Monday, August 8, 2022
Home > సీరియల్ > || నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఐదవ భాగం-3 “చేజారిందే చేతికందింది” -నాగరాజ్ వాసం

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఐదవ భాగం-3 “చేజారిందే చేతికందింది” -నాగరాజ్ వాసం

మనుషులు కోరికలు తీరకుండా చనిపోతే దయ్యాలుగా మారి కోరికలు తీర్చుకుంటారు అని ఎవరో చెబితే విన్నాను.
నేను సినిమా సెలెబ్రిటీలను దగ్గరగా చూసింది డిగ్రీ చదువుతున్నప్పుడు. స్వాతంత్ర్యదినోత్సవ స్వర్ణోత్సవాల సందర్బంగా రాష్ట్రస్థాయి ఇంటర్యూనివర్సిటీ nss యూత్ ఫెస్టివల్ నిర్వహించారు. అవి రవీంద్రభారతి ఆడిటోరియంలో ఐదురోజులపాటు ఘనంగా జరిగాయి. మోనో యాక్షన్,మైమ్,గ్రూప్ డాన్స్, క్లాసికల్ డాన్స్, ఒకల్ సింగింగ్, ఒకల్
ఇంస్ట్రుమెంటల్, గ్రూప్ సింగింగ్, డ్రాయింగ్, కొల్లేజ్, ఎస్సే రైటింగ్ లాంటి వివిధ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని యూనివర్సిటీల నుండి ఎంపికైన విద్యార్థులు పాల్గొన్నారు. నేను కాకతీయ యునివర్సిటినుండి ఎస్సే రయిటింగ్ (వ్యాస రచన) కి ఎంపికై వెళ్ళాను.
అసలు విషయాన్ని వదిలి ఈ సోదంత ఎందుకంటే ,రవీంద్రభారతి మెయిన్ హాళ్ళో ఆ రోజు తనికెళ్ల భరణి గారు రాసిన మైమ్ యాక్షన్ గ్రూప్ ఈవెంట్ ని అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రదర్శిస్తున్నారు. ముందువరుసలో కూర్చుండి ప్రదర్శనను భరణి గారు చూస్తున్నారు. “కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్సింగ్ ట్రూప్ ” సినిమాలో భరణి గారి నటనంటే నాకు వల్లమాలిన అభిమానం. ఆ సినిమాకు ఆయన మాటల రచయిత. ఆ సినిమాలో భరణిగారు చెప్పే ఒక డైలాగ్
ఇప్పటికీ చాలా ఫెమస్ ఈ మధ్య వచ్చిన ఒక సినిమాలో ఆ డైలాగును మళ్ళీ వాడారు. ”
సీతతో అదంత వీజీ కాదురా”. ఏ సినిమాలో అయినా భరణిగారు చేసిన పాత్రని నేను ఇష్టపడతాను. ఆయన నటనంటే నాకు ప్రేమ మరి. అదిగో మళ్ళీ దారి తప్పుతున్నట్టున్నాను.
విషయమేంటంటే!
ముందు వరుసలో కూర్చున్న ఆయన్ని కలవడానికి వెళ్ళాను, అప్పుడు మా యూనివర్సిటీ వాళ్ళు గ్రూప్ సింగింగ్ కోసం ప్రిపేర్ అవుతుంటే కంజీరా నా చేతిలో పట్టుకుని తిరుగుతున్నాను. భరణి గారికి నమస్కరించి ఆటోగ్రాఫ్ అడిగాను. నా చేతిలో పెన్నుంది, పేపర్ లేదు కంజీరా ఆయన చేతిలో పెట్టాను, చిన్నగా నవ్వి దీని పైన పెన్ను రాయదు స్కెచ్ పెన్నుందా అన్నారు, అయ్యోలేదు సర్ అంటూ జేబులు తడుముకుంటే పేపర్ తగిలింది, తీసి ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకున్నాను, అప్పుడు సెల్ ఫోనులింకా చెలరేగలేదు మా చేతుల్లో ఫోన్లు లేవు, కెమెరాలు తీసుకుపోయేంత సీను
మాకు లేదు. కాబట్టి ఫోటో దిగే అదృష్టం కలగలేదు. తీరా ఆటోగ్రాఫ్ తీసుకుని వచ్చి చూసుకున్నా కదా ఆ కాగితం, nss కో ఆర్డినేటర్ మా డిగ్రీ కాలేజ్ pd శ్రీ పరంజ్యోతి గారు నన్ను యూత్ ఫెస్టివల్ కి పంపుతున్నట్లు రాసిచ్చిన లెటర్ అది. దాన్ని యూనివర్సిటీ కో ఆర్డినెటర్కి అప్పజెప్పాలి. అంతే భరణిగారి ఆటోగ్రాఫ్ అలా వెళ్ళిపోయింది.
నిరాశ నాతో ఉండిపోయింది.

