Sunday, October 2, 2022
Home > సీరియల్ > || నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – నాల్గవ భాగం: “ఒక నవ్వులమాసపత్రిక”- ప్రేమాయణం -నాగరాజ్ వాసం

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – నాల్గవ భాగం: “ఒక నవ్వులమాసపత్రిక”- ప్రేమాయణం -నాగరాజ్ వాసం

హైదరాబాదు MG బస్టాండులో మెట్పల్లి బస్సుకోసం ఎదురు చూస్తున్నాను.
ఎంక్వైరీలో అడిగితే ఇంకా గంటసేపు అవుతుంది అన్నాడు.
అప్పటిదాకా ఎం చేయాలి అటూఇటూ తిరుగుతుంటే “పుస్తకాల ప్రదర్శన విక్రయము” బోర్డున్న ఒక దుకాణం కనిపిస్తే వెళ్ళాను.
బాపుగారి కార్టూనుల పుస్తకం కనిపిస్తే తీసుకుని బిల్లు చేయిద్దామని కౌంటర్ దగ్గరికి వచ్చి నిలబడ్డా. అతని వెనుక అమర్చిన స్టాండులో కనిపించిందండి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు, మొక్కవోయిన దేవుడు ఎదురైనట్లు కార్టూనిస్ట్ వినోద్ గారు చెప్పిన పత్రిక, ఆయన గొప్పగా చెప్పిన పత్రిక, “హాస్యనందం” మాస పత్రిక, అంతక్రితం కొన్నేళ్ళు నడిపించి ఆపేసారంట. మళ్ళీ ఈ మధ్యే పునః ప్రారంభించారని చెప్పిన పత్రిక. నా అదృష్టం కొద్దీ నాకు దొరికింది బాపుగారి ప్రత్యేక సంచిక.
బాపుగారి కార్టునుల పుస్తకం, హాస్యనందం రెండు కొనుక్కుని బయలుదేరాను.
నిజం చెప్తున్నాను, నాకు బాపుగారి కార్టూనుల పుస్తకం కొన్నదానికంటే బాపుగారి ప్రత్యేక సంచిక హాస్యనందం దొరికినందుకే ఎక్కువ ఆనందం కలిగింది.

***********************************

హాస్యనందం పత్రిక కొన్నప్పటినుండి ఒకటే ఉత్సాహం నాలో.
అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ మూడు కార్టూనులు గీసి హాస్యనందం పత్రికకి పోస్టు చేసాను.
మే నెల,2011 సంచికలో వేసారండి నా కార్టూను ఒకటి అదే మొదటిది హాస్యనందం పత్రికలో.
కార్టూను ఏంటంటే డాక్టరుకి చూపించుకుని ప్రిస్క్రిప్షన్ తీసుకుని, ఆవిడ దాన్ని చూస్తూ ” మీ చేతిరాత ఇంత అందంగా గుండ్రంగా ఉంది మీరు నిజం డాక్టరు కాదేమోననీ అనుమానంగా ఉంది” అంటుంది అనుమానపు చూపుతో….
అది మొదలు ఇప్పటి దాకా నిరంతరాయంగా నేను కార్టూనులు పంపుతూనే ఉన్నాను, సంపాదకులు అచ్చులోకి తీసుకుంటూనే ఉన్నారు.
నెలకి రెండు సార్లు షాపు పని నిమిత్తం హైదరాబాదు వెళతాం కాబట్టి, వెళ్లిన ప్రతిసారి అదే బుక్ షాపుకి పోవడం హాస్యనందం కొనుక్కోవడం అలవాటు చేసుకున్నా. నేను కొన్న మొదటి సంచిక బాపుగారి స్పెషల్. అప్పటి వరకు అలాంటి ప్రత్యేక సంచికగా వెలువడిన మాస, వార పత్రికలు చూడలేదు, చదవలేదు.
ఇది ప్రత్యేకంగా అనిపించింది,ఇష్టం కూడా ఏర్పడింది. మరో సారి కొన్నపుడు పత్రిక చదువుతుంటే నన్ను నేను నమ్మలేక పోయా. మొత్తం పత్రిక నిండా కార్టూనులే నలభై నుండి యాభై వరకు. మిగతావి కథలు అవి హాస్యప్రధానమైనవి, కొన్ని ఫీచర్లు అవీ హాస్యప్రధానమైనవి.
పుస్తకం మీద “తెలుగులో వెలువడుతున్న ఏకైక హాస్యమాస పత్రిక” అనే టాగ్ లైన్ వంద శాతం నిజం.
పత్రిక నన్ను ఎంతలా సమ్మోహనపరిచిందంటే కచ్చితంగా ఈ పత్రికలో నిరంతరాయంగా నా కార్టూనులు ప్రచురితం కావాలి లేదంటే నేను కార్టూనులు వేయడమే వేస్ట్ అనుకునేంత.
ఒక్కో పేజీ తిరగేస్తుంటే
హరగోపాల్ గారి పాకెట్ కార్టూను, రెండు తలలు మాత్రమే, చిత్రవిచిత్రాది హావభావాలు ప్రదర్శిస్తూ… చిన్న కాప్షన్, అదిరిపోయే పంచ్ తో గమ్మత్తుగా ఉండేది. ఆ బొమ్మలు ఇప్పటికి నాకు ఆశ్చర్యమే.
సర్వశ్రీ ఏ. వి.ఎం., హరి, శివాజీ,బి.వి.,
రామకృష్ణ విష్ణుబోట్ల, శబా, ధన, భాను, రాంమోహన్, వినోద్, తన్నీరు, వెంటపల్లి, వడ్డేపల్లి వెంకటేష్, అర్జున్, విజయ్, రామశర్మ, నందు గార్ల కార్టూనులు, అదొక కార్టునుల ప్రపంచం.
ఇక చివరి అట్ట పేజీ గురించి చెప్పాలంటే అదొక మ్యాజిక్, అదొక మత్తు, అదొక మాటలకందని భావం.
“సినిట్యూన్స్” అనే శీర్షికతో ఫుల్ పేజీ కార్టూనులు, అందులో బొమ్మలు మాట్లాడేవి, పొట్లాడేవి, కవ్వించేవి, నవ్వించేవి, కదిలించేవి, కదిలేవి. వేస్తే ఇలాంటి బొమ్మలు వేయాలి, ఇలాంటి ఐడియాలతో వేయాలి, లేదంటే మానేయాలి అనిపించేది ఆ బొమ్మల్ని చూస్తుంటే. అప్పటి నుండి ఇప్పటిదాకా అలాంటి బొమ్మలు, ఐడియాల కోసం విఫల యత్నం చేస్తూనే ఉన్నాను. కానీ ఆయన దరిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయాను.
అదే పేజీలో ఉన్న ఆయన ఫోన్ నంబరుకి ఫోన్ చేసి మాట్లాడాను. కొంచెం బెరుకు భయంతో ఎలా మాట్లాడాలో తెలియక మాటలు మొదలయ్యాయి సర్ మీకు బహుమతి వచ్చిన కార్టూను స్మైల్ ప్లీజ్ పత్రికలో చూసానండి, మళ్ళీ ఇప్పుడు సినిట్యూన్స్. మీ కార్టూనులతో ప్రేమలో పడిపోయానండి. సినిట్యూన్స్ కార్టూనులన్ని కత్తిరించి భద్రపరచుకున్నాను. అంటూ ఆయన కార్టూనులలో నాకు నచ్చిన విషయాలన్నీ వివరించాను. తరచుగా ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను. ఆయనతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాను. పేరు తరువాత తెలియపరుస్తాను. ఇంకా ఆయన గురించి మాట్లాడాల్సింది చాలా ఉంది.

