Sunday, October 2, 2022
Home > సీరియల్ > || నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఆరవభాగం “గురుదీవెన” -నాగరాజ్ వాసం

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఆరవభాగం “గురుదీవెన” -నాగరాజ్ వాసం

“గురువులేని విద్య గుడ్డివిద్య”
స్వతహాగా ఎంత నైపుణ్యనత ఉన్నప్పటికీ గురువు సాంగత్యంలో, శిక్షణలో, గురువుల ఆశీర్వాదం తో నేర్చుకున్న విద్యయే పరిపూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. సనాతనంగా ఇది ఋజువవుతూనే ఉంది.

గురువులు అనగానే నాకు ముందుగా గురుతుకువచ్చేది పదోతరగతిలో శ్రీమాన్ సంపత్‌కుమార్ గారు, ఇంటర్ మిడియెట్లో శ్రీమాన్ మురళీమోహణాచారి గారు, డిగ్రీలో శ్రీమాన్ పరంజ్యోతి గారు. జీవితంలో ప్రతి మలుపులో, ప్రతిసంఘటనలో వారి మార్గదర్శకాలు నా వెంటనడుస్తూనే ఉంటాయి. సంపత్‌కుమార్ సర్ మాథ్స్ చెప్పేవారు. ఆయన చెప్పిన లెక్కల కన్న జీవనగణితమే నాకు ఎక్కింది. మురళీమోహన్ సర్ తెలుగు బోధించేవారు అమ్మభాష మీద అనురాగం మరింత బలపడేలా చేసింది ఆయన పాఠాలు. పుస్తకాలు చదవడం, ప్రేమించడం నేర్పింది ఆయనే. పరంజ్యోతి సర్ కొన్ని వేలమంది విద్యార్థులకు చేయుతనందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు. మాకు p.d., పుస్తకంలోని పాఠాలు చెప్పలేదు కానీ, ఎవరు ఏ రంగంలో ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నారో గుర్తించి ప్రోత్సహించేవారు. శారీరకంగా, మానసికంగా దృడంగా తయారుచేసేవారు. ఆయన ప్రభావం నామీదే కాదు విద్యార్థులందరి పైన ఉండేది, ఉంది.

ఉత్తమ గురువులు శిష్యులనే కాదు చుట్టూ ఉన్న పరిసరాలను, జనాలను కూడా ప్రభావితం చేస్తారు.
విగ్రహాన్ని ఆరాధిస్తూ విద్య నేర్చుకున్నాడు ఏకలవ్యుడు. ఉత్తమగురువుల ప్రభావం అలాంటిది.
బొమ్మలు ఎదో వేస్తున్నాం, కార్టూనులు అచ్చవుతున్నాయ్, బస్ ! ఇంకేం కావాలి అనుకుంటే ఒకే. కానీ ఇంకా కావాలి, ఇంకా ఏదో నేర్వాలి, ఉత్తమంగా ఉండాలి. తపన, ఉత్సాహం ముందుకు తోస్తున్నాయి.

హాస్యనందం పత్రికలో శ్రీ a.v.m. ( a.v. మోహనగుప్త) గారి ఫోన్ నంబర్ తీసుకుని, ఫోన్ చేసి మాట్లాడాను.
ఎంతోకాలంగా పరిచయం ఉన్నవారిలాగా చాలా మర్యాదగా మాట్లాడారు. మనఇంట్లో పెద్దనాన్నో, చిన్నాన్నో మనతో ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నట్టు ఉంటుంది సర్ తో మాట్లాడుతుంటే. గాట్టి గా మాట్లాడుతారు. ఆయన మాటల్లో కల్మషం, భేషజం, మచ్చుకైనా కనిపించవు. జలపాతం పైనుండి దూకుతున్న నీటికి చూస్తే కలిగే ఆనందం, జలపాతం చేసే నీటి చప్పుడంత స్వచ్ఛత ఆయన మాట్లాడుతుంటే.

సర్ మీ కార్టూన్ పుస్తకాలు కావాలి పంపిస్తారా? అడిగాను.
ఓ తప్పకుండా ! రెండువందలు మనీయార్డర్ చేయండి అన్నారు, ఒక్క నిమిషం చిత్రమైన ఆలోచనలు నా చుట్టూ చేరి విచిత్రమైన ముచ్చట్లు చెప్పి వెళ్లాయి. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి కొన్ని మెతుకులు నోట్లో వేసుకుని తిని చూస్తాము కదా! ఏవిఎం గారు వ్యాపారస్తులు, కార్టూనిస్ట్, జ్యోతిష్యులు, రచయిత ఒక వ్యక్తికి ఇన్ని కోణాలు సాధ్యమా? సాధ్యమనేందుకు సాక్ష్యం మన ముందు ఉంది. నన్ను పరీక్షించారు, వీడు నిజంగా నేర్చుకోవాలనే తపన ఉన్నవాడేన, ఎంతవరకు? తెలుసుకోవలనుకున్నారు. నేను డబ్బులు పంపి, మెసేజ్ పెట్టాను.
నాలుగు రోజుల్లో పుస్తకాలు అందాయి. అయిదు పుస్తకాలు పంపించారు. ధన్యవాదాలు చెప్పడానికి ఫోన్ చేసాను బాగా నేర్చుకోమని దివించారు. మంగళాశాసనాలు.
ఇక డబ్బులు అడగలేదు, ఎన్ని పుస్తకాలు పంపారో! హాస్యకథా సంకలనాలు వారు ఎన్ని ప్రచురించారో అన్ని పంపించారు. గురువుగారు డబ్బులు పంపుతాను అని అడిగా! అదేంటయ్యా ప్రేమతో పంపితే! నేర్చుకుంటావు, తపన గల వాడివి కార్టూనులంటే ఇష్టం ఉన్నవాడివి అని పంపించాను. చక్కగా నేర్చుకుని మంచి కార్టూనులు వేయి అన్నారు. డబ్బులేమి అక్కర్ల అన్నారు.

