Sunday, October 2, 2022
Home > సీరియల్ > || నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఎడవభాగం “కార్టూనుల జాతర” -నాగరాజ్ వాసం

|| నేను.. కార్టూనులు.. లవ్ ఎఫైర్స్ || – ఎడవభాగం “కార్టూనుల జాతర” -నాగరాజ్ వాసం

2012 సంవత్సరం మహా ఉత్సవానికి తెరలేచింది. కార్టూనిస్టుల అతిపెద్ద పండగ. సీనియర్, జూనియర్ బేధాల్లేకుండా పొలిటికల్ కార్టూనిస్టులు, ఫ్రీలాన్స్ కార్టూనిస్టులు ఏకతాటిపై నిలచి జరుపుకున్న పండగ. కార్టూన్, ఆర్ట్ ఏక్సిబిషన్లు ఆర్టీగాలరీల్లో, ఏదైనా థియేటర్లో, హాళ్ళో జరగడం చూసాను కాని బహిరంగ ప్రదేశాల్లో జరిగినపుడు చూడటం ఇదే మొదటిసారి.

హస్యానందం సంపాదకులు శ్రీ రాము గారి నిర్వహణ, సత్కళభారతి శ్రీ సత్యనారాయణ గారి సహకారం, శ్రీ రమణాచారి గారు పెద్దదిక్కై అందించిన ప్రోద్బలం, మహామహులెందరో వారి చేయూతనందించి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆ మహోత్సవానికి వేదిక హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్. శ్రీయుతులు కళాసాగర్ గారు చెప్పకపోయిఉంటే నేను ఏక్సిబిషన్ కి నా కార్టూనులు పంపేవాడిని కాదు. అంత మంచి ప్రదర్శనలో భాగమయ్యేవాడిని కాదు.

పబ్లిక్ గార్డెన్ లోకి వెళ్తుంటే అద్భుతమైన కార్టూనిస్ట్ శ్రీ గోపాలకృష్ణ గారు అలా వెళ్తున్నారు ఆయన్ని గురుతుపట్టి పరుగున వెళ్లి పరిచయం చేసుకుని పలకరించాను చాలా ఆప్యాయంగా మాట్లాడారు. లోపలికి వెళ్ళాక అక్కడ కళాసాగర్ గారు బోర్డులపైన కార్టూనులు అతికించే పనిలో ఉన్నారు. వెళ్లి గట్టిగా ఆయన చేయి పట్టుకున్నా ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నారు.
అది కార్టూనిస్టుల సమ్మేళనం, కార్టూనుకు నీరాజనం పట్టిన నవ్వుల జాతర, పబ్లిక్ గార్డెన్ అంతటా పరుచుకున్న నవ్వుమొక్కల వనం. పార్కుకు వచ్చిన జనం, వ్యాహ్యాళికి వచ్చిన జనం, టూరిస్టు జనం, ఏక్సిబిషన్ సందర్శించకుండా ఎవరు అక్కడి నుండి తిరిగి వెళ్ళలేదు అంటే అతిశయోక్తి కాదు. మనిషిని మనిషి గౌరవిస్తాడో లేదో గాని కళను కళ గౌరవిస్తుంది. నేను అక్కడ ఎవరికి తెలియదు. నాకు ఎవరు పరిచయం లేదు. అక్కడ ప్రదర్శనలో ఉన్న నా కార్టూనులు చూపించి ఇవి నావే అంటే ఎవరో ఇతను అనుకున్న వారు మనవాడే అనుకుని ఆదరించారు. ఎన్ని కెమెరాలు క్లిక్ మన్నాయో, ఎన్ని ఫోటోలు పరస్పరం పంచుకున్నామో నాకు తెలిసిన వారు తెలియని వారు అందరితో ఫోటో దిగాను. ఆ ఆనందానికి పెరు పెట్టలేము, పదాలతో వర్ణించలేము. నా వరకు నేను ఆనందంతో మధురనుభూతి జడివానలో జలకాలాడాను.
శ్రీయుతులు గోపాలకృష్ణ గారు, చంద్ర గారు, శివాజీ తుంబలి గారు, చక్రవర్తి గారు, అరుణ్ గారు, ఉషా గారు, గీత సుబ్బారావు గారు, శ్యామ్ మోహన్ గారు, డెక్కన్ క్రానికల్ సుభాని గారు, లెజెండరీ కార్టూనిస్ట్, ఆర్టిస్టు మోహన్ గారు, గురుదేవులు జయదేవ్ బాబు గారు, కర్ణాటక కార్టూనిస్ట్ నరేంద్ర గారు, బన్ను గారు, అకుండి సాయిరాం గారు వీరందరినీ మొట్టమొదటి సారి కలిసింది ఇక్కడే. నేను గురుతుపట్టినంత వరకు పేర్లుచెప్పాను ఇంకా చాలా మంది పేర్లు తెలియవు వారందరికీ సిరసానమామి.

