Sunday, October 2, 2022
Home > సీరియల్ > || నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఐదవ భాగం-2 “గోంగూర పచ్చడి లాంటివాడు” -నాగరాజ్ వాసం

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఐదవ భాగం-2 “గోంగూర పచ్చడి లాంటివాడు” -నాగరాజ్ వాసం

సమయం కరుగుతున్న కొద్దీ ఒక్కొక్కరుగా కార్టూనిస్టులు వస్తున్నారు. ఆ పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్న పార్నంది వెంకట రామ శర్మ గారు వారిని అప్పుడు పలకరించ లేక పోయాను. బివి.ప్రసాద్ గారు, భాను గారు,విజయ్ పురం గారు, అర్జున్ నాయుడు గారు,తుంబలి శివాజీ గారు,కృష్ణ కిషోర్ వల్లూరి గారు, హరగోపాల్ గారు ఒక్కొక్కరుగా అందరూ వస్తున్నారు, అందరిని ఓ మూలన కూర్చుండి గమనిస్తున్నాను.
అప్పటికే కొన్నిసార్లు ఫోన్ పలకరింపులతో పత్రికల వివరాలు పరస్పరం తెలుపుకుంటు,ఎన్నో మెళకువలు తెలుసుకుంటూ పరిచయం పెంచుకున్న, మంచి మిత్రునిగా మారిన రామ్మోహన్ గారు
వచ్చారు. ఆయనని గురుతుపట్టి దగ్గరికివెళ్లి పలకరించాను. ఎంతో ఆత్మీయత ఎన్నాళ్లుగానో పరిచయం ఉన్న వారిలాగా మాట్లాడుకున్నాం. రామ్మోహన్ గారిని రెండవసారి “2012 కార్టూన్ ఉత్సవ్” పబ్లిక్ గార్డెన్ లో జరిగింది. అక్కడ కలుసుకున్నాను. తరువాత ఏమైందో ఫోన్ ఎన్నిసార్లు చేసినా కలవలేదు. కొన్ని సవత్సరాలకి ఫెస్బుక్ లో “గిలిగింతలు” పేరుతో ఆయన కార్టూనులతో కూడిన సంకలనం విడుదల చేసినట్టు పోస్టు పెట్టారు. అప్పుడుకుడా ఫోన్ కలవలేదు. చాలా రోజులకి మళ్లీ మొన్నటి ప్రపంచ తెలుగుమహాసభల కార్టునుల ప్రదర్శనలో కలిసి ఆయన కార్టూన్ పుస్తకం అందించారు. ఎంతో ఆనంద పడ్డాను.

ఆ రోజు సభకి వచ్చినవారు ఎవరు కూడా నాకు పరిచయం లేనివారు. నేను ఎవరిని పోల్చుకోలేకపోయాను. వస్తున్నవారందరిని వీరు ఫలానా అంటూ రామ్మోహన్ గారే పరిచయం చేసారు. అప్పుడే నవ్వుతూ వస్తున్నవ్యక్తిని చూపిస్తూ ఆయన సరసిగారు అనగానే నాకు భలే సంతోషం కలిగింది వెంటనే వెళ్లి నమస్కరించి, పరిచయం చేసుకుని ఆయనతో ఫోటో దిగాను. ఆ ఫోటోని ఇంటికి వచ్చాక ఎంతమందికి చూపించి మురిసిపోయానో !
సరసిగారితో ఫోటో దిగుతున్నప్పుడు నేను ఉహించడానికి కూడా సాహసం చేయలేని కార్యక్రమములో ఆయనతో భాగమవుతానని కలలోకూడా అనుకోలేదు. జీవితానికి సరిపడా అనుభవాలను సంపాదించుకున్న ఆ సందర్భాన్ని మరో వ్యాసం లో కూలంకషంగా చర్చిస్తాను.

