Tuesday, July 14, 2020
Home > సీరియల్ > || నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ ||(మూడవ భాగం) – జేబు సాటిస్ ఫెక్షన్ – జాబ్ సాటిస్ ఫెక్షన్ – నాగరాజ్ వాసం

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ ||(మూడవ భాగం) – జేబు సాటిస్ ఫెక్షన్ – జాబ్ సాటిస్ ఫెక్షన్ – నాగరాజ్ వాసం


ఆంధ్రభూమి పత్రికకి పంపిన కార్టూనులన్ని గోడకు కొట్టిన బంతులే అవుతున్నాయి.

మనిషి బుర్ర చాలా చెడ్డదండి, కార్టూనులు
తిరిగివస్తున్నాయంటే లోపమెక్కడుందో వెతకాలి గాని, వాటిని సరిదిద్దుకుని ఇంకా బాగా వేసి పంపించాలిగాని, నా కార్టూనులు తిరిగి రావడం ఏమిటి , ఇన్ని కార్టూనులు పంపితే ఒక్కటికూడా పబ్లిష్ చేయడా ? పబ్లిష్ చేసిన కార్టూనులు నెను పంపిన వాటికన్న బాగున్నాయా?
ఇలా ఆలోచించేవాడిని!
ఇగో కాకపోతే !
నావి తొక్కలో కార్టూనులు పంపిన ప్రతిదీ వేసుకుంటారా?

