Sunday, October 2, 2022
Home > సీరియల్ > || నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – రెండవ భాగం – “నేను ఒక బోర్ టూనిస్టుని” -నాగరాజ్ వాసం

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – రెండవ భాగం – “నేను ఒక బోర్ టూనిస్టుని” -నాగరాజ్ వాసం

డిగ్రీ పరీక్షలు రాసి వెంటనే రెడీమేడ్ డ్రెస్సెస్ షాప్ పెట్టుకోవడం ,వ్యాపారంలో మునిగిపోవడం, పది సంవత్సరాలు చకచకా కదిలిపోవడం జరిగిపోయాయి.
ఆ పది సంవత్సరాలు నా జీవితంలో వ్యాపారం డబ్బుతప్ప మరో విషయానికి తావులేదు. కనీసం బంధువులు,పండగలు,దోస్తులు, ఆనందాలు అనే మాటలకు జాగాలేదు.
2008లో ఇల్లు కట్టుకోవడం ,పెళ్లిచేసుకోవడంతో ఆలోచన ధోరణిలో కొంత మార్పు.
మానసుపొరల్లో మగ్గిన కార్టూను విత్తనాలు మొలకెత్తడం ఆరంభించాయి.
ఆంధ్రభూమి వార పత్రికకు పది కార్టూనులు పోస్టుకార్డు సైజులులో వేసి పంపించాను.
25రూపాయల MO వచ్చేదాకా తెలియదు ఒక కార్టూన్ పబ్లిష్ అయిందని.
మొదటి కార్టూను ఏది పబ్లిష్ అయిందో చూసుకోవాలని ఉబలాటం.
మెట్పల్లి లైబ్రేరియన్ శంకరయ్య అని ఉండేవారు ఆయన్ని బతిమాలి,భూమి వార్తాపత్రిక సంపాదించాను.
మొదటి కార్టూను పత్రికలో చూసుకున్న ఆనందం మాటల్లో వర్ణించలేనిది.
ఎన్నిసార్లు చూసుకున్నానో.
లేకలేక కలిగిన సంతానాన్ని చూసుకుని, వచ్చిన ప్రతి మనిషికి చూపించి సంతోషపడే తల్లిలాగా, తెలిసిన వారందరికీ చూపించి ఆనందపడిపోయాను.
అదే ఉత్సాహంలో మరిన్ని కార్టూనులు గీసి ఆంధ్రభూమి వారపత్రికకి పంపించాను.
ఒక్కటి కూడా అచ్చులోకి తీసులేదు.
ఒకసారి నిజామాబాద్ వెళ్ళినపుడు బస్టాండ్ ఆవరణలోని పుస్తకాల షాపులో స్మైల్ప్ ప్లీస్ అనే మ్యాగజైన్ చూసి కొన్నాను.
దానినిండా కార్టూనులు , ఆంధ్రభూమి నుండి తిరిగి వచ్చిన కార్టూనుల్ని స్మైల్ ప్లీస్ పత్రికకి పంపించాను.
మొత్తం ఐదు కార్టూనులు ఒకే పేజీలో నా పేరు ఫోన్ నంబరుతో సహా ప్రచురించారు. కాంప్లిమెంటరీ కాపీ పంపారు. ఇక చూడండి నా ఆనందం, హద్దులుదాటింది నాకు నేను హీరోల ఫీలయ్యా.
స్మైల్ ప్లీస్ పత్రికలో వినోద్ గారివి,వడ్డేపల్లి గారివి, వెంటపల్లి గారివి,శబా గారివి, రామకృష్ణ విష్ణుబోట్ల గారివి,దాన గారివి కార్టూనులు ప్రచురించే వారు.
ఒక సారి వినోద్ సకినేటి పల్లి గారి ఫోన్ నంబరు కనిపిస్తే వారికి ఫోన్ చేసి మాట్లాడాను.
అదే మొదటిసారి నేను ఒక కార్టూనిస్టుతో ఫోన్లో మాట్లాడడం. ఆయన ఎన్నో సలహాలు సూచనలు కార్టూనులకు సంబంధించి చెప్పేవారు. అవి తరువాత నాకు చాలా ఉపయోగపడ్డాయి.
ఒక సారి ఆ పత్రికలో ఒక కార్టూను పోటీ ఫలితాలు ప్రకటించారు.
అందులో ఒక విజేత కార్టూను ” మనుషి భూమిని ఇనుప కడ్డీతో గుచ్చి పొయ్యిమీద కాలుస్తున్నాడు.” ఇది ఎంతగా నన్ను ఆకర్షించిందంటే చెప్పలేను.
తరువాత రోజుల్లో ఆయన నా అభిమాన ఆత్మీయ మిత్రులుగా మారిపోయారు. ఆయన పెరు తర్వాత తెలియపరుస్తాను.

