Monday, August 8, 2022
Home > సీరియల్ > || నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఐదవ భాగం “బ్నిమ్మానందం” -నాగరాజ్ వాసం

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఐదవ భాగం “బ్నిమ్మానందం” -నాగరాజ్ వాసం

సాధారణ ప్రచురణకే ఎంపికవుతుందో లేదో?
ఐదు పంపితే ఎన్ని తిరిగివస్తాయో తెలీదు? ఎలాంటి కార్టూనులు సంపాదకులు
మెచ్చుతారో అవగాహన లేదు.
ఇంత డైలమాలో ఉన్న నా కార్టూనుకు బహుమతి వస్తుందని ఉహించగలమా?
వచ్చింది! అవును !!
2012 సంవత్సరంలో.
హాస్యనందం పత్రిక లో మే 20 తలిశెట్టి రామరావుగారి జయంతి( తొలి తెలుగు
కార్టూనిస్ట్) సందర్బంగా నిర్వహించిన కార్టూను పోటీలో నా కార్టూను విశిష్ట
బహుమతి ( కన్సోలేషన్) గెలుచుకుంది.
గర్వంగా ఉండదా? ఉంటుంది! ఉన్నది కూడా!
బహుమతి మొత్తం గురించే అయ్యో అనుకున్నా! మా తమ్ముడికి చూపించా,
ఈ మెయిల్ లో వచ్చిన ఆహ్వానం చూపించాను.
శ్రీ గురువరెడ్డి గారి సన్ షైన్ హాస్పిటల్ ఇండోర్ ఆడిటోరియం వేదిక.
తనికెళ్ళ భరణి గారు,ఆంధ్రభూమి దిన పత్రిక సంపాదకులు శాస్త్రి గారు,సుధమ
గారు,బ్నీం గారు,సత్యమూర్తి గారు, తలిశెట్టి రామరావుగారి కార్టూనుల సేకర్త
ముల్లంగి వెంకటరమణ గారు, శంకు గారు.
అది చూసి మా తమ్ముడు ఒక మాటన్నాడు.
అన్నా ఇంత గొప్ప వ్యక్తులు పంచుకున్న వేదిక మీద వారి చేతుల మీదుగా బహుమతి
అందుకోవడం గొప్పా? బహుమతి డబ్బులు గొప్పా?
అనగానే నాకు కొంచెం నమోషీ అనిపించింది. ప్రతీ విషయాన్ని డబ్బుతో కొలవలేమని
అర్థమైంది.
బహుమతి వచ్చిన విషయాన్ని , బహుమతి పొందిన కార్టూన్ని శ్రీ కళాసాగర్ గారితో
పంచుకున్నాను.ఆయన సంతోషించారు.
బొమ్మలు ఇంకా బాగా వేయడానికి ప్రయత్నించండి, నాకు వీలైతే మీరు వేసిన కార్టూన్
ని నేను మరోవిధంగా బొమ్మ వేసి చూపిస్తాను పరిశీలించండి, బొమ్మలు ప్రాక్టీస్
చేయమని మంచి సూచనలు చేశారు.

మే 20, 2012 ఆదివారం కాబట్టి షాప్ సెలవు తమ్ముడు నేను ఇద్దరం
బయలుదేరాం.
సన్ షైన్ హాస్పిటల్ చేరుకున్న తరువాత మరొక్క సారి వేదిక కన్ఫర్మ్
చేసుకుని లోపలికి వెళ్ళాము.
ఇలాంటి సభలకు, ఇలాంటివేమిటి అసలు సభలు సమావేశాలకు వెల్లడమే ఇది
మొదలు. అక్కడంతా కొత్త, ఎవరు పరిచయస్తులు లేరు, మనకు మనమే పరిచయం చేసుకోవాలి.
అక్కడ ముందుగా నేను పరిచయం చేసుకున్న వ్యక్తి “నందు” అనే పేరుతో హాస్యనందంలో
కథలకు బొమ్మలు వేస్తున్న గుంటి దయానందు గారిని. అప్పటి పోటీలో ఆయనకు ద్వితీయ
బహుమతి వచ్చింది. చాలా సింపుల్గా, ఎంతో మర్యాదగా,స్నేహపూర్వకంగా మాట్లాడారు.
” తెలుగువెలుగు ” “బాలభారతం” మాస పత్రికల్లో కొన్నాళ్లు బొమ్మలు వేశారు.
తరువాత ఆంధ్రజ్యోతి నవ్య వార పత్రికలో చిత్రకారులుగా చేరారు. ఆయన బొమ్మలేంత
కుదురుగా ఉంటాయో ఆయనా అంతే. ఏ సభలో కలిసినా ఇప్పటికీ ఆప్యాయంగా మాట్లాడతారు.