*************************************

ఇంత చెప్పి పత్రిక సంపాదకులగురించి మాట్లాడకపోతే ఈ వ్యాసానికి పూర్ణత్వం రాదు.

మంచి భవనం నిర్మించాలంటే గట్టి పునాది పడాలంటారు. వాస్తు, పిల్లర్లు, గదులు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, రంగులు ఇవన్నీ భవనం శోభను పెంచుతాయి.
నాకు మాత్రం హాస్యనందం పత్రిక పునాది దగ్గరనుండి సర్వం తానై నిలిచిన, నిలుస్తున్న పత్రిక అని గర్వంగా చెప్పగలను.
హాస్యనందం కోసం అన్నీ తానై, సహస్ర హస్తాలతో కార్టూనిస్టుల కలల్ని, కళల్ని పండిస్తున్న నిత్య హాస్య కృషి వలుడు.
ప్రింట్ పత్రిక కష్టనష్టాలను, సాధకబాధకాలను, కార్టూనిస్టుల ఆశలను,ఆశయాలను ఓకేఒక్కడై తన భుజాలకెత్తుకున్న కార్టూనిస్ట్స్ సమాజ గిరిధారి హాస్యనందం పత్రిక పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హాస్యనందం రాము గారు. కార్టూనిస్టుల పాలిట బక్కపలచని బాహుబలి.
ఆయనకు ఎన్ని ధన్యవాదాలు,కృతజ్ఞతలు చెప్పుకున్న తక్కువే.
ఆయన రుణం ఏమిచ్చినా తీర్చుకోలేము, ఆయనతో ఈ రుణానుబంధం జీవితాంతం కొనసాగాలని ఈశ్వరుణ్ణి ప్రార్ధిండం మినహా!
ప్రముఖుల సహాయంతో ఇష్టపడి, కష్టపడి,ప్రేమించి 2012వ సంవత్సరంలో ప్రారంభించి ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా నిరంతరాయంగా గత ఏడు సంవత్సరాలుగా తొలితెలుగు కార్టూనిస్ట్ తలిశెట్టి రామారావు గారి పేరట ఆయన జన్మదినోత్సవం మే 20 వ తేదీన నిర్వహించే కార్టూన్ పోటీలు మొత్తం 5000 వేల రూపాయల బహుమతుల విలువనుండి ఆరంభించి, ఈ సంవత్సరం 62000 వేల రూపాయల బహుమతులు ఇచ్చే వరకు, కార్టూనిస్టుల నంది అవార్డులు అని కొనియాడే స్థాయికి చేరిందంటే ఆయన కృషి ఎలాంటిదో మీరే ఉహించండి. ఇలాంటి పత్రికతో, ఆ పల్లకి మోసే బోయితో ప్రేమలో పడడం తప్పని అంటారా???
ఆయనకు సహకరించిన పెద్దలు,పూజ్యులు,మహామహుల గురించిన వివరాలన్నీ తరువాత భాగాలలో…

(ఇంకా ఉంది)

-నాగరాజ్ వాసం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!