే సాహసం చేసేవాన్ని కాదు.
మా కోరుట్ల డిగ్రీ కాలేజ్ పిడి గారు స్వర్గీయ శ్రీ పరంజ్యోతి సర్, ఆయన ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తి ప్రధాత. కాకతీయ యూనివర్సిటీ వాలీబాల్ టీం కోచ్ గా ఉండేవారు. ఎంతో మంది విద్యార్థులను తన సొంత ఖర్చులతో టి షర్ట్స్, స్పైక్స్, షార్ట్స్ కొనిపెట్టి స్పోర్ట్స్, గేమ్స్ లో ప్రోత్సహించేవారు.

ఇప్పుడు చాలా మంది మా మిత్రులు స్పోర్ట్స్కోటలో ప్రభుత్వ కొలువులో స్థిరపడ్డారంటే కారణం ఆయన ప్రోత్సాహమే,ఆయన పెట్టిన బిక్షే.
కాలేజి స్థాయిలో వ్యాసరచన,మోనోఅక్షన్,గ్రూప్ డాన్స్,కార్టూనింగ్ లో మొదటి బహుమతి గెలుచుకున్న నన్ను nss యూత్ ఫెస్టివల్ జిల్లా స్థాయి పోటీలకు ఆయన ప్రోత్సాహం తో పంపించారు.
కాలేజీ స్థాయిలో ఎలాగోలా బొమ్మవేసి ప్రయిజ్ కొట్టేసా గాని ఇది జిల్లా స్థాయి, అవగాహనా, అనుభవంలేని నేను కార్టూను పోటీలో నిలబడుతానో లేదో అని సంశయం, భయం, బెరుకు నా మీద అన్ని ఒకేసారి దాడిచేసాయి .
కరీంనగర్ SRR కాలేజీలో మాకు విడిది, పోటీలు జరిగేది కూడా అక్కడే.
ఆరోజు ఆదివారం ఈనాడు సండే బుక్, వార్త సండే బుక్ ల్లో వచ్చిన కార్టూను బొమ్మల్ని బాగా గమనించి మనసులో ఒక ఆలోచనను క్రోడీకరించుకుని పెట్టుకున్నా.
పోటీలో అంశం “రాజకీయాలు” .
లక్కీగా ఆరోజు జయలలిత గారు తమిళనాడు ముఖ్యమంత్రి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని ప్రకటించారు.
శ్రీధర్ గారి కార్టూన్ జయలలిత గారు చక్రాల కుర్చీలో కూర్చున్న వాజపై గారిని లోయలోకి తోస్తున్నట్టు కార్టూను వేశారు.
ఆ బొమ్మను మనసులో ముద్రించుకున్న నేను
అదే బొమ్మ వేసాను.
జడ్జీలు ఏమాలోచించారో గాని ఫస్టు ప్రయిజ్ ఇచ్చారు.
జిల్లా స్థాయిలో వ్యాస రచన, కార్టూనింగ్లో ప్రథమ బహుమతి వచ్చింది.
యూనివర్సిటీ స్థాయికి ఎంపిక అయ్యాను.
కాకతీయ యూనివర్సిటీ కాంపస్ లో విడిది ఏర్పాటు చేశారు, యూనివర్సిటీ స్థాయిలో అన్ని డిగ్రీ కాలేజీల నుండి ఎంపికైన విద్యార్థులు హాజరయ్యారు.
అక్కడకూడా నా అదృష్టం కొద్దీ అదే టాపిక్ ఇచ్చారు.
మళ్ళీ ఆ వారం శ్రీధర్ గారి కార్టూన్ కాపీ కొట్టాను.
ఎన్నికల జాతర అని కాప్షన్ పెట్టి, ఒక్కో పార్టీ నాయకులు ఒక్కో వేషధారణలో వస్తున్నట్లు చిత్రీకరించాను.
ఇక్కడ కూడా కాపీ కార్టూను వేసిన నాకే ప్రథమ బహుమతి ప్రసాదించారు.
రాష్ట్రస్థాయి NSS యువజనోత్సవాలకు ఎంపికయ్యాను.
కాపీ ఆలోచనలతో వేసినవే అయినా ఆ విజయాలు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి, కార్టూనింగ్ ని హాబీగా మాలచుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలకు బీజం వేసాయి. గెలుపులో ఉన్న రుచిని చూపించాయి.
అవే నేను వేసిన మొదటి, చివరి (కాపీ)కార్టూనులు.
ఎవరికి తెలియని, జడ్జీలు తప్ప ఎవరు చూడని, ఎక్కడా ప్రచురితం కానీ
నా మనసుపొరల్లో విత్తనాలుగా షుప్తచేతనావస్థలో మగ్గిపోయి మొలకెత్తడానికి 1998 సంవత్సరం నుండి 2009 సంవత్సరం వరకు ఎదురు చూసిన బీజాలు.

(ఇంకా ఉంది)
-నాగరాజ్ వాసం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!