బువ్వ కోసం, భుక్తి కోసం,
మాట కోసం, మాయిముంత కోసం
ఏండ్ల పడెంత్రం యుద్ధం జర్గింది ?
బ్రిటీషోడు భుజాలెగెరేస్తే
వాని మిడ్సుల పంకులను
అడివట్టి తింపి స్వాతంత్ర్యంను
తెచ్చుకున్నం…
అసొంటి సాధించుకున్న దేశంల
కపఠం బైలెల్లింది
దాన్ని వారసత్వంగ మార్సుకున్న
ఆంధ్రా నాగులు వివక్షల కుబుసాలను
ఇడ్వవట్టినయి
ఆ కాలనాగుల కాట్లకి
నింగికెగిసిన ధృవతారలెన్నో
అస్థిత్వాన్ని చంపుకున్న
చాంద్ తారలెన్నో
మరో గాంధీ అవుతారమెత్తిన
కేసిఆర్ బాపు బిడ్డల కుత్కెల్ల
పొలికేకైండు
అప్పటిదాంక పంచబల్లల్లెక్కున్న
అందరు పంచ్ ఇశిరే షేర్ ఖాన్ లైర్రు
నినాదాలు రణరంగమైనయి
వాళ్ళ కబంద హస్తాల్లో
నలిగి నశించి కృషించిన
తెలంగాణ తల్లికి విముక్తి
కావాలని పోరాటం
ఉవ్వెత్తున ఉప్పెనలా
ఎగిసి పడింది
ఆత్మ బలిదానాలు
అమ్మ కంట సెలయేరులైనయి
గర్భ శోకాలు మిన్నంటాయి
అబద్ధపు తెరను కళ్ళ నుండి
చీరేసి నిజాన్ని ధరించారు
ధర్మం కోసం ఈ గడ్డ
దగాపడ్డది
దురాగతులు తవ్విన
గోతుల్లో ఇక్కడి సంస్కృతి
భూ స్థాపితమైపోయింది
నోరు తెరిచి మాట్లాడితే
వక్ర భాషీయులని వాళ్ళ
సమూహం నుండి వెలేసి
ఆ సమూహానికి ఎందరో
ఇక్కడి బిడ్డలను కాపలా
కుక్కలు చేసి ఆడిన
గొప్ప జగన్నాటకం కాదది
ఆంధ్రా నాటకం !
ఆ నాటకంలో నటులు
దర్శక, రచయీతలు,
నిర్మాతలు ఆంతా వాళ్ళే
వాళ్ళలో మన ఉనికే
మనల్ని వెక్కిరించసాగింది
అందుకే పిడికిళ్ళు
బిగుసుకున్నాయి
పోరాటం ఉధృతమైంది
ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది !
-హుమాయున్ సంఘీర్