ఇక ఎప్పటికి ఇలాంటి అవకాశం నాకు రాదు. చచ్చి దయ్యమై తీరని కోర్కెలు
తీర్చుకుంటే తప్ప అనుకున్నాను.
కా …….నీ…… సరిగ్గా పదిహేను సవత్సరాలకి అనుకోకుండా ఆయన్ని కలిసే అవకాశం, కలవడమే కాదు భరణి గారి చేతులమీదుగా బహుమతి తీసుకునే అదృష్టం కలుగుతుందని నేనూహించలేదు. నాకు ఎప్పుడైనా బాగా సంతోషపడే సందర్భాలు అనుకోకుండానే వచ్చాయి. నేనేదో సాధిద్దాం, పొడిచేద్దాం అంటూ వెళ్లిన ప్రతిసారి గర్వభంగమే.

సరిగ్గా అప్పటికి భరణిగారు అద్భుతమైన దృశ్యకావ్యానికి దర్శకత్వం వహించి
విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
తెలుగుసినీ చరిత్రలో కేవలం రెండు పాత్రలతో ఆద్యంతం ఆసక్తిభరితంగా, వీనుల
విందైన పాటలతో, దాంపత్యసారాన్ని హృద్యంగా చెప్పిన చిత్రం “మిథునం”.
శ్రీ రమణ గారు రాసిన, బాపుగారు మెచ్చిన,అచ్చులో లక్షకాపీలు పైగా అమ్ముడుపోయిన
తెలుగువారి అచ్చతెలుగు దాంపత్య సారాన్ని రసరమ్యంగా,చమత్కారంగా శ్రీ రమణ గారికి
మాత్రమే సాధ్యమైన రచనా శైలితో రాసిన గొప్ప రచన మిథునం.
మిథునం సినిమా పాటలన్ని ఆణిముత్యాలు, ఆ పాటలు ప్లే చేసి సభికులను ఆనంద
పారవశ్యంలో ముంచెత్తారు. బహుమతి పొందిన కార్టూనిస్టులందరికి ఆడియో సీడీని
బహుమతిగా ఇచ్చారు భరణి గారు. మహప్రసాదం. ఇప్పటికి భద్రంగా దాచుకుని పాటలు
వింటున్నాను.
సభనుద్దేశించి ముందుగా శ్రీ సుధామ గారు ప్రసంగించారు. ఆంధ్రభూమి దినపత్రిక
సంపాదకులు శాస్త్రిగారు , సరసిగారు, భరణి గారు, బ్నిం గారు, శంకు గారు
కార్టూనులు కార్టూనిస్టుల గూర్చి అద్భుతమైన విషయాలు ప్రస్తావించారు.
వారి ప్రసంగాలలో ఎన్నో చమక్కులు, ఎంతో హాస్యం, చాలా విషయం తొణికింది.
సభ దాదాపు 75 శాతం హాజరుతో నిండుగా శోభాయమానంగా ఉంది.
వక్తలు, అతిథులను సభికులను ప్రస్తావిస్తూ మురిసిపోయారు. కొన్ని సభలు
ఆర్భాటంగా ఆరంభిస్తారు, జనాలు కరువవుతారు. ఈ సభ నిరాడంబరంగా ప్రారంభమై నిండుగా
కొలువుదీరి శోభాయమానమైందని కొనియాడారు.
బహుమతి పొందిన కార్టూనిస్టులను ఒక్కొక్కరిగా వేదిక మీదికి ఆహ్వానిస్తూ
వారి కార్టూను ని వివరిస్తూ, సభికుల కరతాళధ్వనుల మధ్య బహుమతి ప్రధానం చేశారు.
