Wednesday, July 6, 2022
Home > కవితలు > తెలంగాణ గీతం- మౌనశ్రీ మల్లిక్

తెలంగాణ గీతం- మౌనశ్రీ మల్లిక్

నా తెలంగాణ తంగేడు పూలవాన
జై తెలంగాణ

పాడెద నేను నా తెలంగాణ గీతం
ఎద లోని రాగం రవళించగా
సాగేద నేను స్వరముల తీరం
మదిలోని నాదం పులకించగా

వరమే మాకు బోనాల తీరం
బతుకే మాకు బతుకమ్మ పాదం
రుజువే మాకు సమ్మక్క సారం
నిజమే మాకు సారక్క పీఠం

దేహం జీవం జోగులాంబ రూపం
యాగం యోగం బాసరమ్మ జ్ఞానం
రతనాల వీణ త్యాగాల కోన
పోతన్న పద్యం ప్రవహించేరా

శుభమేగా నిత్యం రామప్ప శిల్పం
శివమేగా సత్యం సోమన్న పాఠం
శరణములే మాకు కాళేశ్వరుడు
స్మరణములే మాకు నాగార్జునుడు

ధైర్యం దర్పం కాకతీయ ద్వారం
శౌర్యం వీర్యం రుద్రమ రౌద్రం
యాదగిరి లోని నరసన్న మాకు
నజరానాలిచ్చి దీవించురా

భక్తికి దుర్గము భద్రాచలము
ముక్తికి మార్గము గోపన్న పదము
అండే గా మాకు ఆ గోలకొండ
పండుగయే మాకు కొమురవెల్లి నుండ

చరిత గురుతు చారిమినారు
సమత మమత ల మారుపేరు
వేములవాడ రాజన్న మాకు
అభయాలనిచ్చి రక్షించురా

వెలుగుల సలాగే నల్లబంగారం
జిలుగులు సొగసే కృష్ణమ్మ వేగం
చలువేలే మాకు గోదావరి తేట
విలువేలే మాకు గోండోళ్ల పాట

యూసఫ్ షరీఫ్ బాబాల భూమి
మెదకు మేరీ గారాల పుడమి
కాళోజి మాట దాశరథి పాట
సినారే కవిత ఉప్పొంగెరా

పాడెద నేను నా తెలంగాణ గీతం
ఎద లోని రాగం రవళించగా
సాగేద నేను స్వరముల తీరం
మదిలోని నాదం పులకించగా

– మౌనశ్రీ మల్లిక్
9394881004

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!