Wednesday, July 6, 2022
Home > కవితలు > వాటికే మాటలొస్తె ! – హుమాయున్ సంఘీర్

వాటికే మాటలొస్తె ! – హుమాయున్ సంఘీర్

ఆశయపు వూపిరిలో
నిత్యం నా రక్తం
కాగుతూ ఉచ్వాస నిఛ్వాసమౌతుంది
కలల సాకారపు బాటలో
నా అవసరాలు ఎండిన
మల్లె మొగ్గల్లే రాలిపోతుంటాయి

నేను నా నిస్పృహలో
పచ్చని చిగుర్లేస్తుంటాను
బక్క చిక్కిపోతూ
ఎండిన డొక్కల్లోంచి
ఆర్తనాదాలేస్తూ
ఆశలు ఎప్పుడూ నామీద
అలుగుతుంటాయి
కోరికలు బుంగమూతి
పెట్టుకుంటాయి

ఒక్కోసారి కోపంగా
నన్ను నిలదీస్తుంటాయి
నా చేతగాని తనాన్ని
రంగులు మారి వెలిసి పోతున్న
సంకల్పాన్ని నానుండి ఎలాగైనా
దూరం చెయ్యాలని
కంకణం కట్టుకొని మరీ
ఇలా ప్రశ్నలు సంధిస్తుంటాయి

ఎందుకయ్యా బోడి
నీ ఆశయపు దండెం మీద
మమ్మల్ని కోసేసి చేపల్ని
ఎండబెట్టినట్టు ఎండబెడతావ్ ?
ఛ.. నీకన్నా అదిగో వాడు నయం
దొరికిన పని చేస్కుంటూ
పైసా వెనకేస్తూ
మేమెప్పుడు ఉబికొచ్చినా
మామీద చల్లని నెరవేర్పుల
అభిషేకం చేస్తుంటాడు

మాకోసం ధనాన్ని కట్టలుగా
జమ చేస్తుంటాడు
నువ్వూ వున్నావ్ ఎందకూ
వూరికే నా లక్ష్యం లక్ష్యం.. అని
మమ్మల్ని అలక్ష్యం చేస్తున్నావ్
మా కోరికల, ఆశల బడబాగ్నిని
నువ్వు చల్లార్చకపోతే

మేమింకా ఉప్పొంగే లార్వాలమౌతాం
అప్పుడు కాలి బూడిదయి
నీ ఆశయం ఆ బూడిదలో
పన్నీరై కారిపోతుంది
ఎట్ లీస్ట్ నీ అవసరాలు కూడా
తీర్చుకోకుండా ఎందుకయ్యా
ముక్కుతావ్ ? మూల్గుతావ్ ?
అవసరమా చెప్పు

ఎన్ని పన్లున్నాయ్ నువ్వు
చేయాలనుకుంటే
నీలో విషయానికి కట్టల
పాములొచ్చి నీ కంఠాభరణాలౌతాయి
పట్టుకున్న కొమ్మ విరిగిపోతుంటే
దాన్నే పట్టుకు వేళాడ్డం
అస్సలు బాలేదు

నువ్వు నీ ఎయిమనే ధ్యాసలో
మజాగా వున్నావ్
మేము మాత్రం మా ధ్యాసంతా
నీ మీద పెట్టుకున్నాం
నువ్వే ఏదైనా చేసి
మా దాహాన్ని చల్లార్చుతావని
కానీ ఎక్కడా… నువ్వు మారవు
నువ్వనుకున్నదిలా పరిస్థితుల
శవాల మధ్య సాధించాననే
పండగ చేస్కోలేవు ?

నీ మీద ఆధారపడ్డవాళ్ళ
గురించి కూడా పట్టించుకోలేనంత
స్వోత్కర్షలో నిన్ను నువ్వు
చంపుకొని హంతకుడవయ్యావ్
నీలో రగిలే మమ్మల్ని
ఆకలికి బలి చేస్తున్నావ్ ?

నీకేమైనా న్యాయంగా వుందా
బంధాలను – బాధ్యతలను
ఇలా ఎంతకాలం తెంచుకొని
తెగిన గాలిపఠమల్లే
తిరుగుతావ్ ?
గమ్యం చేరే ఓపిక నశించింది
కోరికగా, ఆశగా పుట్టిన మేము
నీలో శక్తిని కూడా నింపుతాం
అది కూడా చంపుకొని

ఎంత కాలమయ్యా ఇలా
నీ రంగుల కలల ప్రపంచంలో
బ్లాక్ అండ్ వైట్ బొమ్మగా
తిరగాడుతావ్ ?
నిన్నే అంటి పెట్టుకొని వున్న
మమ్మల్ని ఆకలికి అలమటించి
చంపి భూస్థాపితం చేయటం
న్యాయంగా వుందా చెప్పు ?
నువ్వనుకున్నది సాధించేంత
చిన్నపని కాదు

దానికి బ్యాగ్రౌండ్, బ్యాక్ బోనూ వుండాలి
ఏవీ లేకుండా ఉత్తచేతుల
భిక్షపతిగా ఎందుకయ్యా
తీరని ఆరాటంతో పోరాటం చేస్తావ్ ?
నిన్ను కనిపెంచిన వారి రుణాన్ని
కూడా నీ ఆశయపు అంపశయ్య
పైన పడుకోబెట్టావ్
పెళ్ళొద్దని నీలో రగిలే
కోరికలైన మమ్మల్ని

స్తంభానికి కట్టేసి కొట్టడం
ఏమైనా ధర్మంగా వుందా చెప్పు ?
మారవయ్యా… నీ వయసు కూడా
ఆగకుండా పరుగెడుతోంది
ఇంత సాధుతనంతో, లేకితనంతో
నువ్వు సాధించిందేముంది
ఆహుతౌతున్న వయసుని
విలువైన టైంని నాశనం
చేస్కోవడం తప్ప !?

అంటూ … అవి నన్ను నిత్యం
నానుండి నా ఆశయాన్ని
తన్ని తరిమెయ్యాలని చూస్తుంటాయి
అయినా నేను వాటిని
లెక్ఖ చెయ్యను
నా లక్ష్యం సాధించేవరకు
నేనిలాగే నన్ను నమ్ముకున్నవాళ్ళకి
న్యాయం చెయ్యకుండా
నా దారిలో ముళ్ళ మీద
నడయాడుతూ ఎంత రక్తమోడినా
లెక్క చెయ్యకుండా

ఆ రుధిరాన్ని నా ఆశయానికి
అభిషేకం చేస్తూ
నిత్యం నూతనంగా
వికసిస్తూ, ఏదో మిరకిల్
జరుగుతుందనే ఆశావాదాన్ని
నా ముఖమ్మీద పులుముకొని
పోటీ ప్రపంచంలో ఆటుపోట్లను
ఆలింగనం చేస్కుంటూ
మునుముందుకు దుముకుతుంటా
ఎందుకంటే ఎంతటి శక్తివంతమైన
ఈదురుగాలులకు కూడా
బెదరక నిటారుగా వెలిగే
వర్ధమాన సినీ ఆశాజ్యోతిని కాబట్టి !!

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!