ఆయన రచయిత.. మనుషుల్ని, మానవత్వాన్ని కబలిస్తున్న కులం కాన్సర్ ని దునుమాడుతూ పుస్తకం రాసారు. ఆయన ఇలాస్ట్రేటర్ ఎన్నో కథలకు సాహిత్య పుస్తకాలకు కవర్ పేజీలు వేశారు. సామాజిక రాజకీయ లోతులను, లోపాలను తన కార్టూను చర్ణకోలతో వాతలు పెట్టాడు. అమెరికాకు ఆహ్వానింపబడిన తెలుగు కార్టూనిస్ట్. ఆంధ్రజ్యోతి దినపత్రిక ను తన డైలీ కార్టూనుతో శోభాయమానం చేసిన లెజెండరీ కార్టూనిస్ట్ స్వర్గీయ శేఖర్ గారిని మొదటి, చివరి సారి ఇక్కడే కలిశాను. సర్ అని పిలవగానే ఆగారు. మూడు రోజులు ఇక్కడే ఉంటాం కదా తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నారు. ఫోటో మాత్రం దిగాను. సమాజంలో పేరుకుపోయిన కులం కాన్సర్ రూపుమాపడంకోసం పోరాడిన ఆయన తనలోపల పెరిగిపోయిన కాన్సర్ మహమ్మారి ముందు ఓడి పోయారు.

దక్కన్ క్రానికల్ సుభానిగారు సాధారణంగా కనిపించే అసాధారణ వ్యక్తి, వ్యక్తులను ఉన్నతులుగా చేసేది వారి ప్రతిభ అంటే నేను ఒప్పుకొను, ముమ్మాటికీ వ్యక్తిత్వమే మునుషులను మనుషులుగా నిలబెడుతుంది సాధారణంగా కాదు ఉన్నతంగా ఎవరికి అందనంత.

సరస్వతీ దేవి కటాక్షం ఉన్నవారికి ఇగో చాలా ఎక్కువగా ఉంటుంది, ఎవరో చెబితే విన్నాను. అది సుభాని గారిపట్ల శుద్ధ అబద్దాలు. వారి “ఆదాబ్ హైదరబాద్” పుస్తకం కొనుక్కున్నాను అది కార్టూనిస్టుల, ఆర్టిస్టుల పాలిట రెఫరెన్సుల కల్పతరువు.

సాయంత్రం మొదలైంది అసలు సందడి. బ్నిం గారు, చంద్ర గారు, గురువులు జయదేవ్ బాబు గారు, కన్నడ కార్టూనిస్ట్ నరేంద్ర గారు, మోహన్ గారు, రాంపా గారు అతిరథ మహారథులు వచ్చారు.

సభ నిండుగా కొలువుదిరింది. గబగబా వెళ్లి చంద్ర గారిది, బ్నిం గారిది ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. శ్రీ మోహన్ గారిని అడిగితే ఎందుకులెండి మనమంతా ఒకటే కదా అన్నారు. మోహన్ సర్ ఆంధ్రజ్యోతి సండే బుక్ లో చాలా ఏళ్ల క్రితం లుంబిని పార్కు పక్కన ట్యాంక్ బండ్ ని అనుకుని ఉన్న చిన్న ఏరియని మొక్కలు, చెట్లు నరికేసి ghmc వారు పార్కుల అభివృద్ధి చేయడానికి పూనుకున్నపుడు, ఆ ప్రాంతంలో మోహన్ గారి కంట పడిన ఒక చెట్టు దాని ఆకృతి ఒయ్యారాలు పోయిన ఒక అందమైన పడతిలగా ఉంది నేను చెట్టుని ప్రేమిస్తున్నాను. నా ప్రేయసిని చంపబోతున్నారు అని ఒక ఆర్టికల్ రాసారు.