అక్కడికి వచ్చిన వారు ఒక్క సారిగా లేచి బ్నీం గారు వస్తున్నారు, అంటూ
హడావిడి పడుతుంటే, నేను ఇదివరకు బ్నిం గారి గురించి విని, చదివి ఉన్నాను.
హాస్యనందం పత్రికకి కర్త, కర్మ, క్రియ. ఆయన్ని చూసి మాట్లాడాలని కుతులంతో
ముందుకు కదిలాను. ఒక వ్యక్తి సహాయంతో అడుగుతీసి అడుగువేస్తూ ఆయాసంతో ఇబ్బంది
పడుతూ వస్తున్న ఆయనను చూసి నిష్చేష్టుడిని అయ్యాను. మూడు నాటక, టివి
నందులు,200 ల బ్యాలెలు( ఒక రకమైన నృత్య రూపక ప్రక్రియ రచనలో), ఎన్నో
కథలు,పుస్తకాలు, పద్యాలు, 3000 వేల కార్టూనులు వేసిన బాపుగారి ప్రియ
శిష్యులు. బడి ముఖం చూడకుండా అమ్మ ఒడిలోనే చదువు, జీవనం అధ్యయనం చేసిన
సరస్వతీ పుత్రులు. నేనూహించుకున్న వ్యక్తి రూపం వేరు, చూస్తున్న మనిషి వేరు
మనసులో కలుక్కు మన్నా సానుభూతి కలగలేదు, అపారమైన భక్తి భావం, ప్రేమ కలిగాయి.
భగవంతుడు గారడి వాడు. మనుషుల్ని రకరకాలుగా సృష్టించి ఆడుకుంటాడు. అన్ని
సమకూర్చి అక్కడక్కడ అంది అందకుండా విసిరేస్తాడు మన చుట్టూ పక్కలే అవకాశాలన్ని
సృష్టించి కనిపించకుండా దాచేస్తాడు. వాటిని అందుకుని నిలిచి గెలవమంటాడు.
కొందరుంటారు వారికి భౌతికమైన లోపాలు కనిపించవు, లక్ష్యాలే కనిపిస్తాయి,
ప్రతీదీ అవకాశమే, అందిపుచ్చుకుంటారు. విధిని వెక్కిరించి ముందుకు సాగుతారు.
వారిని చూసి విధి భయపడుతుంది. అలాంటి వ్యక్తి బ్నిం గారు.
ఆయన గురించి నాకు తెలిసింది, చెప్పింది రేణువంత . పూర్తిగా చెప్పాలంటే
ఆకాశాన్ని పుస్తకంగా చేసి రాయాలి.
నందు గారితో కలసి ఆయన దగ్గరికి వెళ్లి పలకరించాను.
” నమస్కారం సర్ నాకు మీరన్నా, మీరచనలు, కార్టూనులన్నా చాలా ఇష్టం,
కార్టూన్ పోటీలో నా కార్టూనుకి కన్సోలేషన్ బహుమతి వచ్చింది సర్ అన్నాను.” (
నిజాయితీగా చెప్పాలంటే ఆయన రచనలు నేను చదవలేదు బ్నిం గారు నన్ను మన్నించాలి)
” చాలా సంతోషమండి, వేయండి ఇంకా బాగా కార్టూనులు వేయాలి మీరు. అంటూ
ఈయన పెరు నాగరాజ్ అండి, నా కార్టూనులంటే ఇష్టపడతారంట, మంచివారు. అంటూ ఆయన
పక్కన ఉన్న వ్యక్తికి కూడా నన్ను పరిచయం చేసారు.
అప్పుడప్పుడు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడే వాడిని. ఏప్రిల్ 23 వ తేదీ
2014 సంవత్సరం నన్ను పెద్ద షాక్ కి గురిచేసారాయన.
అప్పుడప్పుడే ఫెస్బుక్లో ప్రవేశించిన నాకు, ఆ రోజు ఉదయం ఫెస్బుక్ ఓపెన్
చేయగానే బ్నిం గారు నన్ను టాగ్ చేస్తూ పెట్టిన పోస్ట్. నా ఫోటో లేదు కానీ నేను
వేసిన కార్టూను, దానిపైన కార్టూనిస్ట్ నాగ్రాజ్ గారికి పుట్టినరోజు
శుభాకాంక్షలు అని ఉంది. నిజం చెబుతున్నాను అదివరకెప్పుడు నేను పుట్టినరోజు
గురించి ఆలోచించడం ,సెలబ్రేట్ చేసుకోవడం గాని చేయలేదు. అన్ని రోజుల్లాగే
పుట్టినరోజు కూడా గడిచిపోయేది. ఆ రోజు దాటి కొద్దిరోజులకీ ఓహ్ మొన్న నా
పుట్టినరోజు కదా అనుకునే వాడిని. పుట్టినరోజును గొప్పగా ఫీలవడం,శుభాకాంక్షలు
తెలుపుకోవడం ఆ మజా రుచి చూసింది మొదటి సారి ఆ రోజే.
ఫోన్ చేసి బ్నిం గారికి ధన్యవాదాలు చెప్పాను.
ఆయన్ని మొదటి సారి కలిసినప్పుడు ఆటోగ్రాఫ్ అడిగితే పుస్తకంలో “బ్నిమ్మానందం”
అని రాసారు.
ఇదేంటి కొత్తపదం ఇలా రాసారు ఈ పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనుకున్నాను
మనసులో.
పుట్టినరోజున ఎఫ్బి లో పోస్టు చూసి నేను అనుభవించానే అదే ” బ్నిమ్మానందం”
అప్పుడు తెలిసింది అర్థం.

అదే సభలో నేను కలిసిన నా అభిమాన కార్టూనిస్ట్ ఎవరో తెలుసా…..?

(ఇంకా ఇంకా ఉంది)

-నాగరాజ్ వాసం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!