Wednesday, July 6, 2022
Home > కవితలు > తెల౦గాణ నీలవేణి తెలుగునేల పూబోణి -స్వాతీ శ్రీపాద

తెల౦గాణ నీలవేణి తెలుగునేల పూబోణి -స్వాతీ శ్రీపాద

తెల౦గాణ నీలవేణి తెలుగునేల పూబోణి
తలిరాకుల త౦గేడుల సుకుమారపు మాగాణి
తెలివేకువ తొలిగాలుల మంచుపూల రెపరెపలు
గోదావరి పరీవాహ పరామర్శ గుసగుసలు
మాటంతా పులకి౦తై జలపాతపు తు౦పరలై
తీపితేనే పలకరింపు మనసంతా ప్రేమ నింపు||

అడుగడుగున పరచుకున్న తోకమల్లె తివాసీలు
అడగనిదే తరలి వచ్చు బతుకమ్మల హరి చందనాలు
బాట౦తా వెలుగు తోట ఇహ దిగులెందుకు తెనుగు నాట
రేపంటే గగనానికి ఎగిరేందుకు రెక్కలున్న పక్షి కదా ||

అణువణువున దీప్తి౦చే అనురాగపు సిరులూ
అణగారిన మమకారపు అమృతాల ఝరులూ
బంతిపూల తోరణాల సౌభాగ్యపు వన్నెల వెన్నెలలూ
బంగారపు హరివిల్లుల జిలుగుతోట వెలుగు మూట మన ఇల్లు
అక్కనైన ఆలినైన అమ్మ అనే మన్ని౦పులు మనవి
ఎక్కడైనా ఎవరైనా అన్నలే మనకంతా పెద్దన్నలే ఎవరికైన
వెన్నంటి నిలిచే దన్ను కడా వెన్నపూస సహభావన
కడదాకా కలిసి నడిచె కారుణ్యపు సహకారం సమభావం

స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!