ఆ చెట్టుని నరికేయకుండా అలాగే ఉంచారు. ఈ విషయాన్ని సర్ తో ప్రస్తావిస్తే ముసిముసిగా నవ్వారు. మహామహుల పనులు మాట్లాడుతాయి. వారు చాలా తక్కువ మాట్లాడుతారు. గురువుగారు జయదేవులు ఒక సందర్భంలో మోహన్ సర్ గురించి మాట్లాడుతూ మోహన్ గారు రంగులపైన, గీతలపైన సాధికారత కలిగిన వ్యక్తి, ఆయన ఒక స్ట్రోక్ గిస్తే అదే ఫైనల్. మనలాంటి వారు మనలాంటి వారేం ఖర్మ చేయితిరిగిన ఉద్దండ కళాకారులు సైతం అంత పక్కాగా వంక పెట్టలేనంత స్పష్టంగా ఒకే స్ట్రోక్ లో ముగించలేరు. అంతేనా కలర్ పాట్స్ ముందు వేసుకుని బ్రష్ని నీళ్ళల్లో కడిగేయకుండా ఒకరంగునుండి మరో రంగులోకి ఏ రంగుతో ఏ రంగు కలిపితే మరే రంగు వస్తుందో సాధికారికంగా రంగులు వాడేవారంట. అది వారికి సరస్వతీ దేవి ఆశీర్వాదం. ఈ మాటంటే మోహన్ సర్ పైనుండి తిడతారేమో! ఎందుకంటే ఆయనకి ఆశీర్వాదాల పైన కన్నా కృషిమీద ఎక్కువ గురి. ఈ ముచ్చట సర్ తో సన్నిహిత్యమున్న ఎవరినడిగిన చెబుతారు.

అలాంటి గొప్పలు పోనీ గొప్ప వారూ. 2014 సంవత్సరంలో అనుకుంటా రవీంద్రభారతి మినీ హల్ లో జరిగిన తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం మే 20 న, హాలంతా నిండిపోయి కిటకిట లాడుతుంటే చివరాఖారున తడిసిపోయిన కుర్తాలో, నిరాడంబరమైన పరమశివుడిలాగా నిలబడి ఉన్నారు. ఎవరు ఆయన్ని పట్టించుకున్నట్లు లేదు. కొద్దిసేపు నేను ఆయాన్నే గమనించి వెళ్లి కుర్చీ తీసుకుని ముందువేసి కూర్చోమన్నాను. వద్దు బాబు అక్కడంతా ఉక్కపోత ఇక్కడే చల్లగా ఉంది అన్నారు. నేను మారు పలకలేదు. మీతో ఫోటో దిగుతాను సర్ అనడిగా స్యూర్ అన్నారు.
సర్ ని నేను కలిసిన చివరి మధురక్షణాలు.
ఇక మళ్ళీ రావు.

హాస్యనందం రాముగారు అతిథులకు వచ్చిన వారిని, కార్టూనిస్టులను పరిచయం చేస్తున్నారు. మోహన్ సర్ పక్కనే గురువుగారు జయదేవ్ బాబు గారు. ఆయన కాళ్ళకి నమస్కరించుకుని పక్కన నిలబడిపోయా. గురువుగారితో మాట్లాడే క్షణం కోసం. గురువుగారు, బన్ను గారు, నరేంద్ర గారు వెళ్లి అలా కూర్చున్నారు. వారితో అకుండి సాయిరాం గారు మాట్లాడుతుంటే వెళ్లి నన్ను నేను గురువుగారికి పరిచయం చేసుకుని ఫోటో దిగాను. కార్టునుల ప్రదర్శన ప్రారంభోత్సవం మొదటిరోజు గురువుగారి విషింగ్ కార్టూనుతో, ప్రముఖుల కార్టూన్ పుస్తకావిష్కరణలతో అంగరంగ వైభవంగా
ప్రారంభమై మూడురోజులు కొనసాగింది. మరుసటి రోజు, కార్టూనిస్టుల కోసం శ్రీ రమణాచారి గారు హుస్సేనసాగర్ బోటు విహారం ఏర్పాటు చేశారు. సాక్షి పత్రిక శంకర్ గారు, ఆంధ్రజ్యోతి శేఖర్ గారు తమ అనుభవాలు, సలహాలు, కార్టూన్, కారికేచర్ వేసే విధానంలో మెళకువలు పంచుకున్నారు. కార్యక్రమం చివరి రోజు నేను మిస్సయ్యాను కార్టూనిస్టులందరికి ప్రశంసా పత్రాలు అందించారు. అయ్యో నేను ప్రశంసా పత్రం పొందలేక పోయానే అనుకుని బాధపడుతున్న సమయంలో నాకు ఒక ఆపద్భాంధవుడు వెంటనే స్ఫురించాడు. ఆయనకు ఫోన్ చేస్తే అయ్యో తప్పకుండా నాగ్రాజ్, నీ సర్టిఫికెట్ నేను తీసుకుంటాను అని, నాకు కొరియర్ లో పంపారు ఆయన గురించి తరువాత వ్యాసంలో……..

(ఇంకాఉంది)

-నాగ్రాజ్

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!