పూర్వం విష్ణు శర్మ అనే గురువు తన బోధనా నైపుణ్యంతో ప్రసిద్ధి చెందాడు. అతని దగ్గరికి చదువుకోవడానికి వివిధ రాజ్యాలు నుండి విద్యార్థులు వచ్చేవారు. అతని దగ్గరికి ఎవరు చదువు కోవడానికి వచ్చిన ఎటువంటి సంశయం లేకుండా ప్రతి ఒక్కరిని ఆశ్రమం లో చేర్పించుకునేవారు. అలా ఒకసారి ఒక దొంగ కుటుంబం నుండి ఒక విద్యార్థి వచ్చినా ఆశ్రమం లో చేర్పించుకున్నారు.
అతను ఒకసారి ఒక తోటి విద్యార్థి నుండి వస్తువు దొంగిలించడంతో పట్టుబడ్డాడు. ఈ విషయాన్ని వెంటనే మిగితా విద్యార్థులు గురువు గారికి చెప్పారు. మరియు ఇతర విద్యార్థులు ఆశ్రమం నుండి ఆ విద్యార్థిని తొలగించమని గురువు గారిని అడిగారు,కానీ గురువు విష్ణు శర్మ ఆ విషయం మీద దృష్టి పెట్టకుండా నిశ్శబ్దంగా ఉంచడం జరిగినది.దీనితో మిగితా విద్యార్థులు అతనిని దూరంగా ఉంచడం మొదలు పెట్టారు మరియు అతనితో మాట్లాడడంలేదు.
కొంతకాలం గడిచాక మరల అదే విద్యార్ధి మళ్ళీ దొంగిలించి పట్టుబడ్డాడు. మరల గురు విష్ణు శర్మకి ఫిర్యాదు చేశారు. విష్ణు శర్మ గతంలోలానే ఆ విద్యార్ధి ని ఏమి చేయకుండా నిశ్శబ్దంగా ఉన్నారు.
విష్ణు శర్మ ఏమి అనకుండా ఉండటంతో మిగితా విద్యార్థులు గురు విష్ణు శర్మ వద్దకి వెళ్లి మీరు వెంటనే ఆ దొంగ విద్యార్థిని, ఆశ్రమం నుండి పంపించకపోతే మేము ఆశ్రమం వదిలి, వేరొక కొత్త గురువు గారి వద్దకి వెళ్తాము అని చెప్పారు. దానికి విష్ణు శర్మ ఈ విధంగా బదులిచ్చారు “దీన్ని బట్టి మీ అందరికి ఏది ఒప్పు, ఏది తప్పు అన్న భేదం తెలుసు అనిపిస్తోంది, కనుక మీరు ఆశ్రమం వదిలి ఒక కొత్త గురువు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. స్వాగతం, కానీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డ విద్యార్ధి ఆశ్రమం వదిలి వెళ్ళడు. ఎందుకంటే నేను బోధించాల్సింది ఇతనికే. ఇతనికి ఏది ఒప్పు, ఏది తప్పు? అన్నది తెలియదు. ఇతనికి ఆ తేడాని ఇప్పుడు నేను చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు? నా జ్ఞానం మరియు అనుభవం ప్రస్తుతానికి ఇతనికి అవసరం.”
ఆ దొంగతనం చేసిన విద్యార్థి గురువు గారి మాటలు వినగానే ఏడుస్తూ ,బాధతో గురువు గారి కాళ్ళ మీద పడి ఇంకెప్పుడు దొంగతనం చేయను అని ప్రతిజ్ఞ చేసాడు. మిగితా విద్యార్థులు అతడికి జ్ఞానం తెల్సుకోవాలిసిన అవసరం ఉందని అర్థంచేసుకొని సన్నిహితంగా ఉన్నారు.
నీతి:-
దాతృత్వం(ఉదార స్వభావం) తో చెడు సంస్కరణలను మంచి మార్గంలో తీసుకు రావచ్చును.
–శ్రావణ్ నాగశేఖర్