అలా సమావేశమందిరమంత కలియదిరుగుతున్నపుడు వచ్చారు. ఆయన బొమ్మల్లాగే సన్నగా, ఉత్సాహంగా కదులుతున్న వ్యక్తి నేను కార్టూనులని అభిమానించడం అంటూ మొదలుపెట్టాక మొదటగా ప్రేమించింది ఆయన కార్టూనులనే. నా అభిమాన కార్టూనిస్ట్ ,గురువు ,మిత్రులు , శ్రేయోభిలాషి, ఏదైనా అనుకునే హక్కు నాకుంది అర్హత ఆయనకుంది . హాస్యనందంలో చాలా రోజులు సినీ ట్యూన్స్ వేసి నవ్వించిన”రామశేషు గారు”. పరుగునవెళ్లి, చేయి పట్టుకుని ఫోటో దిగాను.
కొంతమంది ఎక్కువగా మాట్లాడరు. వారి పని మాత్రమే మాట్లాడుతుంది, ఎన్నో పాఠాలు నేర్పుతుంది,ఎంతో విషయాన్ని పంచుతుంది. అలాంటి వారు రామశేషు గారు. మీటింగుల్లో కలిసినప్పుడు ఎక్కువగా మాట్లాడరు, మితభాషి అనుకుందామా ఊహు!! అనవసరంగా మాట్లాడరు అంతే!
ఆయన జడ్జిమెంట్ ఎంత గొప్పదంటే పోటీలకి పంపే కార్టూను ల విషయంలో 99 శాతం ఖచ్చితత్వం ఉంటుంది. దాదాపు ప్రతి కార్టూన్ పోటీల్లో ఆయన పొందిన బహుమతులు నిదర్శనం. నాకు ఇచ్చిన సూచనలు సలహాలు నేను పొందిన బహుమతులు సాక్ష్యం.
కథా రచనలో, షార్ట్ ఫిల్మ్ మేకింగ్ లో ప్రవేశముంది,వృత్తిజీవితం యానిమేషన్ కాబట్టి బొమ్మలు వేయడంలో చేయి తిరిగినవాడు.
నాకు అత్యంత ప్రీతిపాత్రమైన, నేను విజయవంతంగా సిరీస్ కార్టూనులలో వంద కార్టూనులు వేసి ఎంతోమంది మిత్రులు,శ్రేయోభిలాషులు,పెద్దలు,గురువుల ప్రశంశలు అందుకున్న కార్టూన్ ఫీచర్ “రాబోవు రోజుల్లో”.
ఈ ఫీచర్ తెలుగువెన్నెల.కం అనే వెబ్ సైట్లో ( రామశేషు గారి మిత్రులు,ఆయన కలిసి నిర్వహించేవారు.) పట్టుబట్టి వేయించి నన్ను ఎన్నో ప్రశంశలకు అర్హుడిని చేసింది రామశేషు గారు.
సంతోషం,బాధ,విజయం,అపజయం,అవమానం,ప్రశంశ,సలహా ఏది పంచుకోవాలన్నా నాకు రామశేషు గారే!
ఏ విషయం గురించైనా గంటలు గంటలు ఫోన్ లో చర్చ సాగుతుంది.
ఒక రోజు మేము మాట్లాడుతుంటే మా ఆవిడకు అనుమానమొచ్చి అడిగింది, అవతల ఆ కార్టూనిస్ట్ ఆడా? మగా? అని.
అది పరిస్థితి.
నా బొమ్మలు అందంగా , రాత గుండ్రంగా రావాలని నిబ్బులతో కూడిన పెన్నుల సెట్టు బహూకరించారు, పర్సపెక్టీవ్ సరిగ్గా రావాలి ప్రాక్టీస్ చేయమని ఎంతో విలువైన పుస్తకాలు స్పైరల్ బైండ్ చేయించి నాకు అందించారు. కానీ నేను బొమ్మల బద్ధకస్థున్ని కదా ఇప్పటిదాకా ఆయన చెప్పిన లెవెల్స్ చేరుకోలేకపోయాను.

