Sunday, October 2, 2022
Home > కథలు > అరచేతిలో వైకుంఠం

అరచేతిలో వైకుంఠం

ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు నిర్వహించే బహింరంగ సభకు తండోప తండాలుగా జనాలు హాజరవుతున్నారు, కొన్నాళ్లుగా ఆయన చేస్తున్న ప్రసంగాలు జనాలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి ఆయన వాగ్దాటి అధికార పార్టీని విమర్శించేతీరు, ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో లొసుగులు, ఆయన లేవనెత్తిన అంశాలు ప్రజల్ని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.

సభాప్రాంగణమంతా జనాలతో కిటకిటలాడుతుంది. ఇసుక పోస్తే రాలనంత జనం, జన సముద్రం, జన సునామి. సభ ప్రారంభమైంది ఒక్కొక్కరుగా వేదికనెక్కి మాట్లాడుతున్నారు, జనాలని ఉద్దేశించి, రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే వారు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గూర్చి ఏకరువు పెడుతున్నారు, వారు చెబుతున్న ప్రతి మాటకి జనాలు చప్పట్లతో హర్షధ్వానాలు తెలియ చేస్తున్నారు.

ఆఖరుగా నాయకుడు మాట్లాడడానికి పోడియం ముందుకి వచ్చాడు, జనాలు ఒకటే కేకలు, ఈలలు, చప్పట్లతో సభాప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది, నాయకుడు జనాలనుద్దేశించి మాట్లాడుతున్నాడు, ఒక్కో మాట ఒక్కో టపాసుల పేలుతూంది, సూటిగా స్పష్టంగా తాను చెప్పదల్చుకున్న విషాయాలనన్ని ఎలాంటి జంకు, బెరుకు లేకుండా చెబుతూ పోతున్నాడు నాయకుడు, నాయకుని మాటలకి జనాలు ఊగిపోతున్నారు మంత్రం వేసినట్టుగా. నాయకుని మాటలు జనాల మనసులని కదిలిస్తున్నాయి, అతనిపైన నమ్మకం కలిగేలా చేస్తున్నాయ్. నాయకుడు రెండు గంటలసేపు మాట్లాడిన ఉపన్యాసమంతా ఒక ఎత్తయితే, చివరన ఆయన చేసిన వాగ్దానం ఒక ఎత్తు. మా పార్టీ కే అధికారం కట్టబెడితే ప్రమాణ స్వీకారం రోజునే వాగ్దానాన్ని నిజం చేసి చూపిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేసాడు. అది ప్రతి సామాన్యుడిని కదిలించిన వాగ్దానం. బీదా-బిక్కి, చిన్న-చితక, మధ్యతరగతి వారు, అందరు ఆ వాగ్దానానికి ముగ్దులైపోయారు, పరవశించి పోయారు, తమ భవిష్యత్ మార్చే, తమకు మంచి రోజులు తెచ్చే నాయకుడు ఇతడే అని వారి మనసుల్లో ఫిక్స్ అయిపోయారు.

ఆ వాగ్దానం ప్రభావంతో ప్రతి పక్ష పార్టీ అఖండ విజయం సాధించింది, నాయకుడు ప్రధాని అయ్యాడు, పదవి స్వీకార ప్రమాణం చేసే రోజు రానే వచ్చింది. ప్రజలంతా ఎదురు చూసిన రోజు తమజీవితాలు మారతాయని, తమ ఇన్నేళ్ల కలలు నిజమవుతాయని ఆశించిన రోజు, ఎంతో ఆతృతతో ఎదురుచూసిన రోజు రానే వచ్చింది.

నాయకుడు పదవి స్వీకార ప్రమాణం చేసే ప్రాంగణం ఒక పెద్ద క్రికెట్ స్టేడియం గా నిర్ణయించారు, స్టేడియం అంతా ఇసుకపోస్తే రాలనంత జనాలతో నిండి పోయింది. స్టేడియం కెపాసిటీ కన్నా రెట్టింపు ప్రజలు హాజరయ్యారు, నాయకుడు ఏం చేయబోతున్నాడు, తమజీవితాలు ఎలా మారబోతున్నాయి, కళ్లారా చూసి చెవులారా విందామని స్టేడియమంతా పెద్ద పెద్ద ఎల్.ఈ.డి. స్క్రీన్ ల తో నింపేశారు, స్టేడియానికి ఒక వయిపున వేదిక ఏర్పాటు చేశారు. మధ్యలో విశాలప్రదేశంలో ఖాళీగా ఉంచి అక్కడంతా ఒక నల్లని గుడ్డ తో కప్పి ఉంచారు. అందరి ద్రుష్టి దానిపైనే. ఏంటి.. ఇక్కడ ఎం జరగబోతుంది.. మధ్యలో గుడ్డ తో కప్పి ఉంచిన ప్రదేశంలో ఏమి ఉండి ఉంటుంది.. ఒకటే ఉత్సుకత.. ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నంత ఉత్కంఠ నెలకొంది ఆ ప్రాంగణమంతా.