ఆయన్ని కలిసి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి అనుకున్నాను. కోరిక నెరవేరింది. కొన్ని సంవత్సరాల తరువాత వారి ఇంటికి వెళ్లి శివపార్వతుల వంటి దంపతుల పాదాలకు నమస్కరించి తరించే వరం విజయవాడ కనకదుర్గమ్మ ప్రసాదించింది. ఆ వివరాలను మరో వ్యాసంలో కూలంకషంగా తెలియపరుస్తాను.

#########################

శ్రీ సజ్జ జయదేవ్ బాబు గారు కార్టూన్ మేరు నగధీరుడు. బాపు గారి తరువాత తెలుగు కార్టూన్ లోకానికి దిశనిర్ధేశం చేస్తున్న ద్రోణాచార్యులు. ఆయనకు ప్రత్యక్షశిష్యగణమే కాదు పరోక్ష ఏకలవ్యశిష్యులు చాలామంది. ఏకలవ్యశిష్యులను ఏరి వారికి కావాల్సిన బొటనవేలును అందిస్తున్న గురుపుంగవులు. అయ్యా మమ్ములను అక్కున చేర్చుకోండి అనే అవసరమే రానీయరు. అలా తనవెంట తీసుకుని పోతుంటారు ఆయన ప్రసాదాన్ని ఎంత స్వీకరిస్తున్నామో మన ఓపిక. డెబ్భై పదులు దాటిన వయసులో కూడా రోజుకి ఒక కార్టూన్ అయినా తప్పకుండా వేస్తుంటారు. అయ్యా! “ఈ ” కార్టూన్ బుక్ తీసుకరబోతున్నాను మీ స్వదస్తూరితో కూడిన ముందుమాట కావాలి అని అడగగానే ఒకటి కాదు రెండు కాదు ఆరు పేజీల నిండుగా రాసారు అందులో ప్రతిపేర కార్టూనిస్టులు చదివి గుర్తుంచుకొని ఆచరించాల్సిన సూచనలు. వారి ఓపికకు కార్టూన్ పట్ల వారి వ్యామోహనికి పాదాభివందనాలు.

కళాసాగర్ సార్ పంపించిన ఆర్టిస్ట్ హ్యాండ్‌బుక్ లో దొరికింది గురువుగారి అడ్రసు, ఫోన్ నంబర్.
ఫోన్ చేసి సర్ మీ కార్టునుల పుస్తకం కావాలి ఎలా సర్ అన్నాను. అచ్చం ఇలాగే. నాగ్‌రాజ్ మీరు మీ కార్టూనులు నాకు పోస్ట్ చేయగలరా? అన్నారు. సర్ నన్ను మీరు అనకండి గురువులు నాకు అదోలా ఉంటుంది అన్నాను. అయినా అలాగే పిలుస్తారు. అది వారి సహృదయత.

యాభై కార్టునుల వరకు వివిధ పత్రికల్లో అచ్చయినవి జిరాక్స్ తీయించి పోస్ట్ చేసాను. వారం రోజుల్లో రిప్లయ్, నేర్చుకోవాలన్న తపన ఉన్నవారిపట్ల గురువుగారి నిబద్ధత అలాంటిది. తనలోకంలోకి అనాయాసంగా లాగేసుకుని కార్టూన్ ప్రపంచపు ఆమూలాగ్రాన్ని మనకు పరిచయం చేస్తారు. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సులభంగా విద్యనందిస్తారు. అపారమైన అనుభవం, కార్టూనిస్టుల పైన ప్రేమ, శిష్యులను అక్కున చేర్చుకునే పెద్దమనసు గురువుగారిది.
గురువుగారి నుండి అందిన మొదటి ఉత్తరం, మొత్తం చదివాక తెలిసింది కార్టూన్ అంటే ఆషామాషీ కాదని, ఉత్తమకార్టూన్ పుట్టాలంటే ప్రసవ వేదన పడాల్సిందే అని. ఎన్ని మెలకువలో ఒక్కోటి పేపర్ పైన సూచనలు చేస్తూ ప్రత్యక్షంగా ముందరకూర్చుండి వింటున్నమా అనేంత స్పష్టంగా రాసి పంపించిన ఉత్తరం. నా కార్టూను రీ డ్రా చేసి మరీ ప్రతీ అంశాన్ని వివరించారు. కార్టూనులు వేసేటప్పుడు చిన్న అనుమానం వచ్చినా గురువుగారి ఉత్తరం తీసిచదువుతాను.
ఫోన్ చేసి ధన్యవాదములు చెబితే నీకే అనుమానం ఉన్నా నిరభ్యంతరంగా అడగొచ్చు, పెన్నులు, పేపర్, పెన్సిల్ ఏదైనా మీ ప్రాంతంలో దొరకనిది నాకు చెబితే మీకు పంపుతాను చెప్పండి అన్నారు.

గురుదేవులను ప్రత్యక్షంగా కలిసి పాదాలకు నమస్కరించి ఫోటో దిగి జీవితాన్నీ సార్థకం చేసుకోవాలని, ఆయనతో కలిసి ఆరు కార్టూనులు వేసేభాగ్యం కలుగుతుందని, ఆయన స్వదస్తూరితో నా ” ఈ” బుక్ కి ముందుమాట రాయించుకుంటానని దేవుడు ఆశీర్వదించాడు, జరిగాయి. అదెలాగో ముందు ముందు తెలియపరుస్తా.

(ఇంకా ఇంకా ఉంది)

-నాగరాజ్ వాసం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!