తెలంగాణ వైభవం పార్ట్-2
త్రిలంగ దేశమిది – తెలంగాణమిది
తొలికోటిలింగాల – ‘ గోబద ‘ శబ్దమది
క్రీస్తుకు పూర్వం – బౌద్ధమత క్షేత్రం
దూళికట్ట క్షేత్ర – ముచిలింద నాగం
బౌద్ధమత బావరి- బాదనకుర్తి వాసి
జైనమత ఋషభుడు – బాహుబలి బోధన్
శాతవాహన రాజ్య – అస్మక జనపదం
కోటిలింగాల ఇది – తోలి రాజధాని
శఖ సంవత్సరం- శాలివాహన శకం
శాతవాహన రాజ్య – గౌతమి శాతకర్ణి
హాల భూపాలుని – గాథ సప్తశతులు
మంత్రి గుణాఢ్యుని – బృహత్ కథల సీమ
తొలి తెలుగు కందం – కురిక్యాల శాసనం
సోమదేవ సూరి – కథా సరిత్సాగారం
కోన సముద్రము- ఇనుముక్కు పరిశ్రమ
ప్రపంచ దేశాల – ఖ్యాతిగాంచిన సీమ
అజంతా, ఎల్లోరా – చిత్ర శిల్ప కళలు
శాతవాహనాది – కళల సామ్రాజ్యాలు
చరిత్ర సాక్షమ్మురా తెలంగాణ
ప్రత్యక్ష నిలయమ్మురా తెలంగాణ
మగధ నందవంశ – మౌర్య సామ్రాజ్య
శాతవాహనపూర్వ – సమగోప, గోబద
ఇక్ష్వాకు రాజ్యం – విజయపురి క్షేత్రం
త్రికూటక రాజ్య – ఇందూరు నగరం
బాదామి చాళుక్య – విష్ణుకుండినులు
వేములవాడ చాళుక్య – రాజ్య సపాదలక్ష
కళ్యాణి చాళుక్య – విక్రమాదితుడు
వేములవాడ క్షేత్ర – రాజరాజేశ్వరుడు
కాకతీయ రుద్రుడు – గణపతీ దేవుడు
రాణి రుద్రమ దేవి – వీర ప్రతాపుడు
పద్మ నాయక రాజ్య – పరిడవిల్లిన నేల
సాహిత్య సుమాలు – వికసించిన సీమ
విజయ నగర కీర్తి – తార్కాణ చిహ్నాలు
అపురూప వైభవ – నిర్మాణ కళారీతి
బహమనీ పాలన – కుతుబ్షాహీలు
మొగలుల పాలన – నిజాం ప్రభువులు
రాచబాటల తీరురా తెలంగాణ
రాజ్యాల ప్రభ వెలుగురా తెలంగాణ
శ్రీపర్వత క్షేత్ర – నాగార్జున సాగర్
ఆచార్య నాగార్జున – బౌద్ధ విద్యాలయం
రామపాదం సోకె – రామగిరి ఖిల్లా
ఆరామ గిరి చూడు – వనమూలికల ఖిల్లా
కొండగట్టు క్షేత్ర – కొండల రాయుడు
ఖిలాషాపురం – సర్వాయి పాపన్న
పొలాస క్షేత్రం – పౌలస్తేశ్వర ఆలయం
జగ్గదేవుడు ఏలె – జగిత్యాల ప్రాంతం
వేములవాడ చాళుక్య – అరకేసరి ప్రభువు
ఆస్థాన పంప కవి – ఆది పురాణాలు
వేములవాడ భీమకవి – వేములవాడ కవి
రాజరాజేశ్వరం – పుణ్య శివ క్షేత్రం
పుణ్య గోదావరి – ధర్మపురి క్షేత్రమది
పంప మహాకవి – అగ్రహారం అది
హాల -లీలావతీ – సప్త గోదావరి
తెలివాహ నది – తెలంగాణమిది
క్షేత్ర ప్రదేశాలురా తెలంగాణ
స్థల పురాణాలురా తెలంగాణ
రామప్ప శిల్పాలు – నాగినీ నృత్యాలు
జయప సీనాని – పద రత్నావళులు
మడికి సింగన కవులు – కందనామాత్యులు
వెలగందుల నారయ – చరికొండ ధర్మన
భీంగల్ సంస్థాన – కొఱవి గోపరాజు
సింహాసనా ద్వాత్రిమిషిక – కావ్యకుసుమాలు
దోమకొండ కవులు – బహుగ్రంథ కర్తలు
కామినేని వారి – పద్మపురాణాలు
పాలమూరు జిల్లా – సాహిత్యపు ఖిల్లా
బి. యెన్. శర్మలు – రామకృష్ణ బుధులు
గద్వాల సంస్థాన – శోభనాద్రీశ్వరుడు
ప్రఖ్యాత విఖ్యాత – కవి పండిత సభలు
గోన బుద్ధారెడ్డి – తొలి రామాయణం
లాక్షణిక గ్రంధం – అప్పకవీయం
సాహిత్య సౌరభమురా తెలంగాణ
కవి పండిత సభలురా తెలంగాణ
– సబ్బని లక్ష్మీనారాయణ , కరీంనగర్