సాయంత్రం ఆరు గంటలకి సభ ప్రారంభమయింది, మంత్రులుగా నిర్ణయించిన వారు అందరు ఒక్కొకరుగా గవర్నరు చేతుల మీదుగా ప్రమాణస్వీకార తంతు ముగించారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడటానికి కదిలారు మైకు ముందరికి. జనాల్లో ఒక్కసారి కదలిక కేకలు, ఈలలు, జయ జయద్వానాలతో స్టేడియమంతా దద్దరిల్లి పోసాగింది…ముఖ్యమంత్రి గారు మైకు అందుకుని, “ప్రజలారా..” అని సంభోదించగానే సభ ఒక్క సారిగా నాయకుడు ఎంచెప్పబోతున్నాడో వినడానికి అన్నట్లు నిశ్శబ్దం ఆవరించింది.

“ప్రజలారా నా మీద నమ్మకంతో.. మీ జీవితంలో మార్పు తీసుకువస్తాననే నాకు ఇంత భారీ విజయాన్ని అందించిన మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదములు. నేను.. పని చేసే వాడిని.. మాట్లాడే వాణ్ని కాదు. మాటల్తో కోటలు కట్టి మోసం చేసే వాణ్ణి కాదు. నేను మీకు చేసిన మొదటి హామీ ఈ రోజే నెరవేరుస్తాను. చుక్కల్ని నెలకి దించుతాను అని హామీ ఇచ్చాను, అది ఇప్పుడే నెరవేర్చ బోతున్నాను, దాని వల్ల ఏమిటి ప్రయోజనం అని మీకు అనుమానం రావొచ్చు. ఆకాశానంటిన ధరలు దిగివస్తాయి.. అది కదా మనకు కావలసింది.. అదికాదా..?” అనగానే స్టేడియమంతా “అవును.. అవును” అంటూ జయ జయ ద్వానాలతో మార్మోగింది.

ముఖ్యమంత్రి చేయి అలా గాల్లో ఊపి ప్రజల్ని శాంతిపజేశారు. ఇప్పుడే చుక్కలు నెలకి దిగుతాయి చూడండి అంటూ అక్కడే ఉన్న సహాయకులకు సైగ చేసాడు. వారు ఎదో తీసుకు వచ్చి మంత్రిగారి ముందు టేబుల్ పైన ఉంచారు, అది ఒక ఎలెక్ట్రిక్ యంత్రం, దాన్ని మంత్రిగారు తాక గానే గూయు మని ఎదో పెద్ద శబ్దం ప్రజలంతా ఎం జరగా బోతుందో అని నోరు వేళ్ళ బెట్టి అలాగే చూస్తుండి పోయారు పిన్ను నెల పైన వేసినా వినిపించేంత నిశ్శబ్దం … స్టేడియం మధ్యలో ఉన్న గుడ్డ ఒక్క సరిగా పక్కకు తొలగింది. భారీ గాజు పలక, దాంట్లో ఆకాశంలో ని నక్షత్రాలు మెరవసాగాయి. మైకు ముందు నిలబడిన నాయకుడు ఒక్కసారిగా హర్షధ్వనాలతో “చూసారా ప్రజలారా.. మీరు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. నక్షత్రాలు నేలకి దిగివచ్చాయి..మనం అనుకున్నది సాధించాం..ఇక మనకు అసాధ్యమంటూ ఏది లేదు.. ఏమంటారు ప్రజలారా..” అంటూ బిగ్గరగా ప్రశ్నించాడు నాయకుడు.

ఒక్క క్షణం స్టేడియమంతా నిశ్శబ్దం ఆవరించుకుంది, వెంటనే ఎం జరిగిందో చూసి తేరుకున్న ప్రజల్లో కొందరు హర్షం వ్యక్తం చేస్తూ జేజే లు చేయసాగారు. “నాయకునికి జై.. చెప్పింది చేసి చూపించిన నిజాయితీ పరునికి జై..” అంటూ ఒక వైపు ప్రజలు హర్షం వ్యక్తం చేయసాగారు. మరో వైపు జనం ఎం జరుగుతుందో, ఏంజరగిందో, అసలు ఇది ఏంటో అర్థం కాక జుట్లు పట్టుకుని నిశ్చేస్తులై చూస్తుంది పోయారు, కొంత మంది ఆలోచనల్లో పడిపోయారు. దీని వల్ల ప్రజల్లో విరుద్ధ భావాలు తలెత్తే అవకాశముందని చర్చించుకోవడం మొదలు పెట్టారు. మరికొంత మంది ఇది పచ్చి మోసం నిజంగా ఇలా చేయడం వల్ల ధరలు దిగి రావు, ప్రజల జీవితాలు బాగు పడవు ఇదంతా “అరచేతిలో వైకుంఠం చూపించడమే..అరచేతిలో వైకుంఠం చూపించడమే!” అనుకుంటూ వెనుతిరగసాగారు.

ఇదంతా వేదిక పైన నాయకులు ముసి ముసి నవ్వులతో అదో రకమైన దివ్యానందాని పొందుతున్నారు.

-నాగరాజ్ వాసం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!