************************

ఒక చల్లని చక్కని సంతోషం పంచిన ఉదయం, ఫోన్ మోగితే తీసాను.
మృదువైన మెత్తని ప్రేమతో కూడిన సున్నిత స్వరం.
“నాగరాజ్ గారేనా ”
“అవునండి”
“నేను కళాసాగర్ కార్టూనిస్టుని”
కళాసాగర్ గారెవరో నాకు తెలియదు.
నేనిదివరకెప్పుడు ఆయన కార్టూనులు చూడలేదు.
అయినా తెలిసిన వాడిలాగా
“సర్ మీరా నమస్కారం సర్”
అన్నాను.
“మీ కార్టూనులు స్మైల్ ప్లీస్ పత్రికలో చూస్తున్నాను, బాగానే వేస్తున్నారు, ఇంకా కొంచెం బొమ్మలు ఐడియాలు ఇంప్రూవ్ చేసుకోవాలి, మీకు నా కార్టునుల పుస్తకం పంపుతాను,బొమ్మలు చూసి బాగా గమనించి వేయండి ప్రాక్టీస్ చేస్తుంటే మీరు గొప్ప కార్టూనిస్టుగా మారతారు.”
ఆయన చెబుతున్నారు, నేను ఊ కొడుతున్నాను.
నాకు ఒక వెబ్ సైట్ ఉంది. www.64kalalu.com దాంట్లో మన కార్టూనిస్టులందరి కార్టూనులు ప్రతినెల కొత్త సంచికలో ప్రచురిస్తాను,మీరుకుడా కార్టూనులు 300 డిపిఐ లో స్కాన్ చేసి మెయిల్ చేయండి,మీ ఫోటోకుడా పంపండి. త్వరలో కార్టూనిస్టుల గురించి ఒక ఆర్టికల్ రాయబోతున్నాను, మీ పెరుకుడా ప్రస్తావిస్తాను అంటూ ఆయన చెబుతుంటే ఎదో తెలియని ఊహా లోకంలో తెలిపోతున్నాను. నక్షత్రాలన్ని ఒక్కొక్కటిగా నా దగ్గరికి వచ్చి హయ్ చెబుతున్నట్లు , చందమామతో షేక్ హాండ్ చేసినట్లు, ఆకాశంలో విహరిస్తన్నట్లు తెలిపోతున్నాను. నేనేంటి నాకు ఒక పెద్దాయన ఫోన్ చేసి మాట్లాడాడమేంటి, నన్ను గుర్తించడమేంటి.
అప్పటికప్పుడు నాకు నేను ఒక గొప్ప పేరున్న కార్టూనిస్టుని అయిపోయినంత గర్వపడ్డాను.
కంప్యూటర్, ఇంటర్నెట్,ఈ మెయిల్ అంటే ఏమిటో అప్పటిదాకా నాకు తెలియదు.
రఘు అని నా బాల్య మిత్రుడు కంప్యూటర్స్ లో be చేసాడు వాడి దగ్గరికి వెళ్లి నా అనుభవాన్నంత వివరించి ఈ మెయిల్ గురించి వెబ్ సైట్ల గురించి కొంత అవగాహన ఏర్పరచుకున్నాను.
ఈ మెయిల్ వాడి సాయంతో క్రియేట్ చేసుకున్నాను.
నా కార్టూనులు,ఫోటో,అడ్రసు కళాసాగర్ గారికి వాడి సాయంతో మెయిల్ చేసాను.
మరుసటి నెలలో నా కార్టూనులు ఫోటోతో సహా ప్రచురించారు.
ఆ తరువాత నెలలో ఒక ఆర్టికల్ లో నాగురించి కూడా ప్రస్తావించారు.
“అబ్బ”
“నేనూ కార్టూనిస్టుని”
“నాకు గుర్తింపు వచ్చింది”
“నేను గ్రేట్”
“నేను”
అనే అహం నన్ను తగులుకుంది.
కళాసాగర్ గారి పుస్తకం ఇంటికి వచ్చింది.
పుస్తకం ఆసాంతం చదివాను.
ఆయనకు అంతర్జాతీయ బహుమతి తెచ్చిపెట్టిన సిగరెట్ కార్టూన్ నా మతి పోగొట్టింది. ఆయన ని ప్రేమించేలా చేసింది.
ఆ ప్రేమ నిరంతారయంగ కొనసాగేలా చేసింది. ఇలాంటి ఆలోచనలతో కూడా కార్టూన్ వేస్తారా అనిపించింది.
“నేను” అని కమ్ముకున్న అహం పొరలు పొరలుగా తొలిగిపోసాగింది. అసలు నేను వేసినవి కార్టూనులు కాదు.
ఆంధ్రభూమి వారు తిప్పి పంపడానికి కారణం కూడా అదే.
ఇప్పటిదాకా అచ్చయినవి పత్రికల వారు నన్ను ప్రోత్సహించడానికి వేసినవి మాత్రమే,
అని తెలుసుకున్నాను.
కళాసాగర్ గారికి వెనవేల ధన్యవాదాలు మనసులోనే తెలుపుకుని వారిని ఒక్కసారైనా కలిసి మాట్లాడి కృతజ్ఞతలు తెలపాలని బలంగా నిర్ణయించుకున్నాను.
ఇప్పుడు నేను కార్టూనిస్టుని కాదు
ముమ్మాటికీ “బోర్ టూనిస్టుని ” అని తెలుసుకున్నాను.

(ఇంకా ఉంది)

-నాగరాజ్ వాసం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!