ఒకరోజు లైబ్రరీలో వార పత్రికలన్ని తిరగేస్తూ విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధం తీసుకుని చదివాను, అందులో రామకృష్ణ విష్ణుబోట్ల గారి కార్టూనులు.
మొత్తం పుస్తకం నిండా ఆయనవే పది వరకు కార్టూనులు. నా కళ్ళు మెరిసాయి.
దాంతో పాటు బుర్రలో ఆలోచన కూడా!
తిరిగివచ్చిన కార్టూనులలోనుండి పది విశాలాంధ్ర కి పంపితే రెండువారాల తరువాత పత్రిక చుస్తిని కదా పత్రికనిండా నావే, ఎనిమిది కార్టూనులు పబ్లిష్ చేశారు.
బాణసంచా ఆకాశంలోకి ఎగిరి ఫాట్ మని పేలి ఒక్కసారిగా ఆకాశంనిండా పరుచుకున్నపుడు వచ్చే వెలుగు నా కళ్ళలో!
ఇక అప్పటి నుండి ముందు ఆంధ్రభూమి,విపుల,ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం లకు పంపడం,తిరిగివచ్చిన కార్టూనులు విశాలాంధ్ర, స్మైల్ ప్లీజ్, www.64kalalu.com లకు పంపడం.
ఏది ఏ పత్రికకు పంపానో ముందుగానే కార్టూను వెనుకవైపు బండగుర్తు వేసుకునేవాడిని, తద్వారా గందరగోళం తప్పేది.
అడపాదడపా భూమి, విపులలో కార్టూనులు పబ్లిష్ అయినా, అత్యధికంగా విశాలాంధ్రలో అచ్చులో చూసుకునే భాగ్యం కలిగేది.
ఒకే సంవత్సరంలో 120 వరకు నా కార్టూనులు అచ్చువేశారు.
విపుల పత్రికలో ప్రచురించిన కార్టూనులకి తప్పకుండా పారితోషికం పంపేవారు. ఇప్పటివరకు కాంప్లిమెంటరీ కాపీ,పారితోషికం తప్పిపోయిన సందర్భం లేనేలేదు.
కానీ ఇక్కడొక చిత్రమైన సమస్య,
వారు అచ్చువేసేది నెలకి ఒక కార్టూను దానికి పారితోషికం 40 రూపాయలు ,అది యూనియన్ బ్యాంక్ చెక్ పంపేవారు, ఆ బ్యాంకు మా ఊరిలో లేదు, పైగా చెక్కు అకౌంట్ పే, నా ఖాతా స్టేట్ బాంక్ లో, నలభై రూపాయల చెక్కు అకౌంట్ లో వేయమని వెళ్లిన ప్రతి సారి సర్ ఇది యూనియన్ బాంక్ కి పంపి మీ ఖాతాలోకి డబ్బు మారవాలంటే ఇరవయ్యారు రూపాయలు చార్జ్ చేస్తాం అనే వాడు. నేను సరే అనే వాడిని. ప్రతీ నెలా ఆయన చెప్పి చెప్పి ఒక సారి ఆపుకోలేక సర్ ఈ నలభై రూపాయల చెక్కు మళ్ళీ తీసుకురాకండి, “ఇది మారవాలంటే నాకే సిగ్గుగా ఉంది అన్నాడు.”
అంతే మళ్లీ విపుల చెక్కు తీసుకుని బ్యాంకుకి పోలేదు.
ఆంధ్రభూమి డైలీ ఆదివారం పత్రికలో ప్రచురిస్తున్నారుగాని డబ్బులు రావడం లేదు.
ఒక రోజు మధ్యాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది.
కార్టూనిస్ట్ నాగరాజ్ గారా?
ఆహా!! ఎంత బాగుంది వింటుంటే
“కార్టూనిస్ట్ నాగరాజ్”
మరోసారి పిలిస్తే బాగుండు అనిపించింది.
“హలొ అవునండి ఎవరు…” అన్నాను
“నేను విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధం ఎడిటర్నీ”
ఆ మాట వింటూనే ఆశ్చర్యంతో ఉబ్బిపోయా,
అబ్బా!!!
పత్రిక ఎడిటర్లు ఫోన్ చేసి పలకరించే రేంజికి వచ్చానే…..
అనుకునే లోపు
“మీ కార్టూనులు బాగుంటున్నాయి కానీ
మొన్న మీరు పంపిన కార్టూనులలో ఒకటి మా టీం ని చాలా ఇబ్బంది పెట్టింది.
మేము కమ్యూనిస్టులం.”
మీరు ఒక కార్టూనులో
“ఒక పార్టీ అధ్యక్షుడు బ్యాంకు కి వెళ్లి మా పార్టీ పెరు ప్రఖ్యాతలు చాలా పెద్దవి కానీ ఆర్థికంగా లేనివారం ఎన్నికల్లో పోటీ చేయడానికి లోను కావాలి ఇప్పించండి.”
“ఇది మీరు వేసిన కార్టూను.”
ఇండైరెక్టుగా మా పార్టీని కించ పరిచేలా ఉంది మరోసారి ఇలాంటి కార్టూనులు పంపవద్దు, అన్యధా భావించకండీ అన్నారు.
ఆ కార్టూను నేను కమ్యూనిస్టు పార్టీని దృష్టిలో పెట్టుకుని వేసింది కాదు, కానీ ఆయనకి సరైన సంజాయిషీ ఇచ్చుకోలేక పోయాను.
ఎం చెప్పాలో తెలియక, పత్రిక సంపాదకులు అనే బెరుకుతో సరేనండి అని ముక్తసరి సమాధానంతో ముగించాను.
పత్రికలు వర్గాలకు,పార్టీలకు,ఇతరత్రా మద్దతు తెలిపేవిగా ఉంటాయని మొదటిసారి అనుభవంలోకి వచ్చింది.
కొద్దిరోజులకి విశాలాంధ్ర పత్రికనుండి ఒక చెక్కు వచ్చింది.
నేను అప్పటిదాకా కార్టూనులకు అంతపెద్ద మొత్తం ఎప్పుడు తీసుకోలేదు. ప్రచురించిన మొత్తం కార్టూను(120 )లకు గాను వారు పంపిన మొత్తం రూపాయలు 885/-
అంటే ఒక్కోదానికీ ఎంతో మిరే లెక్కవేసుకోండి.
ఎందుకో నాకే తెలియదు, కానీ ఆ తర్వాత విశాలాంధ్ర పత్రికకు కార్టూనులు పంపడం ఆపేసాను.
ఇక్కడ నాకు ఇదమిద్ధంగా అర్థమైందేమిటంటే
” కార్టూనిస్ట్ అనే వాడు జాబ్ సాటిస్ ఫెక్షన్ కోసం కార్టూనులు వేయాలి కానీ జేబు సాటిస్ ఫెక్షన్ కోసం కాదని.”