కృష్ణకిశోర్ వల్లూరి గారి కార్టూనుకి కాస్త ఎక్కువ చప్పట్లు పడ్డాయి.
నా కార్టూను భరణి గారు చదివి వినిపిస్తున్నపుడు ఎంత మురిసిపోయానో, ఆ రోజు
రవీంద్రభారతిలో కలిసి ఆటోగ్రాఫ్ తీసుకున్నప్పుడు, అది చేజారిపోయిందే అని చాలా
బాధపడ్డాను. ఈ రోజు ఆయన పక్కన నిలబడి నా కార్టూను చదివి చప్పట్లు కొట్టి
బహుమతి అందిస్తుంటే పరవశించిపోయాను. ఇది కదా మధురానుభూతి అంటే, అదృష్టమంటే.
బహుమతి ప్రధానోత్సవం తరువాత కార్టూనిస్టులకు వేదిక మీద మాట్లాడే అవకాశం
కల్పించారు. సభలో నాకు పరిచయమై తరచుగా ఫోన్లో సంభాషణలు చేస్తూ, నాలో
ఎన్నోసార్లు పాజిటివ్ ఎనర్జీ నింపిన, నింపుతున్న ఎప్పుడూ ఎవరితో కూడా దురుసుగా
ప్రవర్తించని, మాట్లాడని అజాతశత్రువు, మంచి మనిషి, శ్రేయోభిలాషి , మిత్రులు
కార్టూనిస్ట్ అర్జున్ గారు కాదు కాదు కార్టునుల మెషిన్ అర్జున్ గారు కొన్ని
వేల కొద్దీ కార్టూనులు వేసిన, వేస్తున్న కార్టునుల ఖార్ఖానా అర్జున్ గారు.
వేదిక మీద తన కార్టూన్ ప్రయాణాన్ని,అనుభవాలను చాలాబాగా చెప్పారు. నాకు మంచి
మిత్రులుగా మారారు.
అందరూ సభకు సెలవుతీసుకుని మరలిపోతుంటే, భరణి గారిని పిలిచి బతిమాలి
మరోసారి మా తమ్ముడితో కలిసి ఫోటోదిగి మనసు నింపుకున్నాను.
సభకు ఆలస్యంగా వచ్చిన పురం విజయ్ గారు, వారిని చివరిక్షణంలో కలిసి
పలకరించాను. ఆయన ప్రత్యేకమైన శైలి నాకు ఇప్పటికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే
ఉంది.
విజయ్ గారు డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ తీరిక సమయంలో కార్టూనులు
వేస్తుంటారని తెలిసుకుని నమ్మలేకపోయాను. చాలా నెమ్మదస్తులు, ఆయనతో కలిసి
ఇంటికి బయలుదేరాం. సికింద్రాబాద్ బస్టాండులో విజయ్ గారితో
కలిసి టిఫిన్ చేసి, ఎవరి గమ్యాలను వారు వెతుక్కుంటూ బస్సులో బయలుదేరాం.
మరో మరపురాని ఘట్టం కోసం ఎదురు చూస్తూ…….

ఆ మరుపురాని ఘట్టం త్వరలోనే ఎదురవుతుందని, దానికి హైద్రాబాద్ పబ్లిక్
గార్డెన్ వేదికవుతుందని, మూడురోజుల పండగవుతుందని తెలియక..

(ఇంకా ఉంది)

-నాగరాజ్ వాసం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!