నేనంతా చూస్తూనే ఉన్నాను.
నన్ను పొత్తిళ్ళలో మొట్టమొదటిసారిగా చూసి తన యింట మహాలక్ష్మి పుట్టిందని ఆర్భాటం చేసిన
మా నాన్న –
ఈ మధ్య నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేక
తల దించుకుంటున్నాడు.
నేనంతా గమనిస్తూనే ఉన్నాను.
నాకు చనుబాలు తాగించి తన చైతన్యాన్ని నాలో నింపి మాతృత్వపు మధురిమలు ఆస్వాదించిన
మా అమ్మ –
ఈ మధ్య అర్థరాత్రిళ్ళు గొంతులోని వేదన బయటకు పొక్కకుండా
కుళ్ళి కుళ్ళి రోదిస్తుంది.
నేనంతా అనుభవిస్తూనే ఉన్నాను.
నేను పుట్టగానే ఆనంద తాండవం చేసి నా అరికాలి కింద
తన అరచేతులు పరిచి అపురూపంగా పెంచిన
నా అన్న –
ఈ మధ్య నా సమక్షం శిక్షగా భావిస్తున్నాడు. నా పొడ గిట్టనట్టుగా
దూరదూరంగా మసులుతున్నాడు.
నేనంతా పసిగడుతూనే ఉన్నాను.
మా పల్లె అంతా స్వేచ్ఛా విహంగంలా ఎగిరే నన్ను
అల్లారు ముద్దుగా గారాబం చేసే,
నా చుట్టాలు –
ఈ మధ్య ఆంక్షల హద్దులు గీస్తున్నారు.
నన్ను అనుక్షణం కనపడని కన్నులు కాపుగాస్తున్నాయి.
నేనంతా ఆకళింపు చేసుకుంటూనే ఉన్నాను.
అరమరికలు లేక వసుధైక కుటుంబంలా, పాడి పంటలతో
అలరారే
నా పల్లె –
పసినాటి మా ప్రేమల కారణంగా,
ఈ మధ్య కులరక్కసి కోరలలో మాడి మసైపోతుంది.
నేను ముంచుకొచ్చే దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాను.
నా ప్రియ బాంధవుడి క్షేమంకై
గుండె తన్నులాడుతుంది.
పై కులంలో పుట్టిన నన్ను ప్రేమించిన కారణానికి
తను
పై లోకాలకు చేరతాడేమోనని గుండె చెరువయిపోతుంది.
ఎందుకంటే,
నాకు రూఢీగా తెలిసిపోయింది.
మా కోసం –
సజీవ, మానవ కంకాళ కళేబరాలతో సన్నద్ధమైంది మృత్యు రంగం.
సర్వాంగ భీకరంగా అలంకృతమయింది కాలయముని ప్రాంగణం.
భూనభోంతరాళాలు దద్దరిల్లేలా గర్జించిందో మరణ మృదంగం.
అనుకున్నట్టుగానే ఆసన్నమయింది అంతిమ శుభ ముహుర్తం.
అమ్మానాన్నలు నన్ను యముడికిచ్చి చేయించారు పాణి గ్రహణం.
నా ప్రాణ తంత్రుల పేనిన మంగళ సూత్ర ధారణ ముగిసింది.
కన్నెచెర, కన్న పరువు నిలిచినందుకు, అప్పగింతల అధ్యాయం ముగిసినందుకు బంధువులు పరమానంద భరితులయ్యారు.
ఆకాశం అంచున నిలబడి నా ప్రియ బాంధవుడికై వేచి చూస్తున్న నన్ను
మరణుడు మృత్యు పరిష్వంగంలో బంధించాడు.
సెలవ్ ప్రియా!
-ప్రభాకర్ జైని…