ఆ రోజు నేను హైదరాబాద్ కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా mg బస్టాండ్ వెళ్లే రోడ్డునుండి బాంక్ స్ట్రీట్ వెళ్లే దారిలో, కార్నర్ మీద ఒక బుక్ స్టాల్ లో “ఆంధ్రప్రదేశ్” మాస పత్రిక కేవలం 5 రూపాయలకే దొరికితే కొన్నాను. ఇంత క్వాలిటీ ప్రింట్ తో ఇన్ని పేజీలు 5 రూపాయలకేన.
ఇంత చవకగా ఎలా ?
అనే ఆశ్చర్యంతో కొన్న పత్రికలో నిరంతరాయంగా పత్రిక ఆగిపోయే వరకు 100 కి పైగా కార్టూనులు ప్రచురితం అవుతాయని, ప్రతి కార్టూనుకి 150 రూపాయల చొప్పున అందుకుంటానని, కాంప్లిమెంటరీ కాపీతో సహా ప్రచురించిన ప్రతి కార్టూనికి పైసా తప్పకుండా అందుకుంటానని నేనూహించని పరిణామం.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరువాత ప్రభుత్వాలు విడిపోయి ఆ పత్రిక ఆగిపోయింది.
కానీ నాకు మాత్రం నా జీవితానికి సరిపడినంత గొప్ప అనుభవాన్ని మిగిలించింది. ఆ పత్రికలో ప్రచురింప బడిన ఒక కార్టూన్.
ఆ విషయాన్ని తరువాతి వ్యాసాలలో చర్చిస్తాను.
ఆంధ్రప్రదేశ్ పత్రిక అప్పటి సంపాదకులు జి.వల్లీశ్వర్ గారికి నేను ఎప్పటికి ఋణపడి ఉంటాను. ఆయనకి వేనవేలవందనాలు.

**********************************

ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో
పుస్తకం గుత్తకి తీసుకున్నట్లు ఒకదానికిమించి ఒకటి సన్నని గీతల్తో చక్కని చేవ్రాలుతో టన్నుల కొద్దీ హాస్యం గుమ్మరిస్తూ ఎలా ప్రచురితం అవుతున్నాయి, ఈ కార్టూనిస్ట్ కార్టునుల రహస్యం ఏమిటి తెలుసుకోవాలని, ఆయనతో ఇదివరకు ఒక సారి మాట్లాడాను కాబట్టి , అడగొచ్చు అనే ధైర్యంతో ఫోన్ చేసా.
తూ. గో.జిల్లా సకినేటిపల్లి వినోద్ గారికి.
ఆయన ఒకటే చెప్పారు.
నిరంతరాయంగా కార్టూనులు పంపుతూ ఉండండి, వీడు కార్టూనిస్ట్ అనే అభిప్రాయం సంపాదకులకు స్థిరపడేలా చేసుకోండి.
ఖచ్చితంగా మన కార్టూనులు రెగులర్ గా తీసుకుంటారు. నేను చేసింది అదే.
ఇప్పటిదాకా లక్ష రూపాయల వరకు ఆంధ్రభూమి నుండి పారితోషికం అందుకున్నాను అని చెప్పే సరికి దిమ్మ తిరిగి పోయింది నాకు.
ఇప్పటి దాకా మీరు ఓ రెండు వేల కార్టూనులు వేసి ఉంటారా సర్ అని అడిగా అమాయకున్ని, అయ్యో అలా అడిగారెంటి , ఏడెనిమిది వేల కార్టూనులు అచ్చులో వచ్చాయి నావి.
నాదేముంది జయదేవ్ బాబు గారి లాంటి లెజెండరీ కార్టూనిస్టులవి యాభైవేలకి పైగా ఉంటాయి అన్నారు. నా మెదడులో ఆలోచనలు ఆగిపోయాయి.
ఆ సంఖ్య వింటూంటేనే ఆశ్చర్యంగా ఉంది అన్ని ఆలోచనలు ఎలా తోచాయంటారు వారికి. అది బుర్రా ఆలోచనల చెలెమ? అనేకానేక సందేహాలు.

“నా పరిచయం చదివారా ? అందులో 25 కార్టునుల వరకు వేశారు. ఆ పత్రిక చదవండి.
అంటూ ఒక పత్రిక పెరు చెప్పారు.
“తరువాతి రోజుల్లో నాకు ఎన్నో రకాలుగా గుర్తింపు, బహుమతులు, పరిచయాలు,గురువులు, మిత్రులు, అనుభవాల్ని సంపాదించి పెడుతూనే ఉన్న పత్రిక.”
కానీ అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా సంపాదించాలి, ఆ పత్రిక వేట లో పడ్డాను.

(ఇంకా ఉంది)

-నాగరాజ్ వాసం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!