రాంశేషు గారి నాకు నచ్చని విషయం ఒకటుంది. ఎవరైనా, వారెంత వారైన ఆయనకు నచ్చనివిధంగా ప్రవర్తిస్తే, తప్పుగా మాట్లాడితే ముఖంమీదే కుండబద్దలు కొడతారు. పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేదు, లేనిది చెప్పుకోమన్నామా లేదే ఉన్నదే మార్కెట్ చేసుకోరు. ఈ కాలంలో అది నడవదంటే వినరు, పెన్ను పట్టుకోవడం చేతకాని నేనే, నన్ను నేను ప్రమోట్ చేసుకుని పెరుకోసం పాకులాడుతుంటే, విషయం ఉండి, సేలబిలిటీ ఉన్నవ్యక్తి తనగురించి ఇంగ్లీష్ పేపర్ లో వేస్తే ఎవరో చెబితే గాని నలుగురికి తెలియదు, గొప్పగా సన్మానిస్తే ఎవరో ఫెస్బుక్ లో పెడితే గాని తెలియదు, చెప్పలేదండి అని అడిగితే దాంట్లో ఏముందండి చెప్పుకోడానికి అంటారు. అది వాలకం.
మొత్తానికి ఆయన గోంగూర పచ్చడిలాంటివారు. తినడం మొదలుపెట్టేదాకనే, ఒక్కసారి తినడం అలవాటైందా జీవితాంతం మరచిపోము.
నేను తింటున్నాను.
రామశేషుగారి గురించి ఎంత మాట్లాడిన తరగదు, ఎందుకంటే నా కార్టునుల ప్రయాణం అంతా నిండి ఉంటారు కాబట్టి.

**********************************

మాటల్లో పడి సభగురించి మరిచాను.
బ్నిం గారు, శంకు గారు , ముఖి మీడియా వారి సహాయసహకారాలతో ప్రారంభమైన సభ. అతిరథమహారథులు విచ్చేసారు.
వేదిక మీద సర్వశ్రీ తనికెళ్ల భరణి గారు, ఆంధ్రభూమి దిన పత్రిక సంపాదకులు శాస్త్రిగారు, సుధామ గారు, బ్నిం గారు, శంకు గారు, సీనియర్ కార్టూనిస్ట్ సత్యమూర్తి గారు,సరసి గారు, తొలితెలుగు కార్టూనిస్ట్ తలిశెట్టి రామారావు గారి కార్టునుల సేకర్త,సంకలన కర్త ముల్లంగి వెంకట రమణ గార్లతో వేదిక శోభాయమానంగా వెలిగిపోతోంది.
సమావేశమందిరంలో ఆశీనులైన అతిథులంతా పేరుమోసిన వారే. ప్రత్యేక ఆహ్వానితులే, ప్రత్యేకమైన వారే.
కార్యక్రమాన్ని తెరవెనుక నుండి రాముగారు నడిపిస్తున్నారు.
ఏమినెంట్ భారతీయ కార్టూనిస్టుల పై శ్రీ శంకు గారు దర్శకత్వం వహించిన, డాక్యుమెంటరీ ని ప్రదర్శించారు.
ప్రముఖ కార్టూనిస్ట్ సూర్య గారు కార్టూనిస్టులను ప్రోత్సహించే నిమిత్తం రూపొందించిన వెబ్ సైట్ ని భరణిగారు మీట నొక్కి ప్రారంభించారు.
భరణిగారు ఆ సభలో కార్టూనిస్టులకు మరచిపోలేని మధురమైన బహుమతిని ప్రసాదించారు అది నేటికి నా దగ్గర భద్రంగా దాచుకున్నాను.

(ఇంకా ఇంకా ఉంది)

-నాగరాజ్ వాసం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!