తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్గా ప్రముఖ కవి, రచయిత నందినీ సిధారెడ్డి, తెలంగాణ సంస్కృతిని ప్రజలకు మరింత దగ్గరగా చేరవేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు.
తెలంగాణ బతుకు చిత్రాలను తన కలం నుంచి మన కంటికి చూపిన నందినీ సిధారెడ్డి.. మెదక్ (ఉమ్మడి)జిల్లా బందారం గ్రామంలో 1955లో జన్మించారు. బందారం, వెల్కటూర్, సిద్ధిపేటలలో చదువు కున్నారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చేశారు. తెలుగు లెక్చరర్ గా సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేశారు.
పుస్తకాలు చదవడం కాదు.. పుస్తకాలు రాసుడు గొప్ప అన్న తండ్రి మాటలను ఆదర్శంగా తీసుకుని కవిగా ముందుకు వెళ్లిన వ్యక్తి సిధారెడ్డి. విద్యార్థి దశనుండే సాహిత్యం పైన మక్కువ పెంచుకొని కథలు, కవితలు రాసేవారు. ‘ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు’ అనే అంశంపై ఎం.ఫిల్ చేసారు. ‘ఆధునిక కవిత్వం, వాస్తవికత – అధివాస్తవికత’ పై పరిశోధన చేసి 1986 లో పి.హెచ్.డి చేశారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆవశ్యకతను వివరిస్తూ 1997 ఆగస్టులో రాసిన నాగేటి సాలల్ల నా తెలంగాణ పాటకు 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో నంది అవార్డు లభించింది. దీనిలో తెలంగాణ సంస్కృతి అంతా వివరించబడింది. ఇదే కవితను పోరు తెలంగాణ చిత్రం లో కూడా పాట గా తీసుకున్నారు.
మెదక్ స్టడీ సర్కిల్, నవసాహితి సంస్థలను నడపడమే కాకుండా మంజీరా రచయితల సంఘం పేరిట పలు సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు. మంజీర బులెటిన్, సోయి పత్రిక లకు సంపాదకత్వం వహించారు.